Follow by Email

Friday, December 18, 2015

హైకూలు

బీడు గుండెపై

వానగుళ్ళు 

ఎంత ప్రమోదం

 ************

నిండు జాబిలి 

సెల్ఫీ తీసుకున్నాడు 

మా ఊరి చెరువులో  

***********

చెట్టు కొలతలు తీస్తూ 

తనపై కొత్తబట్టలు 

కుట్టించుకుంటుందా తీగ

************

అరవై లోనూ 

ఆరు రుచులూ  జుర్రడమే 

అదృష్టమంటే  

 

**************


Thursday, December 3, 2015

మినీ కవితలు

మినీ కవితలు 

జార్చిన హృధయమెంతగా 

బాధ పడుతుందోనని 

అందరికన్నా ముందుగా 

ఆ హృదయాన్ని ఓదార్చవూ 

ఆ జారే కన్నీళ్ళు 

*************

నీడలు, నేలతో చెప్పే 

ఊసులనే కదూ!

పదాలుగా అల్లి 

పాడుకుంటూ పోయేవా సెలయేళ్ళు 

*************

దొరలనుండి విముక్తి కోసం 

నాడు నిరాహార దీక్ష 

ధరల నుండి విముక్తి పొందలేక నేడు.......... 

**************Saturday, August 15, 2015

మినీ కవితలు

మినీ కవితలు 

వెన్నెల్లో, సాలె గూటి వల వేసి

అందిన కాడికి ఆ నక్షత్రాలను 

పట్టేశానోయ్! 

తక్కువైపోయాయంటే ఎట్టామరి 

*************

తన వైపుకు నా అడుగులు 

పడుతున్నాయన్న ధీమాతో 

తను ఎదగడం మొదలు బెట్టిందా కొండ 

***************

నావికుణ్ణి వెతుక్కుంటూ 

వచ్చే తీరం కదటోయ్ 

వసంతం

************** 
Tuesday, July 28, 2015

కలాం

కలాం 

తలలో తక్షశిలతో పుట్టావా ఏమిటోయ్ నువ్వు?

లేకుంటే నీ నాడులన్ని నలందకు దారులౌతాయా ఇలా. 

విశ్వానికే వన్నె తేలా! గెలవాలన్న నీ సంకల్పం 

గెలిచి వినమ్రతకే వన్నె తేలా ! ఒదిగిన నీ వ్యకిత్వం 

అంకెలకందని విజయాలు సాధించి 

మాటలకందని మౌనాన్ని మిగిల్చావా కలాం?

అందుకే అంటాను నిస్సందేహంగా నేను 

చరిత్ర, ఎOదరినో చిరంజీవులని చేస్తే!

మా భవితకు అమరత్వమీయగలిగేది మాత్రం 

నీ జీవిత చరిత్రేనని  

Friday, July 24, 2015

ఆవిష్కరించు


పొంగిన లావా, పచ్చని బయలైనట్లు  


పొంగిన కన్నీరు పచ్చని బ్రతుకీయదేమి?

 

కడకు చేరిన అలలకు నురుగు నవ్వులు తోడైనట్లు గాక

 

తుదికి చేరిన ముదిమికి మోమెందుకాయే ఎoడమావి?

 

ఊహాశ్వ సారధ్యాన అందుకున్న స్వర్గపు ఆతిధ్యానికై 

 

మది దాటి మిన్నునంటదేమి చింతనా స్రవంతి 

 

దార్యమే మతమన్న విలాసహాసపు ప్రకృతింట 

 

స్వార్దమే వేదమాయనేమి పాలనా సంస్కృతికి 

 

సహకారపు సొబగు, సారస్వతపు జిలుగు నెరుగని

 

వెలలేని బ్రతుకులు ఏపాటి విలువ సేయు?

