Follow by Email

Tuesday, July 31, 2012

మోహార్ణవం

మోహార్ణవం 
కన్నుల హాలాహలపుధారలు గారుచుండ 
ఎపుడో అమృత బిందువొకటి 
నా హృదయమున కందునని అహర్నిశమూ 
నీ మోహార్ణవమును చిలుకుచుంటినాడ.
*********
వెతల మైదానం 
ఆగక పారే కన్నీళ్ళతో 
అనుభవాలెన్నో పండించే వెతల మైదానం 
నా హృదయం.
*********
అద్దం 
ఎన్నెన్నో వ్యాపకాలతో 
క్షణం తీరిక లేకుండా గడుపుతూ కూడా 
నేను ఎదురుపడగానే నవ్వుతూ 
నన్నెలా పలకరిస్తుందో చూడా అద్దం .
**********
అభినయం 
కరిగానని 
కరిగించ లేకపోయానని 
రెంటినీ ఒకేలా అభినయిస్తూ 
కంటినెరుపెక్కించడమే తెలుసు 
నా మనసుకి.
********

Monday, July 30, 2012

సజీవ సౌందర్య శిల్పం

సజీవ సౌందర్య శిల్పం 
తన జీవితమో సజీవ సౌందర్య శిల్పమని చెప్పడానికే 
రాల్చి దాల్చుతుందా శిశిర వసంతాలను 
ఈ మాను.
*********
అల 
పడి లేస్తూనే అప్పటికప్పుడే 
కొత్త జీవితానికి తోరణాలు 
ఎంతందంగా కట్టుకోగలదా కడలి అల.
********
నేతగాడు 
తానే ఆ బట్టకు వేలాడి 
తాను నేసిన బట్ట ఎంత నాణ్యమైనదో 
చెప్పకనే చెప్పాడా నేతగాడు.
********
తోటమాలి 
హృదయ క్షేత్రాన 
వెలుగనే విత్తొకటి నాటి 
లోకమంతటా దాని ఫలాలను 
కోసుకునే తోటమాలిని నేను.
*******

Sunday, July 29, 2012

చేవ్రాలు

అమ్మ 
పుట్టగానే  నా ఏడుపుని 
మనసారా ఆస్వాదించానని కాబోలు 
ఆ పైని నా అన్ని దుఃఖాలకు 
ఎంతగా ఆక్రోసిస్తుందో మా అమ్మ.
********
చేవ్రాలు 
కొన్ని వినోదాల వీలునామా కింద 
మత్తులో పడ్డ మనసు 
మృత్యువుతో చేవ్రాలు చేయిస్తుంది.
********
ఒత్తిడి 
డైనోసార్ల లాగా 
ఒత్తిడి అనే ఆస్టిరాయిడ్ తగిలింది 
నవ్వులకి.
*******

Thursday, July 19, 2012

విలువలు

విలువలు 
మనిషిని మేల్కొల్పీ మేల్కొల్పీ విసుగెత్తి 
ఆఖరికి ఆ పుస్తకాల్లో చేరి 
విశ్రాంతి తీసుకుంటున్నాయా విలువలు.
********
ఆనందబాష్పాలు 
లోకమంతా పరచుకున్న 
ఆహ్లాదాన్ని చూస్తూ ఆకులన్నీ 
ఆనందబాష్పాలు రాలుస్తున్నాయి 
ఈ పొగమంచు వేళ.
********
భావగీతం  
పంట చేల మీదుగా 
వినిపించే ఆ గోదారి పాడే భావగీతమే 
నా జీవితం.
********
కట్టు బానిసలు  
కొందరి వికాసాలకు 
ఇంకొందరి చెమట చుక్కలు 
కొందరి వినోదాలకు 
ఇంకొకరి కన్నీటి బొట్లు 
కట్టు బానిసలు.
********
వానచినుకు  
వీడొచ్చిన ఆకాశాన్ని 
కడసారి చూడడానికని 
ఒళ్ళంతా కళ్ళుచేసుకుని 
నీటి బుడగ అవతారమెత్తింది 
ఆ వానచినుకు. 
*******
 
