Follow by Email

Wednesday, February 29, 2012

KUNTHEE

కనులు తెరిచి
తన కళ్ళలోకి చూస్తే
పేగు బంధం బలపడుతుందేమోనని
కనులైనా తెరవక ముందే
కుండీకంపుతుంది
ఈ తరం కుంతీ.
    ******
రాళ్ళేసి నీరు పైకి తేవవచ్చు
పొగ బెట్టి ఎలుకను
బయటకీడ్వవచ్చు
ఏమి చేసి అవినీతి సొమ్ము
జాతికీయవచ్చు
దారుంటే చెప్పు
దరిద్రనారాయణ.
     *******
బూజట్టి తుమ్ములు తెప్పిత్తాదేమో
అనుకున్నా కానీ తాకగానే
నాటి మమత చూపి
కళ్ళ నీళ్ళు తెప్పించిందే
చిన్ననాడే నే అటకెక్కించిన
తెలుగు వాచకం.
        ********

Tuesday, February 28, 2012

NEMALEEKA

నేను మరచిన పాత జ్ఞాపకాలను
గురుతు చేస్తూ నా ఈ రోజును
తనకన్నా వర్ణమయం చేసింది
నాడు నేను దాచుకున్న నెమలీక.
             *******
నా నడకలలో తాను మొలిచి
నా అడుగుల నలుగుతూ కూడా
అంతకంతకు అందంగా తాను తయారై
నా గమ్యాలను చేరువ చేస్తుంది
ఆ కాలి బాట.
             *********

Friday, February 24, 2012

GUVVA

మాటలు పాటలు అన్ని పోయే
వద్దంటున్న మౌనమే మొఖాన రాసిపెట్టి
పోతున్నాడా సూరీడంటూ
తనలో తానే అనుకుంటుందా వృక్షం
ఎగిరే గువ్వను చూస్తూ.
           ********
ఆకాశం నుండి అజ్ఞాతంగా
ఓ మెరుపు బయల్దేరి
తను చేరాల్సిన గమ్యం ఏదని
కడలిని అడిగిందట
కడలి తీరిక లేకుండా ఆలోచించి
నీ పెదవులు చూపిందట.
           *********

Thursday, February 23, 2012

DEEPAM

నా సూపుల సమురును తాగుతూ
ఇంకా ఇంకా సల్లగ ఎలుగుతుందా
యెన్నెల.
             ********
కరిగే హృదయం
తనకుందని తెలిసే
తాను కరిగి మరీ అంకితమైంది
ఈ నేలకా నింగి.
         *******
నవ్వులు నాలో పూఇంచ
ఏ కోయిల కూయనక్కరలేదు
ఏ  వసంతం రానక్కరలేదు
నవ్వించే నీలాటి
నేస్తమొక్కడు చాలు.
       *******

Friday, February 17, 2012

పూలను నక్షత్రాలను ఇచ్చి పుచ్చుకుంటే
ఆ నింగి ఈ నేల
నా కళ్ళు నిజంగానే
నెత్తి  మీద కొస్తాయేమో
       ********
మేఘాలలో నాటిన
నా గుప్పెడు ఊహలే
ఈ నేలన అడవులై మొలిచాయి .
            *********
అంచు దొరికితే ఆవల ఏముందో
కనిపెట్టేస్తానని కాబోలు
అంచు నాకు కనబడనీయదా ఆకాశం.
            *********
నా కళ్ళు కావలి కాస్తున్నయన్న
ధైర్యం తో కాబోలు
ఆకాశం దాక ఎగిరేస్తోందా గువ్వ.
            *********
ఎప్పుడూ పూలనే చూసే
నా కన్నుల నుండి బొట్లు బొట్లు గా
నీరు గారుతుంటే ఆ మకరందమేమోనని
రుచి చూసా అదైతే కాదు గానీ
ఇంతలో నేలపై పడే నా నీడలోని
కను రెప్పల పై
తుమ్మేదలదేపనిగా వాలుతున్నాఎందుకో.
              **********
తను నేర్పినట్లుగా
నాట్యమాడుతున్నాడని
సేషునికి ఎదురు దక్షిణ ఇచ్చే
గురువా పువ్వు.

MACHCHA LENI JABILI

               మచ్చ లేని జాబిలి
పున్నమి రాత్రిన
ఈ కొలను లో తేలే
 ఆ జాబిలి నీడకున్న మచ్చల పై 
మిణుగురులు గుంపులు గుంపులు గా వాలి
మచ్చ లేని జాబిలిని చూపిస్తే 
ఎంత బావుణ్ణు. 

ROAD

    చిన్న నాటి నుండి 
ఎదురు బదురు పెరిగిన ఈ చెట్లు 
చేయి చేయి కలిపి కళ్యాణం చేసుకుని 
తనకు గొడుగు పడుతున్నాయని 
మురిసి పోతోందా రోడ్డు .

Wednesday, February 15, 2012

ఆకాశం దిగొచ్చింది
ఎవరు చూడగలరు
యకాయకి ఆకాశం నుండి బయలుదేరిన
ఆ చినుకు ప్రస్థానాన్ని
ఎవరడగగలరీ నేలని నీ గుండె కరిగేంతగా
నీతో ఏమి చెప్పిందా చినుకని
ఎవరు చూడగలరా తోటలోని ఏ పువ్వులో
తను కనుతెరిచిందా చినుకని
ఎవరడగగలరీ గాలిని పువ్వైన ఆ చినుకు స్పర్శను
మా గుండెలకద్దమని
అపుడు ఎవరు మాత్రం కాదనగలరు
నీ గుండెల సడిని నేర్వాలనుకుని
తను చినుకై దిగొచ్చింది ఆ ఆకాశమని