Follow by Email

Monday, January 28, 2013

రూపం

 రూపం 
చాటుగా 
చీకట్లోంచి  
చెత్త కుప్పలోకొచ్చింది...... 
******** 
 మోహం 
కాలికి మెట్టెలు అమరే వేళకే  
జీవితంలో ఎక్కి దిగాల్సిన 
మెట్లెన్నో చూపిస్తోందోయ్ 
కొందరికి ఆ.........
*********
కన్నీరు 
జారి తనమీద పడి 
మీ అలికిడిని వినిపించాలనుకుంటున్నారు గానీ 
అలజడే తానైంది నా గుండిప్పుడు.
*******
ఆ పార్కున  
భవిష్యత్తులో మధువే దొరుకుతుందన్న  
పిచ్చి నమ్మకాన 
ప్రేమ సాగర మధనమే జరుగుతోందోయ్ 
పొద వెనుక........
********

Sunday, January 27, 2013

మెరుపు కొరడా

మెరుపు కొరడా 
తళుకుమనే కొరడాలతో కొడుతుంటే 
అక్కడ ఇంకేంతోసేపు తాముండమంటూ 
ఎలా కన్నీరు మున్నీరుగా మాయమైపోతున్నాయో 
చూడా కారుమేఘాలు.
********
పడవ 
వయసెంత మీద పడనీ 
ఊయలూగే పసితన్నాన్ని మాత్రం 
వదులుకుంటుందేమిటోయ్ 
ఆ పడవ.
********
బోసినోరు 
ఆకలితో ఓ బోసినోరు ఏడుస్తుంటే
 అనురాగపు ఆకలితో 
ఇంకో బోసినోరు పూడుకుపోతోంది.
*********
నిర్లిప్తత 
కొందరి నిర్లక్ష్యం కన్నా 
ఇంకొందరి నిర్లిప్తతే 
తమని ఎక్కువగా బాధిస్తుందంటూ 
వాపోతున్నాయా సంస్కృతి సంప్రదాయాలు.
*********

Friday, January 25, 2013

ప్రసవ వేదన

ప్రసవ వేదన 
తాను పడాల్సిన ప్రసవవేదనను 
తన తనువు చీల్చుకుని మరీ 
పడిందనీ పుడమని గాబోలు 
జీవిత కాలమంతా 
ఈ పుడమి వేలు విడిచిపెట్టదా విత్తు.
*********
ప్రయోజకత్వం 
కోవెలనో నీ వాల్జడనో చేరి 
ప్రయోజకత్వానికి భలే నిర్వచనాన్ని 
ఇచ్చాయా పూలనుకుంటాము గానీ 
నిజానికి తనను నిలబెట్టిన నేలను 
నేలను పూజించాలని 
ఆ మాను రాల్చే పూలకన్నా 
ఎవరీయగలరోయ్ పరిపూర్ణమైన నిర్వచనాన్ని 
ప్రయోజకత్వానికి.
*********
వానవత  
ఇలా తామందరం తడిపేస్తుంటే 
పాపమా చెరువుకెక్కడ 
జలుబు చేస్తుందో నని 
వానవతతో గొడుగు పడుతున్నాయా చెరువుకి 
వానచినుకులు కొన్ని గాలిబుడగలై.
********
గట్టు  
నే చేతులడ్డు పెట్టి 
గాలికి ఒంపులు తిరుగుతూ వెలిగే దీపాన్ని 
ఠీవిగా నిలబెట్టినట్లుగా 
తానూ ప్రయత్నిస్తానని 
గోదారికి తన చేతులడ్డు పెట్టి 
తానేమి సాధించిందో చూడా గట్టు.
*********
 

Wednesday, January 23, 2013

అవినీతి

అవినీతి 
ఊళ్లకు ఊళ్లనే కాదు 
కొండలను గుట్టలను కూడా 
కదిలించే అంకుశం గాదటోయ్ 
ఆ అవినీతి అధికారి చేతిలోని కలం.
*******
నీతిని గ్రంధస్థం 
అవినీతిని కంటస్థం చేసేవాడేనోయ్ 
అసలు భారతీయుడంటే 
*******
ఎన్ని చరణాలతో 
పల్లవిస్తోందో చూడు 
బ్రతుకుపాటలో ఆ అవినీతి.
********
శిఖండిని చూసి అస్త్రసన్యాసం చేసిన 
భీష్ముడిది తప్పు కాకపోవచ్చు గానీ 
శిఖండిలాటి నేతలను చూస్తూ 
నువ్వు ఆలోచనాస్త్రాలు 
సన్యసించడం మాత్రం......
*******
ఉదయించి చీకటిని తెచ్చిందిగా 
అస్తమిస్తేనే గానీ 
వెలుగురాదా అవినీతి.
*******

