Follow by Email

Saturday, June 30, 2012

దాంపత్యం

దాంపత్యం
రేపటికి వాడిపోయే పూలతో 
క్షణానికి ఇంకిపోయే సిరాతో 
సరిపెట్టుకుంటుంటే ఆ పెళ్లి తంతు 
తానేమో రోజులు లెక్కెట్టుకుంటుందా దాంపత్యం .
*******
ఇరువురు యోధులు  
ఆశయాలు వేరైన ఇద్దరు మహా యోధులను 
ఎదురు పడనిచ్చి కూడా 
రవ్వంతైన అలజడి రేగకుండా 
నిదుర దారినొకరిని స్వప్నపు దారినొకరిని 
సాగనంపే ధీమంతురాలు నా మనసు.
********
నెలవంక-నిండు జాబిలి  
ఎపుడైనా నెలవంకను  నిండు జాబిలిని 
 కలిపి ఒకేసారి చూసావేమిటోయ్ లేదా 
ఐతే నిదురలో లీలగా నవ్వుతున్న 
ఆ పసివాడి మోమునోసారి చూడు.
********
ఆత్మీయత  
అన్వేషణ ఆత్మీయతను పెంచితే 
ఆ ఆత్మీయతను 
పంచుతుందా అనుభవం.
*******

Friday, June 29, 2012

ప్రణయం-ప్రళయం

ప్రణయం-ప్రళయం 
ప్రణయానికైనా ప్రళయానికైనా తానే దిక్కని 
ఆ పువ్వుతో ఎలా ఆటలాడుతోందో 
చూడా గాలి 
అచ్చమా అతివతో ఆడుకునే అతగాడిలా.
********

తడిసిన మనసు 
ఆ తుషారం వెనుక షికారెళ్లి 
తడిసిన నా మనసు
తననారబెట్టుకుంటోంది చూడా ఎండమావిలా.
*******
స్వప్నం  
నిద్రకు  చెవులు లేవని 
తనకు పెదవులు 
వద్దనుకుందా స్వప్నం .
*******
తెలుసనుకున్నా  
ఇవ్వడమే తెలుసనుకున్నా 
ఆ కడలికి  చెలీ!
నీ పాద ముద్రలు మాయం చేసే దాకా. 
*******

Thursday, June 28, 2012

జలపాతం

జలపాతం 
వానచినుకిచ్చిన హాయిని 
మరువలేకే కాబోలా కొండ 
ఆ జలపాతాన్ని అలా సాగనంపి 
తుషారాన్ని మీదకొంపుకునేది.
*******
కాలిబాట  
చూపినట్టే చూపి చిటికెలో 
ఆ కాలిబాటనెలా మాయం చేసిందో చూడు 
మేఘాల మధ్య ఆ మెరుపుతీగ.
********
  మహావృక్షం  
వేరు కాండము ఉండి 
పత్రాలనేవే లేకుండా 
ఇంత ఒత్తుగా నా గదినిలా కప్పిన 
ఈ దీపపు మహావృక్షాన్ని 
ఆకులన్నీ కన్నులు చేసుకుని 
విస్తుపోయి చూస్తోందా మాను.
*******
పనిపసోడు  
రోజుకెన్ని సార్లో ఆ ముత్యాల పంట 
కాపుకొచ్చి రాలుతుంది 
ఈ పనిపసోడి ఒంటి మీదుగా 
కనీసం ఆ  పంటకైనా  
గిట్టుబాటు ధర ఇవ్వదెందుకోయ్ ఈ లోకం.
*******


