Follow by Email

Tuesday, August 28, 2012

బోసి నవ్వులు

బోసి నవ్వులు 
వసంతపుర రాజధానీ సౌధాలకు 
వర్ణాలలద్దుతున్నాయి 
ఆ పసోడి బోసినవ్వులు.
*******
అడవి సెలయేరు  
సాయంసంధ్యలో గూటికి చేరి 
ఆ మానుకు పిట్టకథలు చెప్పే 
పక్షుల శృతిలో తన ఊహలను 
పాటలుగా పాడుకుంటూ 
సాగుతుందా అడవి సెలయేరు.
*********
విరహం  
అనేకానేక గుప్త భాగ్యరాసుల్లాటి అనుభవాలతో 
నా హృదయాన్ని 
క్షణానికో దీవిగా మార్చే సంద్రం 
నీ విరహం.
******
చీకటి 
తన హృదయాన్ని పట్టుకోగలిగే 
మెళకువనొక్కటి నేర్పక 
ఆ వెలిగే దీపానికి,
రాతిరికి లోకాన్నేలగలుగుతుంది 
ఈ చీకటి.
*******
కుచేలుడు 
బీడువడిన గుండెతో పిలిస్తే 
తన ఇంటికొచ్చిన ఆ ఆకాశానికి 
కుచేలుడిచ్చిన అటుకుల్లా 
అంత పరిమళాన్ని మాత్రమే 
అద్దుతుందీ పుడమి.
*******

Monday, August 27, 2012

సాహసం

 సాహసం 
నా సాహసం నీ చెక్కిళ్ళను ఎరుపెక్కించిన వేళ 
వాటి పై ఇరు సంధ్యలను చూస్తూ
నీ కోపాన్ని సుర్యోదయంలా 
నీ హాసాన్ని చంద్రోదయంలా ఆస్వాదించాలన్న 
ఆ కడలి తలంపే నీ మెడను ముత్యమైనదే 
ఓ నా చెలీ!
*******
రాయి  
ఇంత సేపు ఏ గుండెల మాటున ఆపుకుందో గానీ 
తన లోని గాంధర్వగానాన్ని  
ఇంతసేపు ఏ పాదాల మాటున అణచుకుందో గానీ 
తనలోని ఈ నాట్య హేలను!
చూడా నిశ్చలమైన చెరువులో 
పాయల పసిపాపలనూయలలూపుతూ 
పాడుతున్న ఆ రాయి.
********
పున్నమి రాత్రి  
ఎక్కడీ పండు వెన్నెల్లో మత్తెక్కి 
ఆ ఉన్మాదంలో తమకు 
కన్నుగీటుతుందో ఈ చెరువని 
పాపం భయంతో 
దాక్కుంటున్నాయా తారలీ పున్నమిన.
*******
నీడ 
గొడుగుగా ఈ కొబ్బరిచెట్టు ఛాయను పట్టుకుని 
వామనుడై వచ్చి మూడు అడుగులీయమంటూ 
నా మనసుని అడిగి ఆకాశపు అంచులదాకా 
నా మనసుని ఎగురవేసింది చూడు నా నీడ.
***********
 

Sunday, August 26, 2012

ఆంగ్లపు తేరు

ఆంగ్లపు తేరు 
పనికిరానివనిపించుకుని 
ఈ తోట నోటా పూల సహజ పరిమళాలు 
అగరాబత్తులై వెలుగుతున్నాయి 
ఊరేగే ఆ ఆంగ్లపు తేరుపై.
*********
తల్లి  
ఆ పసివాడి పూర్ణచంద్ర హాసిత మోముపై 
రెండు నెలవంకల విల్లెక్కుపెట్టి మరీ గురిచూసి 
ఎన్ని ముత్యాల సరాలను సాధించిందో చూడా తల్లి 
సరస చుంబనాల పరిష్వంగాన.
***********
అతిథులు 
సంపదతో వెలిగిపోతున్నప్పుడు 
అతిథులెందరో వస్తారని విన్నానుగానీ 
మరా అమాశ నిశిలో ఏమిటోయ్ 
అంతమంది అతిథులొచ్చారా ఆ ఆకాశపుటింటికి.
*********
నా హృదయం 
బద్దలై ఇన్ని అందాలుగా 
పరిణమించిన విశ్వాన్ని చూసి 
నీ విరహాన బీడై కూడా 
ఇన్ని అందాలనూహించడం నేర్చింది 
నా హృదయం.
*******