 

యోచనతో ఆవిష్కరించవోయ్  నిన్నటి ఆ విలువలను

 

విమోచన మప్పుడేనోయ్  రేపటి నవతరానికి

 

 ********Wednesday, June 3, 2015

హైకూలు

హైకూలు 

తలకట్టు, దీర్ఘమైతే 
పోయిన ప్రాణం 
తిరిగిరాదా? ఆ పూలజడలకి 
**************
ప్రకృతి అందాల వెనుక 
పరుగులెత్తే మనసులకి 
పట్టే స్వేదమేనోయ్ అమృతమంటే 
***************
ముందుకెళుతూ 
వెనుకకు చేర్చేది ఫ్యాషన్ 
వెనుకబడుతూ 
ముందుకు నడిపేది కల్చర్ 
****************
మనసు చేసే 
మౌనపు సేద్యానా 
కలుపు తప్పదోయే ఊహలుగా  
****************

Friday, April 24, 2015

అగాధం

అగాధం
అనుభూతికి హృదయానికి నడుమ 
మనిషికి మనిషికి ఏర్పడినంత 
అగాధమేర్పడిన్దిప్పుడు 
*************
హైవే 
రాలిన ఆకులే వాహనాలుగా 
హైవేను తలపిస్తుందా 
కోనలోని సెలయేరు 
*************
చక్రాలు 
యుగం మారి 
ధర్మానికి విరిగిన ఒక్కో కాలు 
చక్రాలై అమరాయా అధర్మానికి 
************
వెన్నెల 
మనసులనే కాదు 
చూపులను కూడా కొనలేనంత 
పేదదయ్యింది వెన్నెలిప్పుడు 

Monday, April 20, 2015

హైకూలు

హైకూలు 
పేజీల సౌభాగ్యం 
రాజీల దౌర్భాగ్యం 
పాపమా విలువలది 
***********
వాలుజడలకై 
వేచిన అభిసారికలు 
పూలజడలు 
************
చావుని 
పోషించడమే 
జీవితమంటే 
***********
ఆహా నుండి 
హవ్వా వరకు 
మన తెలుగో!మన తెలివో?


Thursday, April 16, 2015

హైకూలు

హైకూలు

సీమంతానికి పెద్ద ముత్తెదువ 
ఆ కోయిలమ్మ 
ప్రసవానికి మంత్రసాని 
ఈ నెమలమ్మ 
************
మనసుకి 
ఊహ జీతం 
స్వప్నం బోనస్ 
************
పూల తావిని కడుపార మేసి 
అరగడానికని
ఈ పైరు పాపలను ఊయలూపుతున్దీ గాలి 
************
రోడ్డుకొచ్చిన అల్సర్లే 
ఈ గోతులు 
Sunday, April 12, 2015

పక్షి గూళ్ళు

పక్షి గూళ్ళు 

అన్ని పూలతో విరిసిన, ఆ మాను సిగలో
కిలకిలా నవ్వే పూలై, ఎలా అమరాయో 
చూడా పక్షి గూళ్ళు 
**********

మెరుపు తీగ 

ఏ తీగా రాల్చలేనన్ని పూలను 
తను రాల్చగలనని కాబోలు 
ఉరిమేంత గర్వముందా మెరుపు తీగకి 
***********
సాలీడు 
తన ఇంటి మాటు నుండి చూస్తూ 
నిండు చంద్రునికో నూరు నూలు పోగులేసే 
కిటుకు నేర్చుకోమంటుందేమిటోయ్ ఆ సాలీడు  

Wednesday, April 8, 2015

తెర

                          తెర 

నేటి బాలల కోసం నువ్వు లేవనుకున్నాను గాని 
బడి గోడలూ, దాటేశావని తెలుసుకోలేక పోయాను. 
సమ్మోహనాస్త్రాలు మెండుగా ఉన్న 
ఉద్వేగోన్మాదివి నువ్వు. 
ప్రేమలను విరబూయిస్తావు,
పగలే పరమార్ధమంటావు, 
రాని వయసులను రప్పించేలా నిన్ను నీవు అలంకరించుకుంటావు.  
అవును!
వర్ణశోభ, కర్ణక్షోభ తప్ప ఏమున్నాయి నీదగ్గరిప్పుడు? 
అనురాగాలను అనంత లోకాలకంపేసావు,
హితం లేని సాహిత్యాన్ని 
ఇంగితం లేని సంగీతాన్ని ఎక్కు పెట్టి ,
విలువలపై 70MM బట్ట కప్పి 
సాని బాట పట్టేవు, కసి కేళీ చూపేవు 
తెరవు, కల్ప తరువువు అనుకున్న 
ఎoదరి కళ్ళకో అడ్డు తెరగా నిలిచేవు 

