Friday, December 23, 2016

నువ్వెపుడైనా?    
   --------------------------  
కోనంత తక్కెట్లో
కొండంత తూకం రాళ్ళేసి
రమణి పకృతి గట్టిన
వెన్నెల పైట బరువెంతో
తూచావా? నువ్వెపుడైనా?
సంజె వర్ణాలను
కళ్లతో చిలికి
వన్నెల వెన్న నద్ధుకోమంటూ
కను సైగ చేశావా?
ఆ పూబాలలకు నువ్వెపుడైనా?
మడమ పూవులు పూచిన
చేల మానుపై
పిట్ట గూటిగా వెలయిoచావా?
మనసును నువ్వెపుడైనా?
అణువణువు లోనూ
అంతు చిక్కని దేలే
ఈ అనంత ప్రకృతి సౌoథర్యం .
పరుగు పరువనక
పలుకరించే మనసులకేలే
అది సొంతం.

Friday, December 2, 2016

అవును

నేనూ, నువ్వూ నాలోనే!
కానీ, లోలోన నువ్వూ నేనూ
మాటాడుకుని నేటికీ ఎన్నేళ్లు?
అందం, మాధుర్యం
లాలనా, పాలనా ఏమి లేవని నీలో.
కానీ!!!!!!!
నా వ్యావహారిక వినిమయంలో,
ఓ క్షణం కూడా నిన్ను తలవక పోవడమే గొప్పని
మాటలై, నీ భావాలు ప్రబోధాలవ్వనీయడమే తప్పని
కాలం నేర్పిన కొత్త కైపు
తలకెక్కించుకున్న నా వైపు
ఎప్పటిలానే ఆప్యాయంగా నువ్వు చూస్తున్నావు గాని
నీకు నాకూ నడుమ ఈ బంధమేనాడో
వాడిపోయిందే!!!!!! ఓ  ఏకాంతమా అని
గర్వంగా చెప్పడానికి సిగ్గెందుకే నాకు....... 


Tuesday, November 29, 2016

ఒట్టు

చెరువులో నీటి బొట్టొక్కటి
తామరాకు మీదకి ఎక్కింది.
దానందానికి!
ఆశాంతం మురిసిపోయిందా చెరువు
ఆభరణాలెన్నో పెట్టి మెరిసిపోయిందా కిరణం.
బడిలోని బాలుడొకడు
ఆట స్థలం బాట పట్టాడు!
వాడానందాన్ని!!!!!
అదే పనిగా నిందించిందా పొత్తం.
ఆంక్షలెన్నో పెట్టి అలసిపోయిందా బెత్తం.
మళ్ళీ మళ్ళీ ఆకునెక్కే ఆ నీటి బొట్టులో,
తనను తాను చూసుకుంటూ!
ఆపై ఆరు బయట కనిపించని  ఆ బాలునికై
అదే పనిగా అన్వేషిస్తుందా ఆకాశం. 



Saturday, November 26, 2016

ఎందుకిలా?

ఆమెను కౌగలించుకుని ఎన్నో ఏళ్ళు గడిపాను నేను
కానీ! ఇప్పుడామె చిటికెన వేలుకు కుడా
నా పిల్లలను అందనీయడం లేదు.
నిన్నటేలా..
నా ప్రతీ ఉసూతో ఆమె పులకరించింది.
నా ప్రతీ ఊహనూ ఆమె గెలిపించింది.
నాలోకి నన్ను చేర్చి కలలా నన్ను చేరాలని
అనంత దూరాలకు నన్ను నడిపించి
నా ప్రతి రోజునూ నిద్ర బుచ్చేది ఆమె!
ఆమే!
దారి పొడవునా తను నిల్చి  ఇప్పుడు
పిల్లలకు తనను పరిచయం చేయమంటుంది
వాళ్ళ ఊసులతో తన హృదయం నింపమంటుంది.
నిజమే!!!!
ఎప్పటికీ తగ్గనిది తన అందమని తెలుసు
ఆమె ఒడి నిండుగా తరగని నిధులున్నవనీ తెలుసు
ఆమెతో పెనవేసుకోవడమే పసి తనానికి అర్ధమనీ తెలుసు
కానీ !!!!!
చదువుల జాలానికి, వాళ్ళ బాల్యాన్ని వేలం వేసిన వాణ్ణి
కాలం పరుగులకు, మనసు మెరుగులు అమ్మిన వాణ్ణి
నవ్యతను! నెత్తికెక్కించుకున్న వాణ్ణి
నిన్ననే నిన్ను మరచిన వాణ్ణి
రేపటి వారికై నిన్ను చేరనిత్తునా? అని
నిస్సిగ్గుగా అడగగలిగే వాణ్ణి
ఎందుకే నన్నింత కోరిక కోరావు? ప్రకృతి..  






Friday, November 18, 2016

కొత్త నీతి

పంట మొక్కలన్నింటినీ తొక్కేద్దాం!. 

