Saturday, March 30, 2013

ఉదయ వాహ్యాళి

ఉదయ వాహ్యాళి 
లేలేత వలపుల తొలికిరణాల పలకరింపులలో 
పై సొగసులనే దాచిన! పైటన ఈ సీమ అందాలు చూస్తుంటే 
నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది 
ఒదిగి కూర్చున్న స్వేచ్ఛ రెక్క సాచి  
సంధ్యకై హారతి పడుతున్న చిత్రాలవిగో 
సద్దుమణిగిన నిన్నటి హ్లాద వేణియను మీటా 
వికసిత కిసలయత్వాన! కళ్ళు తెరచిన పూబాలలవిగో 
ఆ చిత్రాల ఛాయన ఈ వేణియ పాటల 
నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది 
నిన్న పున్నమి రాతిరి ఒళ్లంతా వెన్నెల విభూతి పూసుకుంది 
నేటి తొలి పొద్దున్న సంధ్య నేసిన కాషాయం గట్టింది 
గట్టున కూర్చుని సన్యసిస్తుందేమో? ఈ చెరువని అనుకున్నా 
అలల చేతుల ఆకసంతో వియ్యమొంది అది చేసిన కనువిందు చూసి 
నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది  
పరుగు పరుగున నే పోతూ ఉంటే ముత్యాలు మోమున పూస్తూ ఉంటె 
నాకేవంటూ? ఆ సోయగాలని అమాయకంగా అడిగే నా నీడ చిటికెనవేలు పట్టుకుని 
ఏడడుగులు నడిచింది ఆ ప్రకృతికాంత ఈ ఉదయవాహ్యాళి వేళ 
అందుకే నా మనసు విరిసింది మధువని వోలె  హృదయం పొంగి పారింది. 
********    
 

Thursday, March 28, 2013

ఆత్మీయతాగంధం

ఆత్మీయతాగంధం 
పదపదమని పరుగెట్టిస్తూ!
అంతలోనే ఆగాగంటూ ఆపేస్తూ 
తనలోకి రాలిపడిన ఆ పండుటాకులోని 
ఆత్మీయతాగంధాన్ని, తన గుండెలో 
ఎలా దాచుకుందో ఈ యేరు. 
*******
అనురాగపు పిపాస 
నన్ను అడగాల్సిన నా యోగక్షేమాలను 
నా అడుగులనడుగుతూ వాటి 
అనురాగపు పిపాసనెలా తీర్చుకుంటున్నాయో చూడు 
కడలి తీరాన ఆ అలలు. 
*******
కాన్వెంటుల్లో 
కాళీయునిలా 
ఆ తాత బొజ్జెపుడూ సిద్ధమే 
మధించే మనవడి కృష్ణ పాదాలెక్కడ?
*******
శంఖం 
జీవితకాలం పాటూ 
ఘోషను అవపోసన పట్టి 
నా చెవిలో ఇన్ని గాంధర్వాలను 
తానెలా పాడగలుగుతోంది. ఈ శంఖం. 
*******

Tuesday, March 26, 2013

మౌనం

మౌనం  
మా కన్నా మా ఇద్దరి
మౌనాల సాహచర్యమే ఎక్కువ
అది తెలిసే ఆదమరచి మేం
ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటాం
తప్పా.......
**
మౌనం మౌనం కలసి
ఎలా మాట్లాడు కుంటాయంటే
రెండు గుండెల చప్పుళ్ళను
నెమ్మదించి
                     నాలుగు రెప్పల సవ్వడిలా.
**
నీవైన ఎన్నో తలపులను
పల్లవిస్తుంది
నా మౌనం.
**

నీ మౌనం లోనే
తానెదుగుతున్నానని
నా మనసెప్పటికీ
మరచిపోదు.
**
వాడని తోరణంలా
ఒక్క నీ మౌనాన్ని
అలంకరించుకుని నా మనసు
ఎన్ని అనుభవాలను
ఆహ్వానిస్తోందో.
*****

