Follow by Email

Sunday, April 29, 2012

పేరంటం 

గడప దాటకుండానే అందరినీ
తన ఇంటి పేరంటానికి ఆహ్వానించడం
వచ్చిన వారందరినీ గడప దాటకుండానే
నిండు మనసులతో సాగనంపడం
మధువుతో పెట్టిన విద్యా కుసుమాలకు.
*******
శస్త్ర చికిత్సను ఎంత సులువుగా
చేయొచ్చో ఆ డాక్టర్లకు
నేర్పుతుందా తామరాకు
పురుడు పోస్తూ ఈ నీటి బొట్లకు.
*******
మనసు కరిగేలా మాటాడితే
ఫలమెంత మధురంగా ఉంటుందో అని
అంటుందోయ్ ఆ మట్టి
మొలకలై మొలిచి.
********
జారిన చినుకే
పండి అలా పండక ఇలా
ఇంకో రెండు చినుకులను
సంపాదించడమే వ్యవసాయం.
*******

Friday, April 27, 2012

పరిచయం 

నా అడుగులనెంత లోతుగా
పరిచయం చేసుకుంటుందో
ఆ కడలి తీరం
ఎంత లోతుగా నా లోకి
అడుగులు వేస్తూ పరిచయమౌతుందో
ఈ పూలహారం.
*******
ఎవరెస్టుకు జాబిలికీ కూడా
దగ్గరైన పాద ముద్రలు
పాపమెందుకో
దూరమౌతున్నాయా పంట చేలకీమధ్యన.
*******
తొలి సంధ్య వెలుగునా కాన్వెంటులు
మలిసంధ్య చీకట్లనా వృద్ధాశ్రమాలు
ఎంతందంగా దక్కించుకుంటున్నాయో.
*******
నడకలు నేర్పడంలో
వాన చినుకుకు సాటెవ్వరంటూ
చూడా మన్ను.
*******
లాకర్లలో
ఆ పూల మనసులు దాచే
బ్యాంకా తేనెపట్టు.
*******

Thursday, April 26, 2012

తాత

గుండెలపై కూర్చోబెట్టుకుని
ముఖం పై కాలితో తన్నించుకునే
తాత ఆ చీకటి
ఈ దీపానికి.
******
బంధాలు పొమ్మంటే
దేవుడిపై భారం వేసి
వీధిన పడ్డా పండుటాకుకి
వయసై రాలి
గాలి మీద భారం వేసి
లోకసంచారానికి బయలుదేరిన
ఎండుటాకు దారి చూపుతుందా రాదారిపై.
*******
తొలకరి అందాలను
తనివితీరా చూడాలని
ఎన్ని కళ్ళు తెరిచిందో
చూడా మయూరం.
*******
మనసు నుండి రాదారేసుకుంటూ
సాగుతుందా ఊహ
ఎండమావిలా
మనసుపైకొస్తుందా కల.
*******

Wednesday, April 25, 2012

బాల్యం 

నాడెపుడో ఈ ప్రకృతి ఒడిలో
నే దాచుకున్న జ్ఞాపకాలతో
ఏళ్ళు గడిచినా
నన్నొదిలి పోనంటుంది
నా బాల్యం.
*******
ఎన్నో మహా సంగ్రామాల తర్వాత కూడా
శాంతి విలువ తెలుసుకోలేని
సముజ్జీలైన మహాయోధులం
నేను నా మనసు.
*******
బాల్యం వీపున
వృద్ధాప్యం  గుండెన
మోయలేని బరువే మోస్తునాయి.
*******
ఫాషనో తీరిక లేకనో
ఏదైతేనేం అమ్మాయిల జడ నుండి
జారా పూలజడ కూడా
ఓ నాటి జ్ఞాపకమైపోయింది.
*******

Tuesday, April 24, 2012

చిలిపి ఆశ

ఆకాశం అద్దమైతే
సముద్రం నీ వదనమైతే
నీ ప్రతి చిరునవ్వు అల
తీరాన్ని చేరేలోగా
ఆకాశాన్ని ముద్దాడాలని
నాకెందుకో చిలిపి ఆశ.
*******
ఎంత స్వార్ధం నీలో లేకపోతే
నా క్షణాలను నియంతలా పాలిస్తావు
ఎంత ప్రేమ నీలో లేకపోతే
ఆ ప్రతి క్షణంలోనూ
నీ కరుణ నాపై కురిపిస్తావు.
*******
నీ పరిచయం
ఏమి మిగిల్చింది నాకు
నాలో లేని నన్ను తప్ప
నీ అజ్ఞాతం
ఏమి మిగిల్చింది నాకు
నీకై వెదికే నన్ను తప్ప.
*******

Monday, April 23, 2012

చిరిగి పేదరికాన్ని
                         ఆడంబరాన్నీ కూడా

                      ప్రతిబింబించగలదా గుడ్డ.
                                *******
                 

యోగి


చీకట్లు పోయి వెలుగులు ముంచుకొచ్చే వేళ
జ్ఞానోదయమైన యోగిలా
ఆ పచ్చిక ముఖం చూడు
ఎంత తేజస్సుతో వెలిగిపోతోందో.
               *******