నిటారుగా నిలబడి కనిపిస్తాయిగా ,

అప్పుడు కలుపు మొక్కలు. 

అదేపనిగా ఆ కలుపు మొక్కలకప్పుడు 

నీళ్ళను పోద్దాం, ఎరువులు వేద్దాం. 

నలిగి పడిన పంట మొక్కలు 

ఏమిటీ విడ్డురం అంటే 

వేళ్ళూనుకుని వాటి బతుకవి బతుకుతాయి. 

సారం పీల్చి నింగి దాకా ఎదిగిపోతాయి 

అప్పుడు మీరంతా పచ్చదనంతో కళకళలాడవొచ్చు 

అనే కొత్త నీతి సూత్రం నేర్పిద్దాం.     

 


Wednesday, November 16, 2016

సోదర సోదరీ మణులారా

     ఉన్నది కొద్దో గొప్పో! పట్టుకుని మనమందరం బ్యాంకుల ముందు బారులు తీరాం!

యాచకులతో సహా. కానీ మన పంచన నిలువలేని ఓ ఇద్దరి నిరుపేదల సంగతి 

మరచిపోయాం. మీరందరూ తలో రూపాయి వీరికి బిత్సం వేస్తే వాళ్ళనూ మనలో 

కలుపుకోవచ్చు. దేశాభివృద్ధిలో ఇకనైనా వారిని భాగస్వాములను చేయవొచ్చు. 

      అమ్మలారా అయ్యలారా! అందరూ ఆలోచించండి. మీ మీ స్థాయికి ఒక్క రూపాయి 

అంటే ఎంత? అందరూ ఒక్కొక్క రూపాయి వాళ్లకు విదల్చండి. ఓ యాచకా నీ చేయి 

పై నుండే రోజు నేటికి వచ్చింది. 

      నేటి వరకూ కూడా మన మధ్యకు వచ్చి ఠీవిగా నిలబడలేని కడుబీదలైన 

నల్ల కుబేరులను, రాజకీయ నాయకులను రూపాయి విదిల్చి ఆదుకోండమ్మ. 

       ఓ ప్రధాన మంత్రి వర్యా!

ఒక్క రూపాయి విరాళం భారతీయులమైన మేమంతా చెల్లించి వాళ్ళిద్దరినీ 

మా పంచకు చేర్చుకుంటాం. "స్వచ్ఛ భారత్" సెస్ లాగా "కాలా భారత్ " సెస్ 

అనే పన్నును ప్రకటించండి . మా వంతుగా ఓ రూపాయి డబ్బు జమ చేస్తాం. 

ఎందుకంటే! మేం సగటు భారతీయులం. తప్పు అనడం కన్నా! తప్పదు అనుకుని 

బ్రతికెటోల్లం. 



Tuesday, November 1, 2016

మిణుగురులు

వెన్ను జూపి విజయ మొందితివి నీవు 

వేయి శశిల నగలు నిసికిచ్చితివి నీవు 

కానరాని సంద్రాన నా చూపుకు చుక్కానివైతివి నీవు. 

వీచే గాలి, దీర్ఘాయువనును నీ వంటి దివ్వెను జూసి 

కమ్మిన నిశి, కైతలల్లును మీ కలిమి బలిమి జూసి

మిణుకు తారలు, హారతు లిచ్చును నీ పసిడి కులుకును జూసి. 

రాతిరి పలకన, చీకటి దిద్దేటి ఓనమాలావు నువ్వు 

నిండు జాబిలి ఇంట, నవ్వ గలిగేటి దీప కళికవు నువ్వు 

పరవశించే ప్రకృతి, విశ్రమించి కనేటి స్వప్న మాలికవు నువ్వు.

విహరించు నీ దారిలో, 

పలకరించిన నా చూపు సిరికి!

పసిడి చుక్కల ఆనంద ఝరిని 

బహుమతిచ్చిన గడుసరి జోతలివే నీకు!            


Friday, October 28, 2016

చిన్న పోలీస్

       రాజ్యాంగం, చట్టాలను మించి ప్రజలను పాలించడానికి ప్రభుత్వాలకు ఏమైనా

 ఉపయోగపడుతున్నాయా? అంటే అవి లాఠీలు బూట్లే.  కానీ నిన్నటి రోజున 

పాపం! ప్రభుత్వం ఆ లాఠీలు పట్టుకునే చేతుల కోసం, ఆ బూట్లు తొడుక్కునే కాళ్ళ 

కోసం వెతుక్కోవలసి వచ్చిందేమో! అయ్యో! ఇలాటి దుస్థితి ఇక ఏ ప్రభుత్వానికి 

కలగకుండుగాక. 

      ఐనా ఆకలి కేకల్ని హాహాకారాలుగా, భయానక గీతులుగా మలచి, ఆత్మగౌరవంతో   

కాళ్ళను పట్టించుకునే ప్రభుత్వ దమన నీతికి ఏం భంగం వాటిల్లిందని అక్కడ.

