Wednesday, August 28, 2013

నిజం

నిజం
నీ కన్నుల కన్నా 
ఎక్కువ లావణ్యాన్ని సంపాదించాలని కాబోలు 
ఆ పూవులన్నీ అప్పుడే ముడుచుకున్నాయి 
రోజు గడిచింది. నిజం తెలిసింది. 
బాధతో అవి వాడిపోయాయి. 
*******
ఏకాంతం
నా ఏకాంతాన్ని చూసి 
జాబిలి మబ్బు చాటైతే,
కలువ ఏకాంతాన్ని చూసి 
ఆ మబ్బు కాస్తా కరిగి 
నీపై నా సందేశాన్ని కురిపించింది. 
********
ఎదురుచూపు 
తొలిపొద్దు లో ఆకాశంలో రేగిన విప్లవానికి 
ఆదిమూలం, నీకై ఎదురుచూస్తూ విసిగిపోయిన 
నా హృదయం కాక ఇంకేమిటి?
********
ఆమె
ఎందుకు ఆకాశం లోకి 
అదే పనిగా చూస్తావు అని ఆమెనడిగాను. 
చూడనీ ఆమె తన చూపులతో 
నక్షత్రాలను వెలిగిస్తుంది 
అని ఆకాశం బదులిచ్చింది. 
*******
జ్ఞాపకాలు
అమ్మో! నీ జ్ఞాపకాలను లెక్కించడమంటే 
నూరేళ్ళ నా శ్వాసలను 
తారలతో గుణించడమే 
ఐనా ................. 
*******

Friday, August 23, 2013

కృష్ణబిలాలు

కృష్ణబిలాలు
పసినవ్వుల 
కృష్ణబిలాలు 
కాన్వెంటులు. 
****
మాతృభాష
బొడ్డుపేగులోనే 
కాలపాశమెదురయితే 
బ్రతికి బట్ట కట్టేదెలా?
అంటున్న బేల లా అయింది 
నా మాతృభాష. 
******
రాని యవ్వనం
పొగలు, పొంగే నురుగులను 
తమ ప్రాథమిక హక్కులంటూ,
వీధుల్లో ఎలా విహరిస్తున్నాయో చూడు 
రాని యవ్వనాలు కొన్ని.
*******
మనిషి
మనిషి, ఎదుట పడ్డపుడు పట్టాభిషేకమూ,
ఎడం కాగానే పోస్టుమార్టమూ
అలవాటైపోయింది నాలుకలకీమధ్యన. 
********

Wednesday, August 14, 2013

విరుల ఆనందబాష్పాలు

విరుల ఆనందబాష్పాలు
నిండు జాబిలే దిగొచ్చి 
వెన్నెల బొట్టెట్టి తన ఇంటి పేరంటానికి 
తమనాహ్వానించిందంటూ ఆ పూబాలలన్నీ,
తమ పై వాలిన మిణుగురులతో కల్లలాడువేళ!
కలలో నుండి  మేలుకున్న నాపై !
నవ్వుతూ అన్నైతే నీటి ముత్యాలను రాల్చి ఆ విరులన్నీ!
అందంగా నే కన్న కలకు 
వాని కన్నుల జారే ఆనందబాష్పాలని అన్నాయి. 
*******
సంజె సిగ్గు
నా చూపుటింటి లోకి 
తొంగి చూస్తున్న సంజె చెక్కిలిపై 
కనురెప్పల పెదవులతో నే ముద్దిడినంతనే 
విశాల గగనమంతటి సిగ్గొచ్చెనామెకు. 
*******
ఆట పాట
మేధావుల నాల్కలను పట్టుకుని 
వేలాడుతున్నాయి పాపం! 
చిన్నారులను అలరించాల్సిన ఆట పాట. 
********
వాల్జడ
అన్ని పూతలతో! విరబూస్తుంటే ఆమె గారి ముఖం 
నువ్ చేసిన పాపమేమిటే? 
కోతలతో, ముస్తాబుకు 
ఆమడ దూరాన ఆగావు! ఓ వాల్జడ. 
******
బ్లాగ్మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

Monday, August 12, 2013

సిగపట్లు

సిగపట్లు
నన్ను సేద తీర్చాలని 
పాపం! తానెలా సిగపట్లు పడుతోందో చూశావా 
ఆ గాలి ఈ తోట లోని మానులతో. 
*******
తెలుగు భాష
ఉచ్ఛారణలో మనం సగం ఊపిరి తీస్తుంటే 
ఉదాసీనతలో తాను మిగిలిన ఆ ఊపిరిని 
పోగొట్టేసుకుంటోందా తెలుగుభాష. 
********
దీపం
చీకట్లోంచే వెలుగు పుట్టిందని చెప్పడానికో!
లేక ఎంతటి వెలుగైనా 
చీకటిపాల్ కావలసినదే అని చెప్పడానికో!
అలా ఆ చీకటినే చెంతనుంచుకుని వెలిగేది ఆ దీపం. 
*******

పసిపాపడు 
మాయమౌతూ ఆ నక్షత్రాలు వదులుకున్న 
తళుకులను ఒడిసిపట్టుకుని మరీ 
అమ్మ ఒడిలోంచి నిదుర లేస్తున్నట్లున్నాడు 
ఆ పసిపాపడు
********

Tuesday, August 6, 2013

అంతరంగపు చిటపటలు

అంతరంగపు చిటపటలు
ఆకాశపు చిటపటలకు మౌనాన్ని నేర్పి 
తనను తాను పండించుకున్న ఆ బీడులా ఐతే 
ఎంత బావుణ్ణు నా మనసు,
అంతరంగపు చిటపటలకు 
మౌనాన్ని నేర్పుతూ. 
*******
ముదుసలి అందం
ఆ ముదుసలి అందం 
ఎడారి చందం అని అందామంటే 
చెరగని గురుతులేవో 
మాసిపోని చెలమల ఆనవాళ్లనద్దుతున్నాయి. 
********
దీపం
మంచి చెడులను 
తూకం వేస్తుందా దీపం 
తలకాడెలుగుతూ. 
*******
వెలిగే కనులు
సహనంతో ఆమె కళ్ళు 
సరదాకి ఆ సహనాన్ని కొన్నానన్న 
ఆనందంతో ఆతని కళ్ళు 
ఇరుసంధ్యలై వెలుగుతున్నాయి 
ఆ చీకటి గదిలో. 
*******

Thursday, August 1, 2013

మరుభూమి

మరుభూమి
ఆరిన దీపాలతోనే 
దీపావళి చేసుకుంటుంది 
ఆ మరుభూమి. 
*****
ఊహలు
విషాదాన్ని వేరు చేసి 
నాతో ఆనందపానం చేయించే 
హంసలు కాదటోయ్ 
నా ఊహలు. 
*****
విషాదం
ఎన్ని అశ్రుధారలనైనా 
కాదనక సేవించింది గానీ 
రెండంటే రెండు ఆనందబాష్పాలు 
తన గొంతు జారక 
ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతోందో చూడా విషాదం. 
*******
విలువలు
నాధుడనే వాడు వదిలేసాడని 
ఏనాడో పుస్తకమనే పుట్టిల్లు 
చేరాయా విలువలు. 
*******
కల
బద్దలై పోతున్నట్లు 
తెల్లారుతుండగా కలొస్తోందంటూ 
బావురుమంటున్నాయా కొండలీమధ్యనెందుకో 
*******