Follow by Email

Friday, September 28, 2012

ప్రణయ సామ్రాజ్యం

ప్రణయ సామ్రాజ్యం 
చూపులకు మాటలు నేర్పి 
మనసులేమో మౌనంగా 
ప్రణయ సామ్రాజ్యాన్ని 
ఏలుతున్నాయా బృందావనిలో.
********
వేగం 
చీకట్లోకి వెళ్దామనేనేమో 
కాంతి కన్నా 
ఎక్కువ వేగాన్ని సంపాదిస్తున్నాయి 
మనసులీమధ్యన.
******
సంచార దర్పణాలు 
నాడు ఆడవాళ్ళ నెత్తి మీదెక్కిన 
కడవల్లోకి తొంగి చూస్తూ 
తన అందాన్ని చూసుకున్న ఆ ఆకాశం 
నేడు సంచార దర్పణాలుగా మారిన 
కొందరి మగాళ్ళ.......
********
కురులు 
అలల అందాలను ఇద్దామంటే 
ఆ పాటి కురులేవీ ఆడాళ్ళకంటూ 
పాపం ఉసూరంటూ సాగుతుందా గాలి.
***********

Thursday, September 27, 2012

అద్దం

అద్దం 
నవమాసాలు మోయకుండా 
కాస్తంతైనా పురుటినొప్పులు పడకుండానే 
నవరసాలొలికించే నన్నెన్నిసార్లు ప్రసవించిందో 
నా ఇంటి అద్దం.
******
స్వేచ్ఛ 
స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగితే 
తన రెక్కకు నా రెప్పను 
బంధీని చేసిందేమిటో ఆ పిట్ట.
********
నీడ 
వెలుగు ఔదార్యాన్ని 
చీకటి స్వార్ధాన్ని 
ఏక కాలంలో చూపగలదు 
నా నీడ.
******
విజయం 
సాగరమంత 
శ్రమే కాదా విజయం కోరుకునేది 
స్వాతిముత్యమంత 
ఓరిమిని కూడా.
*******

Wednesday, September 26, 2012

లంచం

లంచం 
ఒడి నుండి ఆ చావులమడి దాకా 
ఎంత పచ్చగా తన బ్రతుకు పండించుకుంటోందో 
చూడా లంచం.
*******
ఉపనయనం 
ఎప్పుడో గానీ బిడ్డలపై ప్రేమను కురిపించని 
ఆ తండ్రిని కాదని అన్నీ తానేఅయి 
ఆ మానుకి ఈ తీగను జంధ్యంగా వేసి 
ఎంతందంగా ఉపనయనం చేస్తుందీ నేల తల్లి.
********
మధువు 
నన్నా భానుడు భయపెట్టేవేళ 
పువ్వులా ఈ నేలపై విరిసిన 
ఆ చెట్టునీడ గర్భాన 
గుప్తంగా దాగిన మధువు!
నా నీడ.
********
నవ వధువు 
ఆ వరునింటే వడిగట్టు బియ్యాన్ని 
అప్పగిస్తానని ఇంద్రధనుస్సు గడప దాటి 
పుట్టింటి నుండి మెట్టినింటికి చేరిన 
నవవధువా వానచినుకు.
********

Tuesday, September 25, 2012

వర్ణాశృవులు

వర్ణాశృవులు
 
బాల్యాన ముగ్గురు తాతలు చేయిపట్టి 
సౌందర్య వనాంతరాల కుసుమరాగరంజిత పదాన 
నన్ను నడిపించారోయ్!

ఆపై రూపరేఖా లావణ్యాలతో విచ్చుకున్న 
నా యవ్వన సోయగాన్ని రసికదిగ్గజాలైన 
ఆ ఎనమండుగురు ఎంతందంగా వర్ణించారోయ్!
భువనైకమోహన హాసవిలాసాన.

