Follow by Email

Thursday, February 28, 2013

చరిత్రకూ కాలాలు

చరిత్రకూ కాలాలు 
యుద్ధం, వేసవి 
ఆనక జారిన అందరి కన్నీళ్లు వర్షం 
అలాటి యుద్దాలంటే 
ఈ అవని వెన్నులో పుట్టిన వణుకు సీథాకాలమ్.
 అవునోయ్ మనలానే మూడు కాలాలున్నాయి!
ఆ చరిత్రకీనూ. 
*********
ఇంద్రధనుస్సు 
పాపం తనకు 
ఇంకో వర్ణాన్ని అరువీయమని 
నా కన్నుల వెలసి ఆ ఇంద్రధనుస్సు 
ఆశగా చూస్తుంది 
నవ్వే ఆ పసోడి బోసినోరొంక. 
*********
వాన చెట్టు 
వాన చెట్టుని 
పెంచాలనుందేమిటోయ్ నీకు.?
ఐతే అవిగో విత్తులు!
ఆ తామరాకుపై నీటి బొట్లు!
ఎక్క నాటమని అడుగుతావేమిటోయ్?
సుక్షేత్రమైన మనసుని 
నీ దగ్గరుంచుకుని. 
********
గురువు 
ఇవి ఆడడం చూసి 
ఆ నింగిలో మేఘాలు ఆట నేర్చాయ?
లేక అవి ఆడడం చూసి 
తామరాకు మీద ఈ నీటిబొట్లు ఆట నేర్చాయా?
ఎవరు ఎవరికీ గురువో! కాస్త చూసి చెబుదు!
********

Tuesday, February 26, 2013

మనోహర రహస్యం

మనోహర రహస్యం 
 
ఎవరు మీటుతున్నారు మిమ్మల్ని 
ఇన్ని శృతులను మాకై వినిపిస్తున్నారు 
ఎవరు నేర్పుతున్నారు మీకు 
మీలో మీరు కలసి ఇన్ని వగలను మాకై ఒలకబోస్తున్నారు 
తనకు తెలుసేమో! నని ఆ నింగిని నేనడిగితే 
నాకేమీ తెలీదంటూ చేతులు దులుపుకు కూర్చుంది! నిర్మలంగా 
నువ్వైనా చెప్పమంటూ ఈ నేలను నేనడిగితే  
తనలోని అణువణువునూ నింపుకు కూర్చుంది! శ్యామలంగా 
అందుకే మళ్ళీ మీరోచ్చే వేళైనా 
మీ గుట్టు విప్పుతానంటూ చేతులు చాచి కూర్చుంది నా మానసం 
అదిగో చినుకు చినుకుగా కరిగి 
నా దోసిట పడి మీరు చెప్పేరు!
మా నేస్తులను యడబాయలేనితనం 
నేర్పింది మాకిన్ని శ్రుతులనని 
బొట్లు బొట్లుగా తిరిగి ఈ పుడమిపై కలసిన పారవశ్యం 
నేర్పింది మాకు ఈ ఒయ్యారమంటూ 
ఆహా!  నా మనసు దోసిట్లో.., మీ మనోహర రహస్యం 
వేయి వానవిల్లులై విరిసింది ఇదిగో ఇలా.... 
**********

Monday, February 25, 2013

చెప్పవూ ప్లీజ్

చెప్పవూ ప్లీజ్ 
జరిగింది చూస్తూ!
గెలిచిన  భావవాదమందామా?
ఓడిన మానవతావాడమందామా?
ఆ! ఏదో ఒకటి అందామ్ ఎందుకులే అనే 
నిట్టూర్పుల జడిలో కాసేపు మనసుని తడిపేద్దామా?
అవునోయ్ మరి!
మనకు సరిపడనిది, మనకు  నచ్చనిది జరిగినపుడు 
నిట్టూర్పు కన్నా నినాదమేముందోయ్! నేనూ మనిషిననడానికి 
అందుకే ఆ తారలెందుకు రాలాయో!
వాటి తళుకెందుకలా గాయ పడిందో అక్కడే వదిలేద్దాం 
అవును! కాగల కార్యం, ముష్కరులే చేశారని!
ఆ మృత్యువు హాయిగా శ్వాసించే వేళ 
తల బ్రద్దలైపోయే భాద్యతలతో ఎవడికి వాడా?
తలకెక్కని భాద్యతలతో ఎవడికి వాడా?
అన్న చర్చ ఎందుకులే గానీ 
రోజులు గడుస్తున్నాయన్న నిజం!
ఏ క్షణాన నాకు తెలీకుండా పేలిపోతుందో!
చెప్పవూ ప్లీజ్. 
*********

Saturday, February 23, 2013

ప్రాణాలు

 ప్రాణాలు 
పేక మేడలు , గాలి బుడగలు 
గాల్లో దీపాలు 
నా దేశ జనుల ప్రాణాలు!
**********
రక్తపాతం 
ఎవరికీ చేతకానట్లుగా 
తన ఒరలో రెండు కత్తులను ఇముడ్చుకుని 
ఏ కత్తిని తాను బయటకు తీసినా 
రక్తపాతం తప్పదంటుంది 
ఆ సంధ్య. 
*********
గీటురాళ్ళు 
పచ్చ నోట్లు పక్క దేశాలేనోయ్ 
ప్రతిభకు గీటురాళ్ళు!
నా దేశాన. 
********
నిబంధనలు 
మనం నిబంధనలను తప్పామని 
తానూ నియమావళిని 
మీరిందంతే ఈ ప్రకృతి. 
*********
స్కాములు  
సిద్ధాంతాలు పోయి 
రాద్ధాంతాలు రాజ్యమేలుతున్నాయనే 
శ్రేయస్సు పోయి మన ముందుకు 
స్కాములొచ్చాయి. 
*********