Saturday, January 12, 2013

సాంప్రదాయం

సాంప్రదాయం 
పండుగలనడ్డు పెట్టుకుని గానీ 
పాపం ముఖం చూపలేకపోతోంది 
ఆ సాంప్రదాయం 
*********
మాను 
హృదయపు లోతులను 
చూడగలిగితే 
ఆకాశపు అంచును చూడవచ్చంటూ 
ఆ మాను మర్మగర్భంగా 
నీతో ఏదో........
********
పంటచేను  
గాలి ఊయలూపి 
నిద్ర పుచ్చుదామంటే 
కులాసాగా రాగాలు తీస్తుందేమిటి 
ఆ పంటచేను.
*******
భావచిత్రం 
భలేగా వెలగట్టి 
కొనుక్కుపోయిందిలే 
ఆ ఆకాశం 
ఈ బీడు గీసిన భావచిత్రాన్ని.
*********

Wednesday, January 9, 2013

హేమంతం

హేమంతం 
తెల్లారకుండానే ఏమి సాధించేసిందనో 
ఆ మేఘాలను శాలువాలుగా కప్పి 
ప్రతి ఆకు చేతికి అన్నేసి అక్షతలను ఇచ్చి 
ఆ కొండను దీవించమంటుంది 
ఈ హేమంతం.
********
ఊహలు 
గుప్పిళ్ళతో నే చల్లిన 
ఊహల నుండి ఎంత అందమైన 
ప్రకృతి మొలిచిందో చూసావా.
********
ఋణం 
తోటకు కూడా ఈయనంత తావిని 
తమకైక్యత నేర్పిన దారానికిస్తూ 
తమ ఋణాన్ని ఎలా తీర్చుకుంటున్నాయో 
చూడా విరులు.
********
జోలపాట  
జోలపాట  
ఆపిందా రెప్పని 
మేలుకున్న పసిపాపే 
నా స్వప్నం.
*******

Sunday, January 6, 2013

బృందావనం

బృందావనం 
వారి ఎదలోతు ఊసులను వినాలని 
ఆకైనా కదపక తన ప్రాభవాన్ని కాదని 
తనను పరాభవిస్తే ఆ మానులన్నీ 
గ్రోవిలోన దూరి ఆడే నాగుల్లా 
వాటినెలా మార్చిందో చూడా గాలి.
*********
యుగానికొక్కరు 
రావణుడినో? కీచకుడినో?
యుగానికొక్కరినే చూసిన 
భారతమేనా ఇది.
*******
విటుడు  
ఆరిన దీపం సాక్షిగా 
ఆమె రెండు కళ్ళ కాంతికి 
వెలగట్టాడా విటుడు.
*******
గుక్కెడు గంజి 
నవమాసాలు పైరు పాపలను మోస్తూ 
పాపం గుక్కెడు గంజి కూడా 
పోయలేక పోతోందీ నేల 
పాపమా రైతు నోట.
*********

Thursday, January 3, 2013

చెమ్మగిల్లిన జోడు

చెమ్మగిల్లిన జోడు 
చెమ్మగిల్లిందా కళ్ళజోడు 
దాని వెనుకనున్న కన్ను 
పేగుబంధం కోసం 
ఎదురుచూస్తూ మూత పడిందని 
ఆ వృద్దాశ్రమంలో.
******
చిత్రకారుడు-చరిత్రకారుడు 
నిజం చెప్పాలంటే 
ఆ చెరువంత అందమైన 
చిత్రకారుడు లేడు 
ఆ మానంతటి 
చరిత్రకారుడు లేడు.
******
డబ్బు చేలు   
పంట చేలను
 డబ్బు చేలగా మారుస్తున్నాడీ మనిషి 
భాగిస్తూ.
******
ఏకాంత శిల్పి  
నన్నానందింప చేయడానికి 
నా ఏకాంత శిల్పి 
నిన్ను చెక్కి నా మనసు నింపి 
తానెక్కడికో వెళ్ళిపోయాడు.
*********Wednesday, January 2, 2013

అడియాశ

అడియాశ 
దేవుడెందుకో మనుషుల మనసులను 
చాలా లోతుగా డ్రిల్లింగ్ చేస్తున్నాడోయ్ 
బహుశా మానవత కోసమంటావా?
పోనీలే అడియాశ అంటే ఏమిటో 
ఆ దేవుడికీ తెలిసొస్తుంది.
********
ఉన్న చోటు 
ఉన్న చోటెక్కడో చెప్పదు గానీ 
విషాదమైనా ఆనందమైనా 
తనువంతా కదిపిపారేస్తుంది 
నా మనసు.
********
రాతి మనసు 
ఏళ్ల తరబడి కదలకుండా 
తపస్సెందుకు చేస్తున్నాయో ఆ బండరాళ్ళని 
వాటికి చెవి ఆనించి ఎపుడైనా అడిగావా నువ్వు 
లేదుగదా అందుకే 
నీ మనసలా రాతిలా తయారైంది.
********
ఋతువులు 
విలువల శిశిరం 
కాసుల వసంతం 
రెండే ఋతువులా సినిమా తెరకు.
********