Follow by Email

Monday, December 31, 2012

కాలప్రవాహం

కాలప్రవాహం 
అంతలోనే పుట్టి నీలో నీవే కలిసిపోయే 
నీ ఇంద్రజాలమెవ్వరికీ అబ్బింది కాదు 
నీ రూపగోప్యతకాలవాలమై ఎన్నో చైతన్యాలు 
నీ ఒడిలో పెరిగి విరుగుతాయి 
నీ ఏకరుప స్పర్శకు ముగ్ధమొంది 
ఏకాంశిక తానై నీ కౌగిట చేరి వివిధ రూప లావణ్యాలతో 
తననలంకరించమంటుందీ విశ్వం 
అలంకరించి, తన వంక చూడక సాగే నీ చూపున పడాలని 
నీ వెనుకే వస్తున్న విశ్వానికి 
ఆ బాటలోనే శాంతి విశ్రాంతులు కల్పిస్తావు 
నీలో లేని విభాగాలకు ఎన్నో పేర్లు పెట్టుకుని 
ఈ విశ్వస్రవంతి తనపై 
ఎన్నో రంగుల నీడలు పడేట్టు చేసుకుంటుంది 
ఎన్నో అందాల భావనలతో తన వియోగ దుఃఖ స్పందనలను 
సాఫల్యానుభూతులను నీకే ఆపాదిస్తూ 
నీ చేయూతతో నడిచే విశ్వంలో నేనెంత నా స్థానమెంత 
ఐనా నీ సంపూర్ణ భాగస్తుడిగా నన్నెంపిక చేసి 
నాకందుతున్న  నీ విలువను నేనెరిగేదెపుడో.
*********
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 

Saturday, December 29, 2012

హిమవసంతం

హిమవసంతం 
నాదైన ఈ తోటలో 
కొమ్మ మీద కురుస్తున్న ప్రతి చుక్కా ఓ పూవైపోతుంటే 
ఆ తావిని మోస్తూ గాలికి పట్టిన స్వేదం ముత్యాలౌతుంటే 
రెక్క విప్పాతేటులు మయూరాలనే మించి ఆడుతుంటే 
నా మనసున రేగిన మోదమంతా 
తుషారమై ఈ తోటన పరచుకుంటే 
అపుడు నా రెప్పల చప్పుడు ఆ కోకిలల పిలుపై తోచి 
అందాల హిమనగాన్ని స్వాగతతోరణమై వెలయించి 
ఆ వయ్యారి వసంతం తన విలాససౌధాన్నీ తోట గట్టుకుంటే 
ఈ అందాలకు మైమరచి ఆ తొలిసంధ్య 
పున్నమి జాబిలిని సాగనంపకుంటే ,
వాహ్యాళికని బయలుదేరినా ఇంద్రుడు మేఘాల చాటుగా 
ఈ తోటను చూసి ఊహకందని స్వప్నమొకటి 
వాస్తవమై వెలసిందని 
చేయి సాచి నన్నీ తోటను దానమీయమని అడుగకుండునా?
**********

Sunday, December 23, 2012

వాడిన జ్ఞాపకాలు

వాడిన జ్ఞాపకాలు 
ఎక్కడ వాటిని చూస్తూ 
విరియక ఆగిపోతాయో 
ఈ మొగ్గలని కాబోలు 
వాడినపూల జ్ఞాపకాలను 
తుంచేసుకుంటుందా చెట్టు.
*******
అల్లరి 
ప్రాణం లేకున్నా 
తనలోని నాదంతో 
మునిగిపోతూ 
ఎంత అల్లరి చేసిందో 
ఆ రాయి ఈ చెరువులో 
చూసావా!
********
నిదుర  
నిదురలోనైనా మొత్తంగా  
నిన్ను హత్తుకుందామంటే 
ఈ మాయదారి కలలు 
ఇపుడే మేలుకోవాలా 
అంటూ వాపోతోంది నిదుర 
నవ్వే నీ రెప్పల వెనుక.
*********
ఆకాశం 
కరిగి మాయమయ్యే 
మేఘం కోసం 
గుండెలవిసేలా రోదిస్తూ 
ఉరుముతుంది ఆకాశం.
********