Monday, March 25, 2013

తల్లి

తల్లి 
ఒడి లోకి వాడు తెస్తున్న 
నవ్వుల వసంతాన్ని వర్ధిల్లమంటూ 
తన కన్నుల!
శిశిరాక్షతలను చల్లుతుందా తల్లి. 
**
ఎదలోని విషాదాన్ని 
ఒడిలోని నవ్వులపై ఒంపితే!
ఆమె తల్లెందుకు ఔతుందోయ్!
**
సూది మందు 
ఎంతగా బాగుపడిందో చూసావా!
ఆ బీడు ఆరోగ్యం 
సూదిమందు వేసే సరికి ఆ వాన చినుకులు. 
******
ఉరుము  
పైకి రమ్మంటూ ఈ పుడమిని!
మెరుపంతటి కాలిబాటలు వేసి ఆహ్వానిస్తే 
ఒక్కసారి కూడా రాదేమంటూ 
అలా అరుస్తుంటుంది! ఆ ఆకాశం. 
*******

Friday, March 22, 2013

తెలుగు తల్లి భారతం

తెలుగు తల్లి  భారతం 
చరిత్రన ఆమె రాల్చిన ఆనందబాష్పాలనొక్క కడవన 
వర్తమానాన ఆమె కార్చుతున్న కన్నీళ్ళ నింకొక కడవన 
నింపుకున్న కావడినెత్తుకుని కాటి దారిన 
బయల్దేరిందామె!
సోయగం నిండా పదహారు అణాలున్న 
ఆమె మనసు నిండా ఏవో గాయాలు 
గొంతున విషాద గేయాలు 
ఎవరు తల్లీ నీవు ఈ దారి పట్టి ఇట్లా పోతున్నావు అని అడిగాను
వణికే గొంతుతో తన విషాదాన్ని 
భారతంగా చెప్పనారంభించింది. 
భువనవిజయ  చంద్రికల నల్లుతూ 
నింగి దాకా ఎగిరిన తన కీర్తి బావుటాపై 
మరకలుగా పడిన, మన వ్యామోహాలను 
తూర్పారబడుతూ ముగించింది.  
ఇప్పుడు ఆమె ఎవ్వరో అర్ధమై అందరికీ వినబడేలా అరిచాను 
అదిగో కాటి దారి పట్టి పోతున్న ఆమె మన తెలుగు తల్లని 
ఆపండి ఆమెనాపండి అని 
నీ గత వైభోగాన్ని తిరిగి నీ పాల్జేస్తామమ్మ అని 
బాస చేసి ఆమె నూరడించండని 
ఆమె గోడులానే నా గొంతు కూడా 
అడవి గాచిన వెన్నెలేం కాదుగా! చెప్పవూ నేస్తం!
********

Thursday, March 21, 2013

వృద్ధాశ్రమాలు

వృద్ధాశ్రమాలు 
అజంతా ఎల్లోరా శిల్పాల కన్నా అందమైన 
బ్రతుకిచ్చిన, సజీవ శిల్పాలు ఎన్నో 
ఆ  వృద్ధాశ్రమాలలో 
**
రాలిన పండుతాకును 
తన నీడన పెట్టుకుని 
ఆ వృద్ధాశ్రమాన్ని దెప్పిపొడుస్తోంది 
ఆ మాను 
**
చేసిన సేవను మరువలేక 
కొమ్మ కొమ్మ ఆపి మరీ సన్మానిస్తుంటే ఆ పండుటాకును 
ఎంత అపురూపంగా చూస్తోందో 
ఆ వృద్దాశ్రమం 
**
శిశిరం తర్వాత  
వసంత బంధనానికి 
నోచుకోని మోడులెన్నో 
వృద్ధాశ్రమాలలో 
**
 

