Tuesday, April 30, 2013

పానుపు


ఇటుగా వచ్చిన వేళ 
ఆమె పాదాలను తాకవచ్చని కాబోలు 
ఆ గడ్డిపూలన్నీ ఆమె దారిలో పానుపైనాయి. 
*******
గోదారి 
ఓ నాడు ఆకాశపు కన్య తారల ముందు నర్తిస్తుంటే 
ఆమె పైట జారి వెన్నెల సంద్రాన పడి తడిచిందట 
కన్నె ఆ పైట తీయబోవ వెన్నెల సంద్రం కసరి 
ఆ పైటను నేలకు విసిరిందట 
ఆకాశపు గానం తనలో కలుపుకుని గలగలా సాగిందా పైట 
గోదారిలా వెన్నెలంటిన కస్తూరిలా. 
********
మిణుగురులు 
తానో నాడు జాబిలో చేయిపెట్టి గుప్పెడు వెన్నెలను 
బయటకు తీసింది, గాభారాపడి నేను ఇదేమిటని అడిగా 
తను నవ్వుతూ ఆ గుప్పిటపై నా చేతిని పెట్టి  
 ఈ వెన్నెలతో మన ప్రేమదీపాలు వెలిగి చీకటి రాత్రులలో కూడా 
లోకం మన ప్రేమను గాంచుగాక అంది 
అంతే లెక్కకు మించిన మిణుగురులు. 
*********
అరువు 
నీ మెరుపు మేనియ చూడాలని 
ఆకాశం నా కళ్ళను 
ఓ నిముషం పాటు అరువడిగింది. 
********

Sunday, April 28, 2013

ముక్కుపుడక

ముక్కుపుడక 
తావిని మోయలేకా గాలికి పట్టిన 
స్వేదబిందువొకటి జారి 
ఆ పువ్వుకు ముక్కుపుడకైంది  అదిగో అలా .... 
*******
ప్రకృతి 
జీవిత ప్రాంగణంలో 
మనిషి వేగంగా పరుగెత్తడం 
మొదలెట్టిన చోటే ఆగిపోయింది 
అసలు ప్రకృతి. 
********
తోడు 
సుఖదుఃఖాలను  చెప్పుకోవడానికి 
ఆ రాదారికి కూడా 
కుడిఎడమల మానులున్నాయి 
కానీ బ్రతుకు రాదారిపై నీకో ....?
********
మగత 
తానెవరిని మత్తెక్కించాలని 
మగతగా అడుగుతుందా నిద్ర 
పబ్బుల వెంట తిరుగుతూ. 
********

Friday, April 26, 2013

మేజువాణి

మేజువాణి 
నవ్వే నీ పెదవికి తెలుసు 
నిన్నెంతలా కవ్వించిందో నా మనసని 
మోడును కానంటూ విరబూసిన నా హృదయానికి తెలుసు 
నాలోని మౌనాలను పాటలుగా ఎలా వసంతించిందో నీ మనసని 
  అలలెగసి పడే సంద్రంలా 
నీ ఆలోచనలతో నిండిన నాదు అంతరంగానికి తెలుసు 
నీవు కాని అనుభూతి నా అనుభవానికి రాదనీ, నా మనసుకు అవధి వీవని 
మబ్బుల తేరులపై ఆగుతూ సాగుతున్న నా చూపులకు తెలుసు  
 గగనమంతటి నీ వలపు తోటన తేటులై తామాడే ఆటన 
హరివిల్లులెన్ని విరిశాయో, విరజాజులెన్ని కురిశాయో! పుడమిన అణువణువునూ పలకరించే కిరణాలకు తెలుసు 
నీ, నా సంగమ సంకేత నికేతనం 
ఎగురనిచోటు యుగాలు మారినా వాటికి కానరాదని 
ఆగక సాగుతూనే ఉంటుంది మన మానసవీణల మేజువాణి అని
. **********

