Thursday, June 26, 2014

కొండంత మేడ

కొండంత మేడ
చిటికెన వేలంత పునాదిపై 
కొండంత మేడను 
ఎంత అందంగా కట్టిందో చూడు 
వెలిగే ఆ దీపం. 
****
మానవత 
ఏమి నిలబడి ఉంటుందోయ్ 
ఆ అద్దం ముందు 
అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో 
ఆ ఏముందిలే 
బహుశా! మానవతైయుంటుందేమోలే!
****
పేదరికం-ఆడంబరం
చిరిగి 
పేదరికాన్ని ఆడంబరాన్ని కూడా 
ప్రతిబింబించగలదు ఆ బట్ట. 
****
సంధ్య
బద్ధ శతృవులైన 
ఇద్దరు సమవుజ్జీల నడుమ 
అధికార మార్పిడిని 
ఎంత సులువుగా చేయగలదో చూడు 
ఆ సంధ్య. 
****

Friday, June 20, 2014

ప్రకృతిచిత్రం

అందాల విందు 
అడ్డం లాటి మనసు, ఆతిథ్యమీయాలన్న ఆశ 
ఈ రెండూ చాలవా? ఆకాశం కూడా మురిసి పోయేంత 
అందాల విందును 
ఆ నిండు జాబిలికి వడ్డించనేనంటూ 
చూడు ఎలా మిడిసిపడుతోందో 
అందాల ఈ పల్లె చెరువు. 
*****
ఆనందబాష్పమాల
ఎంత ఆనంద పడుతోందో ఈ కడలి 
తను రాల్చిన ఆనందబాష్పధారలు 
మాల అయి నీ మెడను మెరుస్తున్నందుకో చెలీ!
******
అందమైన అలజడి  
నాలుగు రాళ్ళను లోనికేసుకుంటూ 
అలజడిలో కూడా 
అందముందంటుందా చెరువు 
నిజమేనంటావా?
****
మధనం
మధనం అమృతంతో ఆగిపోయింది కదా!
అలానే అంతర్మధనం కూడా 
ఆనందబాష్పం తో ఆగిపోతే ఎంత బావుణ్ణు. 
******
శిల
మేనితో గానీ మనసుతో గానీ 
మీరు పలుకరించలేని శిలలాంటి మనుషులుంటారని 
తనపై రాలిన ప్రతి పూవుతోనూ 
అంటుందా శిల. 
******
  

Wednesday, June 18, 2014

గతజన్మ

గతజన్మ
గతజన్మలో 
నీలిమబ్బుల బారులు 
ఆ నదీపాయలు. 
***
భాగ్యవంతురాలు
అటూఇటూ 
పూలు కావలి కాచేంత
భాగ్యవంతురాలా దారం. 
****
మెరుపుసుందరి
చీకటిలోనూ 
ఆ మబ్బుల గుంపుల్లో దారిచేసుకుంటూ 
ఎక్కడికి పోతోందో 
ఆ మెరుపుసుందరి. 
****
యుక్తి
గెలిచేదాకా పోరాడే 
శక్తి ఐతే ఉంది గానీ 
ఎలా గెలవాలో అనే 
యుక్తి మాత్రం లేదా అల దగ్గర. 
****

Monday, June 16, 2014

అందం

అందం
 ఓ పక్క ఆ ఆకాశం 
తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా 
అందాన్ని ఎంతందంగా 
నెమరువేస్తోందో చూడా నది 
ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని. 
*****
జలపాతం
దగ్గరకు పిలిచి 
అంత గంధం నా మేనంతా పూసి 
తన గాంధర్వాన్నంతా వినిపిస్తుంది 
నాకా జలపాతం. 
******
తలపు
పరుగెడుతున్న ఆ ఏటి చరణాలకు 
గజ్జె కడదామనుకున్న నా తలంపే 
నవ్వు నురుగులుగా పల్లవిస్తుంది అదిగో అలా.... 
******
దివాలా
కలలు పండించలేక 
నిదుర కూడా వ్యవసాయంలా 
దివాలా తీసిందోయ్. 
******

Wednesday, June 4, 2014

వెలుగుల చీకట్లు

వెలుగుల చీకట్లు
నా దేశాన సంస్కృతనే గర్భాలయాన 
రంగురంగు దీపాలే!
ఎన్ని చీకట్లను ప్రసవించాయో చూడు!
ఆ పబ్బుల పుణ్యమా అంటూ. 
****
వెచ్చని స్వప్నాలు
మబ్బుల దుప్పటి కప్పుకుని నిదురించే 
ఆ కొండల మనస్సుల్లో 
వెచ్చని స్వప్నాలుగా ఎన్ని మొలకలో!
*****
వ్యభిచారం 
సానికి కూటికై,
నేతకు సీటుకై. 
అక్కడ దానితో ఒక్కడికైనా సుఖముంది 
ఇక్కడ వీడితో ఎవ్వరికైనా ఉందా .... సుఖం. 
*****