Wednesday, March 20, 2013

మిణుగురులు

మిణుగురులు 
ఆస్వాదించే మనసులు లేక, 
నేలపాలై పోతున్న వెన్నెలను 
వీపున పెట్టుకుని ఊరేగిస్తున్నాయి 
ఈ మిణుగురులు 
***
అద్దాన నిండు జాబిలిని పట్టి, ఆ జాబిలి లోని 
మచ్చలను కనబడనీయకుండా 
తేనెపట్టు లాటి ఓ పట్టు పట్టమని ఈ మిణుగురులతో 
నువ్ చెప్తావా లేక నన్ను చెప్పమంటావోయ్ 
***
మట్టి లానే నేను మాణిక్యాలను దాచేస్తే!
మలిసంధ్య! మా అమ్మామ్మ కోప్పడదా? నా మీదంటూ 
చూడవోయ్ ఈ చీకటి ఎన్ని మాణిక్యాలను బైటేసిందో!
మిణుగురుల్లా. 
***
వెన్ను చూపడంలోనూ నీరత్వముందోయ్! కాదంటావా?
ఐతే అదిగో వెన్ను చూపుతూనే ఆ చీకటిని ధిక్కరించే 
మిణుగురులొంక చూస్తూ అను ఆ మాట చూద్దాం. 
***
చుట్టూ చీకటున్నా నీలా, నాలా, ఆస్వాదించే మనసున్న వారు 
దొరికినప్పుడల్లా ఆ దేవతలిలాగే హారతులు పడతారోయ్ 
మిణుగురుల్లా. 
***

Tuesday, March 19, 2013

నీవు

నీవు 
నా తొలిచూపు లోనే నిన్నెంతగా చూసాయో నా కళ్ళు 
లోకంలోని అణువణువులో నిన్నే మేల్కొల్పుతున్నాయి 

ఒక్క పిలుపపైనా పిలువలేదు సైగైనా చేయలేదు 
నడిచి వెళ్ళిన నీ దారిలో గురుతైనా వదలలేదు 
కానీ నిన్నే చేరింది నా మనసు 
అన్నింటా నిన్ను వెదకడమే దానికి తెలుసు 

నీ మౌనం నన్ను తాకితే నిన్ను పిలువను పలువరించను  
నీ మౌనాన్ని నా గుండెలో నింపుకుని ఊరుకుంటాను 
నా చూపులు నిన్ను కరిగిస్తాయని 
నీ హృదయాన్నవి పలకరిస్తాయని నాకు తెలుసు 
తప్పదు నీ మౌనాలు మాటలై నాపై హిమవర్షం కురవకపోదు 
మన మాటలతో కొత్త మమతా మతమై లోకాలన వెలగకపోదు  

 నీకై కలలు గనేంతలో నాకై నిజంగా ఉదయిస్తున్నావు 
నీకై దూరాలలో వెతికేంతలో నా హృదయంలో బదులిస్తున్నావు 
నీకై నే చేరేంతలో నా అడుగులో అడుగు వేస్తున్నావు. 
***********

 



Wednesday, March 13, 2013

కాలమా? మనమా? మారాల్సింది

కాలమా? మనమా? మారాల్సింది 
కల్లోలాలు కూస్తున్నాయి! వికారాలు పూస్తున్నాయి! 
మనిషికీ మనిషికీ పొసగని తనాన 
రుచి చప్పబడిపోతోంది జీవితానిది! 
శుభమా అంటూ కొత్తవత్సరం 'విజయం' చేస్తుంటే 
ఆ పాత బూజంతా ఇపుడు దులుపుతావేమిటోయ్!
మనుషుల మధ్య అసలు మంచే లేనట్లు,  
వంచన రాజ్యమేలుతున్నట్లు
కోప్పడకు లేవోయ్ మన ఇద్దరి దగ్గర నిజమనే మాస్కుంది
ఎవడి అందం వాడికి కనబడనట్లుగా వేసేసుకుందాం ముఖాలపై
ఎవడి భావాలను వాడే మోసేసుకుందాం భుజాలపై
మారని మన మనస్తత్వాలు పండించిన సగటు సత్యాల్లోంచి 
ఇంతకన్నా తీపి మనకందదని తెలిసే 
ఈ కాలమెప్పుడూ తన వాకిలి ముందు విలువల కళ్ళాపి చల్లుకోలేదు 
మమకారపు రంగవల్లికను దిద్దుకోలేదు 
శాస్త్రమంటూ మనం తనకంటించిన పంచాంగాల్ని పట్టించుకోలేదు 
ఆరు రుచులను ఆస్వాదించలేదు 
అందుకే ఇపుడీ కాలం తరపున నిన్నో ప్రశ్న అడుగుతున్నాను 
మారిపోతున్న మన అంతరంగాలు, ఆలోచనల సాక్షిగా 
ఇంకెంత వరకూ ఈ ఆచారాలు కాలం ఒంటిపై ఆభరణాలై ఒప్పుతాయి?
తప్పదు మిగిలిన ఈ కాస్త పరిమళమైనా రేపటికి అందాలంటే 
నాకన్నా మిన్నగా నువ్వు ఆలోచించాలి తప్పదు నేస్తం. 
************


