Thursday, September 22, 2016

తొలిమెట్టు



నిండైన దానిని
సన్న సందిచ్చి, చూడనిచ్చి!
బాణమే మదిని గుచ్చి
ప్రాణమే తిరిగి ఇచ్చి !
తనువంత బంగరు పూతతో
పున్నమిన తను నిల్చి !
చిరుగాలి చెలిమితో
వింజామరలెన్నొ నాకై వీయించు
నా పెరటి కొబ్బరిచెట్టు
నిండు జాబిలింటి తొలిమెట్టు 

Wednesday, September 21, 2016

మినీ కవితలు

 

క్షణానికోసారి పండినా!
గంప కెత్త వీలుకాదేమి?
ఆ నీటి మణుల పంట!
ఈ కొలను తామరింట.
*********
మినుకు తారల తోటి
మిణుగు పువ్వుల పోటి
రెప్ప వాల్చక చూసెడి
కన్నుల కెయ్యది సాటి!
**********

Friday, September 16, 2016

స్వార్దామృతం

  

  కోట్లకు పడగలెత్తావు. చూడ చక్కని కుటుంబం నీది. కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్లు, ఆహా! నీ భోగం ఆ దేవేంద్రుని భోగమే అనుకో! కాని ఏమి చేస్తావ్.? నీకున్న స్వార్ధంతో నా అనుకున్న వాళ్లకు తప్ప ఎవ్వరికీ సాయం చేసి ఎరుగవు. ఎంగిలి చేతితో కాకిని తరమవు అన్న కీర్తి సంపాదించావు. ఆఖరికి భగవంతుడినైన నన్ను కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు. లోకం నిన్ను స్వార్ధపరుడని అంటే అంది గాని నీ కోసం నీ భార్యాబిడ్డల కోసం అనుక్షణం పాటు పడిన వాడివిగా నీ కృషి అనన్యసామాన్యం.  అలాటి కోవకు చెందిన వారిలో ఎన్నదగిన వాడవు నువ్వు . అందుకని నీ కోసం రెండు ప్రత్యేక వరాలను ఇవ్వ దలచి ఇలా వచ్చాను అన్నాడు భగవంతుడు ఆ గది లోని ఆ వ్యక్తితో.
      అప్పుడు ఆ వ్యక్తి ఏమిటి స్వామీ ఆ వరాలు అన్నాడు. అప్పుడు భగవంతుడు నాయనా! నువ్వు ఎప్పుడు చనిపోతావో? మొదటి వరంగా నీకు చెబుతా. అంతే కాదు తరువాత జన్మలో నువ్వు ఎక్కడ ఏ తల్లికి పుడతావో రెండవ వరంగా చెబుతా అన్నాడు.
          అలాగా చెప్పు స్వామి అన్నాడు వాడు. దేవుడు ఆ రెండు రహస్యాలను వాడికి చెప్పి నాయనా ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావో చూడాలని ఉంది అన్నాడు . చేసేదేముందిలే స్వామీ! ముందు మీరు దయచేయండి అన్నాడు వాడు. దేవుడు మాయమయ్యాడు.
        చచ్చే రోజుకు ముందుగానే వాడు యావదాస్థిని  చిల్లి గవ్వ పోకుండా జాగ్రత్త చేసుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. దూరమైన వాళ్లు దూరంగానే ఉన్నారు. పెళ్ళాం బిడ్డలు మాత్రం ఐనోళ్ళ మైన మాకు పూచిక పుల్ల కూడా ఇవ్వకుండా యావదాస్థినీ ఎవరో ఊరూ  పేరూ  లేని దాని పేరిట రాసి చచ్చాడీ వెధవడు అంటూ వాపోతున్నారు.
    అప్పుడు దేవుడికి గురుతొచ్చింది. ఈ పిల్ల కడుపునేగా తరువాతి జన్మలో వీడు పుడతాడని చెప్పాను. అందుకని వీడి స్వార్ధం వీడికి ఐన వాళ్ళ మీద కూడా పనిచేసిందన్న మాట.
అమ్మో ! నేను అవకాశమివ్వక గాని ఎవ్వడూ కూడా పోగేసి తన వాళ్లకు కూడా ఇవ్వడన్న మాట! అని అనుకున్నాడు

Saturday, September 3, 2016

మన మతికి బహుమతి

ఊడని బొడ్డు, నీకూడిగం  చేసే, 

ఊరేగే పాడే నీ ప్రాభవం చాటే 

ఎంత పచ్చని బ్రతుకే నీది.
మాకు
ప్రాణవాయువు కన్నా మిన్నవు నువ్వు
జీవనాడి కన్నా మేటివి నువ్వు
రాయగలేక కలములే అలసిపోయిన చరితవు నువ్వు!
కన్నీళ్ళు కరిగించలేవు నిన్ను
వెతలు కదిలించవు నిన్ను
విందౌ! అవే నీకు!
ఇంట స్కాములుగ గెలిచి
నల్ల రొచ్చుగ దేశం విడిచిన
నీ కీర్తి కిరీటానా
భరత మాత కన్నీళ్ళే కలికితురాళ్ళు !!!!!!!!!