Saturday, August 25, 2012

అన్వేషణ

అన్వేషణ 
పదం పాడుతున్న 
ఆ వేణువు పాదాలను 
అన్వేషిస్తూ సాగేవే 
రాధ కన్నుల పయనాలు.
******
శకుంతల 
ఎంతమంది దుష్యంతులను 
సంపాదించుకుందో శకుంతలై 
పాపమా శరద్పూర్ణిమ.
******
చినుకు పాప  
ఆకాశమంత ఎత్తు నుండి 
జారిన ఆ చినుకంటి పాపకు 
దెబ్బ తగలనీయకూడదని 
ఎన్ని పచ్చటూయలలు కట్టిందో 
చూడా మాను కొమ్మ కొమ్మన.
*******
ప్రయోజకులు 
అంతగా గాలి తిరుగుళ్ళు తిరిగే 
తన బిడ్డలనెపుడింత ప్రయోజకుల్ని 
చేసిందో ఆ ఆకాశమని 
హర్షాతిరేకంలో తడుస్తూ 
పొగుడుతున్నాయా చెట్లన్నీ.
*******
 

Friday, August 24, 2012

నీవు

నీవు 
నీ పరిచయం 
ఏమి మిగిల్చింది నాకు 
నాలో లేని నన్ను తప్ప 
నీ అజ్ఞాతం 
ఏమి మిగిల్చింది నాకు 
నీకై వెదికే నన్ను తప్ప.
******
ఓ క్షణం చాలు 
ప్రకృతిని నీవు చూడడానికి 
ఆ క్షణమే చాలు 
ప్రకృతి నీవవడానికి.
******
తన రహస్యాలు తెలుసుకోమంటూ 
ప్రకృతి నా ముందు పరుచుకుంటే 
నీవు మాత్రం రహస్యంగా నన్ను నీలో దాచి 
నా ప్రకృతివైనావు.
*******
నీ గురుతులను దాచుకోవడం 
ఆ గురుతులతోనే 
నన్ను నేను వెతుక్కోవడంలోనే 
నాకు నేను దూరమైనాను.
*******
నా హృదయ స్పందనలను నీ కనురెప్పలు 
నిశ్సబ్దంగా  పాలిస్తున్నాయి 
వేయి వేల వరాలజల్లులా 
నా పై అవి కురుస్తుంటే 
ఈ లోకం నివ్వెరపోతోంది.
******

Thursday, August 23, 2012

విషాదం

విషాదం 
హేమంతంలా పరచుకుని 
వసంతంలా విరబూసి 
శిశిరంలా ఆనందాలు రాల్చుతూ 
వర్షధారల్లా కన్నీటిని కురిపిస్తూ 
జీవితంలో సగానికి పైగా ఋతువులు 
తన సొంతం అంటుందోయ్ 
ఈ విషాదం.
********
కమలం 
మండిపడుతూ కూడా 
చెలియ మనసులో 
వలపు పాట పాడడమెట్లో 
ఆ భానుణ్ణి చూసి 
నేర్చుకోమంటుందా కమలం.
********
పాట 
పతనంలో కూడా పాటపాడడం 
నేర్చుకుందీ జలపాతం 
ఆ వానచినుకుని చూసే.
********
గర్వం 
అంతైతే ఒయ్యారాన్ని ఆ గోదారికి 
అరువీయబోతున్నామన్న గర్వంతో 
బిగ్గరగా వినిపించే ఆ మేఘాల గుండెచప్పుళ్ళే 
ఆ ఉరుములు.
********