Friday, April 20, 2012

దీపం  
గెలుస్తానన్న విశ్వాసం
ఓడినా పర్వాలేదనుకునే త్యాగం
రెంటినీ ఒక చోట చేర్చి
వెలుగుతుందా దీపం.
*******
అడ్డేది నాకంటూ
చెలరేగిపోయే వెలుగుకి
అగ్నిపరీక్షే పెట్టిందోయ్
ఆ నిరాశావాది అంతరంగం.
*******
తాను వదిలొచ్చిన  

ఆ ఆకాశపుటింటిని  
ఇట్టే క్లిక్ మనిపిస్తున్నానన్న
ఆనందంలో చూడా నీటిబుడగ బద్దలై
ఓ అందమైన  జ్ఞాపకంలా

తానెలా నిలిచిపోయిందో నాలో.
********

కారణాలు రాయగలిగే
శక్తే గనుక కన్నీళ్ళకుంటే
రామాయణ భారతాలే
ఇతిహాసాలయ్యుండేవా?
*******
Thursday, April 19, 2012

నటి 

కప్పుకోవాలనిపించి  ఆ రోడ్డే
ఎండమావిని నేయించుకుంటే
మరి ఆ నటికేమయిందోయ్
అలా విప్పుకుని  రోడ్డెక్కేస్తుంది.
********
మనసునూపి  
సేదదీర్చే సంగీతం
మనిషినూపి
స్వేదం పట్టించేదైంది
ఆ వెండి తెరపై.
*******
రెండు బోసినోళ్ళ మధ్య
లేస్తూ పడుతూ అలా అలా సాగే
తరంగమేనోయ్
జీవితమంటే.
********
రోడ్డుకు
వసంత శోభనిస్తుంది
ఆ ఎండమావి.
*******

Tuesday, April 17, 2012

ఆమె 

ఆమె ఓ వెన్నెల రాత్రి
వెన్నెల అభినేత్రి

ఆమె ఓ సౌందర్యం
ప్రణయ మాధుర్యం

ఆమె ఓ స్వాప్నిక
నా జీవన జ్ఞాపిక

ఆమె నాకై వేచిన అభిసారిక
నన్నూరించే రసమయ గీతిక

ఆమె ఓ మలయపవన వీచిక
నా విరహ జ్వాలల సంచిక

ఆమె నా నందనం
ఆమె నా నినాదం

ఆమె నా ప్రస్థానం
ఆమె నా గమ్యం. 

Monday, April 16, 2012

ఒత్తిడి

నీ మెలకువని
నిద్రని కూడా భోంచేస్తూ
నీ కన్నా బలపడుతుంది
ఆ ఒత్తిడి.
       *******
తీరిక లేదంటూ
నీవిచ్చే జవాబుతో
పాపం ఏకాకిగా
రోజులు లెక్కబెట్టుకుంటోంది
ఈ ప్రకృతి.
       ********
నిన్ను కూడా
మరచిపోఏంత మరపు
నీ మనసుకు రావడమేనోయ్
మృత్యువంటే.
     *******

Sunday, April 15, 2012

శిల్పం

ఎన్నాళ్ళ కాఠిన్యమో
వదలిపోయిందని
ప్రతీక్షణం అదే తీరుగా
నాట్యమాడుతూ ఆ శిల్పం
నా కంటికి నిశ్చలంగా కన్పిస్తోంది.
********
వెన్ను చూపుతూనే
తనతో మహాసంగ్రామం చేస్తున్న
ఆ మిణుగురు యోధుని
ఓ రెప్పపాటు కాలం
తల వంచి గౌరవిస్తోంది
చీకటి.
*********
బద్దలయ్యేదాకా
దిక్కులు చూడలేదు
ఆ నీటిబొట్టు.
*******

Friday, April 13, 2012

నాగరికత 

జాతరలో అమ్మవారి
పూనకాలు అనాగరికం
పబ్బులో ఉన్నోళ్ల
పిల్లల చిందులు ......
అంతేనోయ్ నాలుగు గోడల మధ్య
చెలరేగేదేనోయ్ నాగరికత అంటే.
********
చేతులు కాలాక పట్టుకోవడానికైనా
ఆకులుండేలా నాలుగు చెట్లైనా
పెంచడే ఈ మనిషి.
*******
ఆ యువతుల ఒంటిపై
దుస్తులు పైకెళ్ళడం చూసి
తానేం తక్కువ తిన్నానని కాబోలు
ఆ వాలు జడా......
*******

దీపం

గాలి ఆ దీపంతో
వేళాకోళమాడితే
పోటీ పడి మరీ నర్తిస్తాయి
ఆ చీకటి వెలుగులు.
*******
దీపం తోడు రాగా
మెట్టినింటికి వస్తుందా వెలుగు
ఆ దీపాన్ని సాగనంపి
పుట్టినింటికి వస్తుందా చీకటి.
*******
నిజం చెప్పాలంటే
గాలికి మించిన
నాట్యాచార్యుడెవరోయ్
కావాలంటే తలెత్తి
ఆ చెట్లకేసి చూడు.
******

