Follow by Email

Saturday, June 29, 2013

ఎవరు వారు?

ఎవరు వారు?
ఇక దాని బ్రతుకంతమొంది గోడల మధ్యనే గడిచి పోతుందనుకున్నాను 
రోదనే తప్ప దానికిక నవ్వే యోగమే లేదనుకున్నాను 
కానీ ఉన్నట్టుండి దానికెవ్వరో పట్టాభిషేకం చేసారు 
ఇపుడది చిందించే హాసాన ఈ లోకమే మెరిసి మురిసిపోతోంది 
ఎవరు వారు? కంటికి రెప్పలై, ఇలా ఆ మానవతకు పట్టం కట్టినవారు 
వారించలేని కల్లోలాన్ని పీడకలలా మలచిన వారు 
విలాసంగా నవ్వుతున్న మృత్యువు వెన్నులో వణుకు పుట్టించిన వారు 
ఎవరు వారు? ఆత్మీయతకు అద్దం పట్టినవారు 
ఆప్యాయతలో అమ్మనూ మించిపోయినవారు 
అడవి దారుల పట్టి పోతున్న సమాజానికి అసలు దారిని చూపినవారు 
ఎవరు వారు? కోతల్లోని మాటల రాయుళ్ళకు 
మనుషులను చేరడమెలాగో చేతల్లో చూపినవారు 
ఆదుకోవడమే ఆయుధానికి పరమార్ధమని చాటినవారు 
ఇరుకిరుకు దారుల, మనసుల మూలల్లోకి చేరినవారు 
ఎవరు వారు? దేవుడే దిక్కంటూ మ్రొక్కిన వారికి దిక్కైన వారు 
విలువలకు దిక్సూచి ఐనవారు 
మనుషులుగా మనలను గుభాళించమన్నవారు 
ఎవరు వారు? నిన్నటి రోదనల మాటున రేపటి నవ్వులను బ్రతికించిన వారు 
ఉలికిపడిన జాతి గుండెనూరడించినవారు 
అమ్మ పాల ఋణాన్ని ఇంత చక్కగా తీర్చుకున్నవారు 
ఎవరు వారు? చావు బ్రతుకుల సరిహద్దు సీమలను 
సాహసంతో సమీపించి 
ఆ దేవుని కన్నా ఓ మెట్టు పైన నిలబడినవారు 
అమృతం కూడా ఈయలేనంతటి అమరత్వాన్ని 
మానవత్వపు మాటున అందుకున్న వారు 
ఎవరు వారు? ఎవరు వారు?
**********

Sunday, June 16, 2013

మానవత్వపు భంగపాటు

మానవత్వపు భంగపాటు
అమ్మ లాలనను ఇంకా మరచిందో లేదో గానీ 
అపుడే ఓ ఇంటి పాలనను అందుకుందది 
మది తలపులను, గడియపెట్టిన ఇంటి తలుపులను దాటనీయని విద్య నేర్చింది 
అద్దం లాటి ఆ చెక్కిళ్ళపై పడిన ఐదువేళ్ళ ముద్రలు 
అద్దంలా అది మెరిపించిన ఆ ఇంటి గచ్చున మచ్చలుగా  ప్రతిబింబిస్తున్నాయిప్పుడు
పాపం! ఆకలికి దాని హక్కులన్నీ జీర్ణమైపోగా,
ఆ ఇంటి వాళ్ళ అంతులేని అధికారపు దాహాన్ని అలుపెరుగక తీర్చినట్లుంది దాని దేహం 
ఒంటిని కప్పుకోలేని దాని దారిద్ర్యానికి మనసాపుకోలేక, ఆ ఆసామి చేసిన అఘాయిత్యానికి
ఆ గది నాలుగు గోడలు ఉలికి పడ్డాయి 
ఎందరిలానో చావుతోనే అదృష్టం వరించింది దాన్నీ 
ఎప్పటిలానే పత్రికల పతాకానికెక్కింది
నోరుందని అందరూ అరిచారు మాటల తూటాలూ పేల్చారు 
జరుగుతున్న తంతునంతా చూస్తూ 
 వికసించే తరుణం వచ్చేసిందనుకుంది ఆ మానవత 
కాసేపటికే తాను ఆవిరై పోతానని ఎరుగక 
అవును! ఎవరి తొందరలు వారివి మరి 
అంతేలేవోయ్ దగాపడిన జీవితానికిక్కడ విలువేముందని 
అందరూ పంచుకునే ఓ ఐదు నిముషాల కాలక్షేపం తప్ప 
ఆ!ఆ! ఆ ఐదు నిముషాలు ఐపోయాయి ఇంకా ఆలోచించకు 
ఆలోచించే వారిని వెక్కిరిస్తూ, పద వెనువెనుకకు  పోతూ 
ఆదిలో మనం విడిచొచ్చిన అడవులను చేరదాం 
అక్కడ ఆశా ఉండదు, భంగపాటు ఉండదు ఈ మానవత్వానికి. 
*********
 