Tuesday, August 21, 2012

మధురానుభూతులు

మధురానుభూతులు 
మరచిపోలేని మధురానుభూతులెన్నో 
తన మగడి చెవిన వేయాలన్న ఆత్రమోవేపు లాగుతుంటే 
అంతలోనే ఆ ఊసులన్నీ విని వాడేమనుకుంటాడోనన్న 
బిడియమింకోవైపు లాగుతుంటే 
ఆనందంలో అనుమానాన్ని కలుపుకుని 
సుడులు తిరుగుతూ ఎంతందంగా సాగిపోతోందో 
చూడా గోదారి.
********
ఏడడుగులు 
ఆకాశం కురిపించే 
ప్రేమధారకు కరిగి 
ఏడడుగులు వేస్తుందా మన్ను 
అదిగో అలా.......
*******
గుండెచప్పుళ్ళు 
గుప్పెడు అక్షరాలు చాలు 
నా గుండెచప్పుళ్ళనీ దిగంతాలలో 
ప్రతిధ్వనింపచేయడానికి.
*********
ఆణిముత్యాలు 
పడినా లేచినా 
ఆగక నవ్వే ఆ కడలి అంతరంగంలో 
ఆణిముత్యాలు కాక ఇంకేమిటుంటాయోయ్.
********

Friday, August 17, 2012

అందాల జంట

అందాల జంట 
గాఢ ఆలింగనంలో 
ఒకరికోర్కెకొకరు కరిగిపోయే 
అందాల జంట ఈ రేయింబవళ్ళు 
ఆ సంధ్య సాక్షిగా.
*******
దాగుడుమూతలు 
నేను నేనేనా అనే అనుమానపు లోతుల్లో 
నాతో నీవాడే దాగుడుమూతలే 
నాకు చీకటి వెలుగులైనాయి.
*********
ఇల్లాలు 
అలసి ఇంటికొచ్చిన ఇల్లాలికి 
కాసిని మంచినీళ్ళైనా 
ఇద్దామని లేదా కడలికి 
ఆ మాటకొస్తే........
*********
జ్ఞాపకాల మాల 
విరహం కన్నా గొప్పగా 
జ్ఞాపకాల మాలను 
కట్టగలవారెవ్వరోయ్?
*******
మత్తు 
మత్తెక్కక పోతే 
నిటారుగా నిలబడలేదోయ్ 
ఆ కలల కుంచె.
********

Thursday, August 16, 2012

స్వప్నం

స్వప్నం 
లయ నచ్చి తానెక్కడ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందో అని 
చప్పుడు చేయనప్పుడా కనురెప్పలు 
చక్కంగా వచ్చిపోతుందా స్వప్నం.
********
మృత్యువు 
ప్రతి వికాసమూ ఆ కాలానికి 
హృదయస్పందన ఐతే 
తనకు మాత్రం ప్రాణస్పందన 
అంటుందా మృత్యువు.
*******
ఆకలి 
రసికత ఉన్నా లేకున్నా 
ఎలాటి మనిషినైనా కదిలించగలిగే 
రాగమాలపించడంలో తన తర్వాతే ఎవరైనా 
అంటుందా ఆకలి.
*******
ఆవేదన 
ఆవేదనే అధికభాగం కాబోలు 
అందరిలా ఈ పుడమికీ 
కాకున్ననేమి 
కన్నీళ్లు కడలంత కాగా 
ఆనందబాష్పాలు నదులంత.
*********

Wednesday, August 15, 2012

అమృతం

అమృతం 
నీ జ్ఞాపకాలను 
చెరపలేని కన్నీరు 
నిజంగా అమృతమే 
నా మనసుకు.
******
కేశాలంకరణ  
కేశాలంకరణ అంటే  
ఎంత మోజో ఆ ఆకాశానికి పాపిటి రేఖను 
మెరుపు వేగంతో మార్చుకుని మరీ 
ఎలా ముస్తాబవుతోందో చూడు.
********
సంస్కృతి  
ఆశ్రయమిచ్చి ఇచ్చీ 
చివరికి తానే ఆశ్రితురాలైంది 
నా దేశ  సంస్కృతిపుడు.
*******
జీవనదులు 
అండగా కరిగే మనసుంటే 
జీవితమంతా గల గల నవ్వులే అని 
పారుతూ చెబుతున్నాయా జీవనదులన్నీ.
********
 