Sunday, March 10, 2013

లేఖాశ్వాలు

 లేఖాశ్వాలు 
 పూలు పంపిన 
లేఖాశ్వాలను కట్టుకున్న తేరులపై 
 తుమ్మెదలొచ్చాయి 
ఆ తోపుల్లోకి. 
*******
తొలకరి 
తన శౌర్యాన్ని చూపమంటూ 
వీరగంధం పూస్తుంది బీడుకి!
తొలకరి. 
*******
గోదారి 
ఉగ్గుపాలు పడుతూ 
గట్టుని బిడ్డలా చూస్తుంది 
గోదారి!
*******
వేసవి 
కనుచూపు మేర బాటల వెంట 
నీళ్ళ అంగళ్ళను తెరిచింది వేసవి 
నీ సరసమైన వీక్షణలతో వెలగడతావని. 
*******

Friday, March 8, 2013

నాడలా-నేడిలా

నాడలా-నేడిలా 
నాడు! ఆ బుడ్డోడి చేతిలో నలుగుతూ వాడితో పాటుగా 
అంబరమంతటి ఆనందాన్ని అనుభవించిందీ నాకు జ్ఞాపకమే 
మారాలు పోయే గారాలపట్టీలకంది 
షావుకారు కొట్టుకి షికారెళ్లి0దీ నాకు జ్ఞాపకమే 
జారి నేలపై పడి నేను టాంగుమంటే గాబరాగా 
నన్ను వెతుకుతూ తల్లడిల్లిపోయిన గుండెలెన్నో నాకు జ్ఞాపకమే 
శ్రీమంతుల మొదలు బుద్ధిమాంధ్యుల గుండె చప్పుళ్ళను విన్నదీ నాకు జ్ఞాపకమే 
కానీ నేడు ఒంటిగా బుడ్డోడి చేతిలో పడ్డానో! నేలకేసి కొట్టేస్తున్నాడు 
నేల తగిలి చప్పుడు చేస్తూ నే రోదిస్తున్నా 
నన్ను గుండెలకు హత్తుకునే వాడే లేడు  
శ్రీమంతుడికే కాదు కదా మతిలేని ధీమంతులకు కూడా 
అక్కరకు రాని చుట్టాన్ని నేనిపుడు 
మారిన ఈ కాలాన తళ తళలాడే రూపమైతే నాకొచ్చింది గానీ 
నాటి విలువ పోయి వెలవెలలాడుచుంటి 
చెల్లని రూపాయినై. 
********* 

Wednesday, March 6, 2013

ఈ జాబుకు బదులేది?

ఈ జాబుకు బదులేది?
అందరి ఎదలోని  ఊహలు, పసిడిజిలుగుల పల్లకీనెక్కాలని 
అందరికీ అందేలా జాబు రాసి విడిచాడు వాడు 
నా కాలికింద నలిగే గడ్డిపోచ సైతం, 
నిలిచి గాలికూయలూగే చిగురాకు సైతం 
తనకందిన లేఖలో తడిచి తబ్బిబ్బయితే,
నిలబడలేని పనుల మునిగిన నాదు మనసునకు 
పట్టుబడలేదయ్యో! ఆ వెన్నెల పట్టాభిషేక ప్రాభవం. 
*********
పలకరింపు 
తొలకరి పేరు చెప్పి 
అందరినీ ఆ గాలిలా 
పలకరించడం నేర్చిందీ మట్టి. 
*********
ఆశ  
జరామరణాలనే 
అలలతో సింగారించుకున్న సంద్రమీ లోకమని 
మంచి ముత్యాలకై వెదికేవు 
నీ ఆశ పాడుగాను. 
*******
పతంగాలు  
మెరుపంటి దారం తెగి 
గాలి వాటున 
ఎటు పడితే అటు ఎగిరిపోయే 
పతంగాలీ మబ్బులు. 
*******