Monday, April 6, 2015

క్రోధం-మోదం

క్రోధం-మోదం 

మనసు నుండి ఎప్పటి 
మకరందాన్ని అప్పుడే 
తాగేసే భ్రమరమా క్రోధం  
కూడబెట్టే మధుపమా మోదం
************

పూలు

మూగ సైగలే తప్ప 
మాట్లాడడం రాని 
బహు భాషావేత్తలీ పూలు 
*************
అత్తరులు 
పరిగెడుతున్న ఈ సమాజంలో 
ఆ అనురాగాలకన్నా 
ఎక్కువ ఆయువునే 
పొసుకుంటున్నాయి అత్తరులు 
*************


Friday, April 3, 2015

గోదారి

గోదారి 

తన విభునకేమి తక్కువంటూ 
పుట్టింటి నుండి పట్టుకెళ్ళాసిన 
చీర సారేలను మనకు జీవితాలుగా 
వదిలేస్తుందా గోదారి 
*************

నింగి నేతగాడు 

తన సిగ్గుతో, మేఘాల మేని పై 
బంగరు బట్టను నేసి 
మన చూపుల గిట్టుబాటoదక 
మదనపడే నింగి నేతగాడా నిండు జాబిలి
************** 

కోవెలలో 

అనుభూతి ప్రసాదం 
తీర్ధమా ఆనంద భాష్పం 
ఈ ప్రకృతి కోవెలలో 


Saturday, March 28, 2015

మనిషి

మనిషి 


ఉండాల్సిన సుగుణాలన్నీ 
ఉన్నట్టుగా కనిపించే
ఎoడ మావి పేరే మనిషి 
*************

తాటికాయలు 

నా దేశ సంస్కృతి పై 
పడుతున్న తాటికాయలు 
ఈ వారాంతాలు 
*************

ఎoదుకో?

నాడు గంగలా పొంగిన సారస్వతం 
నేడు సరస్వతిలా అయిoదెoదుకో 
ఈ సినిమా పాటల్లో 
**************

మహాత్మా 

నోటితో వద్దన్న పనులన్నిటినీ 
నోటుతో చేయించడం నీకే చెల్లింది 
ఓ మహాత్మా 
Monday, March 23, 2015

హైకూలు

హైకూలు
**************

ఆకాశాన్ని దీవిస్తూ 

అక్షతలు  విడిచిందా  పంట చేను 
 
పక్షి  గుంపులుగా 
***********

కృష్ణుడే వచ్చి 

కుచేలునికి మూడు గుప్పిల్లిచ్చి

అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే 

రాజకీయమంటే

***********

నలుగురితో సంఘర్షించిన వేళ 

చరిత్ర లోకి నేను నడిచాను 

నాతో నేను సంఘర్షించిన వేళ 

తనుగా వచ్చి నాతో నడచిందా 

చరిత్ర

**********

అడవిని వదిలామని 

అందరూ నమ్మడానికి 

ఇంకెంతగా మారాలో కొందరు 

 

 

 

Saturday, March 14, 2015

తాంబూలం

తాంబూలం 

ఆమె చేతులను చిగురింప జేసి
ఆతను! నాకేది ఆ వర్ణమని
అడిగాడు కాబోలు
తాంబూల మేసుకొచ్చిందామే
*******

వస్తుందా?

