Saturday, June 29, 2013

ఎవరు వారు?

ఎవరు వారు?
ఇక దాని బ్రతుకంతమొంది గోడల మధ్యనే గడిచి పోతుందనుకున్నాను 
రోదనే తప్ప దానికిక నవ్వే యోగమే లేదనుకున్నాను 
కానీ ఉన్నట్టుండి దానికెవ్వరో పట్టాభిషేకం చేసారు 
ఇపుడది చిందించే హాసాన ఈ లోకమే మెరిసి మురిసిపోతోంది 
ఎవరు వారు? కంటికి రెప్పలై, ఇలా ఆ మానవతకు పట్టం కట్టినవారు 
వారించలేని కల్లోలాన్ని పీడకలలా మలచిన వారు 
విలాసంగా నవ్వుతున్న మృత్యువు వెన్నులో వణుకు పుట్టించిన వారు 
ఎవరు వారు? ఆత్మీయతకు అద్దం పట్టినవారు 
ఆప్యాయతలో అమ్మనూ మించిపోయినవారు 
అడవి దారుల పట్టి పోతున్న సమాజానికి అసలు దారిని చూపినవారు 
ఎవరు వారు? కోతల్లోని మాటల రాయుళ్ళకు 
మనుషులను చేరడమెలాగో చేతల్లో చూపినవారు 
ఆదుకోవడమే ఆయుధానికి పరమార్ధమని చాటినవారు 
ఇరుకిరుకు దారుల, మనసుల మూలల్లోకి చేరినవారు 
ఎవరు వారు? దేవుడే దిక్కంటూ మ్రొక్కిన వారికి దిక్కైన వారు 
విలువలకు దిక్సూచి ఐనవారు 
మనుషులుగా మనలను గుభాళించమన్నవారు 
ఎవరు వారు? నిన్నటి రోదనల మాటున రేపటి నవ్వులను బ్రతికించిన వారు 
ఉలికిపడిన జాతి గుండెనూరడించినవారు 
అమ్మ పాల ఋణాన్ని ఇంత చక్కగా తీర్చుకున్నవారు 
ఎవరు వారు? చావు బ్రతుకుల సరిహద్దు సీమలను 
సాహసంతో సమీపించి 
ఆ దేవుని కన్నా ఓ మెట్టు పైన నిలబడినవారు 
అమృతం కూడా ఈయలేనంతటి అమరత్వాన్ని 
మానవత్వపు మాటున అందుకున్న వారు 
ఎవరు వారు? ఎవరు వారు?
**********

No comments:

Post a Comment