Monday, July 29, 2013

సాహసం

సాహసం
నా సాహసం 
ప్రియురాలి
 బుగ్గ ఎరుపు
****
మెరుపు
పేదవాడి 
ఆనందం
ఆకాశంలో మెరుపు
****
రంగవల్లి
రోజు రోజుకు 
 చెరిగిపోతున్న రంగవల్లి 
అడవితల్లి
****
కొత్త అత్తరు
మార్కెట్ లో 
కొత్త అత్తరు 
మట్టివాసన 
****
పరిణామం
అమ్మ గర్భం 
అద్దెకు 
ష్!.... పరిణామం 
*****
నూత్నదాంపత్యం
ఆమెతో ఆమె 
నాతో నేను 
నూత్నదాంపత్యం 
****
గూళ్ళు 
పిచ్చుకల గూళ్ళు 
పురాణేతిహాసాలు 
****
మూడ్
చావు, పుట్టుక, లంచం 
జీవితానికి 
'మూడ్' ఉండాలోయ్ మరి 
******

Thursday, July 25, 2013

శ్యామలధ్వజం

శ్యామలధ్వజం
శ్యామలధ్వజాన్ని 
పైకెత్తాయా చేలో 
చేయి చేయి పట్టి ఆ వానచినుకులు. 
*******
కొబ్బరాకు
వెన్నెల పట్టాభిషేకం చేసిన 
నా పెరటి తోటకు 
మకుటమై తానమరిందా కొబ్బరాకు ఛాయ. 
*******
లోటు
ఆమె మోస్తున్న కడవలోకి తొంగి చూస్తూ 
తనకు కాళ్ళు లేని లోటును 
పూడ్చుకుందా ఆకాశం. 
********
ముఖాముఖి
అదేమిటో! మాటలు సాగవు 
మౌనాలు మిగలవు 
నేను నా మనసు ముఖాముఖి ఎదురుపడినపుడు. 
********
ఎవరో!
ఆదమరచి  హాయిగా నిదరోతున్న 
ఆ తోటలోని అందాలపై అన్ని ముత్యాలు చల్లి
తెల్లారకుండానే నిద్ర లేపిందెవరో!
*********

Saturday, July 20, 2013

రాదారి

రాదారి
నిదురన్నది కూడా పోకుండా, తను చెప్పే ఊసులన్నిటినీ
 కదలక కూర్చుని వింటున్న ఆ మైలురాళ్ళ గొంతుతో 
తాను బదులిస్తుందా రాదారి!
చేరాల్సిన దూరమెంతని నేనడిగినప్పుడల్లా. 
********
సంస్కృతి
రంగురంగుల దీపాల కాంతులు 
తనను చీకట్లోకి సాగనంపుతుంటే 
నా కనుజారే కన్నీటిబొట్టుతో 
తాను సాగిపోతోంది నా దేశ సంస్కృతి 
ఆ పబ్బుల పుణ్యమా అంటూ. 
********
కాటుకరేఖ
దిద్దుకునే కాటుకరేఖ 
నల్లగానే ఉండాలా అంటూ 
అడుగుతుందా ఆకాశం 
కారుమబ్బుల కన్నులతో ఉరిమి చూస్తూ. 
********
జ్ఞాపకాలు 
అంతరంగం కడలై 
కన్నీళ్లు అలలైతే 
అందు మేలిమి ముత్యాలు కాదా 
నీ జ్ఞాపకాలు. 
*********

Monday, July 15, 2013

ఆశ

ఆశ
నానిన ఎన్నో చొక్కాల తళుకులద్దుకుని!
తాను మెరిసి మాయమైపోయింది ఆ చొక్కా!
ఆశ పడకూడదా శ్రమలంటూ. 
********
గోదారి 
ఉన్ననాడా చేలో, లేనినాడా ఇసుకతెన్నెలపై
కమనీయంగా విందునొడ్డించి 
తానెంత మనసున్నదానినో 
చూడమంటుందా గోదారి. 
*******
అనుభవాలవిందు
కడుపునిండా తినకుండా 
తనకు తానే ఎంత బరువై తోచిందో,
కడుపునిండుగా మెక్కి 
తానంత తేలికైపోయింది నా మనసు!
అనుభవాలు విందు చేసే వేళ. 
*********
విలువలు 
వినోదాల విపణి వీధులకి!
హరివిల్లు వర్ణాలద్దుతున్నాయి 
తాము వివర్ణమై ఆ విలువలు. 
*********

Tuesday, July 9, 2013

చెలిమి

చెలిమి
చీకటితో! రాతిరి చేసిన చెలిమికి 
అక్షర రూపమీయడానికి 
సిరా చుక్కలుగా, ఆకు చివర్లనుండి జారుతున్న 
నీటిబొట్లను పోగేసిందా వనం. 
*********
సమాధులు 
అందమైన సౌధాలెన్ని!
సమాధులై వెలిశాయో చూడు!
తొలకరినాటి మట్టి పరిమళంపై. 
********
పాతివ్రత్యం
నాడగ్గి దూకిన 
పాతివ్రత్యం నేడు
ఆమ్లాన క్రాగుతోంది. 
******
ఏడడుగులు
లోకకళ్యాణం కోసమంటూ 
ఏడడుగులు వేస్తున్నారా నేతలు!
అవినీతితో. 
*******
ఉరితాళ్ళు 
వలువలు జారి 
ఉరితాళ్ళయినాయోయ్
విలువలకు. 
******

                                                                                                                                                                                                          

Thursday, July 4, 2013

స్వప్నాలు

స్వప్నాలు
నే కన్న కలలన్నీ కరిగి 
కనుజారి అలలైనాయని తెలిసి 
చూడా సంద్రం తను కన్న 
స్వప్నాలనెలా దాచుకుందో, ముత్యాలుగా. 
********
స్వేచ్ఛ
తనను అణచి కూడా 
ఆకాశమంత స్వేచ్ఛనిచ్చింది 
ఈ మన్నేనని కాబోలు 
మానైనా ఈ మన్నునొదలదా విత్తు. 
********
బాల కార్మికులు
చమురంతా బయటకే ఒలుకుతుంది కనుకే 
చీకటిని గడప దాటించలేని దీపాలు 
ఆ బాలకార్మికుల నయనాలు . 
********
ఆచారాలు
మెట్టినింటి ఆచారాలను 
ఎంత అలవోకగా నేర్చుకుంటుందో చూడా నది 
సాగరాన్ని సమీపిస్తూనే. 
*********