 

Wednesday, July 18, 2012

ఒయ్యారం

ఒయ్యారం 
ఒయ్యరమెక్కువా సెలయేటికని 
తానెంత ఒయ్యారంగా మారి దానికి 
ఆతిథ్య  మిస్తోందో చూడా కొండ.
*******
చెప్పగలవా?
ఆట లోంచి పాట పుడుతుందా?
పాటలోంచి ఆట పుడుతుందా?
చెప్పగలవేమిటోయ్?
గాలి వీచే వేళ ఆ పంట చేనును చూస్తూ.
********
అందమైన స్వార్ధం 
ఓ పక్క ఇతరుల సొమ్ము లాక్కుంటూనే 
ఇంకో పక్క తనకంత స్వార్ధం లేదని 
గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే 
తన కిందా చీకటికీ ఆశ్రయమెందుకిస్తుందా దీపం.
*********
జలపాతం 
తనను సృజియించిన మేఘాలను స్మరిస్తూ 
మరలా వాటికి రూపమిద్దామని కాబోలు 
జారుతున్న ప్రతిసారి తుషారాన్ని అలా 
గాలిలోకి సాగనంపేదా జలపాతం.
*********
వాల్జడ 
జీవితం లో ఎంతో ఎత్తుకు 
ఎదిగిపోవాలన్న నిజం ఎలా తెలిసిందబ్బా 
ఆ ఆడాళ్ళ వాల్జడలకు.
********

Tuesday, July 17, 2012

అభిసారిక

అభిసారిక 
ఆమె ఎంత అందగత్తె దానికి తోడు 
ఆపాదమస్తకమూ అలంకరించుకుందేమో 
దేనితో సరిపోల్చాలో కూడా తెలియడంలేదామెనిప్పుడు 
గతానా అంతే!
ఆమె హావభావాలెన్ని కావ్యాలకు జీవ శ్వాసలైనాయని 
ఎంతటి జ్ఞానవాహినిని ఆమె తన కనుసన్నలతో ఉప్పొంగించిందని 
అనుభవేకవేద్యమైన ఎన్ని అనుభూతులతో 
ఆగని ఈ కాలపు నుదుటి రాత రాసిందామె 
అవును! నిజమేనోయ్ 
తన ఒడిలో తానే పెరిగి విరిగే 
జీవన చిత్రమామె సొంతం మరి 
కాలం పట్టుకు పోతున్న తన అందాలను 
తిరిగి తిరిగి సంపాదిస్తూ కూడా 
తీరిక లేని నీ చూపొకటీ  సంపాదించలేక పోయానని 
బాధతో వికసిస్తూ నీ పలకరింపు కోసం 
అభిసారికలా ఎదురుచూస్తున్న ఆమె 
ఎవరో కాదోయ్ ఈ ప్రకృతి కాంత.
*********
నేతగాడు 
వెన్నెల నీడల్లో నిలబడిన 
ఆ పచ్చికలను పడుగు పేకలుగా చేసి 
నేల మీద వెన్నెల వన్నెల వస్త్రం నేయగల 
నేతగాడు ఆ గాలి.
********