Thursday, April 25, 2013

మనసుఆకలి

మనసుఆకలి 
చెరువంత విస్తరిలో 
కొసరి కొసరి వెన్నెల వడ్డించే ఆ జాబిలింట 
విందందుకున్నావేమిటోయ్ ఎపుడైనా 
అన్నానని కాదుగానీ అప్పుడప్పుడూ మనసు ఆకలి కూడా తీర్చాలోయ్ 
ఏమంటావ్?
*******
ఏకాంతశిల్పి 
నన్నానందింపజేయడానికి నా ఏకాంత శిల్పి 
నిన్ను చెక్కి నా మనసు నింపి 
తానెక్కడికో వెళ్ళిపోయాడు. 
********
పిలవని పేరంటం 
తలుపులన్నీ మూసేసినా 
పిలవని పేరంటానికి 
ఎంత దర్జాగా వచ్చిందో చూడా చీకటి. 
******
మెరుపు సుందరి  
చీకటిలోనూ ఆ మబ్బుల గుంపుల్లో 
దారి చేసుకుంటూ ఎక్కడికి పోతోందో 
ఆ మెరుపుసుందరి. 
******

Monday, April 22, 2013

వెన్నదొర

వెన్నదొర 
పున్నమి నాడు, తను కవ్వమై!
వెన్నెలను చిలికి, ఆ వెన్నను నాదు మనసుకు తినిపిస్తూ 
'వెన్నదొర' అంటే వీడేనని అందరితో అనిపిస్తుంది!
నా పెరటి కొబ్బరిచెట్టు. 
********
ఎదురుచూపు
రాలిపడే పూలతో,
తానేమి సౌరభించగలనని కాబోలు 
జారిపడే వాన చినుకులకై ఎదురు చూస్తుందా మన్ను. 
********
శిరస్త్రాణాలు 
ఉదయ వాహ్యాళి వేళ నీ, నా పదఘట్టనల 
తామెక్కడ గాయపడతామోనన్న జాగ్రత్తతో 
శిరస్త్రాణాలను ధరించి ఎలా కూర్చున్నాయో చూడా పచ్చికలు. 
*********
జలతారుమేఘాలు 
బురదింటి ఇంతికి 
నింగిలోని ముగ్ధమోహనునికి 
మనువు జరుగుతున్న ఈ వేళ 
మాటిమాటికీ అడ్డుతెరలై నిలిచి ఈ జలతారుమేఘాలు!
నును సిగ్గులవానలను కురిపించగలమూ  మేము 
కదలకుండా, కరగకుండానూ అంటున్నాయి. 
*********

Saturday, April 20, 2013

బిరుదు

బిరుదు 
పుట్టిన నాటి నుండి! కవిత్వాన్ని 
కొంగున ముడేసుకుని తిరుగుతున్నా 
ఏ ఒక్క బిరుదూ ఇవ్వవేమిటోయ్  నువ్వు 
ఆ అలలకు. 
 *********
మార్గదర్శకత్వం 
అనంత ఐశ్వర్యం తనలో ఉన్నా 
తనకంటూ ఓ హద్దు కావాలనుకుని 
తీరాన్ని ముద్దిడే కడలే 
మార్గదర్శకత్వం చేయలేకపోతోంది 
అనంతానంత అనుభూతులను 
ఆనందబాష్పాలుగా రెప్పల జారుతున్న ఈ వేళ 
నాదు మనసు. 
*********
లోకకళ్యాణం 
లోకకళ్యాణమన్నది ఎప్పటికీ 
రేపటి మాటేనోయ్!
ఎందుకంటే ఆ విలువలతో ఏడడుగులు వేయడం 
నేటికీ నువ్ నేర్వలేదుగా మరి. 
********
కారుణ్యం 
 కన్నీళ్ళకు కారుణ్యాలు మొలిస్తే 
మనిషికి బదులు 
పాపమా దేవుడు ఒంటరివాడైపోతాడేమో కదూ.  
*********

Thursday, April 18, 2013

అందాలవిందు

అందాలవిందు 
అద్దంలాటి మనసు , ఆతిథ్యమీయాలన్న ఆశ!
ఈ రెండూ చాలవా? ఆకాశం కూడా మురిసిపోయేంత 
అందాలవిందును ఆ నిండు జాబిలికి వడ్డించ నేనంటూ 
చూడు ఎలా మిడిసిపడుతోందో అందాల ఈ పల్లెచెరువు. 
*********
అందమైన అలజడి 
నాలుగు రాళ్ళను లోనికేసుకుంటూ!
అలజడిలో కూడా అందముంటుందంటుందా చెరువు 
నిజమేనంటావా?
*******
కొంగ 
పుల్లంత కాళ్ళతో ఇంతటి దేహాన్ని ఎలా మోసుకొస్తున్నావంటూ 
తనను వెక్కిరించేలోపే ఇంతిల్లున్నా 
దాక్కోవడమే రాని నిన్ను నా గొంతులో దాస్తానంటూ 
గుటుక్కున చేపను మింగిందా కొంగ. 
********
నీ కన్నులంటే ......
 