Tuesday, August 14, 2012

నాలుగు రాళ్ళు

నాలుగు రాళ్ళు
నాలుగురాళ్ళు 
వెనకేసుకోమనా పెద్దలంటే 
ఏకంగా నాలుగు కొండలనే 
వెనకేసుకున్నాడా నేత.
*******
శంఖం  
ఏ దూర తీరాలను చేరినా
పుట్టింటి పలుకులనే వల్లెవేసే 
ఆ శంఖాన్ని చూసి 
ఏమి నేర్చుకోవాలంటావ్ 
ఈ ఎగిరెళ్ళే యువతరం.
********
రాగాలాపన 
తన గొంతు పిసుకుతున్నా 
నీ శ్వాస సీమలో 
తన మనసుతో ఎన్నెన్ని 
రాగాలాలపించగలదా పువ్వు.
*******
వీలునామా 
తన ఒయ్యారపు వీలునామా 
చెల్లుబాటు కావడానికి 
ఆ ఆకాశపు చేవ్రాలు కోసం 
ఎదురుచూస్తుందా గోదారి.
*******

Monday, August 13, 2012

పిల్లనగ్రోవి

పిల్లనగ్రోవి 
కష్టపడి తన ఇంటికొచ్చిన అతిథిని 
యోగక్షేమాలు కూడా అడగకుండా 
ఇట్టే సాగనంపేసి కూడా 
నాతో అన్ని ఆనందబాష్పాలు పెట్టించడం 
ఆ పిల్లనగ్రోవికే చెల్లు.
*******
విలువలు 
పాతాళంలో పందిరల్లుతున్న 
ఆ తీగలకు 
విలువలని పేరు.
********
కారుమేఘాలు  
మౌనం తప్ప ఇంకో భాష తెలీదన్నట్లు 
ఎదురు బదురు చూసుకుంటూనే 
రోజులు గడిపేస్తున్న ఆ నింగి నేలలను 
కలిపే బాధ్యతను భుజాన వేసుకుని 
కరిగిపోయాయా కారుమేఘాలు.
*********
నా పరిచయం 
నా పరిచయం 
తనలోని చిత్రకారుణ్ణి 
బయటకు తెచ్చింది 
అంటుందా అద్దం.
*******

Friday, August 10, 2012

గులకరాళ్ళు

గులకరాళ్ళు
మట్టి, ఇసుక మేఘాలుగా కమ్మిన నిండు చంద్రుళ్ళు
నలుపు, ఎరుపు గొంగళ్ళు కప్పుకుని
మట్టిలో మొద్దు నిదరోతున్న బట్ట బుర్రల తాతలు
మేఘం గాలికి కదిలినా, గొంగళి నీళ్ళకు చివికినా
నిండు చంద్రోదయం లాటి పాత పలకరింపుతో
యకాయకి నా మనసు పొరలను చీల్చి
బాల్యాన్ని బైటేసే తుపాకి గుళ్ళు
ఆహా! బాల్య స్రావాన్ని పిల్లకాలువలా పరుగెత్తించే
ఎలాటి గాయమైందో చూడవోయ్ నా మనసుకిపుడు
ఆనాడు, ఆ సెలయేటి గట్ల వెంబడి పరుగెడుతూ
దోసిళ్ళ కొద్దీ నీళ్ళతో ఈ బట్ట తలలకు తలంటి
అరుపులాటి పిలుపుతో నా నేస్తాల మధ్య
దివిటీల్లా వెలిగిన నా కళ్లిప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి
పోటీలు పడి మరీ పోగేసుకున్న గులకరాళ్ళు
జోడెడ్లలా ఆ జేబులు కట్టిన "లాగు"డు బండిలాటి
లాగూలో వేసుకుని ఇంటికెళ్తుంటే 
బరువుతో ఒకెద్దు కిందికి జారుతుంటే
నా చిట్టి చేతులే ఆసరాగా "లాగు"డు బండి
ఇంటిదాకా లాక్కెళ్ళిన సజీవ దృశ్యం
నేనెన్ని మైలురాళ్ళీ జీవితంలో దాటితే మాత్రం
మాసిపోగలదా చెప్పు నేస్తం
అవును మనసైన జ్ఞాపకాలు మట్టిలో ఉంటేనేం? ఇసుకలో ఉంటేనేం?
ఒకసారి పలకరించు నేస్తం
ఒకటో, రెండో, గుప్పెడో, గంపెడో పోగుచేయి
పట్టుకెళ్ళడమే తెలిసిన ఈ కాలం
నీ బాల్యాన్ని తిరిగి నీకెందుకివ్వదో చూద్దాం రా నేస్తం.
************