Monday, July 16, 2012

హోలీ

హోలీ 
తెలుపు, ఎరుపు, బంగరు వర్ణాల మోములపై 
మందారపు వర్ణాలు అలుముతుంటే 
ఆ కారుమేఘపు వన్నె వాడి నవ్వులు 
చూస్తూ ఆ వివిధ వర్ణాల విరులు ఆనందబాష్పాలు రాల్చుతుంటే 
పుడమి గుండెనంటిన ఈ రంగుల సాక్షిగా 
పాపం నోరు తెరఛి ఆ  హోలీ 
ఒక్క రోజైనా సెలవు అడగలేకుందా బృందావనాన.
********
ప్రేమ 
అమ్మ చేతి వటపత్రాన తేలి 
ఆలి చేత తులసాకున తూగె 
ప్రేమెంత తేలిక చేసిందోయ్ 
ఆ కృష్ణుణ్ణి.
******
పబ్ 
తళుకుమనే దీపాలా తారలు 
లేజర్ కాంతులా మెరుపు తీగలు 
అడ్డొచ్చే మబ్బులన్నీ మనసుని మత్తెక్కిస్తుంటే 
ఒళ్ళు మరచి నా ప్రియురాలు, ఆ నిండు జాబిలితో 
వెన్నెల్లో నా మనసు చిందులేస్తుంటే .....
అవునోయ్ ఆకాశం నుండే ఊడిపడింది నాకని ఓ పబ్ 
మరి నీకో.........?
*********
మనసు 
పూవు మనసునా పరిమళం 
జలపాతపు మనసునా తుషారం అనువదిస్తున్నట్లు 
జాబిలి మనసును ఊగుతూ ఆ చెరువు అలలు.....
********

Sunday, July 15, 2012

వర్షరాగం

వర్షరాగం 
అందుకోలేని ఆ కొండ తాపాన్ని  
ఆగలేని ఆ మేఘపు విరహాన్ని 
ఒక్కతాటన కట్టేదే 
ఈ వర్షరాగం.
******
జాణ 
నీకై ఎదురుచూచు నా మనోసీమలందు 
నా రెప్పలనే తోరణాలుగా అలంకరింపచేసితివి 
ఔరా! నీవెంత జాణవు?
*********
వలపు గాయము 
మౌనాన 
మరింత శోభింతుమని ఎరిగే 
మూగవైనవి 
వలపు గాయమ్ములన్నీ.
******** 
రాత్రి 
ఆమె ఇంకా 
నా స్వప్నసీమలనేలుతూనే ఉందని 
పగటి అందాలను 
వద్దనుకుందీ రాత్రి.
********

Saturday, July 14, 2012

మాతృభాష

మాతృభాష 
జీవితదశల్లా 
మాతృభాష ఇప్పుడు 
వృద్ధాప్యం లోకి వచ్చిందోయ్ 
అందుకే పరాయి పంచన ఓ మూల 
తన నెలవు వెతుక్కుంటోంది.
********
రోడ్డు 
కొందరి జీవితాల్లో 
బాల్యం, ముసలితనాలకు 
చిరునామా ఆ రోడ్డు.
*******
నీవు 
ముక్కలైన ఆ మెరుపు తీగన 
వెలుగు నిలిచినట్లు 
గాయమైన నా హృదయాన 
నీవట్లే నిలుతువు.
*******
హృదయం 
వేణువూదు గానము అంత ప్రీతి నీకని 
ఏల చెప్పనైతివి నాకు 
నిలువెల్లా గాయాలతో విరబూయింతును గదా 
నా హృదయాన్ని.
********

Friday, July 13, 2012

బ్రతుకు దారులు

బ్రతుకు దారులు 
వాడిపోయిన పూలే కాదు
వికసించాల్సిన మొగ్గలు కూడా రాదారులపై
 బ్రతుకుదారులు వెదుక్కుంటున్నాయి.
********
చేవ్రాలు 
కరగబోతున్న తమ అందాలు 
నాకు చేరాలని మెరుపు తీగలతో 
చేవ్రాలు చేస్తున్నాయా మేఘాలు.
********
దీపం 
ఎన్ని చీకట్లు కమ్ముకుంటేనేం నా జీవితాన 
నా హృదిలో ఇంకా 
దీపం శ్వాసిస్తూనే ఉంది.
******
కాలం 
అందరి జీవితాలు 
వడ్డించిన విస్తర్లే 
కానీ మనసుపడి 
కొందరి విస్తర్లలో కొన్నిటిని 
ఆరగిస్తుందీ కాలం.
******
 