ఇక నా కౌమార కౌశలాన 
రవి అస్తమయమే ఎరుగమన్న ఆ తలబిరుసు దొరలే 
నింగికంటా ఎగసిన  నా కీర్తి కేతనాల ముందు 
అవనత మస్తకాలతో నిలిచి 
సంతత మనోసీమల నుండి జారిన 
ఆ మాధుర్య మోదామృత ధారలు త్రావి 
చిరంజీవులన్న యశము బడలేదా?
 
ఇపుడా వైభోగమంతా యేమాయెనో గానీ నాకపుడే వృద్ధాప్యమాపాదించి 
ఆ మొనదేలిన ఇరువదియారు అమ్ముల అంపశయ్యపై పరుండ బెట్టారు.
ఆ! ఇపుడు నా మరణ ముహూర్తం ఆసన్నమైనదనీ ,
సంస్కృతికి పాలు పట్టించిన నా స్తనాలుకూడా వట్టిపోవునని 
ఈ కాలానికిపుడు తెలిసొస్తుందిలే 
నీ వల్లే కాదులే మీ అందరి వల్ల.
**********

 

Monday, September 24, 2012

బృందావన శోభ

బృందావన శోభ   
సాహసించిన ఆతని 
అధరవైభోగమామే చెక్కిలిపై 
స్వాగతించిన ఆమె 
నఖవైభోగమాతని మేనిపై 
ఇరుసంధ్యలై శోభించాయా బృందావనాన.
**********
విరహం  
కాలమనే గాలి వీచి 
విరహమనే కారుమబ్బు 
కరిగి కురిసింది గనుకే 
నా హృదయోద్యానవనంలో 
పూచిన ప్రతి పువ్వులోనూ 
నీ రూపే నాకు తోచెనో చెలీ.
********
గర్వం 
ఎవరూ మీటకుండానే 
రాగమాలపించే వీణ తీగలమని!
తుషారమంత గర్వమా జలపాతానికి.
*********
గోదారి 
పాదం కదిపినంత అందంగా 
పదం పాడడం 
పదం పాడినంత అందంగా 
పాదం కదపడం 
తనకు నవ్వినంత తేలికంటుందా గోదారి.
**********

Wednesday, September 19, 2012

వలపు ఏరువాక

వలపు ఏరువాక 
ఏడు అడుగులు నడిచాయో లేదో 
అపుడే వలపు ఏరువాకకు ఎంతందంగా 
ప్రణాళికను రచిస్తున్నాయో చూడా చేలో 
ఆ వానచినుకులీ మన్నుతో మమేకమై. 
*********
శిశిరోదయం 
మోడైన ఆ ఎదలను చిగురింప చేయాలని 
తన వంతుగా 
ఆ గాలెంత శ్రావ్యంగా సంగీతమాలపిస్తోందో 
చూడా రాలిన ఆకులతో కలిసి  
ఆ శిశిరోద్యానవనాన.
********
సింగారం 
అసలు సిసలు సింగారాన్ని 
నా వదనానికి నేర్పేవి 
పెదవులే.
*******
ప్రగతి తేరు 
అవినీతి, అధిక ధరలు 
సామాన్యుని ప్రగతి తేరుకు చక్రాలు 
నా దేశాన.
*******

Monday, September 17, 2012

గానవాహిని

 గానవాహిని 
పికమాపిన గానాన్ని ఆ సెలయేరు 
ఆ యేరొదిలిన  పదాన్ని 
ఈ ఆకులనుండి జారే మంచుబిందువులు 
ఆలపిస్తుంటే 
ఇక తన గానవాహినికి అంతమెక్కడిదని  
అడుగుతుందా అడవి.
********
మెరుపు తీగ 
ఆ వీణతీగ కన్నా అందంగా ఉంది కదా 
మీటితే ఇంకెంత వీనులవిందైన 
సంగీతం వినిపిస్తుందో అనుకుంటే 
ఇలా ఉరిమిందేమిటా మెరుపుతీగంటూ 
కరుగుతున్నాయా మేఘాలు.
*********
వర్ణ విక్రయశాల 
ఏ దారినీ పూలన్నీ పోయి ఆకాశంలోని 
ఆ వర్ణ విక్రయశాలలోని రంగులను 
కొనుక్కొచ్చాయో ఆ దారినే పోయి 
అన్ని స్వప్నాలను కొనుక్కొచ్చింది 
నా మనసు.
********
శృతి 
కరిగిన ఆ ఇల్లాలి కలలు 
కన్నీళ్ళై కారుతున్నా నిషా మత్తులో పడి 
మేలుకోడా మొగుడు 
కానీ ఆమె ఒడిలోని బిడ్డడో!
ఆమె కన్నీళ్ళకో శృతినీయడా?
*********