Monday, February 18, 2013

జ్ఞాపకాల మాల

జ్ఞాపకాల మాల 
విరహం కన్నా గొప్పగా 
జ్ఞాపకాల మాలను 
కట్టగలవారెవ్వరోయ్?
********
సంస్కృతి 
ఆమె ఒంటిమీద 
 కరువైన ఆ బట్టని 
ముఖం చెల్లక 
కప్పుకుంటుందీ సంస్కృతి.
********
రూపాయి నోటు 
ఈ రోజుల్లో అనురాగాలకంటూ 
ఓ రూపాన్నీయగలిగితే 
అచ్చంగా అది 
రూపాయినోటులానే ఉంటుందేమో.
*********
వసుధైక కుటుంబం 
వసుధైక కుటుంబమంటే 
ఈ వసుధ అంతా 
తన కుటుంబానికే చెందిందిలా 
అర్ధమైనట్లుంది మా నేతకి 
అందుకే అలా......
*********

Friday, February 15, 2013

చిరంజీవి

చిరంజీవి  
దేవతలనే వారు అమృతం తాగి
చిరంజీవులైనారో లేదో గానీ 
ఈ చరిత్ర మాత్రం 
రక్తం తాగి చిరంజీవైంది 
********
 చేతికర్ర 
చిన్నపుడెపుడో ఆ పంట కాల్వలో 
వంగి చేపలు పట్టిన సజీవచిత్రాన్ని
నడుము వంగిన వయసులో 
నీ ఆనందానికి చేతికర్రలా ఇవ్వదా 
నీ మనసు.
********* 
 మాట 
నేలంతా మౌనానికి 
చినుకంత మాట నేర్పుతుంది 
ఆ ఆకాశం.
******* 
రెక్కలు
నిదురించిన పక్షులన్నీ 
వాటి రెక్కలను 
నా స్వప్నాలకిస్తాయేమో.
********

Monday, February 11, 2013

విడిపోయిన జంట

విడిపోయిన జంట 
ఏనాడో విడిపోయిన జంటే 
కానీ నా చూపులకై నిరీక్షిస్తూ 
అక్కడక్కడా అప్పుడప్పుడూ 
కలుస్తుంటాయా నింగీనేలలు.
********
వసంతం 
ముసలి ముతక 
అందరినీ తరిమేసి 
నిఖార్సైన పడుచులతో 
సరసమాడుతుందా వసంతం.
********

కరిగే హృదయం 
కరిగే హృదయం తనకుందని తెలిసే 
తాను కరిగి మరీ ఈ నేలకంకితమైంది 
ఆ నింగి.
*******
ఆకర్షణ 
ఎంత ఆకర్షణ ఉన్నా 
ఏం లాభం నాకు 
ఆకాసమంతటి ప్రియుడు 
అక్కడే ఆగిపోయాక 
అంటూ కుమిలిపోతుందీ భూమి.
********

Sunday, February 10, 2013

గోదారి

గోదారి  
వడిగా పరుగు, ఆపై వొగురొకటి 
పోనీ ఆగమని అందామా? అంటే 
ఆమె గారి ఒంపుసొంపులను చూస్తూ 
మాట, మౌనమనే మాత్ర మింగేసింది 
ఇలా, ఆమె ఆడుతూ పాడడమెపుడు మొదలెట్టిందో గానీ 
చెట్టూ పుట్టా పైరుపాపల నోట ఆ పదనిసలను 
తాను వినని క్షణం లేదంటే ఈ కాలం, కాదనగలవారెవ్వరోయ్ 
అవునోయ్ మరి, ఈ ధాత్రిపై చరిత్రని కన్నదామె 
మురిపాల ఉగ్గు పాలు పడుతూ 
తన వేలిచ్చి నాగరికతను నడిపించిందామె 
ఊహల్ని, కలల్ని విరబూయించి ఎడారులంటి మనస్సులను 
రసికోద్యానాలుగా మార్చిందీ ఆమే 
గలగలల గాంధర్వాలతో సుశ్యామల గీతిని
ఇలా ఈ ఇలనాలపించిందీ ఆమే!
ఇన్ని చేసి కూడా!
మెత్తని తివాచీలు పరచి తనని ఆహ్వానించమనదామె,
పోయే దారుల ఈ ఇసుక తిన్నెలు చాలంటూ.
దొంతరలుగా శాలువాలు గప్పి సన్మానించమనీననదామె 
మేఘపు ఛాయలను తన మేనిపై కప్పుకుంటూ.
కడలి ఒడిని చేరునంత వరకు 
తన భావుకతతో ఈ ప్రకృతి పాదాలకు పారాణి దిద్దుతూ 
నవజీవన చైతన్యాన్ని నా ప్రాణనాడుల  నింపుతూ 
ఎలా సాగుతోందో చూడా గోదారి.
*********