Thursday, August 9, 2012

సంధ్యా చెక్కిళ్ళు

సంధ్యా చెక్కిళ్ళు 
తీరని తన అలకలన్నీ అనుమానపు తీగలై అల్లుకున్న వేళ
ఆమె మనసు, కంటి నుండి ఏకధారగా గారుచుండ
మెరయుచున్న ఆ ముదిత చెక్కిళ్ళ అద్దాన
మోదమొందుచు తన రూపు సవరించుకొనియె ఆ మాధవుండు
అపుడామె మోము విరిసిన ఎర్రకలువ
అపుడామె మనసు అమాసను వరించిన పున్నమి వెన్నెల చెలియ
ఇక అక్కడి మౌనమోపలేక ఆ కాలం
ఆరు ఋతువుల అందాలను దూసి
ఆ బృందావనాన రాశిగ బోసి
మచ్చికైన వారి మనసుల నడుమ
ఆ అనురాగామెంతసేపు ఎడమైయుండునటంచు
వారి కనుదోయిల నడుమ తోరణమై నిలచె
అపుడు జారుతున్న ఆమె కన్నీటి బిందువులనొక్కొక్క కొనగోట నిలిపి
ఓ బేల ఇన్ని గోవర్ధనాల నెటుల మోయగలిగితివీవు
నీ మనసు పరిధి దాటి ఊహనైనా పోని నాకై అంటూ సరస వచనంబులాడ
అపుడా అనుమానపు తీగలపై అనురాగపు విరులు నవ్వె
మనసులు కలసిన మకరందాన్ని కాలానికి రువ్వె
ఇపుడూ! ఆ రాధ మోము విరబూసిన ఎర్రకలువేనోయ్
కాకపోతే ఆ ఎరుపు ఏ సంధ్యా ఒప్పనిది
ఈ ఎరుపు ఏ సంధ్యా విడువనిది.
***********

Wednesday, August 8, 2012

నిగర్వి

నిగర్వి
నేను నిగర్వినే
ఐనా నాలోని గర్వాన్ని
బయట పెడుతుందా అద్దం.
**********
వీణ తీగలు
ఆకాశం నుండి చూస్తే

వీణ తీగలుగా కనబడిన
ఆ నదీ పాయలను మీటుదామని
ఉన్నపళంగా బయలుదేరిన జాబిలికి
అడ్డొచ్చి అసలు నిజాన్ని
చెబుతున్నాయా మేఘాలు.
***********
ఊహల పూదోట

మృత్యువంత దూరాన
ఆగింది శిశిరం
నా ఊహల పూదోటలో.
*********
సరస్సు
సిగ్గు పూలను విరబూయిస్తాయో

ఆవేశాలను ఆరబోస్తాయో
ఆ సంధ్యలీ సరస్సులో.
**********

Tuesday, August 7, 2012

ఇంద్ర ధనుస్సు

ఇంద్ర ధనుస్సు
ఎడబాటు ఫలించిన
నీ, నా కన్నుల నడుమ
సప్తస్వరాలను నేర్చుకుంటున్న
సప్త వర్ణాలను చూసి
ఉలికి పడుతుందా ఇంద్రధనుస్సు.
***********
మహా సంగ్రామం
ఊయలూగే పసిపాపలా ఐనా

నిలబడడం వచ్చిన యోధుడిలా ఐనా
మహాసంగ్రామమే చేయడమొచ్చా దీపానికీ చీకటితో.
***********
చితులు

లోకానికంతటికీ
వెలుగు చూపడానికి
ఎక్కడికక్కడ చితులను
వెలిగించిందీ చరిత్ర.
*********
అవినీతి

