Follow by Email

Friday, September 20, 2013

ఉరికొయ్యలు

ఉరికొయ్యలు
ఆడది నిర్భయంగా తిరగాలంటే 
ఉరికొయ్యలకు తలలు పూయాల్సిన ఖర్మ 
ఇంకెన్నళ్లో నా భారతాన. 
******
చందమామ
చూపుల పాలనకెంత దూరమైందో 
నింగిలోని ఆ నిండు చందమామ 
లేత చేతుల లాలనకు అంతే దూరమైంది 
ఈ కథల చందమామ. 
*******
పూనకం
గుడిలో అజ్ఞానమనిపించుకుని 
పబ్బులో విజ్ఞానమనిపించుకునేదే!
పూనకం. 
*******
ప్లాట్ 
పొలం కట్టిన 
పచ్చని చీరను 
పచ్చనోట్లు విప్పేస్తున్నాయి. 
*******

Monday, September 16, 2013

జాబిలి -కలువ

జాబిలి -కలువ
నీ చెక్కిలిపై విలాసంగా నవ్వుతున్న 
నన్ను నేను చూడకనే 
కలువలై విచ్చిన నీదు కన్నుల జూచి!
ఎక్కడా? ఆ నిండు జాబిలని వెతికాను. 
*******
కొంటె కోణంగి
కవ్వించి, కవ్వించి నింగి వెలుగులను దాచేసే 
ఆ కొంటె కోణంగేనా! 
కరిగి, కొసరి కొసరి ఇన్ని అందాలను 
దానమిచ్చేదీ అవనికి. 
*******
గుణపాఠం
ఎదురు లేదంటూ చెలరేగే గాలికి, 
వెదురు తగిలి నేర్పే గుణపాఠం 
ఈ జన్మకు మరువగలవా నువ్వు. 
*******
చిరంజీవులు
పూస్తున్న ఉరికొయ్యల సాక్షిగా,
నా దేశాన! ఆడదాని భయము,
మగవాడి అహంకారము రెండూ చిరంజీవులే.
 *********

Wednesday, September 4, 2013

నాగరికత

నాగరికత
అవమానం అనుకోపోతే 
నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా!
నడిరోడ్డుపై పోతున్న మానమే. 
******
వానచినుకులు
బాటసారులై 
గగనపు వీధుల సంచరించే 
కారుమబ్బులకు పట్టిన 
చెమట చుక్కలేమో ఈ వానచినుకులు.
ప్రజ్ఞలు 
వెలుగులోకొచ్చే స్థోమత లేక 
కొన్ని ప్రజ్ఞలు, ఎంత చీకట్లు మిగిల్చాయో 
నా భారతాన. 
******
ఆత్మహత్య
కావాలని చమురొంపుకుంటున్నాయి 
కొన్ని దీపాలంటూ 
ఉసూరుమంటున్నాయి 
రేపటి వెలుగులు. 
******