Wednesday, June 27, 2012

ఎడబాటు

ఎడబాటు  
ఎడబాటు  తీరబోతోందన్న భావాన్ని 
తడబడుతూ కూడా 
ఎంతందంగా  చెప్పగలదా నది.
********
  సీమంతం
తన మీది చిటారు కొమ్మకు సీమంతమంటూ 
ఎండుటాకుల శుభలేఖలొదిలెనా  మాను అడవి సెలయేటిలో 
అందుకున్నదే తడవు ఆ ఏరు 
అడవి మానుల గడపలెల్ల వదిలెనాలేఖ 
లేఖనంది సంతసమొంద ప్రతి మాను
తన గూటిలోనే గువ్వలనాయింటి పెరంటానికంప 
గువ్వలంత  ఆ మానింట ఎన్ని దీవెనలిచ్చిరమ్మ 
ఫక్కుమని నవ్వ కొమ్మ ఎన్ని చివురులు తొడిగెనమ్మ.
********
కనువిప్పు
ఎవరికో కనువిప్పు కలగాలని 
తీగలను చుట్టుకుని మరీ 
ఒంటిని దాచుకుంటుందా మొక్క 
ఎవరికైఉంటుందంటావ్?
*******
మనసు రూపం  
ఆ తామరాకు మీది నీటిబొట్లను 
చుక్కలుగా కలుపుతూ రంగవల్లిని 
రచిద్దామనుకుంటున్నావేమిటోయ్ 
ఎపుడైనా ఓ సారి ప్రయత్నించు 
నీ మనసే రూపంలో ఉంటుందో 
నీ కళ్ళకు కనబడకుంటే నన్నడుగు.
*******

Tuesday, June 26, 2012

చిరునవ్వు

చిరునవ్వు
మనకన్నా ఎక్కువగా పడుతూ లేస్తూనే 
ఎంత అందంగా నవ్వగలదు ఆ అల 
మరి నీవేమిటోయ్ 
చిరునవ్వుని గతజన్మ లోనే వదిలేసినట్లు 
ఎప్పుడూ అలా ........
******
నీడ
ఎప్పుడో గానీ కన్నెత్తి చూడనా 
ఐనా గానీ అది ప్రతి క్షణము 
నన్నే కనిపెట్టుకుని ఉంటుందోయ్ 
నిజంగా అనుబంధమంటే 
నాదీ నా నీడదేనోయ్.
*******
ఒయ్యారం
మేఘాల్లో దాగిన 
ఆ నదీ యవ్వనాన్ని 
ఆడుతూ పట్టుకొచ్చేసిందా మయూరం 
ఇక చూడా నది పొంగులు.
******
ఆంగ్లం
మనదన్న దాన్ని మింగేస్తూ కూడా 
మనతోనే కొనియాడబడడం 
ఆ ఒక్క ఆంగ్లానికే చెల్లు.
******

Monday, June 25, 2012

కారు మేఘాలు

కారు మేఘాలు 
మౌనం తప్ప ఇంకో భాష తెలీదన్నట్లు 
ఎదురు బదురు చూసుకుంటూనే 
రోజులు గడిపేస్తున్న ఆ నింగి నేలలను 
కలిపే బాధ్యత భుజాన వేసుకుని 
కరిగిపోయాయా కారుమేఘాలు.
******
తామరాకు
నేలను 
తామరాకును చేసే 
నీటిబొట్టు నా నీడ.
******
తోరణం
నా ఏకాంతాన్ని పంచుకుంటూ
ఆ వెన్నెల ఇంకా ఇంకా వెలిగిపోతుంటే 
వలపు పేరంటపు తోరణాన్ని 
ఎంతందంగా కట్టిందో చూడా కలువ 
నా కనుదోయి వాకిట.
*******
ఏమనాలో ..
అది పాపిట రేఖో 
కంట హారమో 
వడ్డాణమో లేక
మురిసా ప్రియుడు పెట్టిన 
మువ్వల పట్టీయో చెప్పలేకున్నాను 
నీవైనా చెప్పవోయ్ 
ఆ కొండను చుట్టుకుని పారుతున్న 
ఈ నదీ పాయ నేమనాలో 

Sunday, June 24, 2012

మహాసంగ్రామం

మహాసంగ్రామం 
మనసు దొరకబుచ్చుకోవాలనుకునే 
ప్రతి నిశ్శబ్దం వెనుక 
సమాప్తాన్ని కోరుతున్న 
ఓ మహాసంగ్రామమేదో ఉండే ఉంటుంది.
*******
కొబ్బరాకు
గాలి వాటున నాపై 
వెన్నెల వస్త్రం నేసే నేతగాడౌతుంది 
నా పెరటి కొబ్బరాకు 
ఇదిగో ఇలా.....
******
ఆధునిక కాపురాలు
ఐతే  నిశ్శబ్దం లేకుంటే రాద్ధాంతం 
అనే రెండు సేతువులే అనుసంధానిస్తున్నాయి 
కొన్ని కాపురాలనీమధ్యన.
*******
నిషా  
చెమట చుక్కల సౌందర్యాన్ని 
ఆకలి కన్నా ఎక్కువగా 
ఆస్వాదిస్తుందా నిషా.