Thursday, April 12, 2012

అంతరంగం 

తృప్తిగా నువ్వు
రెప్పవాల్చిన వర్తమానం
అలసిన నా అంతరంగాన్ని
ఎన్ని కలలతో అలంకరించిందో.
********
తన కళ్ళనాడిస్తూ
అనంత భాగ్యరాసులతో ఆ సంద్రం
తీరంలో గవ్వలేరుకునే
నన్నే చూస్తోందెందుకో
బహుశా దానికీ బాల్యమంటే............
**********

Wednesday, April 11, 2012

ఏకాంతం

ఋజువేది నా ఏకాంతానికి
మళ్ళీ మళ్ళీ నాలో ప్రతిధ్వనించే
నీ పిలుపులు తప్ప.
********
నీ, నా మనసుల
పరవస్యానికి నడుమ
ఒద్దికగా కుర్చుందే ఈ ప్రకృతి.
*********
తనను తాను కుంచెగా
మలచుకుంది ప్రతి చెట్టు
ఓ పచ్చని చిత్రాన్ని
ఆ ఆకాశపు కాన్వాసుపై గీద్దామని.
********

Friday, April 6, 2012

మనసు

ఊహకు కన్నతల్లి
స్వప్నానికి సవతితల్లి
నా మనసు.
   *******
పాలు మరిగి
ఆ చిగురు వెచ్చగా
నా పెదవుల చిరునవ్వు
పూయించే.
   *******
ఆకాశానికి పూలజడ
పట్టుకెళ్తున్నాయి
ఆ ఎగిరే కొంగల గుంపులు
అదిగో అలా......
   *******

Thursday, April 5, 2012

చెత్తకుండీ

ఈ మధ్య
చెత్తకుండీకి కూడా
గొంతు లేస్తోందోయ్.
    *******
నిన్నటి పంట కాలువ
నేడు సందో గొందో
అవుతోంది.
  ******
తనలా పాడే
నన్నోడించి మరీ
కొత్త సొగసులు తెస్తుందా
కోయిలమ్మ.
  ******

Wednesday, April 4, 2012

జీవిత లక్ష్యం

ఆదుర్దా ఎక్కువైతే
జీవిత లక్ష్యం
త్వరగా చేరువౌతుంది
అంటుందా స్మశానం.
     *******
ముడతలు పడిన కళ్ళకు
మమకారాలు మరింత
అందంగా కనిపిస్తాయి
దగ్గరై కాదు సుమీ.
    ********
పారాణి పెట్టుకుని
అప్పుడప్పుడు
మృత్యువుని పెండ్లాడుతుంది
ఈ రోడ్డు.
     ********

Tuesday, April 3, 2012

బాల శ్రామికుడు

లోకమెంతో మెచ్చి
ఇంకా ఇంకా కావాలనుకునే ముత్యాలు
మా కన్నీరంటూ
ఏడుస్తూ సాగాడా బాల వటుడు.
*****
ఇంకని గంగను మోసినోడు
శివుడైతే
జంట జీవ నదులను
నీ కంట మోసే నిన్నేమనాలో
ఓ బాల శ్రామికా.
*******
కనికరం తగ్గి
సగం బరువును
తడి ఆరని నీ మోమునే
దింపుకుంటుంది
ఈ భూమి.
*******
ఆగి ఆగి జారితే
దారెక్కడ మరుస్తామో అని
ఆగక ఏకధారగా కురుస్తాయి
మా కన్నీళ్ళంటూ
బరువు నెత్తిన పెట్టుకు పోయాడా
బాల వీరుడు
గుండె బరువుతో అడుగుపడక నేనాగిపోయా.
******

Monday, April 2, 2012

ఫాషన్

దుస్తుల అవరోహణే
నాగరికత ఆరోహణనుకుంటున్నారు
అతివలెందరో ఇప్పుడు.
      ********
ఫాషనబ్బి
గుట్టు దాచాలేనిదైనదా
గుడ్డ.
      ********
మతి తప్పిన దుస్తులు
గతి తప్పిన అడుగులు
అంతేనోయ్ ఫాషన్ అంటే.
     *********
     

Sunday, April 1, 2012

చిరుగుల పంచె

ఆకాశానికి
ఎన్ని ఆకారాలను ఇస్తోందో
చూడా నేతగాని
చిరుగుల పంచె.
     *********
ఒంటిమీద బరువు దింపుకుని
తాను తెచ్చుకున్న వసంతాన్ని
మనసు మీద బరువు దింపుకుని
నిన్నూ తెచ్చుకోమంటుందా
మాను.
     **********
విషాదానికి ఆకాశం
ఆనందానికి పాతాళం రాసిచ్చేసి
ఎంత విలువగా ఈ నేలపై
బ్రతుకుతున్నాడో ఈ మనిషి.
      *********