Follow by Email

Friday, April 24, 2015

అగాధం

అగాధం
అనుభూతికి హృదయానికి నడుమ 
మనిషికి మనిషికి ఏర్పడినంత 
అగాధమేర్పడిన్దిప్పుడు 
*************
హైవే 
రాలిన ఆకులే వాహనాలుగా 
హైవేను తలపిస్తుందా 
కోనలోని సెలయేరు 
*************
చక్రాలు 
యుగం మారి 
ధర్మానికి విరిగిన ఒక్కో కాలు 
చక్రాలై అమరాయా అధర్మానికి 
************
వెన్నెల 
మనసులనే కాదు 
చూపులను కూడా కొనలేనంత 
పేదదయ్యింది వెన్నెలిప్పుడు 

Monday, April 20, 2015

హైకూలు

హైకూలు 
పేజీల సౌభాగ్యం 
రాజీల దౌర్భాగ్యం 
పాపమా విలువలది 
***********
వాలుజడలకై 
వేచిన అభిసారికలు 
పూలజడలు 
************
చావుని 
పోషించడమే 
జీవితమంటే 
***********
ఆహా నుండి 
హవ్వా వరకు 
మన తెలుగో!మన తెలివో?


Thursday, April 16, 2015

హైకూలు

హైకూలు

సీమంతానికి పెద్ద ముత్తెదువ 
ఆ కోయిలమ్మ 
ప్రసవానికి మంత్రసాని 
ఈ నెమలమ్మ 
************
మనసుకి 
ఊహ జీతం 
స్వప్నం బోనస్ 
************
పూల తావిని కడుపార మేసి 
అరగడానికని
ఈ పైరు పాపలను ఊయలూపుతున్దీ గాలి 
************
రోడ్డుకొచ్చిన అల్సర్లే 
ఈ గోతులు 
Sunday, April 12, 2015

పక్షి గూళ్ళు

పక్షి గూళ్ళు 

అన్ని పూలతో విరిసిన, ఆ మాను సిగలో
కిలకిలా నవ్వే పూలై, ఎలా అమరాయో 
చూడా పక్షి గూళ్ళు 
**********

మెరుపు తీగ 

ఏ తీగా రాల్చలేనన్ని పూలను 
తను రాల్చగలనని కాబోలు 
ఉరిమేంత గర్వముందా మెరుపు తీగకి 
***********
సాలీడు 
తన ఇంటి మాటు నుండి చూస్తూ 
నిండు చంద్రునికో నూరు నూలు పోగులేసే 
కిటుకు నేర్చుకోమంటుందేమిటోయ్ ఆ సాలీడు  

Wednesday, April 8, 2015

తెర

                          తెర 

నేటి బాలల కోసం నువ్వు లేవనుకున్నాను గాని 
బడి గోడలూ, దాటేశావని తెలుసుకోలేక పోయాను. 
సమ్మోహనాస్త్రాలు మెండుగా ఉన్న 
ఉద్వేగోన్మాదివి నువ్వు. 
ప్రేమలను విరబూయిస్తావు,
పగలే పరమార్ధమంటావు, 
రాని వయసులను రప్పించేలా నిన్ను నీవు అలంకరించుకుంటావు.  
అవును!
వర్ణశోభ, కర్ణక్షోభ తప్ప ఏమున్నాయి నీదగ్గరిప్పుడు? 
అనురాగాలను అనంత లోకాలకంపేసావు,
హితం లేని సాహిత్యాన్ని 
ఇంగితం లేని సంగీతాన్ని ఎక్కు పెట్టి ,
విలువలపై 70MM బట్ట కప్పి 
సాని బాట పట్టేవు, కసి కేళీ చూపేవు 
తెరవు, కల్ప తరువువు అనుకున్న 
ఎoదరి కళ్ళకో అడ్డు తెరగా నిలిచేవు 

Monday, April 6, 2015

క్రోధం-మోదం

క్రోధం-మోదం 

మనసు నుండి ఎప్పటి 
మకరందాన్ని అప్పుడే 
తాగేసే భ్రమరమా క్రోధం  
కూడబెట్టే మధుపమా మోదం
************

పూలు

మూగ సైగలే తప్ప 
మాట్లాడడం రాని 
బహు భాషావేత్తలీ పూలు 
*************
అత్తరులు 
పరిగెడుతున్న ఈ సమాజంలో 
ఆ అనురాగాలకన్నా 
ఎక్కువ ఆయువునే 
పొసుకుంటున్నాయి అత్తరులు 
*************


Friday, April 3, 2015

గోదారి

గోదారి 

తన విభునకేమి తక్కువంటూ 
పుట్టింటి నుండి పట్టుకెళ్ళాసిన 
చీర సారేలను మనకు జీవితాలుగా 
వదిలేస్తుందా గోదారి 
*************

నింగి నేతగాడు 

తన సిగ్గుతో, మేఘాల మేని పై 
బంగరు బట్టను నేసి 
మన చూపుల గిట్టుబాటoదక 
మదనపడే నింగి నేతగాడా నిండు జాబిలి
************** 

కోవెలలో 

అనుభూతి ప్రసాదం 
తీర్ధమా ఆనంద భాష్పం 
ఈ ప్రకృతి కోవెలలో