Saturday, June 23, 2012

బృందావనం

బృందావనం
అక్కడ కోయిల పిలుపులు లేవు 
తేటిని పిలిచే పూవులు లేవు 
కానీ ఆ వనాన నిత్య వసంతం 
కొలను లేదు కలువలు లేవు 
కానీ నిత్య పూర్ణిమ ఆ తీర ముఖచిత్రం 
అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి 
పాదాలు కదిపే పడుచులాటలో 
నిదురన్నది మరచి రాతిరి 
ఆ నల్ల వాడి రంగైందేమో.
********
వైభోగం  
విరులన్నిటికీ రంగులిచ్చి 
ఆ విలాసమేల  తనకీయలేదటంచు 
వాపోయిన ఆ గడ్డి పూవుకు 
ఘన వైభోగమే ఇచ్చిందా ప్రకృతి 
తుషారబిందు స్నాన శ్రీమంతినిగా .
*******
నిశ్శబ్దం
రాతిరి నిశ్శబ్దాన్ని పదిలంగా దాచి 
పుడమి గుండె తలుపులు తడుతున్నాయి 
ఆకులపై నుండి జారే 
మంచు బిందువులతో ఆ చెట్లు.
*******

Friday, June 22, 2012

బోసినోరు

బోసినోరు
నిజానికి బోసి నోట్లోనుంచే 
సెలవు తీసుకుంటున్నాయి 
స్వచ్ఛమైన చిరునవ్వులన్నీ.
******
ఆత్మీయత
మౌనంగా మొదలై 
స్వర స్థాయిని పెంచుకుంటూ 
మూగావోయేవే ఆత్మీయతలన్నీ.
*******
వలపులాట  
ఓడినాగానీ నా మనసు 
విజయపు పూర్ణాలింగన స్పర్శను 
అనుభవించేది 
నీతో ఆడే ఆ ఒక్క వలపులాటలోనే.
*******
ఆనంద భాష్పం 
పూవులన్నిటిలోని ఆ మధువును తూచే 
తులసాకు నా ఒక్క ఆనందభాష్పం అని 
చెప్పగలిగే కన్నులేవి ఈ పరుగెత్తే ప్రపంచాన.

Thursday, June 21, 2012

పెళ్లి విందు

పెళ్ళి  విందు 
నీలి మబ్బుల మాటుగా 
ఆయన పై నుండి తలంబ్రాలు పోసాడు 
ఈమె గారు కింది నుండి 
పచ్చలు పైకెగరేసింది 
ఇంకేముంది పసందైన పెళ్ళివిందు 
పరచుకుంది చూడు కనులముందు.
********
ధీమంతురాలు
ఊహలు స్వప్నాలతో 
ఓ వైపు తప్పటడుగులు వేస్తూనే 
ఇంకో వైపు అనుభవాల చేతికర్ర ను వదలని 
ధీమంతురాలు నా మనసు.
*******
కలసిన మనసులు 
మనసులు కలిసేలా 
మాట్లాడుకోవడం ఎలాగో 
కేవలం ఆ చీకటికి దీపానికే తెలుసు.
******

Wednesday, June 20, 2012

జ్ఞాపకం

జ్ఞాపకం 
క్షణం తీరిక లేకుండా 
స్వాగతాలు సాగనంపడాలతో 
సతమతమౌతూ కూడా 
నేనొచ్చానన్న జ్ఞాపకాన్ని 
ఎంత అందంగా ముద్రించుకుందో 
చూడా తీరం.
******
బీడు
మనసు కరిగించే మధుర గానాన్ని 
వినిపించబోతోందా ఆకాశమని కాబోలు 
ఒళ్ళంతా చెవులు చేసుకుందా బీడు.
*******
నాగలి
ఆకాశం నచ్చచెబితే బెట్టు సవరించి 
మెత్తబడిన ఈ చేలో 
ఎంత అందంగా ముగ్గేసిందో చూడు 
ధాన్యలక్ష్మిని ఆహ్వానిస్తూ ఆ నాగలి.
*******
గాంధీ
తప్పని ఓ పక్కన చెప్పి కూడా 
కన్నీటిలోంచి అత్తరు లోకి 
నవ్వుతూనే పోతున్నాడా గాంధీ.
******