Tuesday, March 5, 2013

సిద్ధాంతాలు-రాద్ధాంతాలు

సిద్ధాంతాలు-రాద్ధాంతాలు 
తీపో! చేదో!తనకూ కొన్ని అనుభూతులుండాలని 
ఈ కాలమే కోరుకుంటుందేమోనోయ్ 
అందుకే ఇన్ని సిద్ధాంతాల పూమాలలను వేసుకుని 
రాద్ధాంతాల ముళ్ళపై అదే పనిగా నడిచెళ్లిపోతుంది 
పరిమళాన్ని మెచ్చేవారు కొందరైతే 
పదునుకు నొచ్చేవారు కొందరు కదా!
అందుకే మనిషి పుట్టిన నాటి నుండీ నేటి దాకా 
పదునుకు, పరిమళానికీ నడుమ పెనుగులాట తప్పనూలేదు 
సామూహిక చితిమంటలు ఆరనూలేదు. 
*********

Monday, March 4, 2013

సీత

సీత 
సందేహం! 
అగ్నిలోకి కొమ్మను విసిరేస్తే,
ఆ అగ్నిలో పూవై విరిసి 
ఎంతటి మకరందాన్ని 
నా జాతికి పంచిందో చూడు 
ఆమె సంస్కారం. 
*******
నీడ  
వెలుగు ఔదార్యాన్ని 
చీకటి స్వార్ధాన్ని 
ఏక కాలంలో చూపగలదు 
నా నీడ. 
********
వేర్లు 
లోకం మెచ్చిన అంతటి 
భావచిత్రాన్ని గీశామన్న గర్వం 
కించిత్ కూడా లేకుండా 
మట్టిలోకి ఎలా ముడుచుకుంటున్నాయో 
చూడా వేర్లు.
 ********
అద్దం 
నవమాసాలు మోయకుండానే 
కాస్తంతైనా నొప్పులు పడకుండానే 
నవరసాలొలికించే 
నన్నెన్ని సార్లు ప్రసవించిందో 
నా ఇంటి అద్దం. 
********

Friday, March 1, 2013

శిశిర క్షోభ

శిశిర క్షోభ 
పసిడి జిలుగుల పట్టు పీతాంబరమొకటి 
ఉషః కాంతిన మా మేనియలపై నేసి 
తమ పనితనానికి తామెంత 
మురిసిపోయినవో! ఆ సంధ్యారుణ కాంతి పుంజాలు 
వర్ణాంగినులై, మోదక లాలసాన 
ఆ గాలికి విందు జేయు పూబాలలు 
మోమంత విప్పారిన కన్నులతోడ 
రాయంచలై మా తోడ నూయలలూగే 
కాలివ్రేళ్ళపై కదలక నిలబడిన 
మాతృమూర్తి క్షుద్భాధను 
కాదనక దీర్చే ప్రమోదమొక్కవైపు 
పచ్చగా మాలో పరవళ్ళు ద్రొక్కుతుంటే,
ఇంకో వైపున ఆయమ కాలివ్రేళ్ళపై వాలి 
ఇంత కాలమూ భుజాల మమ్ము మోసిన 
ఋణం తీర్చుకోవాలనుంది 
కాలం కలిసొచ్చింది!
మాలోని హరితమిప్పుడు సువర్ణమయింది 
కాలివ్రేళ్ళ మా ఆశ పండి రాలిన ఋణాలతో 
శిశిర క్షోభ వచ్చింది! వనానికి. 
*********