Tuesday, November 29, 2016

ఒట్టు

చెరువులో నీటి బొట్టొక్కటి
తామరాకు మీదకి ఎక్కింది.
దానందానికి!
ఆశాంతం మురిసిపోయిందా చెరువు
ఆభరణాలెన్నో పెట్టి మెరిసిపోయిందా కిరణం.
బడిలోని బాలుడొకడు
ఆట స్థలం బాట పట్టాడు!
వాడానందాన్ని!!!!!
అదే పనిగా నిందించిందా పొత్తం.
ఆంక్షలెన్నో పెట్టి అలసిపోయిందా బెత్తం.
మళ్ళీ మళ్ళీ ఆకునెక్కే ఆ నీటి బొట్టులో,
తనను తాను చూసుకుంటూ!
ఆపై ఆరు బయట కనిపించని  ఆ బాలునికై
అదే పనిగా అన్వేషిస్తుందా ఆకాశం. 



Saturday, November 26, 2016

ఎందుకిలా?

ఆమెను కౌగలించుకుని ఎన్నో ఏళ్ళు గడిపాను నేను
కానీ! ఇప్పుడామె చిటికెన వేలుకు కుడా
నా పిల్లలను అందనీయడం లేదు.
నిన్నటేలా..
నా ప్రతీ ఉసూతో ఆమె పులకరించింది.
నా ప్రతీ ఊహనూ ఆమె గెలిపించింది.
నాలోకి నన్ను చేర్చి కలలా నన్ను చేరాలని
అనంత దూరాలకు నన్ను నడిపించి
నా ప్రతి రోజునూ నిద్ర బుచ్చేది ఆమె!
ఆమే!
దారి పొడవునా తను నిల్చి  ఇప్పుడు
పిల్లలకు తనను పరిచయం చేయమంటుంది
వాళ్ళ ఊసులతో తన హృదయం నింపమంటుంది.
నిజమే!!!!
ఎప్పటికీ తగ్గనిది తన అందమని తెలుసు
ఆమె ఒడి నిండుగా తరగని నిధులున్నవనీ తెలుసు
ఆమెతో పెనవేసుకోవడమే పసి తనానికి అర్ధమనీ తెలుసు
కానీ !!!!!
చదువుల జాలానికి, వాళ్ళ బాల్యాన్ని వేలం వేసిన వాణ్ణి
కాలం పరుగులకు, మనసు మెరుగులు అమ్మిన వాణ్ణి
నవ్యతను! నెత్తికెక్కించుకున్న వాణ్ణి
నిన్ననే నిన్ను మరచిన వాణ్ణి
రేపటి వారికై నిన్ను చేరనిత్తునా? అని
నిస్సిగ్గుగా అడగగలిగే వాణ్ణి
ఎందుకే నన్నింత కోరిక కోరావు? ప్రకృతి..  






Friday, November 18, 2016

కొత్త నీతి

పంట మొక్కలన్నింటినీ తొక్కేద్దాం!. 

నిటారుగా నిలబడి కనిపిస్తాయిగా ,

అప్పుడు కలుపు మొక్కలు. 

అదేపనిగా ఆ కలుపు మొక్కలకప్పుడు 

నీళ్ళను పోద్దాం, ఎరువులు వేద్దాం. 

నలిగి పడిన పంట మొక్కలు 

ఏమిటీ విడ్డురం అంటే 

వేళ్ళూనుకుని వాటి బతుకవి బతుకుతాయి. 

సారం పీల్చి నింగి దాకా ఎదిగిపోతాయి 

అప్పుడు మీరంతా పచ్చదనంతో కళకళలాడవొచ్చు 

అనే కొత్త నీతి సూత్రం నేర్పిద్దాం.     

 


Wednesday, November 16, 2016

సోదర సోదరీ మణులారా

     ఉన్నది కొద్దో గొప్పో! పట్టుకుని మనమందరం బ్యాంకుల ముందు బారులు తీరాం!

యాచకులతో సహా. కానీ మన పంచన నిలువలేని ఓ ఇద్దరి నిరుపేదల సంగతి 

మరచిపోయాం. మీరందరూ తలో రూపాయి వీరికి బిత్సం వేస్తే వాళ్ళనూ మనలో 

కలుపుకోవచ్చు. దేశాభివృద్ధిలో ఇకనైనా వారిని భాగస్వాములను చేయవొచ్చు. 

      అమ్మలారా అయ్యలారా! అందరూ ఆలోచించండి. మీ మీ స్థాయికి ఒక్క రూపాయి 

అంటే ఎంత? అందరూ ఒక్కొక్క రూపాయి వాళ్లకు విదల్చండి. ఓ యాచకా నీ చేయి 

పై నుండే రోజు నేటికి వచ్చింది. 

      నేటి వరకూ కూడా మన మధ్యకు వచ్చి ఠీవిగా నిలబడలేని కడుబీదలైన 

నల్ల కుబేరులను, రాజకీయ నాయకులను రూపాయి విదిల్చి ఆదుకోండమ్మ. 

       ఓ ప్రధాన మంత్రి వర్యా!

ఒక్క రూపాయి విరాళం భారతీయులమైన మేమంతా చెల్లించి వాళ్ళిద్దరినీ 

మా పంచకు చేర్చుకుంటాం. "స్వచ్ఛ భారత్" సెస్ లాగా "కాలా భారత్ " సెస్ 

అనే పన్నును ప్రకటించండి . మా వంతుగా ఓ రూపాయి డబ్బు జమ చేస్తాం. 

ఎందుకంటే! మేం సగటు భారతీయులం. తప్పు అనడం కన్నా! తప్పదు అనుకుని 

బ్రతికెటోల్లం. 



Tuesday, November 1, 2016

మిణుగురులు

వెన్ను జూపి విజయ మొందితివి నీవు 

వేయి శశిల నగలు నిసికిచ్చితివి నీవు 

కానరాని సంద్రాన నా చూపుకు చుక్కానివైతివి నీవు. 

వీచే గాలి, దీర్ఘాయువనును నీ వంటి దివ్వెను జూసి 

కమ్మిన నిశి, కైతలల్లును మీ కలిమి బలిమి జూసి

మిణుకు తారలు, హారతు లిచ్చును నీ పసిడి కులుకును జూసి. 

రాతిరి పలకన, చీకటి దిద్దేటి ఓనమాలావు నువ్వు 

నిండు జాబిలి ఇంట, నవ్వ గలిగేటి దీప కళికవు నువ్వు 

పరవశించే ప్రకృతి, విశ్రమించి కనేటి స్వప్న మాలికవు నువ్వు.

విహరించు నీ దారిలో, 

పలకరించిన నా చూపు సిరికి!

పసిడి చుక్కల ఆనంద ఝరిని 

బహుమతిచ్చిన గడుసరి జోతలివే నీకు!