Thursday, July 12, 2012

చుంబనం

చుంబనం 
తాకీ తాకని ప్రియుని చుంబనంతో 
ఆ ప్రేయసికి పట్టిన  స్వేదబిందువుల్లా లేవూ 
మేఘాల చుంబనంతో ఆ కొండపై 
ఆకు చివర్లనుండి జారుతున్న నీటిబిందువులు.
విందు 
కొండంత పీటేసుకు కూర్చుని 
గోదారంత విస్తట్లో 
నిండు జాబిలి వడ్డిస్తున్న 
విందారగిస్తోంది నా మనసు.
*******
మాటల సేతువు 
మాటల సేతువుపై ఎపుడో గానీ 
చేయి చేయి పట్టి 
నడవడం లేదా మనసు, నాలుకలు.
********
కాపురం 
ఊయలలో ఊగే బిడ్డను 
కందామని కాబోలు ఊయలూగుతూనే 
కాపురం చేస్తున్నారా కలువ, జాబిలులు
వారి కలలు అలలై ఊరు ఈ తటాకాన.
********
 

Wednesday, July 11, 2012

స్పందన

స్పందన 
సింధువైనా  బిందువుతో మొదలైనట్లు 
అనంత జ్ఞాన సాగరమంతా 
చిన్న స్పందన నుండే ..........
*********
నాగరికత 
కట్టింది విప్పేసి చరిత్రని 
నాగరికతగా మలచింది 
ఆమె.
********
భావాలు 
పనికిరాని విత్తులు పైకి తేలుతుంటే 
పనికిరాని భావాలెందుకు 
అంత లోతుగా నాటుకుంటాయి 
మనసుల్లో.
********
పబ్బులు 
రాతిరికి చీకటికి మధ్య సంబంధాన్ని 
వెక్కిరిస్తున్నాయి 
ఆ పబ్బుల్లో దీపాలు.
********
 మృత్యువు
మన వైపుకు దారి చేసుకుంటూ 
వచ్చే గమ్యమే 
మృత్యువు .
********

Tuesday, July 10, 2012

ఆనంద బాష్పం

ఆనంద బాష్పం 
పారవశ్యాన  నా నెచ్చెలి కంటి నుండి జారిన 
ఒక్క ఆనందబాష్పాన్ని 
కోటి మణుగుల మేలిమి ముత్యాలు ధారవోసి 
కొన్నదా కడలి 
తన నెచ్చెలి, ఆ గోదారి  ముక్కుపుడకన పొదగడానికి.
********
జయకేతనం 
పుట్టుక చావు నడుమ జీవితం 
అనే మూడు వర్ణాలతో 
నా జాతీయ పతాకం కన్నా 
ఉన్నతంగా ఎగురుతోందా లంచపు జయకేతనం 
నా ఈ దేశాన.
********
రాతిరి 
అన్ని దీపాలను పోగేసి 
అలా వెలిగించడానికి 
పగలంత సమయం పట్టింది 
ఈ రాతిరికి.
******
కన్నీళ్లు 
పుట్టిన నాడు 
పెదవులపై పూచిన నవ్వులను 
కడుగుతున్నాయి 
పోయిన నాటి కన్నీళ్లు.
******* 

Monday, July 9, 2012

చెరువు

చెరువు 
వెన్నెల్లో తాను తేలుతూ 
ఆ జాబిలిని ఎంత చక్కగా మోస్తుందో 
చూడా చెరువు.
*******
ఇంద్రధనుస్సు 
పూలకు వర్ణాలు పంచీ పంచీ 
అలసిపోయి ఎపుడో గాని 
అలా బయటకు  రాదా ఇంద్రధనుస్సు.
********
పలకరింపు 
రావడం తోనే అందరినీ 
పలకరించడమెలాగో 
ఈ చెరువింటికొచ్చిన 
ఆ రాయిని చూసి నేర్చుకోవాలి.
*******
అద్దం 
మింగడం చేతకాక 
అన్నిటిని పట్టి వదిలేస్తుంది గానీ 
అమ్మో! నోరంటూ ఉంటేనా 
ఆ అద్దానికి ........
*******

