Thursday, March 31, 2016

కూనలమ్మ పదాలు


1.  పసిడి సొగసుల దివ్వె 

     నిశికి పెట్టెను బువ్వె 

     జగతి నిండుగ నవ్వె 

     ఓ జాబిలమ్మ

     ********** 

2.  ప్రేమ పగలే చూడ 

     తెలుగు సినిమా నిండ 

     విలువ కేదోయ్ అండ 

     ఓ జాబిలమ్మ 

    ***********

3. శిగలు తరగగ జూసి 

    నవ్వ లేనని తెలిసి 

    విడిచె పూజడ వాసి 

    ఓ జాబిలమ్మ

    ************ 

4. అల్ల రల్లరి వాన 

    వాగు ఒంపుల లోన 

    పాడు పాటలు చాన 

    ఓ జాబిలమ్మ 

    ***********

5. కన్ను తెరవక ముందు 

    కాల కూటపు మందు 

    ఆడ శిశువుకు విందు 

    ఓ జాబిలమ్మ 

    ***********

Tuesday, March 29, 2016

మినీ కవితలు


ఉదయ సుందరి 
తాను రాసిన పాటను 
పాడడం కోసమని 
ఎన్ని గొంతులను మేల్కొల్పిందో 
ఆ ఉదయ సుందరి.
*******
నేతగాడు 
తానే ఆ బట్టకు వేలాడి 
తాను నేసిన బట్ట ఎంత నాణ్యమైనదో 
చెప్పకనే చెప్పాడా నేతగాడు.
********
తోటమాలి 
హృదయ క్షేత్రాన 
వెలుగనే విత్తొకటి నాటి 
లోకమంతటా దాని ఫలాలను 
కోసుకునే తోటమాలిని నేను.
*******
కలల మధువు
పూలై విచ్చిన ఊహల నుండి,
కలలనే! మధువును గ్రోలుతుంది నిదుర 
తుమ్మెదై 


******

Monday, March 21, 2016

మినీ కవితలు

అన్వేషణ 
వెలుగుతూ 
ఆ చీకటి శిరస్సుకై 
వెదుకుతుంటే ఆ దీపం 
దాని కింద నలుగుతూ 
ఆ దీపపు చరణాలకై 
అన్వేషిస్తుందా చీకటి.
*******
ఆణిముత్యాలు 
పడినా ,లేచినా 
ఆగక నవ్వే ఆ కడలి అంతరంగంలో 
ఆణిముత్యాలు కాక ఇంకేమిటుంటాయోయ్.
********
రాగాలాపన 
తన గొంతు పిసుకుతున్నా 
నీ శ్వాస సీమలో 
తన మనసుతో ఎన్నెన్ని 
రాగాలాలపించగలదా పువ్వు.
*******
వీలునామా 
తన ఒయ్యారపు వీలునామా 
చెల్లుబాటు కావడానికి 
ఆ ఆకాశపు చేవ్రాలు కోసం 
ఎదురుచూస్తుందా గోదారి.
*******

Sunday, March 13, 2016

మినీ కవితలు


ఆడది 
అణచుకోవడం చేతకాక బ్రద్దలై 
అది విశ్వమైంది గానీ 
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ 
ఆడదే అయ్యేదేమో.
******
 సన్మానం 
చేసిన సేవను మరువలేక కాబోలు 
కొమ్మ కొమ్మ ఆపి మరీ 
సన్మానిస్తోంది 
 ఆ రాలుతున్న పండుటాకును.
*******
పూల చరిత్ర 
పట్టు బట్టి మరీ ఆ పూల చరిత్రని 
గ్రంథస్థం చేస్తున్నాయి 
ఈ తేనెటీగలు.
********
మానవత 
మానవత 
ముందుకు నడవాలంటే 
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.


**********

Saturday, March 12, 2016

మినీ కవితలు

అద్దం 
కదలకుండా నిలబెట్టి
నన్ను నిలువుదోపిడి చేస్తూనే!
తనపై నవ్వుల పూలు వేయించుకునే
కళనెక్కడ నేర్చిందో ఈ అద్దం. 

గుప్పెడంత చేను

ఎపుడంటే అపుడు 
కన్నీటి తడిని అద్దగలిగే గుప్పెడంత చేను 
తన చేతిలో ఉందని కాబోలు 
ఎప్పుడూ ఏదో ఒక భావాన్ని 
పండిస్తూనే ఉంటుంది 
నా మనసు
ముక్కుపుడక 
తావిని మోయలేకా గాలికి పట్టిన 
స్వేదబిందువొకటి జారి 
ఆ పువ్వుకు ముక్కుపుడకైంది  అదిగో అలా .... 
*******

Sunday, March 6, 2016

మినీ కవితలు

మినీ కవితలు 

నా చేతుల్ని 

ముద్దాడడానికని 

మిణుగురుల అవతారం 

ఎత్తింది ఆ జాబిలి

************

నా మనసులోనే నిన్నెక్కడో దాచి 

దాగుడుమూతలు ఆడుతూ 

నిన్ను కనిపెట్టే ఆటకు 

విరహమని పేరు! ఓ నా చెలి 

***********

ఆ బురద మట్టిలో పడి 

మాట్లాడే మొక్కలుగా మొలిస్తే 

ఎంత బావుణ్ణు! మన నీడలు 

**********