నాపై ప్రేమను చెప్పే  నీ పెదవులకన్నా 
మౌనంగా నీ ప్రేమను తెలిపే 
నీ కన్నులే నాకిష్టం. 
*******

Wednesday, April 17, 2013

కాంతిహారం

కాంతిహారం 
రాతిరికలా నింగి లో అన్ని పూలు పూసి 
వాడిపోవాల్సిందేనేమిటోయ్? ఎంచక్కా నాలా 
ఆ సాలెగూటి తీగలను పేని దారంగా చేసి 
ఆ పూలతో  కాంతిహారమల్లడం నేర్పు నీ ఊహలకి. 
*******
కరగబోతున్న అందాలు  
కరగబోతున్న తమ అందాలు 
నాకు చేరాలని మెరుపు తీగలతో 
చేవ్రాలు చేస్తున్నాయా మేఘాలు. 
*********
కొమ్మ 
కొమ్మ ఒకటి ఒయ్యారంగా
నలుగురిలోకి నడచి వచ్చి 
తనపైని ఆకులను పూవులను రాల్చుకుంటూ 
మళ్ళీ అంతే ఒయ్యారంగా  నడిచెళ్లిపోయింది 
ఫ్లాష్ లైట్ల వెలుగులో. 
*******
స్పందన  
సింధువైనా బిందువుతో మొదలైనట్లు 
అనంత జ్ఞానసాగరమంతా 
చిన్న స్పందన నుండే......... 
********

Tuesday, April 16, 2013

బిడియం

బిడియం 
దాటనా? వద్దా? అంటూ బిడియపడుతూ 
నీ పెదవిని దాటేసి, నాకెంత 
గాయంచేసి కూర్చుందో చూడు 
ఆ నీ చిరునవ్వు. 
********
వసంతం  
నల్లది  పిలిస్తే వచ్చిన పచ్చది 
తెల్లని నా కంటిని ఎరుపెక్కించి బహుమతిగా 
నాలుగు ఆనందబాష్పాలు రాల్చుకుంది 
ఈ తోటలో. 
********
రాయికీ మనసు.... 
నా మెడలో చేరిన పూలహారంతో 
అందరూ నన్ను మొక్కేరు. నన్ను నిలిపిన నా దేవుణ్ణి 
నే మొక్కలేక పోతున్నానంటూ వాపోతోందా శిల్పం.  
రాయికీ మనసుందోయ్. 
*******
పచ్చని వలువ 
తామిచ్చే చిరుస్పర్శకే  పులకరించిపోయే 
ఆ ప్రేమికుని మేనిపై 
పచ్చని వలువ నేయాలని 
ఆ మేఘాలు గిరిని కప్పుతున్నాయి. 
********

Sunday, April 14, 2013

విప్లవ బావుటా

 విప్లవ బావుటా 
నాపైనే నా మనసు  
విప్లవబావుటా ఎగరేస్తుంది 
నీకు చేరువ కమ్మంటూ. 
********
దాహం 
ఎంత దాహమై నాపై పడ్డావో 
నా హృదయమంతా కరిగించి 
నీ దాహం తీర్చాలనుకున్నా 
పాడు గాలి ఒక్క క్షణం ఆగితేగా!
అంటుంది ఆ చెరువు తనపై పడిన చెట్టు నీడతో. 
*********
కాలిబాట  
నా నడకల్లో తాను మొలిచి 
నా అడుగుల నలుగుతూ కూడా 
అంతకంతకు అందంగా తాను తయారై 
నా గమ్యాలను చేరువ చేస్తుంది 
ఆ కాలిబాట. 
*********
మధురసంగీతం 
మనసుని తాకే 
మధురసంగీతాన్ని వినిపించడానికి 
పచ్చిక గాలిలో తనను తాను మీటుకుంటున్నది 
చెవియొగ్గి ఓ సారి వినలేవా?
********
 
 
 