 షరామామూలే!

      కాకపోతే ఇక్కడ ప్రజలకన్నా లాఠీలే ఓ కొత్త నీతి నేర్చికోవలసి వచ్చింది. 

పట్టించుకోమన్నందుకు, తమను పట్టుకున్న చేతులపై కూడా ఒక్కోసారి  విరుచుకు 

పడాల్సివస్తుందని. పాపం ఇది లాఠీ స్వామ్యమని అందరూ దాని ముందు 

సమానమేనని వాటికి మాత్రం తెలీదా?

     ఇక ప్రజలంటావా? మాటాడుకోవడానికి అందరూ ఉంటారు. మదన పడడానికి 

కొందరుంటారు. అడగడానికైతే ఎంత మంది ఉంటారో? ఇది చాలదా? మన వెచ్చని 

కన్నీళ్లను తాగుతూ  సమస్య ఎప్పుడూ పచ్చగుండడానికి. 


Thursday, September 22, 2016

తొలిమెట్టు



నిండైన దానిని
సన్న సందిచ్చి, చూడనిచ్చి!
బాణమే మదిని గుచ్చి
ప్రాణమే తిరిగి ఇచ్చి !
తనువంత బంగరు పూతతో
పున్నమిన తను నిల్చి !
చిరుగాలి చెలిమితో
వింజామరలెన్నొ నాకై వీయించు
నా పెరటి కొబ్బరిచెట్టు
నిండు జాబిలింటి తొలిమెట్టు 

Wednesday, September 21, 2016

మినీ కవితలు

 

క్షణానికోసారి పండినా!
గంప కెత్త వీలుకాదేమి?
ఆ నీటి మణుల పంట!
ఈ కొలను తామరింట.
*********
మినుకు తారల తోటి
మిణుగు పువ్వుల పోటి
రెప్ప వాల్చక చూసెడి
కన్నుల కెయ్యది సాటి!
**********

Friday, September 16, 2016

స్వార్దామృతం

  

  కోట్లకు పడగలెత్తావు. చూడ చక్కని కుటుంబం నీది. కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్లు, ఆహా! నీ భోగం ఆ దేవేంద్రుని భోగమే అనుకో! కాని ఏమి చేస్తావ్.? నీకున్న స్వార్ధంతో నా అనుకున్న వాళ్లకు తప్ప ఎవ్వరికీ సాయం చేసి ఎరుగవు. ఎంగిలి చేతితో కాకిని తరమవు అన్న కీర్తి సంపాదించావు. ఆఖరికి భగవంతుడినైన నన్ను కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు. లోకం నిన్ను స్వార్ధపరుడని అంటే అంది గాని నీ కోసం నీ భార్యాబిడ్డల కోసం అనుక్షణం పాటు పడిన వాడివిగా నీ కృషి అనన్యసామాన్యం.  అలాటి కోవకు చెందిన వారిలో ఎన్నదగిన వాడవు నువ్వు . అందుకని నీ కోసం రెండు ప్రత్యేక వరాలను ఇవ్వ దలచి ఇలా వచ్చాను అన్నాడు భగవంతుడు ఆ గది లోని ఆ వ్యక్తితో.
      అప్పుడు ఆ వ్యక్తి ఏమిటి స్వామీ ఆ వరాలు అన్నాడు. అప్పుడు భగవంతుడు నాయనా! నువ్వు ఎప్పుడు చనిపోతావో? మొదటి వరంగా నీకు చెబుతా. అంతే కాదు తరువాత జన్మలో నువ్వు ఎక్కడ ఏ తల్లికి పుడతావో రెండవ వరంగా చెబుతా అన్నాడు.
          అలాగా చెప్పు స్వామి అన్నాడు వాడు. దేవుడు ఆ రెండు రహస్యాలను వాడికి చెప్పి నాయనా ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావో చూడాలని ఉంది అన్నాడు . చేసేదేముందిలే స్వామీ! ముందు మీరు దయచేయండి అన్నాడు వాడు. దేవుడు మాయమయ్యాడు.
        చచ్చే రోజుకు ముందుగానే వాడు యావదాస్థిని  చిల్లి గవ్వ పోకుండా జాగ్రత్త చేసుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. దూరమైన వాళ్లు దూరంగానే ఉన్నారు. పెళ్ళాం బిడ్డలు మాత్రం ఐనోళ్ళ మైన మాకు పూచిక పుల్ల కూడా ఇవ్వకుండా యావదాస్థినీ ఎవరో ఊరూ  పేరూ  లేని దాని పేరిట రాసి చచ్చాడీ వెధవడు అంటూ వాపోతున్నారు.
    అప్పుడు దేవుడికి గురుతొచ్చింది. ఈ పిల్ల కడుపునేగా తరువాతి జన్మలో వీడు పుడతాడని చెప్పాను. అందుకని వీడి స్వార్ధం వీడికి ఐన వాళ్ళ మీద కూడా పనిచేసిందన్న మాట.
అమ్మో ! నేను అవకాశమివ్వక గాని ఎవ్వడూ కూడా పోగేసి తన వాళ్లకు కూడా ఇవ్వడన్న మాట! అని అనుకున్నాడు

