Monday, May 28, 2012

మెరుపు

మబ్బు తో మబ్బు చుంబిస్తేనేనా 
మెరుపొచ్చేది అని ప్రశ్నిస్తుందా  కిరణం 
ఇసుక రేణువును  చుంబిస్తూ.
******
తన తీర్మానాన్ని 
స్వాగతించే కీచురాళ్ళకు 
వ్యతిరేకించే మిణుగురులకు స్థానమిచ్చి 
తనలోని ప్రజాస్వామికతను 
చాటుకుంటుందా  చీకటి.
*******
కలసి వేయాల్సిన ఏడు అడుగులను 
ఒకరికొకరు వ్యతిరేకంగా 
వేసుకుంటూ పోతున్నారా పాట పొదరింట 
సంగీతమూ సాహిత్యమూనూ.
*******
పరిమాణంలో 
భారత రామాయణ భాగవతాలు 
మూడిటిని ముచ్చటగా 
వెనక్కు  నెట్టిందా నేతపైని 
సి బి ఐ చార్జ్ షీట్.
*******
 

Sunday, May 27, 2012

వసంత శోభ

కాలాన్ని అరువిచ్చి పుచ్చుకుంటూ 
ఆ రుతువులు తనకు మాత్రం 
తరగని వసంత శోభను కట్టిపెడుతున్నాయంటూ 
మురిసిపోతోందా మృత్యువు.
******
అంత తొందరగా 
చెట్టు నీడను వదిలిపెడుతుందా 
బంధం బలమైనదైతే 
స్వేచ్ఛతో  పనేమిటంటూ 
ఆ ఎండుటాకు.
*******
బద్ద శత్రువులైన 
ఇద్దరు సమవుజ్జీల నడుమ 
అధికార బదలాయింపును 
ఎంత సులువుగా చేస్తుందా సంధ్య.
*******
అధికారంలోకి రాగానే 
ఇచ్చిన హామీని 
ఎంతందంగా నెరవేరుస్తుందో 
చూడా దీపం.
*******

Friday, May 25, 2012

ముత్యాలు

అన్ని ముత్యపు చిప్పలలో 
ముత్యాలుంటాయో లేదో గానీ 
అలాగుండే  అందరి కళ్ళలో మాత్రం.......
******
కాలానికన్నా తానెక్కువ 
కష్టపడుతున్నానంటుంది నా మనసు 
ఊహల్ని కలల్ని రుజువులుగా చూపుతూ.
********
నా అన్న వాళ్ళు నలుగురితో 
కలిసున్నానన్న ఆనందమే 
మకరందమయిందా పువ్వులో.
********
నాటి నాయికల అందాలు 
కావ్యాలకు కొత్త శోభలను తెస్తే 
నేటి నాయికల అందాలు గోడలకు 
నగ్న శోభలను తెస్తున్నాయి.
*******

Wednesday, May 23, 2012

సెలయేరు

ఒద్దికగా తన ఇంట్లోకొచ్చి 
వయ్యారాన్నే తన ఇంటి పేరుగా 
మార్చిందా వాన చినుకంటూ 
ఒంపు ఒంపునా గట్టుతో చెబుతూ 
పారుతుందా సెలయేరు.
********
అందమైనది గనుకే 
నా మౌనం 
దానికన్ని శత్రువులు.
******
తొలకరికా మట్టి 
పువ్వైందని 
వర్తమానమిచ్చిందా గాలి
నా మనసుకి.
******
ఎంత కాలమైనా 
నాలో నీ ఆనవాళ్ళు 
మాపడమనే విద్య 
అబ్బింది కాదీ కాలానికి.
*******

Friday, May 4, 2012

గత జన్మ

పూలకి
గతజన్మ 
జ్ఞాపకమా తేనెపట్టు.
******
నా మనసు లోతెంతో 
చెప్పగలిగేవి 
నా కన్నీళ్ళే.
*******
శ త్రువెంత సాధించినా 
విజయాన్ని ఆ శత్రువుకే 
అంకితమివ్వడం 
ఒక్క దీపానికే చెల్లింది.
*******
బ్రతకడానికి కాలంతో పాటూ 
పరుగెడుతున్న నన్ను చూసి 
 ఆయాసపడుతోంది నా నీడ
అవును నా కన్నా నా బ్రతుకు విలువ 
దానికే తెలుసు మరి.
*******

Thursday, May 3, 2012

జీవితం

ఆ రెండు మెట్ల నడుమ 
లెక్కలేనన్ని  విన్యాసాలు చేసేదే 
జీవితమంటే.
*******
ఆ అడవి మానుల్ని అడిగి మరీ 
ఒక దాని వెనుక ఒకటి క్రమంగా 
వచ్చేవా రుతువులు 
ఇపుడడగడానికి అవి లేవనే 
బొత్తిగా క్రమశిక్షణ తప్పాయి.
*******
జీవితాల్లోకి తొందరొచ్చి 
శుభకార్యానికి సగం 
అశుభకార్యానికి  మూడొంతులు 
ఆయుష్షును తగ్గించేసింది.
*******
జీవితదశలు మారినంత 
నిదానంగా కూడా 
దశలు మారడం లేదా పాత్రలకు 
డైలీ సీరియల్లో.
*******