Follow by Email

Monday, April 18, 2016

మినీ కవితలు

నాగరికత
అవమానం అనుకోపోతే 
నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా!
నడిరోడ్డుపై పోతున్న మానమే. 


******
అనుభవాలవిందు
కడుపునిండా తినకుండా 
తనకు తానే,ఎంత బరువై తోచిందో,
కడుపునిండుగా మెక్కి 
తానంత తేలికైపోయింది, నా మనసు!
అనుభవాలు, విందు చేసే వేళ. 


*********
కష్టార్జితపు మత్తు 
ఆమె పిల్లల ఆకలి మంటల్లో 
ఆతని కష్టార్జితపు మత్తు 
చమురు పోస్తుంది. 
******
కన్నీళ్లు 
విడిచిన ప్రతి సారీ 
గమ్యాన్ని చేరడం తెలిస్తే!
జీవితాంతమూ పోషించే వారెవ్వరూ చెప్పు 
ఈ కన్నీళ్లను. 
*********

Wednesday, April 13, 2016

మినీ కవితలు

వైద్యము, విద్య 

కార్పోరేటువి ఒడంబడ్డాయి. 

అక్కడ డెలివరికి ఇక్కడ అడ్మిషను 

ఇక్కడ ఒత్తిడికి అక్కడ బెడ్ ఫ్రీ అని. 

******************

ఫ్యామిలి ఫోటోలో అందరూ 

తలో దేశంలో ఉండడమే 

వసుదైక కుటుంబమంటే 

అని ఎవరు చెప్పగలరు మనం తప్ప. 

**************

అందరినీ పరిగెత్తించే 

వర్తమానము, భవిత 

మనకు ఇస్తున్నది 

ఈయగలిగేది ఏమిటో తెలుసా?

నిన్నటి ఆటవిక చరిత్రనే!. 

***************

సిగరు పొగల మబ్బులు 

అప్పటికప్పుడే కరిగి 

కాక్ టైలు  పెగ్గులగును 

ఆ గబ్బు జబ్బుల పబ్బుల్లో!

 

Monday, April 11, 2016

GO BACK, GO BACK

అమ్మ ఒడిలోంచి బిడ్డను, ఎవరో మాయం చేసారు. 

కన్నవారిలో కలవరం లేదు 

అయిన వారిలో ఆందోళన లేదు. 

నిన్నకూ  నేడుకూ  బేధమే లేదన్నట్లు 

ఎవరి పనుల్లో వారు. 

పాపం! కలవరపడి ఆకాశం

తనువంతా, కళ్ళు చేసుకుని వెతికింది. 

పసి వాసనకై గాలి దేవులాడింది 

నీరు కన్నీరు పెట్టింది. అగ్ని అంతటా తడిమింది 

వెతికి వెతికి పుడమి సొమ్మసిల్లి పోయింది

పాపం! వాటికేమి తెలుసు?

వాచి వాచి విజ్ఞానం!

నరకాన్ని మించిందే ఇలకు దించిందని. 

ఆ చోటుకు తాము ఐదుగురమూ చేరలేమని 

ఏ ప్రకృతి సోయగమూ అక్కడ విరియదని 

కోరి కోరి ప్రేమానురాగాలకు,

అమ్మ నాన్నలే, అక్కడ గోరీలు కడతారని 

వాటినే కార్పోరేట్ బడులంటారని. 

ఐనా! ఎలాగయినా ఆ బిడ్డను చుసిపోవాలని 

గేటు దగ్గరే నిలబడిన 

ఆ పంచ భూతాలకూ, ప్రకృతి సోయగాలకు 

go back go back అన్న నినాదాలు వినబడ్డాయి 

అమ్మ నాన్నల నోటి నుండి 

  

Wednesday, April 6, 2016

పునరపి జననం


ఎంత తింటావు, ఏమి చేసుకుంటావు?

ఎందుకు, ఇంతింత కూడబెడతావు? అని 

ఓ నల్ల కుబేరుణ్ణి అడిగాను!

పునరపి జననాన్ని నేను నమ్ముతాను. 

చచ్చాక, నా ఇంటనే పాపడిగా పుట్టి 

తిరిగి తిరిగి నా సొమ్మును నేనే తింటా!

అందుకే నా తరతరాలకూ 

సరిపడా ఇలా ......... అన్నాడు. 

మరి పేదోడి సంగతేమిటన్నాను?

ఏ నాకు వర్తించే కర్మ సిద్దాంతమే వాడికీ ........ Monday, April 4, 2016

ష్.... మనసులో

               

భారత మాతకు జై, అనమన్నవాడు 

భారత నేతను 'చీ' అంటే ఊరుకుంటాడ?

నుదిటి రాతకు ఓ విధాత అని నమ్మే భారతీయత,

ఎదుటి రోతకు, ఏ నేత? అని అడగని విధేయత 

కలగలిసిన ఈ భారతమాతింట! 

మన మనసులలో మాటకు 

నేతల, మూడో కంటి మంటే తోడు. 

అందుకే, మనం మౌనమనే కవచం ధరిద్దాం. 

నేతల వాతలు ఎన్నెన్ని పెరిగినా 

పొరలను పరుచుకుంటూ,

మన కవచాలను బలపెట్టుకుందాం. 

మన కన్నా వందల రెట్లు పెద్దదౌతున్న 

మన కవచం, పాతాలపు చీకట్లు 

మనకు చూపిస్తున్నా! జై జై అందాం. 

ఎందుకోయ్  ఈ జే జే లని ఎవ్వరడిగినా, 

భరించే భారతీయతకు, 

అలవాటైపోయిన అరాచకానికి అనేద్దాం!

పైకి కాదు సుమీ  .......  Saturday, April 2, 2016

కూనలమ్మ పదాలు

1. మనిషి మనిషిగ లేడు 

    మనిషి మనిషితొ రాడు 

    మనిషి మనిషికె కీడు 

    ఓ జాబిలమ్మ 

2. వాన చినుకుల తోడి 

    మట్టి వాసన జోడి 

   కట్టె కరువుకు పాడి 

   ఓ జాబిలమ్మ 

3. చదువు కట్టలు కట్టి 

   ప్రేమ నటకన పెట్టి 

    బలికి ముద్దుల పట్టి 

    ఓ జాబిలమ్మ 

4. వయసు తొందర సేయ 

    చాటు సరసం పూయ 

    ఫోను కెక్కెను చెలియ 

    ఓ జాబిలమ్మ 

5. మమత పాతర వేసి 

    మనసు ఉసురులు దీసి 

    బంధ మాయెను బోసి 

    ఓ జాబిలమ్మ