Friday, October 19, 2012

సన్మానం

 సన్మానం 
చేసిన సేవను మరువలేక కాబోలు 
కొమ్మ కొమ్మ ఆపి మరీ 
సన్మానిస్తోంది 
 ఆ రాలుతున్న పండుటాకును.
*******
మాటకారి 
మనసులోని అణువణువును 
పలకరించడంలో 
విషాదమంతటి మాటకారి కాదోయ్ 
ఆ ఆనందం.
*******
లయ  
మనసు పగిలిన చప్పుడులో 
ఏ లయుందని కరిగాయో 
నా కళ్ళు.
*******
జాబిలి 
కదలక నాడా బృందావనాన 
ఏ విద్య నేర్చిందో 
నేటికి గానీ అవగతం కాలేదా ఆకాశానికి 
కలువ కలువకు నడుమనున్న 
ఆ జాబిలిని చూసి.
******

Tuesday, October 16, 2012

అతిథి

అతిథి 
శుభమైనా అశుభమైనా
నీ ఇంటి చివరి అతిథి 
వీధి చెత్తకుండీ.
*****
మేఘసందేశం  
మేఘసందేశానికి 
అడుగుల సవ్వడికి 
దూరమై కూర్చుందా పంటచేలు.
*******
సెలయేరు 
పరుగెత్తే మేఘాన్ని 
ఒడుపుగా పట్టుకోవడం 
ఒయ్యారంగా నేర్చుకుందా సెలయేరు.
*******
జీవితం 
శోకం పండించిన 
నవ్వుల పంటను 
ఆ శోకం సాక్షిగానే తుంచేయడమే 
జీవితమంటే .
******

Monday, October 15, 2012

హరివిల్లు

హరివిల్లు 

ఆమె మేని ఒంపులో విరిసిన 
హరివిల్లుని చూసుకుని 
నేల ఆ నింగిని వెక్కిరిస్తోంది.
********

Sunday, October 14, 2012

శిశిర శిల్పం

శిశిర శిల్పం 
వేగం చేతిలో ఉలిని పెట్టి 
ఎంత అందమైన శిశిర శిల్పంలా చెక్కిందో చూడు 
నా జీవితాన్ని ఈ కాలం.
*******
వెలుగులోకి రాని జీవితాలు 
సిరా చుక్కలతో కూడా 
కన్నీరు పెట్టించగలవు గనుకే 
కొన్ని జీవితాలు 
అసలు వెలుగులోకే రావు.
********
గరికపువ్వు  
పరిమళించి నీ కురుల పల్లకీలో 
ఊరేగే పూల కన్నా 
ఓ చెలీ! నీ పాదాల పూజించే 
ఆ గరికపువ్వే నాకు మిన్న.
*******
క్షమాపణ లేఖ  
వెలిగా చీకటిని గాయపరచినందుకు 
ఆరాక తన ధూమంతో 
ఆ చీకటికి క్షమాపణ లేఖ రాస్తుందా దీపం 
అదిగో అలా......
********

Saturday, October 13, 2012

పల్లె చెరువు

పల్లె చెరువు 
తెల్లారకనే బుడ్డోళ్ళ ఆటలు 
ఎలుగెక్కాక ఆడోళ్ళ ఊసులు 
సందేలకు గెలుపు రాయుళ్ళ సాగనంపులు 
యెన్నెలేళకు పడుచు జంటల ప్రేమాయణాలతో 
నాడు విశ్రాంతి ఎరుగని ఆ పల్లెచెరువు 
నేడు ఎవరూ లేని అనాధలా.........
********

Thursday, October 11, 2012

పండుటాకులు

పండుటాకులు 
ఐన వారి అడుగుల సవ్వడి కోసం 
నలుగుతున్న ఆ పండుటాకుల 
హృదయ వేదనను 
అడుగుల కింద నలుగుతూనే 
భాష్యం చెబుతున్నాయా ఎండుటాకులు.
********
బృందావని 
కన్నులు దీపాలు శ్వాస ధూపం 
నైవేద్యమిదిగో పెదవులకు పెదవులే 
అందించుకుంటున్నాయా బృందావనాన.
********
వాలి సుగ్రీవులు 
ఎదురుపడి ఆ కాన్వెంట్లో 
యుద్ధం చేసుకుంటున్న వాలి సుగ్రీవులనుకుంట 
ఈ ఆంగ్లము ఆ ఆంధ్రము 
అయ్యో! ఇది త్రేతాయుగం కాదుగా
పాపమా సుగ్రీవుడెలా.......?
*********

Wednesday, October 10, 2012

మనసుంటే మార్గం....