అర్ధ రాతిరి ఆడది ఒంటరిగా తిరిగే 
రోజొస్తుందేమో గాని,
ఆ కధా నాయికి ఒంటి నిండా 
గుడ్డ కప్పుకునే రోజు ..... ?
******** 

విరిసిన పూలై 

రాతిరంతా నాతో 
ముచ్చటలాడిన తారలన్ని 
తెల్లారిందో లేదో 
కిటికీలోంచి నన్ను చూస్తున్నాయి 
విరిసిన పూలై 
******

DVD

అనుబంధాల బరువును 
దింపుకుంటుంది నా గుండె 
DVD గా 
********

Thursday, March 12, 2015

కసరత్తు

కసరత్తు 

నా చూపులను గెలవాలని
అలా అలా కసరత్తు
చేస్తున్నాయా కిరణాలు
ఈ అలలపై
*******

సగం సగం

ఇంటి దాని కన్నీళ్ళు  సగం
ఒంటి నుండి జారిన  చెమట నీళ్ళు సగం
చాలవేమిటోయ్ నింపడానికా
ఖాళీ మద్యం సీసాని

తొలకరి 

తెల్లారుతూనే ఆకాశం పైకి
తొలకరిని కురిపిస్తుందా వనం
కిల కిల మంటూ

నా కళ్ళు 

వికసిస్తున్న నీ వదనపు పరిమళాన్ని
శ్వాసిస్తున్నాయి నా కళ్ళు
 

Sunday, March 8, 2015

గోరుముద్దలు

గోరుముద్దలు 

నిద్దురా మెలకువ కూడా
గోరుముద్దలే
ఒత్తిడికి
*******

గురు దక్షిణ 

నాట్యం నేర్పిన గురువని!
ఆ గాలికి
పూలు పత్రాలను రాల్చి
గురుధక్షిణ లిస్తుంటాయి
ఆ చెట్ట్లు 
******

మచ్చలోడు 

అందగాడని అందరూ అంటూనే ఉన్నా 
మాటి మాటికి  ఆ మబ్బుల మాటుకెల్లి 
ముఖం కడుకొస్తాడేమిటా మచ్చలోడు 
******

బుగ్గన చుక్క 

అద్దంలోని చందమామకు 
బుగ్గన చుక్క పెట్టానని 
నాకు వినబడేలా  పక్కున నవ్వింది 
ఆ కలువ 
 

 

 

Friday, March 6, 2015

ఆగని కన్నీరుగా

ఆగని కన్నీరుగా 

ఆకాశం కూడా
నా మనసులానే
మబ్బులతో డాగులు పడింది
పెద్ద వర్షం రావలసిందే
ఆగని కన్నీరులా

****

సతీ సహగమనం

సతీ సహగమనమంటే
ఎమిటని ఆ కలువ కమలాల కన్నా
మిన్నగ చెప్పగలవారేవ్వరోయే!
****

పిసినారి సంద్రం 

అంత చోటు తనకున్నా
నా కాళ్ళ  కింది చోటును కూడా
ఎలా కరిగించుకుని పోతుందో చూడా సంద్రం
****

మిడిసిపాటు

మెరిసిపడే  వెన్నెలకు 
మిడిసిపడడం నేర్పింది 
మా పల్లె చెరువు 

 
 

Wednesday, March 4, 2015

బదులు 

వయ్యారముప్పొంగే పరువంపు వేళ
ఆ దరి కెన్ని ముద్దులిడినావని
ఎడబాసిన వేళ ఈ గోదారి నడిగితే
తిన్నెలుగా పరుచుకున్న
ఈ ఇసుక రేణువు లన్ని,అని
ఎంత అందంగా బదులిచ్చిందో చూడు

పేరంటాళ్ళు 

పగలూ రాత్రీ ఎప్పుడూ
ఎవేవో పిలుపులతో
ఇన్నిన్ని పేరంటాళ్ళను
ఎలా జరిపిస్తుందీ వనమని
ఆ చిటారు కొమ్మనో ఈ చిన్ని మొగ్గనో
అడిగావా ఎపుడైనా నువ్వు?

మెరుపు

నింగి తోపున పూచిన 
పూలా మబ్బులను కూర్చి 
మాల కడదామనుకున్న నా తలపుకు 
చిక్కెనుగా మెరుపు దారమై