Saturday, September 3, 2016

మన మతికి బహుమతి

ఊడని బొడ్డు, నీకూడిగం  చేసే, 

ఊరేగే పాడే నీ ప్రాభవం చాటే 

ఎంత పచ్చని బ్రతుకే నీది.
మాకు
ప్రాణవాయువు కన్నా మిన్నవు నువ్వు
జీవనాడి కన్నా మేటివి నువ్వు
రాయగలేక కలములే అలసిపోయిన చరితవు నువ్వు!
కన్నీళ్ళు కరిగించలేవు నిన్ను
వెతలు కదిలించవు నిన్ను
విందౌ! అవే నీకు!
ఇంట స్కాములుగ గెలిచి
నల్ల రొచ్చుగ దేశం విడిచిన
నీ కీర్తి కిరీటానా
భరత మాత కన్నీళ్ళే కలికితురాళ్ళు !!!!!!!!!
 



Wednesday, August 31, 2016

మినీ కవిత


తొలి మంచు పడుగు 

నా చలి చూపు పేక!

చీర నేసెను సంధ్య

కట్టి చూపెను వింధ్య  

 

Monday, August 29, 2016

తెలుగు బావుటా

పల్లవి:   తీపినద్దాను తేనెకే 


             రూపునిచ్చాను వాణికే 


             ఊతమైనాను ఉనికికే

 

                  

                    పోయమంటుంటె ఊపిరే 

                    ఆర్పివేస్తావు దీపమే

                     చీకటేనాకు వెలుగంటు

                     అంధుడౌతావ ఆంధ్రుడా 


చరణం:   భువనం నిండిన ప్రాభవం 


                 బలిచేస్తుంటే ఈ తరం 


                 గురుతుకొస్తుందే నా గతం 


                 మూగవోతోంది సుస్వరం 


                 బలినే తొక్కిన బాపడై 


                 పెరుగుతుంటేను పాపడే 


                 బ్రతకనిచ్చునా నన్నింక 

                 ఆ గీర్వాణీ పతియైన ll తీపి ll


చరణం:   ఓనమాలుగా గెలిపించు 


                 అమ్మ ప్రేమగా లాలిస్తా 


                 పదముపదమున నను పలుకు 


                 పూలవానలే కురిపిస్తా 


                 నలుగురొక్కటై కాంక్షిస్తే 


                 నాలుగుదిక్కుల నవ్వనా 


                 మదిమదిలోనూ చోటిస్తే 


                 తెలుగువెలుగులే పంచనా                ll తీపి ll 

Wednesday, August 24, 2016

నీడ

              నీడ 

           -----------------

ఎన్నెన్ని అందాలు గలవే! నీ మేన,
అన్నిటిని ముద్దాడ మనసాయె  నో భామ.
సరే నటంచు నీవు బల్కిన చాలు,
అణువణువు నిను తాకి
రమణి నీకిత్తు రమ్యమైన కాన్క లెన్నో!
అని, ఆ వెలుగు పుడమిని వేడ!
అనుమతించిన పుడమిని అణువణువూ తాకి
ఆ వెలుగిచ్చిన కానుకలేనోయ్ నీడలు!!!!!

Saturday, July 16, 2016

అవునా?

విశ్వసించలేక, ఎవరికి వారైన 

మనిషినీ,మనిషినీ వదిలి 

వికసించలేని 

మనసునీ, మనిషినీ వదిలి 

వర్ధిల్లలేని 

మానవతనీ, మనిషినీ వదిలి 

విస్తరించలేని 

విలువలనీ, మనిషినీ వదిలి 

విశ్వంలోని  దూరాలనటోయ్!

కాంతి సంవత్సరాల పేరిట 

నువ్వు కొలిచేది. 

Saturday, July 2, 2016

పాపం

అంతరించి పోయిన జీవులు 

కనీసం పుస్తకాల మాటునైనా 

పరిచయమౌతున్నవి గాని!

ఏమి పాపము చేసినవో 

చుట్టూనున్న ఈ చెట్టు చేమలు 

ఆ కార్పొరేట్ బడి పిల్లల చూపుల కందక!

Wednesday, June 22, 2016

ఏమిటోయ్ ?

పదునెక్కే ప్రేమతో ఓ వైపు 

పదును తగ్గని పగతో ఇంకో వైపు! 