Sunday, September 16, 2012

తూరుపు తీరుపు

తూరుపు తీరుపు 
ఈ మంచుతో ఆహ్లాదంగా అల్లుకున్న 
తమ అనుబంధాన్ని ఓర్వలేకపోతున్న 
ఆ తూరుపు తీరుపును కన్నీళ్ళతో 
శిరసా వహిస్తున్నాయా ఆకులు.
*******
అతివృష్టి 
అతివృష్టి లోనూ 
ఆకాశం దాకా ఎదిగే పంట 
మన విషాదమేనోయ్.
********
మానవత 
మానవత 
ముందుకు నడవాలంటే 
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.
**********
గజ్జె 
నవజీవనహేలతో నర్తించే 
ఈ పుడమి చరణాలా నదులకు 
అప్పుడప్పుడు గజ్జె కడుతుందా ఆకాశం.
********

Saturday, September 15, 2012

సుమ శరమ్ములు

 సుమ శరమ్ములు వారందగత్తెలు 
వారి కనుసన్నలలో అనంత సౌందర్య సాగరపుటలలెగసిపడుతున్నవి 
వారి ఎదల మాటున సురతో, సరితూగగలుగు ఝరులూరుతున్నవి 
ఈ లోకాన మైత్రీ మధురగంధాన్ని పూయగలరు వారు 
కాంక్షా విభావరీ గీతికలనాలపించగలరు వారు 
డోలలూగుతూనే, ఆనందహేలా ధనుస్సులను చేబూని 
గురిచూసి మదిన నాటగలరు వారు 
ఆహ్లాదమను సుమనశ్సరమ్ములు 
వారింద్రధనుస్సులను పెదవులపై శ్రుతించి 
ఆ పిలుపులతో అందరి మదినేలెడి ప్రాభావమ్మున్నవారు 
విలాసాహాసిత చుంబన ప్రబంధాలనెన్నో 
గాలివాటున రాయగల ప్రాజ్ఞులైయుండి కూడా 
వారిపుడు మరులుగొని చేరెనో చెలీ నా చెంత 
నీ వాల్జడన కొలువు గోరి.
********

Friday, September 14, 2012

ఆ! రైతునే

ఆ! రైతునే 
కరుణించమంటూ అదేపనిగా ఆ ఆకాశాన్ని 
తన ఆశల పుప్పొళ్ళు చల్లుతూ అర్ధించే 
ఎడారిని కాను నేను 

పొంగిపొర్లుతూ మీదికొచ్చిపడిన యవ్వనసౌందర్యం తో 
ఆ మింటికి కనుగీటే నదినీ కాను నేను 

వద్దనుకోవడం రాక, ఆ  నింగి లోతుల్లో వెదుకుతూ 
అనేకానేక ఇంద్రధనూ రాశులను పండించే 
నా పగిలిన సులోచనాల మాటుగా 
జోడు జీవనదులే ప్రవహిస్తున్నా! 
హసించే ఎడారొకటి వసించే మనసుతో నిలబడిన 
నేనెవ్వరో గురుతు పట్టగలవా నువ్వు 
ఆ! అవును బక్కచిక్కిన నీదు దేశ భాగ్య విధాతను 
రైతును.
***********