మనసుంటే మార్గం....
మనసుంటే మార్గం ఉంటుందని,
ఆ ఎండమావిని కూడా 
అలలెగసి పడుతున్న కడలిగా మార్చి 
నావగా తానెలా సాగిపోతోందో 
చూడా ఎండుటాకు.
********
మనసు తలంపు 
తమను సాగనంపి 
తాను తేలికబడదామనుకున్న 
ఆ మనసు తలంపు 
తేరేది కాదంటున్నాయా కన్నీళ్లు అప్పుడప్పుడు.
********
ఇంద్రధనుస్సు 
కట్టడానికి నారే గనుక ఉండి 
బాణాలు వేయడం మొదలెడితే ఆ ఇంద్రధనుస్సు 
తమకా దేవుడి మెడనలంకరించే 
భాగ్యమెక్కడిదంటున్నాయా పూలు.
*********
రక్త పిపాశులు 
ఇంత రక్త పిపాశులైయుండి కూడా 
చరిత్రలో స్థానం సంపాదించలేక పోయాయేమిటోయ్ 
ఆ దోమలు.
*******

Tuesday, October 9, 2012

భువనవిజయం

భువనవిజయం 
తమ రచనలను  అందంగా పాడి వినిపించే 
జలపాతం,  సెలయేరు 
పక్షులు, కీచురాళ్ళు 
తుమ్మెదలు, తేనెటీగలు 
గాలికూగే చెట్లు, నానా మృగాదులనే 
అష్టదిగ్గజాలతో నిత్య శోభిత 
భువనైక మోహన భువనవిజయమేనోయ్ 
ఆ అడవి.
***********
ఇంద్రధనుస్సు 
మనసులు కలిసి అప్పటికప్పుడే 
మనువాడతాయేమోనని ఆ ఎండా వానలు 
తాను తాళిబొట్టుగా  ప్రత్యక్షమౌతుందా ఇంద్రధనుస్సు.
**********
కావడి 
పున్నమి వెన్నెల్లో 
సరదాగా కావడి మోయాలనుకున్న ఆ జాబిలికి 
కావడి బద్దలా దొరికిందా గోదారి 
మరి కుండలంటావేమిటోయ్ ?
రసాస్వాదనాబాష్పాలు రాల్చుతున్న నీ నా కన్నులేనోయ్.
**********
ఆశలచిగురింత 
చెమరించిన ఎన్ని నయనాలకు తెలుసు 
తమ ఆశల చిగురింతకు 
అక్కరకు రావీ కన్నీరని.
*******

Monday, October 8, 2012

ప్రియుని రూపు

ప్రియుని రూపు 
ఎంత కదిలించాలని చూసినా
కదలక నిలబడి ప్రియుణ్నే చూసే 
ఆమెను ఏమీ అనలేక 
పదిలంగా ఆ ప్రియుని రూపు పట్టి 
ఆ కలువభామినికిచ్చి అలసట తీర్చుకుంది 
ఆ తటాకం.
******
 ఆమె అడుగులు 
ఆమెనిక చేరకపోయినా పరవాలేదు 
ఆమె అడుగులలో 
నా అడుగులు పడుతున్నాయి 
అది చాలు.
******
ప్రకృతి 
ఓ క్షణం చాలు 
ప్రకృతిని నీవు చూడడానికి 
ఆ క్షణం చాలు 
ప్రకృతే నీవవడానికి.
*******
కొరడా  
మెరుపు కొరడా ఘుళిపిస్తే 
ఇన్ని చెమటలు బోసాయా?!!
ఆ ఆకాశానికి.
*******

Sunday, October 7, 2012

చిగురుటాకు

చిగురుటాకు 
ఆ చిగురుటాకు జననాన్ని 
కళ్ళప్పగించి చూస్తూ వనానికంతా వినబడేలా 
చప్పట్లు కొడుతున్నాయా పక్షులు 
రెక్కలాడిస్తూ .
******
మౌనం 
మాటలు పాటలు అన్నీ పోయే 
వద్దంటున్నా మౌనమే
మొఖాన రాసిపెట్టి పోతున్నాడా సురీడంటూ 
తనలో తానే అనుకుంటోందా వృక్షం 
ఎగిరే గువ్వలను చూస్తూ.
*******
ఆకాశం 
కరిగి మాయమైన మేఘం కోసం 
గుండెలవిసేలా ఉరుముతుంది 
ఆకాశం.
******
కల  
కడలి అల  
మెలకువతో కనే కల 
తిరిగి తిరిగి నీ అడుగులు కొలవాలని.
******

