Wednesday, June 22, 2016

ఏమిటోయ్ ?

పదునెక్కే ప్రేమతో ఓ వైపు 

పదును తగ్గని పగతో ఇంకో వైపు! 

రెండు వైపులా తనకు పదునే అంటూ,

నిస్సుగ్గుగా! విలువల గొంతుకలు

తెగనరికే, కరవాలమైనదేమిటోయ్ 

మన తెలుగు సినిమా. 



Tuesday, June 21, 2016

కాదంటావా?

బొడ్డు పేగులను పిండుకుని,

చితి మంటలలో వండుకుని!

కడుపు నింపుకునే తత్వాన్ని 

ఆ లంచానికి 

అలవాటు చేసింది,

మన అలసత్వమే కదటోయ్!

  


Monday, June 20, 2016

ఏమో?

పెరుగుతున్న నిత్యావసరాల ,

ధరల పుణ్యమా అని!

తాను కూడా 

ఆదాయపు పన్ను కట్టించే 

జాబితాలో చేరిపోతుందేమో 

కడుపు నిండుగా చేసే భోజనం. 


Tuesday, June 14, 2016

ఎవరో ఆమె?

రాతిరేల, ఆమె ఎవరో?

కడలి సైతం మనసుపడేటన్ని, 

నిధులతో బయలుదేరింది. 

మనిషి మనిషినీ ఆపింది,

మనసు మనసునీ అడిగింది. 

రాతిరికి, తనకాశ్రయమీయమని 

కలల వేణువు నూదుతూ 

మీతో కలసిపోతానని. 

మా కలతలు మావిలేమ్మా!

నీ కలలు మాకెందుకంటూ 

అందరూ ఆమె నుండి దూరంగా జరిగారు 

చేసేది లేక దారి పట్టి పోతున్న ఆమెను 

పసి మనసులు పొదుగుకున్నాయి. 

అందుకై ఆమె 

ఆదమరిచే హాయి నిధులను వారికిచ్చి 

వారి మూగ నవ్వులతో 

తనకు  జోల పాడించుకుంటుంది 

వేళనక, పాళనక.