Monday, June 18, 2012

ఎదురు చూపులు

ఆధునికత అనురాగాలకు పెట్టిన 
అదనపు ఆభరణమే 
ఈ ఎదురుచూపులు.
******
మౌనానికి కూడా అవసరమైన 
మాధుర్యమేదో సాధించాలని 
ఐక్యమైనవే నీ నా మనసులు.
*******
 వర్తమానం లోని నా కృషికి 
గతం 
మంత్రిత్వం చేస్తుంది.
*****
నేనిచ్చిన దానికన్నా 
ఎక్కువ విలువీయగలదు 
నా ఊపిరికా పిల్లనగ్రోవి.
******

Sunday, June 17, 2012

స్వేచ్చ

తనను అణచి కూడా 
ఆకాశమంత స్వేచ్ఛనిచ్చింది 
ఈ మన్నేనని కాబోలు 
మానైనా  ఈ  మన్నునొదలదా  విత్తు.
*******
నే కన్న కలలన్నీ కరిగి 
కను జారి  అలలైనాయని  తెలిసి 
చూడా సంద్రం 
తానుకన్న స్వప్నాలనెలా  దాచుకుందో 
ముత్యాలుగా .
*******
మనకైతే కళ్ళ  నుండి 
ఆ మేఘాలకైతే ఆకు అంచుల నుండి 
జారతాయా ఆఖరి జ్ఞాపకాలు.
******
చూపుడు వేలిని చుట్టుకుని 
ఆ ఐదు లేత వేళ్ళు షికారుకు రావడం 
అప్పుడప్పుడూ లీలగా చూస్తుందీ లోకం.
*******
వియోగాన్ని కూడా 
మెరుపు లాటి మనసుతో ఆస్వాదించడం 
నీకే చెల్లిందని నేను అభినందించేంతలో 
ఎంత బిగ్గరగా ఏడుస్తుందో చూడా ఆకాశం.
********

Saturday, June 16, 2012

చీకటి గుణం

అమృతం ఉదయించగానే 
దేవతలకు అబ్బిన 
చీకటి గుణమా స్వార్ధానికి 
వారసులమే మనమందరం.
*******
నిన్న మొన్నటి అనుభవాల 
మాటెందుకు వింటాయి 
నేటి చాటు మాటు అనుభూతులు.
*******
 మానవ జీవన యాంత్రీకరణలో 
ఇంధనాలైపోతున్నాయి 
పాపమా అనురాగాలు.
*******
వయసవకుండానే 
లెక్కకు వస్తున్నాయి 
కొందరి తల వెంట్రుకలిప్పుడు.
********

Friday, June 15, 2012

అద్దం

ఏది కనబడినా ఇట్టే మింగేసి 
తానెంత ఆకలి మీదుందో 
భలే చెబుతుందా అద్దం.
*****
ఊహల్ని మేపే 
మౌనాలేనోయ్ 
అందరివి.
*****
దీపాల్లా వెలిగే కన్నులే 
ఆ బాలలందరివి 
కానీ ఆ కాంతితో మెరిసే మోములెందరివి?
*******
మారణహోమాలు సాయపడినంతగా 
మేధస్సు సాయపడలేదు పాపం 
మలుపు తిరగాడానికా చరిత్రకి.
*******

Thursday, June 14, 2012

గాలానికి చిక్కిన చేప

గాలానికి చిక్కిన చేప 
మనసారా హాయిగా నవ్వుతుంది 
లైన్ లో నిలబడిన 
ఓటరును చూసి.
*****
విత్తంత సొత్తు నే దాస్తే 
వడ్డీ కట్టడంలో ఆ వేంకటేశ్వరుడినే  
మించిపోయిందీ  పుడమి.
******
కొన్ని వానచినుకులకే 
ముత్యపు భాగ్యం దక్కుతుంది 
కొన్ని కన్నీళ్లకే కోరింది దక్కినట్లు.
******
తన రూపు కరిగినా 
ప్రియుడింటికి ఎన్ని 
ఒయ్యారపు  గలగలలను 
కానుకిచ్చిందో చూడా మేఘం.
******