Thursday, June 13, 2013

దినపత్రిక

దినపత్రిక
రాలక, సుడిగాలి పలకరించిన ఆనవాళ్ళను 
జీవితాంతమూ మోస్తూ కుమిలిపోతున్న 
పసి మొగ్గల తో తానలంకరించుకుంటుంది 
ఆ దినపత్రిక. 
*********
నల్లటి నీడ
అనుబంధాల హరివిల్లు వర్ణాలపై 
నల్లటి తన నీడ పడేంతగా 
ఎదుగుతుంది రూపాయి. 
********
కిరీటం
తనకు కిరీటమెందుకనుకుంది గానీ ఆ వెలిగే దీపం 
లేకుంటే నీ చిరునవ్వు 
నాకెందుకు దక్కేది! ఓ చెలీ!
*********
నోటుకై .....
భారతి కంట చుక్కలొలుకుతున్నా
చుక్కల సీమలొంకకు పయనమౌతున్నారు 
రూపాయిలు రాలే నోట్లకై ఎందఱో. 
*******

Wednesday, June 12, 2013

కన్నతల్లి

కన్నతల్లి
ఎంచక్కా చెరువు ఒడిలో పసి పాపలా 
కూర్చుందా మేఘమనుకునే లోపే 
కరిగి తానే ఈ చెరువు కడుపు నింపే కన్నతల్లైపోయిందే. 
*********
వ్యాపార కుసుమం
దేహాలపై విరబూస్తూ 
భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతుందేమిటోయ్
ఈ వ్యాపార కుసుమం. 
********
విజ్ఞానపు వెలుగు
వినాశనమనే చీకటిని సృజియిస్తూ 
దీపంలా వెలిగి పోతోందీ విజ్ఞానమని అనుకుంటున్నాయి 
తమలో తామా పంచభూతాలు. 
********
కాంక్రీటుగోడలు
భవిత పేరు చెప్పి 
పరిమళించాల్సిన బంధపు సుగంధాన్ని 
ఆఘ్రాణించేస్తున్నాయి నాలుగు కాంక్రీటుగోడలు. 
**********

Monday, June 10, 2013

పాశుపతం

పాశుపతం 
కాల మహిమో, కాదనలేని సమ్మోహనమో కాపోతే
లేలేత పసి నాల్కలే, పాశుపతాలై 
పంచప్రాణాలు తీసేయడమేమిటోయ్ నా తెలుగుతల్లివి. 
*********
కాన్వెంటులు
దాంపత్యం మొగ్గేస్తే చాలు 
ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తున్నాయో చూడవోయ్ 
ఆ కాన్వెంటులు. 
********
ముచ్చటైన గృహాలు
అమాశ రాతిరి తారలన్ని ఉండేవి నాడు. 
నడుమ పున్నమి రాతిరన్ని ఐనాయి. 
నేడో! వలసదెబ్బ తిన్న పల్లె వాకిట వెలిగే 
వీధి దీపాలన్నీ కూడా లేవు గదటోయ్. 
ముచ్చటగా మూడు తరాలు,  మురిపాలు పంచుకుంటున్న గృహాలు. 
*********
లంచం
నన్నడ్డుపెట్టుకుని నా జీవితారంభాని కన్నా ముందే 
తన ప్రాభవాన్ని చూపగలిగేది,
అంతం తర్వాత కూడా తన ఉనికి  చాటేది
ఏదైనా ఉన్నదంటే అది లంచమేనోయ్ నా దేశాన. 
********