రెండు వైపులా తనకు పదునే అంటూ,

నిస్సుగ్గుగా! విలువల గొంతుకలు

తెగనరికే, కరవాలమైనదేమిటోయ్ 

మన తెలుగు సినిమా. 



Tuesday, June 21, 2016

కాదంటావా?

బొడ్డు పేగులను పిండుకుని,

చితి మంటలలో వండుకుని!

కడుపు నింపుకునే తత్వాన్ని 

ఆ లంచానికి 

అలవాటు చేసింది,

మన అలసత్వమే కదటోయ్!

  


Monday, June 20, 2016

ఏమో?

పెరుగుతున్న నిత్యావసరాల ,

ధరల పుణ్యమా అని!

తాను కూడా 

ఆదాయపు పన్ను కట్టించే 

జాబితాలో చేరిపోతుందేమో 

కడుపు నిండుగా చేసే భోజనం. 


Tuesday, June 14, 2016

ఎవరో ఆమె?

రాతిరేల, ఆమె ఎవరో?

కడలి సైతం మనసుపడేటన్ని, 

నిధులతో బయలుదేరింది. 

మనిషి మనిషినీ ఆపింది,

మనసు మనసునీ అడిగింది. 

రాతిరికి, తనకాశ్రయమీయమని 

కలల వేణువు నూదుతూ 

మీతో కలసిపోతానని. 

మా కలతలు మావిలేమ్మా!

నీ కలలు మాకెందుకంటూ 

అందరూ ఆమె నుండి దూరంగా జరిగారు 

చేసేది లేక దారి పట్టి పోతున్న ఆమెను 

పసి మనసులు పొదుగుకున్నాయి. 

అందుకై ఆమె 

ఆదమరిచే హాయి నిధులను వారికిచ్చి 

వారి మూగ నవ్వులతో 

తనకు  జోల పాడించుకుంటుంది 

వేళనక, పాళనక. 


Monday, April 18, 2016

మినీ కవితలు

నాగరికత
అవమానం అనుకోపోతే 
నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా!
నడిరోడ్డుపై పోతున్న మానమే. 


******
అనుభవాలవిందు
కడుపునిండా తినకుండా 
తనకు తానే,ఎంత బరువై తోచిందో,
కడుపునిండుగా మెక్కి 
తానంత తేలికైపోయింది, నా మనసు!
అనుభవాలు, విందు చేసే వేళ. 


*********
కష్టార్జితపు మత్తు 
ఆమె పిల్లల ఆకలి మంటల్లో 
ఆతని కష్టార్జితపు మత్తు 
చమురు పోస్తుంది. 
******
కన్నీళ్లు 
విడిచిన ప్రతి సారీ 
గమ్యాన్ని చేరడం తెలిస్తే!
జీవితాంతమూ పోషించే వారెవ్వరూ చెప్పు 
ఈ కన్నీళ్లను. 
*********

Wednesday, April 13, 2016

మినీ కవితలు

వైద్యము, విద్య 

కార్పోరేటువి ఒడంబడ్డాయి. 

అక్కడ డెలివరికి ఇక్కడ అడ్మిషను 

ఇక్కడ ఒత్తిడికి అక్కడ బెడ్ ఫ్రీ అని. 

******************

ఫ్యామిలి ఫోటోలో అందరూ 

తలో దేశంలో ఉండడమే 

వసుదైక కుటుంబమంటే 

అని ఎవరు చెప్పగలరు మనం తప్ప. 

**************

అందరినీ పరిగెత్తించే 

వర్తమానము, భవిత 

మనకు ఇస్తున్నది 

ఈయగలిగేది ఏమిటో తెలుసా?

నిన్నటి ఆటవిక చరిత్రనే!. 

***************

సిగరు పొగల మబ్బులు 

అప్పటికప్పుడే కరిగి 

కాక్ టైలు  పెగ్గులగును 

ఆ గబ్బు జబ్బుల పబ్బుల్లో!

 

Monday, April 11, 2016

GO BACK, GO BACK

అమ్మ ఒడిలోంచి బిడ్డను, ఎవరో మాయం చేసారు. 

కన్నవారిలో కలవరం లేదు 

అయిన వారిలో ఆందోళన లేదు. 

నిన్నకూ  నేడుకూ  బేధమే లేదన్నట్లు 

ఎవరి పనుల్లో వారు. 

పాపం! కలవరపడి ఆకాశం

తనువంతా, కళ్ళు చేసుకుని వెతికింది. 

పసి వాసనకై గాలి దేవులాడింది 

నీరు కన్నీరు పెట్టింది. అగ్ని అంతటా తడిమింది 

వెతికి వెతికి పుడమి సొమ్మసిల్లి పోయింది

పాపం! వాటికేమి తెలుసు?

వాచి వాచి విజ్ఞానం!

నరకాన్ని మించిందే ఇలకు దించిందని. 