Saturday, July 7, 2012

మనసైనవే

మనసైనవే 
కుదురు నేర్వమని అనే వాళ్ళు లేక 
ఎంత అల్లరి చేస్తుందా  పారే ఏరు 
ఆ! అవునులే కొన్ని అల్లర్లు మనసైనవే.
*******
మాధుర్యం 
శ్రుతి కుదరక 
మూగవోయిన అనురాగాల్లో కూడా 
కాలం మాయ చేయలేనంత 
మాధుర్యముంటుంది.
******
పలకరింపు 
అంత నోరేసుకుని అందరినీ 
ఇలా అరుస్తూ పలకరిస్తావా?
అని నీ కోప్పడేంతలోనే 
అణువణువును పలకరించే 
ఎన్ని స్వరాలను నేలరాల్చిందో 
చూడా ఆకాశం.
*******
ఎండుటాకు 
ముసలితనం తో కిందొచ్చి పడ్డాను కదా అని 
ముడుచుకుని ఓ చోట పడుకుంటే కాదా? ఆ ఎండుటాకు!
ఈ గాలి వేలట్టుకుని ఆ ఏటి బాట లో పడి 
ఈ షికారులెందుకో.
******
వ్యసనం 
నా ఆశలు పతంగాలు 
ఊహలు దారాలు 
ఎక్కడ పతంగాలు తెగిపోతాయో అని 
దారాలనింకా ఇంకా పేనడం 
నా మనసుకో వ్యసనం.
*******

Friday, July 6, 2012

భావగీతి

భావగీతి 
ఓ పక్క ఆ పైరుతో 
సయ్యాట ఆడుతూనే 
తాను రాసిన భావగీతిని 
భలేగా పాడుతుందా గాలి.
*****
 కన్నీళ్లు 
భావాన్ని చెప్పడానికి 
కుంచె చివరి నుండి జాలువారే ఆ రంగుబొట్లలా 
భావాన్ని చెప్పడమొస్తే ఎంత బావుణ్ణు 
ఆ కన్నీళ్ళకి .
*****
అలసట 
అలసట అంటే ఏమిటో 
తనకు తెలీదని గొప్పలు 
చెప్పుకోవడానికి కాపోతే 
పురివిప్పిన నిద్రలో తనపై 
స్వప్నాల తొలకరులను 
కురిపించుకుంటుంది నా మనసు..
******
దాంపత్యాలు 
పూలతో పోటీ పడుతున్నాయోయ్ 
దాంపత్యాలు కొన్ని 
వికసించడంలో అనుకునేవు సుమా..
******
 చివరికి 
చివరికి గానీ 
ఒకరి కోసం నలుగురు 
పోగవడం లేదోయ్..
******
 

Thursday, July 5, 2012

మట్టి

మట్టి 
మట్టి!
గుప్పెట్లో నలిగితే జీవితం 
గుప్పెట్లోంచి  రాలితే ....,
******
రెండంటే రెండే గుప్పెళ్ళతో 
నీ జీవిత పరిణామానికి  
భాష్యం చెప్పగలదీ మట్టి.
*******
వేగం 
వేగంగా అలంకరించుకుంటున్న 
మనసు నుండి  జారిపోయిన ఆభరణాలే 
అనురాగాలు, ఆప్యాయతలు.
*******
జీవితం 
శోకం పండించిన నవ్వుల పంటను 
ఆ శోకం సాక్షిగానే తుంచేయడమే 
జీవితమంటే.
*****
మొగ్గ 
మొగ్గల పై 
తుమ్మెదే వాలదే 
మరి ఈ మనుషులెందుకో.........?
******