నాలుగు అడుగులు వెనక్కి వేయడమే
నేర్పిందా ఆకలి క్రూర మృగానికి కూడా
కానీ కడుపు నిండిన మానవ మృగానికి
అవినీతో?
************
పొద

పొద ఎదలో చేరి
తాను కనిపెట్టిన రహస్యాన్ని
అడవి కంతటికీ చెప్పేదాకా
కుదురెక్కడ వస్తుందా గాలికి.
*********

Monday, August 6, 2012

మధువు

మధువు 
పాత్రల కొద్దీ మధువును
కొసరి కొసరి పోస్తుంటే ఆ మేఘాలు!
మత్తులో పడి అడుగైనా కదపగలవా?
ఆ కొండలు.
**********
ప్రహేళికలు
చూపులతో నా సమస్త చీకట్లను వెలిగించే 
కాంతి ప్రహేళికలనెవ్వరు వెలిగించారు 
నీ కన్నుల.
*********
గతం
మనిషికి మనిషి దొరికాడంటే
తన గతం తనకు దొరికినట్లే
ఆ కాలానికి.
*********
అలంకారం
అద్దాన్ని నాకు అలంకారమెందుకంటే
ఓ పట్టాన వినిపించుకోకుండా
ఆ వాడని వసంతాన్ని నా పాలు చేసి
ఎలా వస్తూ పోతున్నాయో చూడా మేఘాలు
అంటోందా చెరువు.
**********

Saturday, August 4, 2012

మనసు చెక్కిన శిల్పం 

మనసు చెక్కిన శిల్పం

నిముషాన వెళ్ళదలచి
నీ చూపుల ఆశుకవితా ధారలు
నే కోరియుంటి గానీ నీవేల
వలపులీను చూపుల కావ్య ధారలు కురిపించి
నీ మనసు చెక్కిన శిల్పంలా
నను మలచుకుంటివి
ఇక నే పోవుటెట్లు

********
వసంతం
కన్నీటి శిశిరమైననేమి
నా ఎడద గాయమ్ము
గేయమ్మే అల్లి
వసంతాన్ని విరబూయింతునీ లోకాన.

********
బడాయి
బడాయి కాకపోతే
ఏమంత దూరంలో ఉందని! తన నేస్తం
అంత పెద్ద దీపం వెలిగించి మరీ
బిగ్గరగా అరుస్తూ వెతుకుతుందా మేఘం
ఇంకో మేఘాన్ని.

*********
సమాజం  
పనికి రాని ఆకుల్ని రాల్చుకునే శక్తి
ఆ చెట్టుకున్నట్లే
ఈ సమాజానికీ ఉంటే?
********
యుద్ధం
ఎవరూ వద్దని అడ్డు చెప్పనంత
అందంగా యుద్ధం చేసుకుంటుంటున్నాయోయ్
చీకటితో ఆ రెల్లుగడ్డి పొదలు
మిణుగురు సరాలను విసురుతూ.

*********
పల్లెపడుచు
చెరువంత ఆకాశం కడవంతై
ఆ పల్లెపడుచు చంకలో ఊయలూగిన దృశ్యం
గుండె గోడలపై నుండి
గది గోడల మీదకి చేరింది.

*********
ఇంద్రజాలం
మెరుస్తూ పిలిచినా కన్నెత్తి
క్షణమైనా వాటి వంక చూడలేదని
కిందికొచ్చి రెప్పవాల్చలేని
అందాల ఇంద్రజాలాన్ని
నా కళ్ళ ముందెలా పరచాయో చూడా మేఘాలు
చినుకునొక్క మొలకగా మలచి.
***********


Friday, August 3, 2012

నారుమడి

నారుమడి   
సర్దుకుని సర్దుకుని పెరిగి ఆపై 
ఎదిగేందుకు ఇంత చోటు చూపిన 
ఆ పంట చేలో ఎలా సమ్మోహనంగా 
పరుగెడుతోందో చూడా నారుమడి.
********
జాబిలి 
అందాల నిండు జాబిలిని
అద్దాన పట్టి కొంటెగా దానికి
కను ముక్కు చెవులు గీచేంతలో
నవ్వుతున్న నీవగుపించావేమిటి ఈ అద్దాన!
ఓ నా చెలీ.
*********
వేణువు

