Friday, August 22, 2014

నీటి అద్దం

నీటి అద్దం 

వంగి, ఆ రైతు జార్చు నీటి అద్దాన 
తమ  మోము చూసుకోవాలని 
పోటీ పడుతూ పెరుగుతున్నాయా విత్తులు 
పైరుపాపలుగా. 

****

పూలజడ 

కొమ్మలు మరచిపోయిన పూలజడలను 
తాను వేసుకొచ్చిందా గున్నమావి కొమ్మ 
ఈ వసంతాన. 

****

సాహసగాథ 

తుషార గంధం పోసి 
కోనలోని చెట్టూ పుట్టకు, రాయీ రప్పకు 
తన సాహసగాథను తెలపదూ 
ఆ జలపాతం. 

****

నింగి పూలు 

అంతటి గగనపు తోటలో 
చీకటేళ పూసిన నక్షత్ర పూలు 
ఉన్నపాటుగా మాయమై పోయాయని 
రెక్కలు విప్పి మరీ ఆ పూల సొగసును 
మరలా ఆ నింగికివ్వాలని 
తెల్లారకుండానే ఆ విహంగాల తొందర చూడు. 

****

Wednesday, August 20, 2014

పుడమి కల

పుడమి కల 
 
కురిసే వాన చినుకులన్నీ 
మెరిసే మెరుపు తీగపై 
పూలై పూస్తే!
పుడమి కలలు గనే  వసంతమే కాదా? అది. 
 
 
 
*****
 
 
బ్రతుకు
 
గాఢమ్ గా 
నిద్దరోయిన మృతువు కనే కలేనేమో 
బ్రతుకంటే. 
 
 
*****
 
 
అనాధలు
 
వికసించిన మనసుతో
మానవత! కన్నీరెడుతూ చిరునవ్వు 
ఒకరినొకరు ఓదార్చుకుంటున్నాయి!
అనాధలైనామని. 
 
 
*****
 
 
మనసు
 
 
ఏకాంతానుభూతిని పొందలేక 
నా పైన తానే సానుభూతి పవనమై  పరచుకుంది 
నా మనసు. 
 
 
 
*****

Tuesday, August 5, 2014

అదృష్టం

అదృష్టం
 
 
అప్పుడప్పుడే గెలుస్తాయి విప్లవాలంటూ,
ఆశ పడ్డ పేగులపై 
నీళ్ళను చల్లింది 
అదృష్టం.
 
 
***
 
 
ఊరంత అందం 
 
 
అంతందంగా ఊరంత అందం 
తమ కంట పడుతున్నందుకు కాదూ 
అడుగైనా కదపనిది ఆ కొండలు. 
 
 
***
 
 
రుచులు 
 
 
నిండు విస్తరోడికి పడనివి 
అర్ధ విస్తరోడికి అందనివే  
రుచులంటే. 
 
 
***
 
 
స్వప్నం 
 
 
తనను కనే మెలకువ 
నిద్దురకే ఉందని,ఆ వేళ వరకూ 
నా మనసును కనిపెట్టుకునే 
ఉంటుందా స్వప్నం. 
 
***

Friday, August 1, 2014

స్వర సన్యాసం

స్వర సన్యాసం 
స్వర సన్యాసం  చేశాయోయ్!
నేటి పాటలు. 
ఇక మనసులనెలా గెలుస్తాయిలే. 
****
భోగం 
ఎంత భోగమో 
ఈ నీడకి 
నేలే బోయీ అయింది. 
****
పెద్ద గీత 
కాలం మాత్రం లోకపు గాయాలను 
మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన!
గీత పక్కన పెద్దగీతను గీస్తోంది తప్ప. 
****
దగ్గర-దూరం 
పేగుకి మెతుకును 
దగ్గర చేయడానికి 
ఎంత దూరమౌతున్నారు 
ఈ మనుషులు. 
****