Friday, December 21, 2012

శిల

శిల 
శిల శిల్పమైనదని 
నీడనిచ్చిన మాను 
మెడలో హారమైనది.
******
కాంతిసీమ 
కాంతిసీమకామె కాటుక రేఖను 
కావలి బెట్టిందని కాబోలు 
చీకటి ఖైదు లోకి 
జారిపోయిందా మెరుపు తీగ.
********
ఆడది 
అణచుకోవడం చేతకాక బ్రద్దలై 
అది విశ్వమైంది గానీ 
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ 
ఆడదే అయ్యేదేమో.
********
బాల్యం  
ఆట, పాట  
అనురాగము, ఆప్యాయత అనే 
నలుగురు బోయీలు మోసే 
పల్లకీలో ఎక్కి ఊరేగి 
ఎన్నాళ్ళయిందో ఆ బాల్యం.
********

Wednesday, December 19, 2012

అలజడి

అలజడి 
నిప్పొక చోటుంటే పొగ 
ఇంకొక చోటునుండి వస్తుందంటే 
నమ్మక తప్పడం లేదోయ్ 
అంతరంగంలో అలజడి 
కళ్ళల్లో సుడితిరుగుతుంటే.
********
జ్ఞాపకం 
అలలు ఎగసిపడుతున్న 
నా కంటిలో 
నీ ప్రతి జ్ఞాపకమూ 
ఓ ఆణిముత్యమే.
*******
వసంతం 
అన్నీ రాలిన మానుకు 
ఒక్క చిగురాకుతో వసంతం రాదేమో గానీ 
బంధాలన్నీ విదిల్చిన మనిషికి 
ఒక్క పిలుపైనా నిజంగా వసంతమే.
******
దీర్ఘాలు 
అతివల తలకట్లు 
దీర్ఘాలు కాకుండా 
పోతున్నాయీమధ్యన.
********

Tuesday, December 18, 2012

రాజకీయం

రాజకీయం 
కొన్ని నిజాలు 
కొందరికి తెలియకపోతే మంచిది 
అన్ని నిజాలు 
అందరికీ తెలియకపోతే మంచిది 
వెరసి నిజమన్నది 
మనిషికి తెలియకపోతే మంచిదంటూ 
సాగుతోంది నేటి రాజకీయం.
********
శోధన 
మట్టిని శోధిస్తే 
నాగరికత బయటపడిందోయ్ 
మరి మనిషిని శోధిస్తే?
అ.............
********
నీతి 
ఆదరించే మనసులు తప్ప 
అన్నీ ఉన్నాయోయ్ 
చట్టాలు రాజ్యాంగాలు అంటూ ఈ నీతికి.
*********
అవినీతి  
అవినీతి 
కాదు కాదు నీకు అనడం రావట్లా 
అవే నీతి లేదా 
అదే నీతి అని అనాలి.
********

Monday, December 17, 2012

ఋతు సంగమం

ఋతు సంగమం 
కొమ్మ చాటు గాంధర్వం విని 
పొంగిపోయిన ప్రకృతి డెందం 
అందుకుంది మా వలపు గంధం 
పరిమళించే ఈ సుమ బంధం. 
 
ఎదను బీడు చేయ 
గ్రీష్మాగ్ని గాదు విరహాగ్ని 
ఊహా మాత్రాన కోరింది ఇచ్చు జవరాలిని 
జత చేయు మోదాగ్ని.

అందం పురివిప్పింది 
ఆకాశాన్ని నీరు గ్రప్పింది 
కరిగిన మేఘం కార్చిచ్చై 
మన ఎడబాటునే దహించింది 

లోకాన్ని మంచు దుప్పటిలా కప్పింది హేమంతం 
పారవశ్యం చిగురాకుకూ అయింది సొంతం 
తొలి సంధ్య పాడింది సుప్రభాతం 
ప్రతి ఆకు రాల్చింది మన వలపు కరపత్రం.
 
పసిడి పుప్పొడి రాల్చింది 
శరద్పున్నమీ పుష్పం 
నీ నా సంయోగ సంగమాన్ని గాంచి 
రాల్చింది ఓ మధుబాష్పం.
 
రాలిన ఆకుల వలువలనే  
ఎంచుకున్న వనభూమిలా 
సింగారించుకుంది  నాదు హృది 
నిన్నటి నీ తలపులతో.
********