Friday, June 7, 2013

కష్టార్జితపు మత్తు

కష్టార్జితపు మత్తు 
ఆమె పిల్లల ఆకలి మంటల్లో 
ఆతని కష్టార్జితపు మత్తు 
చమురు పోస్తుంది. 
******
మౌనపు విత్తులు 
నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని
విత్తులుగా చల్లుతూ, నా మనసున 
ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి  
నీ చూపులు. 
********
అనుభూతులు 
 పరిగెత్తే లోకాన అనుభూతులకు 
పెట్టుబడిగా పెట్టగలిగినంత కాలం నా దగ్గర లేదు. 
అందుకే నాకు నేను కూడా అనుభవానికి రావడం లేదు మరి. 
*******
కన్నీళ్లు 
విడిచిన ప్రతి సారీ 
గమ్యాన్ని చేరడం తెలిస్తే!
జీవితాంతమూ పోషించే వారెవ్వరూ చెప్పు ఈ కన్నీళ్లను. 
*********

Thursday, June 6, 2013

దొమ్మరిపిల్ల

దొమ్మరిపిల్ల
కూర్చుని అనుభవించే దొరసానితనం తనకొద్దంటూ 
అలుపూ సొలుపెరుగక క్షణమైనా విరామమడగక 
విశ్వపు వీధుల దొమ్మరిపిల్లలా తిరుగుతుంది 
నా మనసు. 
**********
వెన్నెల వాల్జడ 
నిండు పున్నమి రోజున జారుతున్న జలపాతాన్ని,
వెన్నెలవాల్జడగా చూపుతూ 
నా చూపులను పూలుగా ముడుచుకుందా కొండ. 
********
ఆడపిండాలు 
బ్రతికే వయసే ఇంకా రాలేదుగానీ 
చావడానికి తొమ్మిది నెలలు నిండాలా అంటూ 
మౌనంగా అడుగుతున్నాయి ఆడ పిండాలు కొన్ని. 
*********
గ్రంథాలయాలు 
లోకమొద్దనుకున్న నీతి నియమాలను 
తవ్వి తలకెత్తుకున్న వేదనతో 
మూలుగుతున్నయా పుస్తకాలు 
ఈ గ్రంథాలయాలలో. 
*********
 
 

Sunday, June 2, 2013

వీడ్కోలు

వీడ్కోలు
మౌనాలు కమ్ముకొస్తున్నాయి
ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి
కాలపు కథ సరే! మామూలే నేస్తం
దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో
ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే
ఎన్నో గలగలలు కిలకిలలు
మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక
కన్నీటి తెరల వెనుక పొదగాల్సిందే
కోపాలు, కలహాలు, సరదాలు మౌనంగా ఇక విశ్రమించాల్సిందే
అవును! నిజం నాకు నిశ్చయంగా తెలుసు
అందుకే ఈ కలయిక శాశ్వతమనుకునే సాహసం ఎన్నడూ చేయలేదు
కానీ ఇదేమిటో నేస్తం నీ వియోగం నన్ను వేధిస్తోంది
ఇప్పుడు నన్ను సమాధానపరచే వారెవ్వరు నేస్తం
ఘనమైన నీ జ్ఞాపకాలు తప్ప.
***********
జీవితం
ఇంతకన్నా అందమైంది ఏదీ లేదు 
ఇంతకన్నా అందమైనవే అన్నీను 
అనే రెండు మాటల నడుమ 
తన పరిధిని విస్తరించుకున్నదే జీవితం! 
*******