Thursday, September 13, 2012

అనురాగసౌధం

అనురాగసౌధం 
గుండె లోతునున్న ఆ పునాదుల్లోకి 
కన్నీరొచ్చి చేరినా 
ఎంత ఠీవిగా అనురాగసౌధాన్ని 
తన భుజాలపై నిలపగాలదా తల్లి 
తన ముద్దు బిడ్డడకై.
********
తొలకరి ఛాయ 
ఈ కాలమో నా మనసో 
మౌనమనే ముసుగేసిన భావాలే 
ఏకాంతాన నా మనోసీమల్లో 
పురివిప్పి ఆడే మయూరాలు 
అందుకే అవి అలా ఆట మొదలెట్టగానే 
ఇట్టే తొలకరి చాయలను 
ప్రతిబింబిస్తాయి నా కన్నులు,
*********
ధీమంతులు 
పాతాళం గతానికి 
ఆకాశం భవితకి స్థావరాలైతే 
వర్తమానంలో ఒకేసారి 
గతాన్ని భవితను వెతుక్కోగలిగే 
దీమంతులా మానులు.
********
మౌక్తికాలు 
చరిత్ర నిజంగా ఓ మహాసంద్రమే 
సంస్కృతులన్నీ అందులోని మౌక్తికాలే కాని
ఆ నాగరికతా సుందరి మెడను మెరిసే భాగ్యము 
వాటిలోని కొన్నిటికే మాత్రమే దక్కెనెందుకో?
*********

Wednesday, September 12, 2012

మాతృ భాష

మాతృ భాష 
వినబడకూడదనుకున్న ఆ పంచములన్న శబ్దం 
మనుషులను వదిలి 
మాతృభాషలను పట్టుకుందిపుడు 
ఆ ఆంగ్లపు ప్రభావాన.
*********
బృందావనం 
వెన్నెల్లో సయ్యాటలాడే వారిద్దరి నీడలను 
కదిలే నీటిబొట్లుగా మోస్తూ 
ఆ కొలనులోని తామరాకులను 
వెక్కిరిస్తుందా బృందావనం.
*******
ఆమె  
నా ఇంటి కిటికీలోకొచ్చి నా ప్రతి కదలికను 
ఆమె తన పూల కళ్ళతో 
సి సి టి వి కెమేరాలా షూట్ చేస్తున్నా 
తననేమీ అనలేని మూగవాడినైనాను 
అవును నిజంగా!
మేనంతా పచ్చని ఒయ్యారం ఒలకబోస్తున్న ఆమె 
మెరుపుతీగలాటి అందగత్తె మరి. 
మాధవుడు 
చూపులతో ఓ పక్క 
ఆమె ఒయ్యారపు నడుమొంపులను పలకరిస్తూనే 
చిన్నపుడు ఆ సెలయేటిలో తానొదిలిన 
ఎండుటాకు పడవలను గురుతుతెచ్చుకుంటున్నాడేమిటో 
ఆ మాధవుడు.
*********

Tuesday, September 11, 2012

తొలిసంధ్య

తొలిసంధ్య 
ఒక్క రాత్రిలోనే అలంకరణ శాస్త్రంలో 
తల పండిపోయేంత విజ్ఞానాన్ని 
ఎలా సాధించాయా పచ్చికలని 
అంతంత గొంతులేసుకుని 
తనపై విరుచుకుపడుతున్న 
ఆ పక్షులకేమి బదులీయాలో తెలియక 
పాపం అంతలోనే జారుకుంటుంది 
ఆ తొలిసంధ్య.
********
పరిణామం  
ఓ తరమాగాక దొరికిన తీరికేళ 
ఊయలూపే శయ్యగా 
తన బొజ్జను మలచి 
తన అనుభూతులను 
ఒక బోసినోరు ఇంకో బోసినోటితో కలసి 
నెమరేసే దృశ్యం తన గుండెలపై నుండి 
చెరిగిపోయేలా ఎందుకు పరిణమించావంటూ 
ఆ కాలాన్ని నిలదీస్తుందీ పుడమి.
**********
వయసుమళ్ళిన అనురాగాలు
ఎవరికంటా పడకుండా 
అంతర్వాహినులై పారి 
మరుభూమిలో కలిసే జీవనదులైనాయి 
ఆ వయసుమళ్ళిన అనురాగాలు.
*********