Wednesday, April 10, 2013

చేను

చేను 
శ్రావ్యమైన సంగీతమైందో లేదో 
ఆ గీతానికెంతటి 
కమనీయ రుపునాపాదిస్తోందో 
చూడా చేను. 
*******
వాగు 
పొంగుతూ! తాను పాడుతున్న 
వాన పాటను, ఒళ్లంతా చెవులు చేసుకుని 
వింటున్న ఆ మాను పాదాలను కడుగుతూ 
సాగుతుందా వాగు. 
*******
పూల
తెల్లవారే వేళ తమపై 
మంచు బొట్లను మోస్తూ  కొమ్మే కాదు!
తాము కూడా, పూలను 
పూయించగలమంటున్నాయా పూలు!
*******
మనసు 
నీలో తానున్నానని 
కన్నీటిలో పడి కొట్టుకుపోతూ 
చెబుతుందేమిటోయ్ నీ మనసు. 
********
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు 

Tuesday, April 9, 2013

సంగమస్థానం

సంగమస్థానం 
ఎవరి కంటా పడని 
సంగమస్థానం కోసం వెదుకుతూ కాబోలు 
ఆ నింగి ఈ నేల  ఇంకా సంగమించనిది. 
********
జయకేతనం 
కలలన్నీ గెలిచాయని 
కంటి నుండి జారిన బిందువులో 
నీ రూపాన్నే నిలిపి 
మళ్ళీ మళ్ళీ జయకేతనం ఎగురవేస్తుంది 
నా మనసు. 
********
వసంతం 
ఒకింత ఓపికతో తనకై నిరీక్షిస్తూ 
ప్రాణాలను నిలుపుకున్న ఆ వనాలకు 
తన పంచ ప్రాణాలు పంచేసింది 
ఆ వసంతం. 
******
యుగళగీతం 
జడివాన వదిలేసిన ఒంటరి రాతిరితో 
యుగళగీతం పాడుతున్నాయి 
ఆ కీచురాళ్ళు. 
*******
 

Monday, April 8, 2013

మృదువైన పరిచయాలు

మృదువైన పరిచయాలు 
మృదువైన పరిచయాలు ఎక్కువైతే,
మధుధారలు పొంగి పారవేమిటోయ్ జీవితాంతమని 
అంటున్నాయి ఆ తేనెటీగలు 
నిజమేనేమిటోయ్?
*******
పురుటినొప్పులు  
లెక్కలేనన్ని వాన చినుకులను కనడానికి 
ఆ మేఘాలు పడుతున్న 
పురుటినొప్పులేనోయ్ ఈ ఉరుములు. 
********
చిరునవ్వుల వడ్డీ  
అడగ్గానే ఇంత అందాన్ని 
అరువిస్తుందని!
అడక్కుండానే చిరువన్నుల వడ్డీ 
కడుతుంటాను ఆ అద్దానికి. 
*********
గూడు 
కిలకిలమంటూ సందడిగుండే 
ఎన్ని ఇళ్ళకు 
ఒంటి గడపో ఈ కొమ్మ. 
*******

Friday, April 5, 2013

మనసైన బానిసత్వం

మనసైన బానిసత్వం 
నోరు తెరిచి అడగ్గానే స్వాతంత్ర్యమిచ్చి 
ఆకాశాన్ని తన పాలు చేసిందని కాబోలు 
ఎంత ఎదిగితే అంత గట్టి సంకెళ్ళను 
తనకు తానే తయారు చేసుకుని 
ఈ మట్టితో బానిసత్వమూ 
తనకిష్టమేనని అంటుంది ఆ విత్తు. 
*******
మెరుపు తీగ
తనను  తాను మీటుకోవడం వల్లనే 
ఇన్ని అందాలొచ్చాయీ పుడమికని 
ఎంత అతిశయాన్ని ప్రదర్శిస్తుందో 
చూడా మెరుపుతీగ. 
*******
పండుటాకులు 
ఓ పూట ఆకలి తీర్చిన ఎండుటాకులు 
గర్వంతో అలా  ఎగిరి పడుతుంటే 
ఇన్నేళ్ళ ఆకలి తీర్చిన పండుటాకులు కొన్ని 
వీధి చివర క్రుంగిపోతున్నాయి విదల్చబడి. 
**********
గురువు 
ఏటికి గొంతిచ్చి 
లెక్క లేనన్ని పైరు పాపలకు 
పాటలు నేర్పే గురువును చేసింది వాన. 
*******