Saturday, October 6, 2012

జోల పాట

జోల పాట 
చిటపట అల్లరి చేసిన 
వాన చినుకులకు 
నోరు తెరిచిన బీడు 
జోల పాడింది.
*****
ఉదయ సుందరి 
తాను రాసిన పాటను 
పాడడం కోసమని 
ఎన్ని గొంతులను మేల్కొల్పిందో 
ఆ ఉదయ సుందరి.
*******
జలపాతం 
మంచి చెప్పే లోపే 
ముఖం పగల గొట్టేసుకుంటుందని 
ఆ పర్వతమెప్పుడూ 
తిడుతూనే ఉంటుందా జలపాతాన్ని.
*******
ఘోష 
మేనంతా కరిగించిందని 
ఆ మేఘం ఘోషిస్తూ 
ఈ గిరి తనువునే చీలుస్తుంది 
జలపాతమై.
******

Friday, October 5, 2012

మొట్టికాయలు

మొట్టికాయలు 
మొట్టికాయలంటే ఎంత ఇష్టం లేపోతే 
వాన వెలిసాక కూడా 
ఆ ఆకుల నుండి జారే నీటి బొట్లతో 
మళ్ళీ మళ్ళీ ఈ నేల అలా.....
********
పూల చరిత్ర 
పట్టు బట్టి మరీ ఆ పూల చరిత్రని 
గ్రంథస్థం చేస్తున్నాయి 
ఈ తేనెటీగలు.
********
వాన చినుకు 
నిండు జాబిలిలా 
తనను తాను అలంకరించుకుని 
ఆనక ఈ పుడమికి వన్నెలద్దుదామని 
తనను తాను ఎలా బ్రద్దలు చేసుకుంటుందో 
చూడా వాన చినుకు.
********
రాదారి 
వెలిగే వీధి దీపాలై ఆ పూలు 
నా చూపులు నడిచే 
రాదారిగా చేసాయీ తీగను.
*******

Wednesday, October 3, 2012

వర్షరాగం

వర్షరాగం 
పరిమళ మంత పారవశ్యాన్నే కాదు 
మొలకలెత్తినంత ఆనందాన్నీ 
చూపగలదా మన్ను 
 హర్షాన రవళించిన 
ఆ వర్ష రాగాన్ని వింటూ.
*********
అత్తగారు 
గుభాళించే పువ్వుల్లాటి పిల్లల్ని 
వేలు లక్షలుగా కని కూడా 
ఆ తోట దక్కించుకోలేని అత్తగారన్న గౌరవాన్ని 
ఇద్దరంటే ఇద్దర్నే కని దక్కించుకుందా చెరువు 
సూర్య చంద్రులను అల్లుళ్ళుగా సంపాదించి.
********
'గాలి' తో సావాసం  
'గాలి'తో సావాసం చేసి 
తనలోని భావుకతను 
బయట పెట్టుకుంటే ఆ ఎడారి 
'గాలి'తో చెలిమి చేసి తన వైభోగాన్నే 
పోగొట్టుకుందీ న్యాయం.
*******
వాన పాట 
ఒక్క వాన పాట పాడి 
తన వసంతాన్ని 
శిశిరంగా మార్చుకోగలదా ఆకాశం.
********


Monday, October 1, 2012

తెలుగు వాచకం

తెలుగు వాచకం 
నాడు నా బ్రతుకెంతో ఘనం 
నేడు బ్రతకడమే గగనమంటూ 
ప్రతిధ్వనిస్తూనే ఉందా తెలుగు వాచకం.
*********
నల్లవాడు 
అక్కడ కోయిల పిలుపులు లేవు 
తేటిని పిలిచే పూవులు లేవు 
కానీ ఆ వనాన నిత్య వసంతం 
 కొలను లేదు కలువలు లేవు 
కానీ నిత్య పూర్ణిమ ఆ తీర ముఖచిత్రం 
  అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి 
పాదాలు కదిపే పడుచులాటలో 
నిదురన్నది మరచి  రాతిరి 
ఆ నల్లవాడి మేని వర్ణమైందేమో 
********
చేతి గాజులు  
రవ్వంత సడి లేకుండా 
ఆమె ఊసులు వినాలన్న నా తలపును 
రాగయుక్తంగా తీరుస్తున్నాయి 
ఆమె చేతి గాజులు.
*******
ఆత్మీయత 
పంచిన ఆత్మీయత 
చాలలేదనుకుందేమో 
ఎగసి ఎగసి గాలితో కలసి 
తుషారమై మరీ నన్ను తాకుతోంది 
జోరువాన.
*********