Wednesday, July 4, 2012

ఆనంద తాండవం

ఆనంద తాండవం 
ప్రతి భావనలోనూ ఆమెనే తలపోసే నాకు 
ఆమె కన్నుల జారిన 
ఆనంద బిందువొకటి దొరికింది 
ఆ బిందువే అనంత రూపాలుగా ఈ పుడమిపై 
ఆనందతాండవం చేస్తోంది.
*******
గోదారి 
ఓ నాడు ఆకాశపు కన్య 
తారల ముందు  నర్తిస్తుంటే 
ఆమె పైట జారి వెన్నెల సంద్రాన పడి తడిచిందట 
కన్నె ఆ పైట తీయబోవ వెన్నెల సంద్రం కసిరి 
ఆ పైటను నేలకు విసిరిందట 
ఆకసపు గానం తనలో కలుపుకుని 
గలగలా సాగిందా పైట గోదారిలా 
వెన్నెలంటిన కస్తూరిలా.
********
జాబిలి 
నిండు జాబిలిని అద్దంలో పట్టి 
దాని మచ్చలపై మిణుగురులను పొదిగాను 
అంతే ఆ వెన్నెల కాంతిలో వెలిగిపోయే నన్ను 
సోదరా అని పలకరించిందా జాబిలి.
********
దీపం 
మాయం చేసిన చీకటిని 
తన కింది రెప్పగా 
మార్చుకుందా దీపం.
******

Tuesday, July 3, 2012

ఎడబాటు

ఎడబాటు 
నా కళ్ళు కరిగించే 
నీ రూపాన్ని నా మనసు 
శోషించడమే ఎడబాటంటే.
******
ప్రకృతి 
అనుభూతులు  ఆనందభాష్పాలనే 
తీర్ధ ప్రసాదాలను ఈయగలదోయ్ 
ఈ ప్రకృతి కూడా ఆ దేవునిలా.
*******
 మౌనదీవులు
 ఊహలు ఆలోచనలు 
మాటలు చేతలనే 
అపార జలరాసుల నడుమ వెలశాయి 
మనసు మనసుపడే మౌనాలనే దీవులు.
*******
విరహం 
అన్నింటా నిన్నే చూస్తూ 
నాలోని నీ రూపంతో సరిపోల్చుకోవడమే 
విరహమంటే.
******

Monday, July 2, 2012

గోపికలు

గోపికలు
తెల్ల వారుతూనే 
చల్లనమ్మబోయే గోపికలు ఆ పచ్చికలు 
వారితో ఆడుతూ ఆ చల్లను 
మాయం చేసే కృష్ణుడు ఆ సూరీడు .
*******
మూడు కాలాలు  
ఆ కొండకు పట్టిన స్వేదాన్ని 
వదిలించేలా స్నానం చేయించి 
దుప్పటి కప్పి నిద్రబుచ్చడానికే 
ఈ మూడు కాలాలున్నది.
********
శూన్యాలంకరణ 
తాను శోభించడానికి శూన్యాలంకరణ చాలని 
ఓ పక్క చెబుతూనే లెక్కకు మించిన 
ఆశలపై మోజు పడడం  
ఆ మనసుకే చెల్లింది.
*******
రూపాంతరం  
వికాసాల లేత చేతులకు 
ఆ అనుభవాల వేళ్ళు 
అందించలేనంతగా 
రూపాంతరం చెందాయా అనురాగాలు.
*******

Sunday, July 1, 2012

వాన చినుకులు

వాన చినుకులు 
కదల లేని ఆ కొండను కదిలిద్దామని 
తలో చేయివేసి అటూ ఇటూ 
నెడుతున్న ఆ మేఘాలకు పట్టిన స్వేదబిందువులే 
తొలివాన చినుకులైనాయి.
********
డైలీ సీరియల్ 
పువ్వు కి కూడా మృదుత్వాన్ని 
అరువీయగల పసిమనసుల్లో 
ఎలాటి భావాలను నాటుతున్నాయో
చూడా ముగింపునందుకోలేని ఆ డైలీ సీరియళ్ళు .
*********
విలువలు
అందరూ మాట్లాడుకుంటూ 
వాటి రెక్కలపైనే కూర్చుని 
ఎగురు ఎగురు అంటే 
పాపమెలా ఎగురుతాయా విలువలు.
*********
ఆభరణం  
నవ్వులను మించిన  
ఆభరణం ఇంకొకటి లేదని 
ఏనాడో తెలుసుకున్నట్లుందా సంద్రం 
అందుకే నురుగు నవ్వులతో తాను అలంకరించుకుంటూ 
తళుకు బెళుకు రాళ్ళు తనకెందుకంటూ నీకు ధారవోస్తుంది.
********