చిరునవ్వు

దీపానికి కూడా 
వెలుగును  అరువీయగలిగేది 
నీ చిరునవ్వే.
*****
మౌనమంటే విసిగి ఆ ఆకాశమే 
మెరుపునాహ్వానించుకుంటే 
నీవో చిరునవ్వును కూడా.....?
******
సందిగ్ధత అనే 
గీత వెనుక 
ఎంత జ్ఞానసాగరమాగిపోయిందో .
*****
అవసరాన్నిబట్టి విరుస్తూ 
జీవిత మాధుర్యాన్ని 
ఎంత అందంగా వెక్కిరిస్తున్నాయో 
పెదవులు.
******

Tuesday, June 12, 2012

మృత్యువు

తన కౌగిలితో కొందరికి 
స్వేచ్ఛ  విశ్రాంతులను 
అదనంగా ప్రసాదించగలదా మృత్యువు.
******
గాంధీ గుట్టల మీద 
వెలసేవే నా దేశంలో 
ఎన్నికల సౌధాలన్నీ.
******
కొండలు, గనులు, పొలాలు 
ఏమిటంటావ్  ఇవి 
మా నేత తినే 
భోజనంలో కూరలోయ్.
******
దగ్గరై  దూరమై ఆ అనురాగాలు 
మనసుని సంద్రం చేయగలవనడానికి 
ఋజువులే  కన్నీళ్లు.
******

Monday, June 11, 2012

అభినందన

నిద్రనిచ్చిన నిశ్శబ్దాన్ని 
ఎంతందంగా అభినయిస్తున్నాయి 
లేస్తూనే ఆ పక్షులు.
******
కరగకుండా ఆ నెమలికి 
కరిగీ వాగుకి  ఆట నేర్పేదే 
కారుమేఘం.
******
వేదాంతిననిపించుకోవాలని 
చీకటి సారస్వతాన్ని 
పదే  పదే  వల్లె వేస్తుంది 
ఆ కీచురాయి.
*****
వయసుతో సంబంధం లేకుండా 
శివునికన్నా ఇంకో నయనాన్ని 
అదనంగా సాధిస్తున్నారు కొందరు.
*******

Sunday, June 10, 2012

సంక్షేమం

పేదల జీవితాల్లోంచి 
ఏనాడో కాగితాల మీదకు 
జారుకుందా సంక్షేమం.
*****
అణచివేతతో  అలజడితో 
ఏ ఆత్మీయతా రాదని 
అంటున్నాయా పూలు సుడిగాలితో.
******
కాలి వేళ్ళపై పడి 
దీవెనలందే  ఆ వాగుని 
మనసారా దీవిస్తున్నాయా మానులు 
అక్షతలుగా ఎండుటాకులు రాల్చుతూ.
******
బ్రతికున్నంత కాలం 
కారాగారాల్లో గడిపి 
తరువాత రూపాయి నోట్లపైకెక్కి 
మా నేతింటికొచ్చి 
అజ్ఞాతం లోకి వెళ్తున్నాడా గాంధీ 
పాపం వెలుగు చూసేదెపుడో .
*******

Saturday, June 9, 2012

నలక

అనురాగామంటూ  ఓడితే 
మనసులో
నలక పడినట్లే.
****
ఆనక సాధించే ఫలితంలో 
కావాలా పిల్లలే నా కోపమూ 
ఆ సాయం సంధ్య.
****
జోల పాడా చేనుని 
సాకే కన్నా తల్లి 
ఈ పంట కాల్వ.
****
గాలి తనను 
ఊయలలో పిల్లాడిని చేసినా 
శత్రు సంహారం మాత్రం ఆపనంటూ 
చూడా దీపం ఎలా.......
****

Thursday, June 7, 2012

విప్లవం

ఆ చిన్న రాయికి 
నేనిచ్చిన స్వేచ్ఛ 
ఎంతటి విప్లవాన్ని 
లేవదీసిందా చెరువులో.
*******