ఆ చోటుకు తాము ఐదుగురమూ చేరలేమని 

ఏ ప్రకృతి సోయగమూ అక్కడ విరియదని 

కోరి కోరి ప్రేమానురాగాలకు,

అమ్మ నాన్నలే, అక్కడ గోరీలు కడతారని 

వాటినే కార్పోరేట్ బడులంటారని. 

ఐనా! ఎలాగయినా ఆ బిడ్డను చుసిపోవాలని 

గేటు దగ్గరే నిలబడిన 

ఆ పంచ భూతాలకూ, ప్రకృతి సోయగాలకు 

go back go back అన్న నినాదాలు వినబడ్డాయి 

అమ్మ నాన్నల నోటి నుండి 

  

Wednesday, April 6, 2016

పునరపి జననం


ఎంత తింటావు, ఏమి చేసుకుంటావు?

ఎందుకు, ఇంతింత కూడబెడతావు? అని 

ఓ నల్ల కుబేరుణ్ణి అడిగాను!

పునరపి జననాన్ని నేను నమ్ముతాను. 

చచ్చాక, నా ఇంటనే పాపడిగా పుట్టి 

తిరిగి తిరిగి నా సొమ్మును నేనే తింటా!

అందుకే నా తరతరాలకూ 

సరిపడా ఇలా ......... అన్నాడు. 

మరి పేదోడి సంగతేమిటన్నాను?

ఏ నాకు వర్తించే కర్మ సిద్దాంతమే వాడికీ ........ 



Monday, April 4, 2016

ష్.... మనసులో

               

భారత మాతకు జై, అనమన్నవాడు 

భారత నేతను 'చీ' అంటే ఊరుకుంటాడ?

నుదిటి రాతకు ఓ విధాత అని నమ్మే భారతీయత,

ఎదుటి రోతకు, ఏ నేత? అని అడగని విధేయత 

కలగలిసిన ఈ భారతమాతింట! 

మన మనసులలో మాటకు 

నేతల, మూడో కంటి మంటే తోడు. 

అందుకే, మనం మౌనమనే కవచం ధరిద్దాం. 

నేతల వాతలు ఎన్నెన్ని పెరిగినా 

పొరలను పరుచుకుంటూ,

మన కవచాలను బలపెట్టుకుందాం. 

మన కన్నా వందల రెట్లు పెద్దదౌతున్న 

మన కవచం, పాతాలపు చీకట్లు 

మనకు చూపిస్తున్నా! జై జై అందాం. 

ఎందుకోయ్  ఈ జే జే లని ఎవ్వరడిగినా, 

భరించే భారతీయతకు, 

అలవాటైపోయిన అరాచకానికి అనేద్దాం!

పైకి కాదు సుమీ  .......  



Saturday, April 2, 2016

కూనలమ్మ పదాలు

1. మనిషి మనిషిగ లేడు 

    మనిషి మనిషితొ రాడు 

    మనిషి మనిషికె కీడు 

    ఓ జాబిలమ్మ 

2. వాన చినుకుల తోడి 

    మట్టి వాసన జోడి 

   కట్టె కరువుకు పాడి 

   ఓ జాబిలమ్మ 

3. చదువు కట్టలు కట్టి 

   ప్రేమ నటకన పెట్టి 

    బలికి ముద్దుల పట్టి 

    ఓ జాబిలమ్మ 

4. వయసు తొందర సేయ 

    చాటు సరసం పూయ 

    ఫోను కెక్కెను చెలియ 

    ఓ జాబిలమ్మ 

5. మమత పాతర వేసి 

    మనసు ఉసురులు దీసి 

    బంధ మాయెను బోసి 

    ఓ జాబిలమ్మ 







Thursday, March 31, 2016

కూనలమ్మ పదాలు


1.  పసిడి సొగసుల దివ్వె 

     నిశికి పెట్టెను బువ్వె 

     జగతి నిండుగ నవ్వె 

     ఓ జాబిలమ్మ

     ********** 

2.  ప్రేమ పగలే చూడ 

     తెలుగు సినిమా నిండ 

     విలువ కేదోయ్ అండ 

     ఓ జాబిలమ్మ 

    ***********

3. శిగలు తరగగ జూసి 

    నవ్వ లేనని తెలిసి 

    విడిచె పూజడ వాసి 

    ఓ జాబిలమ్మ

    ************ 

4. అల్ల రల్లరి వాన 

    వాగు ఒంపుల లోన 

    పాడు పాటలు చాన 

    ఓ జాబిలమ్మ 

    ***********

5. కన్ను తెరవక ముందు 

    కాల కూటపు మందు 

    ఆడ శిశువుకు విందు 

    ఓ జాబిలమ్మ 

    ***********

Tuesday, March 29, 2016

మినీ కవితలు


ఉదయ సుందరి 
తాను రాసిన పాటను 
పాడడం కోసమని 
ఎన్ని గొంతులను మేల్కొల్పిందో 
ఆ ఉదయ సుందరి.
*******
నేతగాడు 
తానే ఆ బట్టకు వేలాడి 
తాను నేసిన బట్ట ఎంత నాణ్యమైనదో 
చెప్పకనే చెప్పాడా నేతగాడు.
********
తోటమాలి 
హృదయ క్షేత్రాన 
వెలుగనే విత్తొకటి నాటి 
లోకమంతటా దాని ఫలాలను 
కోసుకునే తోటమాలిని నేను.
*******
కలల మధువు
పూలై విచ్చిన ఊహల నుండి,
కలలనే! మధువును గ్రోలుతుంది నిదుర 
తుమ్మెదై 


