Sunday, March 16, 2014

పున్నమి

పున్నమి 
పున్నమి, దీపాన్ని పట్టుకుని 
గోదారి గట్ల వెంట వెతికేది ఏమై ఉంటుందంటావ్?
తెలీదంటావేమిటోయ్ నీ మనసే 
పాపమోసారి దొరకనివ్వవోయ్ దానికి. 
******
ఫాషన్
అందాలన్నిటికీ 
అందమైన వలువలు కడుతుందా చీకటి 
ఫాషన్ అంటే ఏమిటో తెలీకుండానే 
*****
జోడెడ్లు
జోడెడ్లే మనిషి, మనసు 
కానీ రెండూ 
ఒకే తోవన నడవడమే అరుదు. 
******
మనసు
ఉన్న చోటెక్కడో చెప్పదు కానీ 
విషాదమైనా ఆనందమైనా 
తనువంతా కదిపి పారేస్తుంది 
నా మనసు. 
******

Saturday, March 15, 2014

దీపం

దీపం
గాయం లేదు 
చుక్క రక్తమైనా చిందలేదు 
అయినా ఎంత కాంతులీను బిడ్డను కందా దీపం. 
*******
సరస కావ్యం 
ఓ కవి భావుకతలాటి ఆ చల్లగాలికి 
ఓ నర్తకిలా ఆ వనం అభినయం నేర్పితే 
ఆడుతున్న ఆ సరసకావ్యాన 
నాయికా నాయకులెవరో తెలుసా? 
నీ కన్నులే. 
******
పెరటి పువ్వు
ఎంత పిలిచినా పలుకలేదని 
అలసి నా పాదాల పై పడి 
ప్రాణాలొదిలింది నా పెరటి పువ్వు 
******
శాపం
ఏళ్ళుగా నిలబడి 
తపస్సు చేసినందుకు 
శాపం మీదపడిందని 
ముక్కలై పోతోందీ మాను. 
******

Wednesday, March 5, 2014

సుందరి

సుందరి
తాను వస్తూనే నా జీవితాన్ని 
అందంగా అలంకరించింది 
తన ఎదుటనుండి నన్నో క్షణం దూరం కానీయనంత దగ్గరైంది 
నాక్కావాల్సిన రూపంలో తానాడింది 
ఆమె లేనిదే జీవితమే లేదనిపించింది 
ఇంత చ చేసిన ఆమెను నీకేమి కావాలంటూ అడిగితే 
నీ ప్రాణాలు నాకిమ్మంటూ అడిగిందా ప్లాస్టిక్ సుందరి 
******
 నాట్యం
నేలపై నీ కళ్ళను పరచి 
చెట్టు విడిచిన ఎండుటాకు
గాలిలో చేసే నాట్యాన్ని 
నీవెప్పుడైనా చూశావా 
ఆకాశ సంద్రం నుండి బయలుదేరి 
నేల తీరాన్ని చేరే నావలా లేదూ!
******
శిల
రాయికి మాత్రం తెలిసిందా 
నిన్ను ఆకట్టే కళ తనలో ఉందని 
నే తనను శిల్పంలా మలచేదాకా. 
నాకు మాత్రం తెలిసిందా 
శిలలా నేనున్నానని 
నీ చూపు నాపై పడేదాకా. 
*******
అలక
నిజం చెప్పాలంటే 
వాడంత కొంటెతనం నీకెక్కడిది 
ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ 
నిలబడి నీవు ప్రేమాయణం సాగిస్తే 
వాడేమో ఓరకంట ఆ వయ్యారాన్ని మీటి 
తన దారిన తాను పోతూ 
చెలిని చుట్టూ తిప్పుకుంటాదంటూ 
సూరీని చూపి ఆకాశం తనను దెప్పిందని అలిగి 
అమాసన బయటకే రాడు జాబిలి. 
*******

Tuesday, March 4, 2014

గుప్పెడు చేను

గుప్పెడు చేను
ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎప్పుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది 
నా మనసు. 
*****
సజీవగీతికలు
మమతానురాగాలు 
పల్లవీ చరణాలుగా వినిపించే సజీవగీతికలను విని 
ఎంత కాలమైందో అని 
తనలో తాను అనుకుంటూ 
ముందుకు సాగుతుందీ కాలం. 
******
బడాయి
ఎక్కడ నా రెక్క తగిలి 
తను గాయపడాల్సి వస్తుందోనని 
అంత దూరానెళ్ళి కూర్చుందా ఆకాశమంటూ 
ఎంత బడాయిగా చెబుతోందో 
చూడా బుల్లిపిట్ట. 
*****
మెరుపుతీగ
తానాడే ఆటకు నిడివి చాలకనో 
తకిచ్చిన ఆయువు ఇంతేనా అనో 
అలిగి ఆ ఆకాశాన్ని వీడిన 
మెరుపుతీగ కాదటోయ్ 
వెన్నెల్లో ఈ గోదారి. 
*******

Monday, March 3, 2014

ఆశ

ఆశ
ఆమె నా హృదయోద్యానవనమున 
వాహ్యాళికై వచ్చింది మొదలు 
వికసింపనెరిగాయి నా భావనలు 
వాటి పరిమళం నచ్చి ఇంకాసేపు.... 
ఆమె ఇచటనే ఆగునేమోనని ఆశ
******

Sunday, March 2, 2014

బృందావనం

బృందావనం
తెలుపు ఎరుపు బంగారు వర్ణాల మోములపై 
మందారపు వర్ణాలు అలిమిన 
ఆ కారుమేఘపు వన్నె వాడి నవ్వులు చూస్తూ 
 వివిధ వర్ణాల విరులు ఆనందబాష్పాలు రాల్చుతుంటే 
పుడమి గుండెనంటిన ఈ రంగుల సాక్షిగా 
పాపం నోరుతెరిచా హోలీ 
ఒక్కరోజైనా సెలవు అడగకుందా బృందావనాన. 
******