Thursday, April 4, 2013

నిశ్శబ్ద గగనం

నిశ్శబ్ద గగనం  
అలిగి కూర్చున్న ప్రేయసిని 
కదిలించాలని కాకపోతే 
నిశ్శబ్ద గగనానికా ఉరుమెందుకు?
********
పుస్తె 
పుత్తడి వర్ణానికి తిరిగిందా చేను 
పుస్తె కరిగించా రైతు ఇల్లాలిది. 
*******
నలుసు  
గుండె బద్దలై  
కంటిలో నలుసౌతుందేమో 
లేకుంటే కన్నీళ్ళెందుకలా...... 
*******
అద్దం 
ఎంత యావో చూడా అద్దానికి 
ఎప్పుడూ ఏదో ఒకటి 
తలపోస్తూనే ఉంటుంది. 
********
కన్నీటి బొట్లు 
కరిగి విరిగిన రెండు సందర్భాలలో 
నా మనసుకు ప్రతినిధులు 
ఈ రెండు కన్నీటి బొట్లే. 
******

Tuesday, April 2, 2013

వేణువు

వేణువు 
ఊపిరి జత చేశానంతే 
నా మనసునిలా ఖైదు చేసిందేమిటోయ్!
ఈ వేణువు 
******
చెక్కిళ్ళు  
వాలిన రెప్పల పైనుండి 
జారుతున్న నునుసిగ్గును 
ఎంతందంగా పట్టుకున్నాయో 
చూడామె చెక్కిళ్ళు 
******
తొలకరి 
ఆడుతున్న ఆ నెమలి కాళ్ళకు 
గజ్జె కట్టింది నా పాట 
ఇక కరిగి నీ గుండె తొలకరిగా 
కురవక తప్పదు నేస్తం 
******
మేటి జవరాళ్ళు 
ముద్దులలోని మాధుర్యాన్ని 
మొదట ఆ రాతి గుండె వాడికి 
రుచి చూపించి, ఆనక 
ప్రణయ పారవశ్యాన కరిగి 
ప్రియుని ఒడిలో ఒయ్యారంగా ఒంపులు తిరిగే 
మేటి జవరాళ్ళు కాదటోయ్ ఆ మేఘాలు 
********

Monday, April 1, 2013

రావోయీ

రావోయీ 
ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం 
కాసిని కలలను పండిద్దాం 
 
క్షణానికో అనుభవం విరియిద్దాం యుగాలదాకా 
అది నిలిచే దారిన పయనిద్దాం 
 
ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం 
కాసిని కలలను పండిద్దాం
 
అంతులేనిదై ఆ ఆకాశం 
వేచియున్నది మనకోసం 
 
రివ్వున ఎగిరిపోదామా?
రెక్కలివ్వమని ఈ పూవులనడిగి!
 
చప్పున తిరిగొచ్చేద్దామా?
నీటి ముత్యాల మూటలు దోచి 
మబ్బులింటినే లూటీ చేసి 
 
ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం 
కాసిని కలలను పండిద్దాం
 
దోసెడు నవ్వులనరువీయమంటూ అన్ని పూవులను అడిగేద్దాం 
వేదనమరిగిన మనసులనా నవ్వుల ముంచేద్దాం 
 
మనుషులందరినీ ఒక్కటి చేద్దాం 
మధుఝరులనే పారించేద్దాం 
 
ముళ్ళబాటలను తీసేద్దాం 
మనసుల వారధుల్ కట్టేద్దాం 
 
ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం 
కాసిని కలలను పండిద్దాం 
 
నిలబడలేక పరుగిడే అలజడితో 
రూపం మారిన లోకపు తీరును నిరసిద్దాం 

శాంతిని కొలిచే కొత్త కాంతులను 
అందరి కన్నుల వెలయిద్దాం 

కాలపు క్రీనీడన హాలాహలపు రుచిమరిగిన 
విలువలకు అమృతత్వాన్ని ఆపాదిద్దాం 

విశాల జగతికి విశ్వమానవతను 
బహుమతిగా ఇచ్చేద్దాం .
 
ఉన్నపాటుగా రావోయీ ఊహల్లో విహరిద్దాం 
కాసిని కలలను పండిద్దాం
********