******

Monday, March 21, 2016

మినీ కవితలు

అన్వేషణ 
వెలుగుతూ 
ఆ చీకటి శిరస్సుకై 
వెదుకుతుంటే ఆ దీపం 
దాని కింద నలుగుతూ 
ఆ దీపపు చరణాలకై 
అన్వేషిస్తుందా చీకటి.
*******
ఆణిముత్యాలు 
పడినా ,లేచినా 
ఆగక నవ్వే ఆ కడలి అంతరంగంలో 
ఆణిముత్యాలు కాక ఇంకేమిటుంటాయోయ్.
********
రాగాలాపన 
తన గొంతు పిసుకుతున్నా 
నీ శ్వాస సీమలో 
తన మనసుతో ఎన్నెన్ని 
రాగాలాలపించగలదా పువ్వు.
*******
వీలునామా 
తన ఒయ్యారపు వీలునామా 
చెల్లుబాటు కావడానికి 
ఆ ఆకాశపు చేవ్రాలు కోసం 
ఎదురుచూస్తుందా గోదారి.
*******

Sunday, March 13, 2016

మినీ కవితలు


ఆడది 
అణచుకోవడం చేతకాక బ్రద్దలై 
అది విశ్వమైంది గానీ 
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ 
ఆడదే అయ్యేదేమో.
******
 సన్మానం 
చేసిన సేవను మరువలేక కాబోలు 
కొమ్మ కొమ్మ ఆపి మరీ 
సన్మానిస్తోంది 
 ఆ రాలుతున్న పండుటాకును.
*******
పూల చరిత్ర 
పట్టు బట్టి మరీ ఆ పూల చరిత్రని 
గ్రంథస్థం చేస్తున్నాయి 
ఈ తేనెటీగలు.
********
మానవత 
మానవత 
ముందుకు నడవాలంటే 
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.


**********

Saturday, March 12, 2016

మినీ కవితలు

అద్దం 
కదలకుండా నిలబెట్టి
నన్ను నిలువుదోపిడి చేస్తూనే!
తనపై నవ్వుల పూలు వేయించుకునే
కళనెక్కడ నేర్చిందో ఈ అద్దం. 

గుప్పెడంత చేను

ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎప్పుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది 
నా మనసు
ముక్కుపుడక 
తావిని మోయలేకా గాలికి పట్టిన 
స్వేదబిందువొకటి జారి 
ఆ పువ్వుకు ముక్కుపుడకైంది  అదిగో అలా .... 
*******

Sunday, March 6, 2016

మినీ కవితలు

మినీ కవితలు 

నా చేతుల్ని 

ముద్దాడడానికని 

మిణుగురుల అవతారం 

ఎత్తింది ఆ జాబిలి

************

నా మనసులోనే నిన్నెక్కడో దాచి 

దాగుడుమూతలు ఆడుతూ 

నిన్ను కనిపెట్టే ఆటకు 

విరహమని పేరు! ఓ నా చెలి 

***********

ఆ బురద మట్టిలో పడి 

మాట్లాడే మొక్కలుగా మొలిస్తే 

ఎంత బావుణ్ణు! మన నీడలు 

**********





Thursday, January 28, 2016

మీ వెర్రిగాని

మీ వెర్రిగాని 

ప్రశ్నలు అడిగితే,

చెప్పలేక దిక్కులు చూస్తున్నాడా?

స్పెల్లింగ్గులు రాయమంటే 

అన్నీ తప్పులే రాస్తున్నాడా?

ఇంక వీడికి చదువేమబ్బుతుంది 

ఉద్యోగమెలా వస్తుందని అనకండి. 

ఏమో దిక్కులు చూసే వీడే 

రేపు వాస్తు సిద్దాంతి అవుతాడేమో!

స్పెల్లింగ్గులు తప్పులు రాసే వీడే 

రేపు న్యుమరాలజిస్టు అవుతాడేమో!

ఆ! కాలం మారిందండి బాబు. 

రంగు రాళ్ళు, వాస్తు గూళ్ళు  

రూపాంతర నామాలు, సహస్ర దీపాలు 

వేటికవే అదృష్టాన్ని అన్లిమిటెడ్ గా పంచుతూ ఉంటే 

అక్షరం ముక్కబ్బనోడికి  కొలువును 

ఆ చదువుల తల్లే చూపాలా? మీ వెర్రిగాని!

