Follow by Email

Sunday, May 27, 2012

వసంత శోభ

కాలాన్ని అరువిచ్చి పుచ్చుకుంటూ 
ఆ రుతువులు తనకు మాత్రం 
తరగని వసంత శోభను కట్టిపెడుతున్నాయంటూ 
మురిసిపోతోందా మృత్యువు.
******
అంత తొందరగా 
చెట్టు నీడను వదిలిపెడుతుందా 
బంధం బలమైనదైతే 
స్వేచ్ఛతో  పనేమిటంటూ 
ఆ ఎండుటాకు.
*******
బద్ద శత్రువులైన 
ఇద్దరు సమవుజ్జీల నడుమ 
అధికార బదలాయింపును 
ఎంత సులువుగా చేస్తుందా సంధ్య.
*******
అధికారంలోకి రాగానే 
ఇచ్చిన హామీని 
ఎంతందంగా నెరవేరుస్తుందో 
చూడా దీపం.
*******

Friday, May 25, 2012

ముత్యాలు

అన్ని ముత్యపు చిప్పలలో 
ముత్యాలుంటాయో లేదో గానీ 
అలాగుండే  అందరి కళ్ళలో మాత్రం.......
******
కాలానికన్నా తానెక్కువ 
కష్టపడుతున్నానంటుంది నా మనసు 
ఊహల్ని కలల్ని రుజువులుగా చూపుతూ.
********
నా అన్న వాళ్ళు నలుగురితో 
కలిసున్నానన్న ఆనందమే 
మకరందమయిందా పువ్వులో.
********
నాటి నాయికల అందాలు 
కావ్యాలకు కొత్త శోభలను తెస్తే 
నేటి నాయికల అందాలు గోడలకు 
నగ్న శోభలను తెస్తున్నాయి.
*******

Wednesday, May 23, 2012

సెలయేరు

ఒద్దికగా తన ఇంట్లోకొచ్చి 
వయ్యారాన్నే తన ఇంటి పేరుగా 
మార్చిందా వాన చినుకంటూ 
ఒంపు ఒంపునా గట్టుతో చెబుతూ 
పారుతుందా సెలయేరు.
********
అందమైనది గనుకే 
నా మౌనం 
దానికన్ని శత్రువులు.
******
తొలకరికా మట్టి 
పువ్వైందని 
వర్తమానమిచ్చిందా గాలి
నా మనసుకి.
******
ఎంత కాలమైనా 
నాలో నీ ఆనవాళ్ళు 
మాపడమనే విద్య 
అబ్బింది కాదీ కాలానికి.
*******

Friday, May 4, 2012

గత జన్మ

పూలకి
గతజన్మ 
జ్ఞాపకమా తేనెపట్టు.
******
నా మనసు లోతెంతో 
చెప్పగలిగేవి 
నా కన్నీళ్ళే.
*******
శ త్రువెంత సాధించినా 
విజయాన్ని ఆ శత్రువుకే 
అంకితమివ్వడం 
ఒక్క దీపానికే చెల్లింది.
*******
బ్రతకడానికి కాలంతో పాటూ 
పరుగెడుతున్న నన్ను చూసి 
 ఆయాసపడుతోంది నా నీడ
అవును నా కన్నా నా బ్రతుకు విలువ 
దానికే తెలుసు మరి.
*******

Thursday, May 3, 2012

జీవితం

ఆ రెండు మెట్ల నడుమ 
లెక్కలేనన్ని  విన్యాసాలు చేసేదే 
జీవితమంటే.
*******
ఆ అడవి మానుల్ని అడిగి మరీ 
ఒక దాని వెనుక ఒకటి క్రమంగా 
వచ్చేవా రుతువులు 
ఇపుడడగడానికి అవి లేవనే 
బొత్తిగా క్రమశిక్షణ తప్పాయి.
*******
జీవితాల్లోకి తొందరొచ్చి 
శుభకార్యానికి సగం 
అశుభకార్యానికి  మూడొంతులు 
ఆయుష్షును తగ్గించేసింది.
*******
జీవితదశలు మారినంత 
నిదానంగా కూడా 
దశలు మారడం లేదా పాత్రలకు 
డైలీ సీరియల్లో.
*******

Sunday, April 29, 2012

పేరంటం 

గడప దాటకుండానే అందరినీ
తన ఇంటి పేరంటానికి ఆహ్వానించడం
వచ్చిన వారందరినీ గడప దాటకుండానే
నిండు మనసులతో సాగనంపడం
మధువుతో పెట్టిన విద్యా కుసుమాలకు.
*******
శస్త్ర చికిత్సను ఎంత సులువుగా
చేయొచ్చో ఆ డాక్టర్లకు
నేర్పుతుందా తామరాకు
పురుడు పోస్తూ ఈ నీటి బొట్లకు.
*******
మనసు కరిగేలా మాటాడితే
ఫలమెంత మధురంగా ఉంటుందో అని
అంటుందోయ్ ఆ మట్టి
మొలకలై మొలిచి.
********
జారిన చినుకే
పండి అలా పండక ఇలా
ఇంకో రెండు చినుకులను
సంపాదించడమే వ్యవసాయం.
*******

Friday, April 27, 2012

పరిచయం 

నా అడుగులనెంత లోతుగా
పరిచయం చేసుకుంటుందో
ఆ కడలి తీరం
ఎంత లోతుగా నా లోకి
అడుగులు వేస్తూ పరిచయమౌతుందో
ఈ పూలహారం.
*******
ఎవరెస్టుకు జాబిలికీ కూడా
దగ్గరైన పాద ముద్రలు
పాపమెందుకో
దూరమౌతున్నాయా పంట చేలకీమధ్యన.
*******
తొలి సంధ్య వెలుగునా కాన్వెంటులు
మలిసంధ్య చీకట్లనా వృద్ధాశ్రమాలు
ఎంతందంగా దక్కించుకుంటున్నాయో.
*******
నడకలు నేర్పడంలో
వాన చినుకుకు సాటెవ్వరంటూ
చూడా మన్ను.
*******
లాకర్లలో
ఆ పూల మనసులు దాచే
బ్యాంకా తేనెపట్టు.
*******