Thursday, December 26, 2013

కుటుంబం

కుటుంబం
గోడకు వేలాడే పటంలోని 
నలుగురు ఏరంటే!
ప్రపంచపటం లో చూపుతూ 
గొప్పలు పోయే కుటుంబాలెన్నో! నా భారతాన. 
*******
చందమామలు 
భేతాళ కథలు వింటూ 
కాలం గడపాల్సిన చందమామలు 
భుజానేవో మోసుకుంటూ 
కాలంతో పరుగెడుతున్నాయి. 
*******
మద్యం సీసా
ఒంటి నుండి, కంటి నుండి 
జారే బొట్టుబొట్టు ను తనలోకి జార్చుకుంటూ 
భలేగా గుప్పుగుప్పుమంటుందిలే 
ఆ మద్యం సీసా. 
*******
ఇంద్రచాపం
ఒకరి మనసులోకొకరు తొంగిచూసే ఇంద్రజాలం!
 మాలా మీ అందరికబ్బితే 
ఎన్ని ఇంద్రచాపాలీ లోకాన అని అంటున్నాయోయ్ 
ముక్త కంఠాన ఆ ఎండావానలు . 
********

Friday, December 20, 2013

చెలీ!

చెలీ!
మింటిలోని ప్రతి తారలోను 
నీ రూపునూహించినాను.
నల్లబడి నిండు జాబిలి 
మన పెళ్లి వేళ 
నీ బుగ్గన చుక్కౌతానన్నది! ఓ చెలీ!
*******
నీ వాలుచూపులు నాకై రాసిచ్చిన 
వీలునామాను చదువుకునే వేళ!
అంత వణుకెందుకే చెలీ 
నీ పెదవులకు 
*******
గుప్పెడు మల్లెలకు వరమిచ్చి 
గంపెడు శరాలను ఎక్కుపెట్టి 
అడుగైనా కదపలేని తనాన్ని 
బహుమతిగా ఇచ్చావేమి
నా మనసుకో చెలీ!
*******
పండు వెన్నెల్లో 
ఆ కలువను మించి విరిసిన 
నీ ముఖకమలాన్ని చూస్తున్న నిండు జాబిలిని 
కాస్త నిదానించమన్నాను ఓ చెలీ!
********

Thursday, December 19, 2013

అహం!

అహం!
అహం! నా కంటి రెప్పేయనపుడు 
చూపుల నుండి ఎన్ని అందాలను 
తప్పించేసిందీ కాలమన్నది 
నలుగురిలోనూ చెల్లని నాణెమైనప్పుడు గానీ 
తెలీలేదు నాకు 
ఐనా తెలివిన పడక ఎక్కడెక్కడి దూరతీరాలలోనో 
ఒంటరిగా సాగడం నేర్చాను 
అడుగడుగునా ఎదురౌతున్న నాలాటి వారెందరినో చూస్తూ 
పరిచయం లేకున్నా 
ఎవరికీ వారు అహమనే ఏకసూత్రబద్దులే అంటున్నాను. ఏమంటావ్?
బాబ్బాబు! ఆవును కాదనలేని ప్రశ్న వేసి 
మరో అంతర్యుద్ధానికి నా మనసుని వేదిక చేయకు ప్లీజ్. 
**********

Monday, December 2, 2013

శంఖం

శంఖం
రహస్యాలను! నా కన్నా శ్రావ్యంగా
ఎవరు చెప్పగలరోయ్ నీ చెవిలో
అని అడుగుతున్న ఆ శంఖాన్ని చూస్తూ
అంత కన్నా తెల్లగా పాలిపోయింది
నా ప్రియురాలి ముఖం.
******
పండుటాకులు
గిట్టి, రాలిపోయినా!
తమ పరిచయాలకు పలకరింపులకొచ్చిన
లోటేమిటంటున్నాయి!
పారుతున్న ఆ సెలయేటి అండ చూసుకుంటూ
ఆ అడవి మానుల పైని పండుటాకులు.
*******
చెరువు ఆటలు
క్షణం తీరిక లేకుండా మా ఊరి చెరువు
గాలికాడుకునే ఆటలే
ఆ గట్టుకు చేరేసరికి పాటలౌతున్నాయి.
*********

తొలి లేఖ
విరబూసిన పూదోటకెలా అప్పగిస్తానో!
సెగలు గ్రక్కే ఎడారికీ అలానే అప్పగిస్తాను
నా మనసు కళ్ళాలనని,
నా కంటికే తనింటి పిలుపుల
తొలిలేఖనంపుతుందీ ప్రకృతి.
*********
మనసులు
సుక్ష్మజీవులను చూడగలుగుతున్నాం కదా అని

అంత కన్నా సుక్ష్మంగా, అంతరిక్షాలను అందుకోగలుగుతున్నాం కదా అని
అంత కన్నా దూరంగా మనసులను విసిరేసుకుంటే ఎలాగోయ్.
**********