Follow by Email

Friday, January 31, 2014

కథలెక్కడ?

కథలెక్కడ?
కంచికెళుతూ! మంచిని పంచిన 
నాటి కథలెక్కడోయ్ నేడు?
చూడు చూడు..  ఆ విలువలు చేరిన చోటకే 
చేరిపోయాయా ఏమిటి?
*****
కలల మధువు
పూలై విచ్చిన ఊహల నుండి,
కలలనే! మధువును గ్రోలుతుంది నిదుర 
తుమ్మెదై 
******
దర్పణం 
నన్ను కాసింత నవ్వించి,
నా కన్నులాస్వాదించే 
మెరుపును  కన్నదా దర్పణం. 
******
ఆనంద బాష్పాలు
ఊరు ఊరంతా కొత్తబట్ట 
కట్టబెట్టింది ఆ పొగమంచని
ఎన్నెన్ని ఆనంద బాష్పాలను రాల్చుతున్నాయో 
చూడా ఆకులు ఈ పూరేకులు 
*******

Tuesday, January 28, 2014

జ్ఞాపకాల పూలు

జ్ఞాపకాల పూలు
నాలుగు, జ్ఞాపకాలను పూలు లేనపుడు 
నలుగురూ మెచ్చే 
మధువెక్కడుంటుందోయ్! మదిలో 
*****
బరువు 
బరువే, 
బాధ్యత అయింది! పాపం
ఆ బాల్యానికి 
****
నవవధువు
నిత్యమూ బుగ్గ చుక్కతో భాసిల్లే 
నవవధువులాటి భాగ్యమబ్బిందా చీకటికి 
ఈ మిణుగురుల పుణ్యమా అని 
******
జటాయువు
సీతాపహరణ వేళ 
జటాయువు అయింది 
ఆంగ్లపు చేతుల నా సంస్కృతి చిక్కిన వేళ 
తెలుగు స్థితి 
*****

Tuesday, January 21, 2014

మనసు లోపల....

మనసు లోపల....
పుడమి గుండెల్లో,
కడలి లోతుల్లో ఏముందో 
ఇట్టే కనిపెట్టేసే మనిషి మనసు 
తన లోపల ఏముందో మాత్రం...... 
******
పలుకే....
పలుకే బంగారమాయెన అంటూ 
ఎంత బాగా భవిష్యత్తుని 
చూడగలిగారో ఆ త్యాగరాజు అని 
నాకిప్పటికి అర్ధమైందోయ్ 
ఆ కొత్త సినిమా పాటను వింటుంటే 
********
తొందర పడితే
వసంతం విరబూయించిన ఆ పూల సిరులు
రాతిరికా మిణుగురులకు విడిదైతే 
అమ్మో! అంత అందాన్ని చూడాలని 
ఆ సూరీడే తొందరపడితే ఎలా మరి 
*******
ఊహాచిత్రం
గాలి గీస్తున్న 
ఊహాచిత్రం 
ఆ ఎండుటాకు 
****

Friday, January 10, 2014

నీటి ముత్యాలు

నీటి ముత్యాలు
రాతిరంతా ఈ ధాత్రి చేసిన 
అతిథి మర్యాదకు మెచ్చి 
ఆ చీకటి జార్చిన ఆనందబాష్పాలే 
ఈ పచ్చికల తలపై నీటిముత్యాలయినాయి. 
******
సంతసం 
మెరిసినంత 
ఎంత సంతసమో నీకని అడిగేంతలో! 
కరిగి నన్ను చేరేంత అని 
బదులిస్తూ ఉరుముతుందా ఆకాశం. 
********
సరసాలాట
చిగురాకు చాటునొరిగి,
గాలి సయ్యాటన నాడే ఎరిగిన సరసాలాటను 
కన్నులారా గాంచి కాదా 
ఇప్పుడు నీ సిగన 
ఫక్కున నవ్వేదా మల్లె మొగ్గలో చెలీ. 
*******

Tuesday, January 7, 2014

జాతి కేతనం

జాతి కేతనం
సొమ్ములు మారే చీకట్లోన?
శీలం పోయే అంగట్లోన?
ఎక్కడ ఎగరాలోయ్ నేనని, అడుగుతుంటే జాతి కేతనం!
మౌనంగా నువ్ బదులిస్తావో!
మదన పడి మరి అమృతమిస్తావో?
********
కీచురాయి 
చీకటిన ఈ ధాత్రికి ధైర్యం చెప్పే 
కీచురాయి పాటైనా చేయరేమీ లోకులు 
ఎదలో చీకటులు అలముకున్నేళ. 
*******
కడలి
ముంగిట నవ్వులతో 
రంగవల్లికలేయు అలలున్న 
ఆ కడలింట లక్ష్మి కొలువుండ
ఆశ్చర్యమేమిటోయ్
******
వెన్నెల కవిత
పున్నమి వెన్నెల చెబుతున్న 
కమ్మని కవితల భావాన్ని 
నేల పుటల నెలా రాస్తున్నాయో చూడు 
ఆ అడవి మానులు తమ నీడలను కలాలు చేతబూని
*******