ఓనమాలు నేర్చుకుంటానని
లోపలికొచ్చి సంగీత సారస్వతాన్నంతా
నేర్చుకుని బయటకెళ్తున్న గాలిని
మనసారా దీవిస్తుందా వేణువు.
**********
విత్తు

ఆకాశానికి పుడమికి కూడా
తనలోని భావ చిత్రకారున్ని చూపిస్తూ
ఎదుగుతుందా విత్తు.
********
అలంకారం

ఏపుగా ఎదిగిన పంట చేనుకు
కడలి అలల
అలంకారమద్దుతుందా గాలి.
**********

Thursday, August 2, 2012

జ్ఞాపకం

జ్ఞాపకం 
నాకు నీడనిచ్చిన జ్ఞాపకాన్ని 
నాతో పాటూ బూడిదౌతూ 
గురుతు తెచ్చుకుందా మాను.
*********
స్తన్యం 
వట్టిపోయిందని చెలి తన ఎదను చూపితే 
అరుస్తూ రోదిస్తూ ఆకాశం నుండి 
ఆ ప్రియుడు దిగొచ్చాడంతే 
ఇక చూడామె ఎన్ని మొలకలకి 
తన స్తన్యాన్ని పడుతోందో.
*********
నల్లని పుష్పం 
ముడుచుకోవడం వికసించడం తప్ప 
వాడడం అంటే ఏమిటో తనకు తెలీదంటూ 
నేలకు మాత్రమే తన పరిమళాన్ని పంచే 
నల్లని పుష్పమే నా నీడ.
********
మానవత 
నాగరికతెంత వికసించినా 
అంటరాని తనాన్ని 
వదిలించుకోలేక పోయిందెందుకో 
ఈ మానవత.
********
పబ్ 
మిణుగురుల్లాటి మసక దీపాల కింద 
గుడ్లగూబలంత వికారంగా 
మన సంస్కృతిని తక్రిందులు చేసిన 
గబ్బిలాలు కొన్ని మత్తులో 
చిందులేస్తున్నాయా పబ్బులో.
*********

Wednesday, August 1, 2012

రైలు బోగీ

రైలు బోగీ 
ఈ చిగురుటాకుల నుండి 
ఆ పండుటాకుల వరకు 
పెద్దకొడుకైంది 
కాలి ఆ రైలు బోగీ.
*******
ఆ రైలు బోగీ సాక్షిగా 
అంతిమ సత్కారానికి కూడా నోచుకోని 
చావులెన్నో.
*******
కలల పంట 
నాగేటికి కట్టిన ఆ ఎద్దుల గంటల చప్పుడులో 
నా ప్రియురాలి కాలి మువ్వల సవ్వడి విన్నాను 
మొలిచిన మొలకల్లో 
గిలిగింతగా ఆమె పిలుపులు విన్నాను 
ఆ పిలుపులు పాటలైన అనుభూతులతో 
ఎంత పచ్చగా ఈ లోకాన్ని పలకరించానో 
మేనంత ఎదిగిన ఒయ్యారంతో గాలికి నాట్యమాడుతూ 
సౌందర్య దేవతకు పట్టు పీతాంబరమై అమరిన ఆమె మేను 
నా తలపుల పండి ఒంగిన వేళ నా కలల పంటనిదిగో 
ఇలా తూర్పారబట్టుకుంటున్నాను.
**********
 మేఘాల కంబళి 
గ్రీష్మం ఎండలకి సెలవని 
వర్ష ధారలతో చెబుతూ 
చలికి తట్టుకోలేకో ఏమో నల్లని మేఘాలనలా 
కంబళిలా కప్పుకుంటుందా ఆకాశం.
*********
తివాచి 
పుట్టబోయే పువ్వులాటి బిడ్డలు 
ఒడి జారితే ఎక్కడ గాయపడతారో అని 
మాసం ముందుగానే తన కింద 
ఆకుల తివాచి పరచిందా మాను.
********