 

Wednesday, January 27, 2016

మినీకవితలు

మినీకవితలు 

తాత 

తండ్రి 

మనవడు

ఓ అనురాగపు టింటి కప్పు 

వృద్ధాశ్రమం 

ఆఫీసు 

కార్పోరేట్ హాస్టలు

ఆ అనురాగపు చావు డప్పు 

***************

ఎవడి ప్రపంచాన్ని 

వాడికిచ్చే సాంకేతికత ముందు, 

అందరిదీ ఈ ప్రపంచమన్న

నాగరికత నిలుస్తుందా? చెప్పు 

***********

అదృష్టానికి మార్గదర్శులటోయ్  

పేర్లలో అక్షరాలూ 

ఊర్లలో దేవుళ్ళు 

 

 


Monday, January 25, 2016

మినీ కవితలు

మినీ కవితలు 

నీ పరిచయం, ఏమి మిగిల్చింది నాకు? 

నాలో లేని నన్ను తప్ప! 

నీ అజ్ఞాతం ఏమి మిగిల్చింది నాకు? 

నీకై  వెతికే నన్నుతప్ప!

************

ప్రకృతికి, నా ప్రేయసికి 

ఒకటే పోలిక.  

ఆస్వాదించే మనసుతో నేనుంటే 

అంతులేని అనుభూతులతో వారుంటారు 

**************

పువ్వు  మొగ్గవుతుంది 

రేపయినా నా చెలి సిగలో 

నవ్వొచ్చని 

************

మనసుప్పొంగిందని 

చెబుతుంది ఆ  నీటి బొట్టు 

బుడగేసి 

*******

Monday, January 18, 2016

పండుగ

పండుగ   

కత్తి, రక్తి కట్టించేదా? పండుగ 

జూదం, వేదం అయ్యేదా? పండుగ 

సీసపద్యం పాడే మద్యం మాటున 

ఖాకీలు చూసే చోద్యమా? పండుగ 

షరా మామూలే!

కన్నీటితోనో? పన్నీటితోనో తడచిన రూపాయ 

కట్టలు కట్టలుగా, కుబేరునికే కన్నులు కుట్టేలా 

బరిలోకొచ్చింది., తొలికూతల దేహాలమీద కవాతు చేసింది 

సాంప్రదాయానికి రెక్కలనిచ్చింది 

ఓ యబ్బో బలే చెప్పేవులేవోయే!! 

అయినా!

హింసను చిన్నచూపు చూడనిదే 

చరిత్రింత పెద్దదయ్యెదా?

రక్తమిట్లా చిందకపోతే 

పెద్ద పండుగ పరువుంటుందా?

అనే అందరి మద్య 

మారండెహే అని కూసే నువ్వూ నేను ఉన్నంత మాత్రాన 

సాంప్రదాయం శోభిల్లడానికి 

నెత్తుటి తిలకమే కొదువా? చెప్పు! 

 

     ********

Wednesday, January 6, 2016

మినీ కవితలు

మినీ కవితలు 

ఆధునిక కాలం 

అంటరానితనాన్ని అంటగట్టింది 

మాతృభాషలకి 

************

మనుషులతోనే మనుషుల మధ్యే 

ఎదుగుతుంది  గాని 

ఎపుడో గాని మనిషిని చుడలేయకపోతుంది 

పాపం నాగరికత 

************

ఇపుడు! పల్లె గుండెచప్పుడు 

ఆ పరమాత్మునికైనా వినబడేది 

సంకురాతిరి వెంటిలేటర్ పైనే!

*************

తీపి పడని వాళ్ళకు ఆసుపత్రులు 

కడుపు తీపి పడనివాళ్లకు 

కార్పోరేటు విధ్యాలయాలు  


Monday, January 4, 2016

హైకూలు

హైకూలు 

తల్లి ఛాయకు కూడా 

తమ సొగసులద్దాలనే!

అలా రాలిపడేది ఆ పూలు 

*************

వెలుగుతున్న దీపానికే,

వెలుగుని అరువీయగల 

ఐశ్వర్యముందోయ్ నీ చిరునవ్వులో 

నవ్వి చూడు 

**************

మబ్బులు పూలు, మెరుపు దారం 

మాల కూర్చుకోమంటే 

ఇంత మేలు కూర్చిందేమిటి! ఈ ప్రకృతి 


Saturday, January 2, 2016

హైకూలు

హైకూలు 

తెరుస్తూ 

అమ్మ గర్భం నుండి 

మూస్తూ 

కాలగర్భం లోకి 

*********

విచ్చుకుని 

కొమ్మను ముడవమంటున్దా 

పువ్వు 

**********

కమ్ముకున్న కారుమబ్బులు 

కన్నీరు కురిపించడమే 

రాజకీయమంటే 

***********