రెప్పలు చిలికే 
స్వప్నాలకు 
ఊహలని పేరు.
*****
ఆఖరికి అడిగి లోనికి వెళ్ళాల్సిన 
అగత్యమేర్పడిందా  కిరణానికి 
ఈ అపార్టుమెంటుల పుణ్యమా అంటూ.
*******
వానచినుకు సందడిని మళ్ళీ మళ్ళీ 
పరిచయం చేస్తుందా చెరువుకి 
ఎగిరెగిరి పడుతూ ఆ చేపపిల్ల.
******
ఎడ్ల గిట్టల 
చప్పుడునా పంటచేను  మరచినట్లు 
పిల్లల పద ఘట్టనలను ఏనాడో 
మరచిపోయిందా కాన్వెంటు ప్లే గ్రౌండ్.
******

Wednesday, June 6, 2012

మృత అభిసారికలు


కదులుతాయి కన్నీరు కారుస్తాయని శవాలనం గానీ 
వాటికన్నా గొప్పవేమీ కాదు 
ఆటవిడుపు వాంఛలు తీర్చే వారి దేహాలు
సానుభూతంటే ఎరుగని సహనం వారి సొంతం 
దేహాలపై గాయాలెన్నో విరబూసినా 
వాటిలో కూడా మధువునెతుక్కునే
తుమ్మెదల రూపాలను 
కన్నీటితో కడుగుతూ మరో తేటిని వెదికేందుకు 
ముఖం పై నవ్వు దీపాలను వెలిగించాల్సిందే 
భాగ్యము వారిది కాదంటూ వారి కన్నీళ్లు 
చెప్పకనే చెబుతున్నాయి 
ఐనా అర్ధాలతో మనకు పనేమిటోయి అందాలతో గానీ 
రా వారి దేహాలపై నీ కోర్కెల పంజా విసురు 
చిమ్మిన వారి రక్తాన్ని అత్తరుగా పూసుకుని 
ఆమె వెచ్చని కన్నీళ్లు ఆ అత్తరు ఘాటును 
తగ్గించక ముందే  
నీ పురుష సుగంధాన్ని ఈ నాగరిక లోకానికి చూపు 
భయపడకోయ్ ఓ రోజాకలి తీర్చిన 
నిన్నెందుకామె  శపిస్తుంది
అయితే గియితే ఆమె రాతనలా రాసిన ఆ దేవుణ్ణి తప్ప 
ఐనా మగాడిని శపించడం ఏ ఆడదాని కన్నీళ్లకొచ్చు.
******* 

Tuesday, June 5, 2012

ఊహ

నిజమవ్వాలంటూ 
తనకు తానే రాసుకునే రాతను 
ఆ విధాతకు కూడా నేర్పిస్తే 
ఎంత బావుణ్ణు  నా ఊహ.
******
అలజడిని 
పోగేసుకోవడంలో పోటీ పడేవే 
మనసులన్నీ.
******
చావు పుట్టుక 
పగలు రాత్రి 
వెలుగు చీకటి 
వేటి వ్యతిరేకాలు వాటికున్నాయని 
నాకు వ్యతిరేకమైంది నా మనసు.
*******
వెలుగప్పుడప్పుడూ ఈర్ష్య పడుతుంది 
చీకటి అప్పుడప్ప్పుడూ భయపడుతుంది 
నా మనసు లోతుల్లోకి చూసి.
******

Monday, June 4, 2012

నా మనసు

తన సొంతమైనట్లు నా మనసులోకి దూరి 
నావైన కొన్ని ఆనందభాష్పాలను 
తన గుండె లోతుల్లో మకరందంలా మార్చి 
చివరకా పూవు తుమ్మెదకు ధారవోసేది నా మనసునే.
********
కడుపు నింపిన ఆ ఆకాశానికి 
ఎంత మృదువుగా 
చిగురు గొంతు విచ్చి 
ధన్యవాదాలు చెబుతుందో 
చూడా మాను.
*******
కొన్ని కోపాలు కాసిని ద్వేషాలు
కొన్ని ఊహాకుసుమాలు కాసిని మాయని గాయాలు 
అంతే మానవ జీవిత నాలుగు పార్శ్వాలు.
********