Monday, September 10, 2012

క్రోధం-మోదం

క్రోధం-మోదం 

మనసుల నుండి
ఎప్పటి మకరందాన్ని అప్పుడే తాగేసే
భ్రమరమీ క్రోధం
కూడబెట్టే మధుపమీ మోదం.
*******
సంద్రం
అంత సంపద తనలో ఉంది గనుకే
ఈ రేయింబవళ్ళనా సంధ్యకిచ్చి
పూటకోసారి పెళ్ళిచేసి
తన చేతులమీదుగా
నవ్వుతూ సాగనంపగలదా సంద్రం.
*******
మనశ్శాంతి
నేనెన్ని శివధనస్సులు
విరవాల్సివస్తుందో
నన్ను వరించాడానికా మనశ్శాంతి.
*******
స్వప్న సుందరి
మనసులను మురిపించేంత ప్రతిభ
తనలో ఉంచుకుని కూడా
తన ప్రదర్శనకు ఒక్క శ్రోత గానీ
ఒక్క ప్రేక్షకుడు  గానీ
వద్దంటుందేమిటా స్వప్నసుందరి.
*********

Sunday, September 9, 2012

అలజడి

అలజడి 
తన అందం చూసుకోవడానికి 
నా చెక్కిలి అద్దాలను కన్నీటితో 
మెరిపిస్తూనే ఉంటుందా అలజడి.
*********
వర్ణాలు 
జీవితాల్లోకి 
ఎన్ని వర్ణాలొచ్చాయో 
వివర్ణం చేయడానికి
ఆ మనసుని.
******
కబుర్లపోగు   
తాను కబుర్లపోగుననిపించుకునేలా 
ఊసులెన్నో చెప్పాలని 
పాదాల మొదలా శిరస్సు దాకా ఎంతందంగా 
ఆ మాను మేనల్లుకుందో 
చూడీ తీగ.
********
శ్రీగంధం   
గాలి సాయంతో 
ఆ మాను నీడను అరగదీసి 
తన మేనుకు శ్రీగంధంలా పూసుకుంటుంది 
ఈ పుడమి.
********

Saturday, September 8, 2012

సంఘర్షణ

సంఘర్షణ 
నిజానికి శాంతి కన్నా 
సంఘర్షణేనోయ్ 
ఎక్కువ వికాసం 
నేర్పిందీ మనుషులకి.
******
అన్వేషణ 
వెలుగుతూ 
ఆ చీకటి శిరస్సుకై 
వెదుకుతుంటే ఆ దీపం 
దాని కింద నలుగుతూ 
ఆ దీపపు చరణాలకై 
అన్వేషిస్తుందా చీకటి.
*******
అలక 
అలిగి ముఖం చాటేయడం కంటే 
కోపంతో నా మేనంతా విరుచుకు పడితే 
ఎంత బావుణ్నీ వెన్నెల 
అంటుందా పుడమి.
*******
నక్షత్రాలు 
అకాశానికా మిణుగురులు 
అంకితమిచ్చిన దీపాలే 
నక్షత్రాలు.
*********

Thursday, September 6, 2012

సజీవగీతాలు

సజీవగీతాలు 
మమతానురాగాలు 
పల్లవీ చరణాలుగా వినిపించే 
సజీవగీతాలను విని ఎంతకాలమైందో అని 
తనలోతాను అనుకుంటూ  
ముందుకు సాగుతుందీ కాలం.
********
ముత్యాలు 
అనుమానాలో ఆనందాలో గానీ 
ఆమె కన్నుల వెంట ధారగా జారి 
ఆ కడలి కూడా అసూయ పడేంతగా 
యీతని చేతుల్లో ముత్యాలౌతున్నాయా బృందావనాన.
********
మనసు 
ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే 
గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎపుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది నా మనసు.
*******
నదీ పాయలు 
తీగలా మానుని చుట్టుకున్నట్లే 
నదీ పాయలన్నీ 
ఈ పుడమి మేనుని............
********