Wednesday, May 29, 2013

నా మనసు

నా మనసు 
లోకాన్ని ఒవైపుకు, నన్నోవైపుకు నెట్టేస్తూ 
బలవంతానా ఓ విభజన రేఖను గీసిందెందుకో నా మనసు 
పోనీ! లోకం వైపు ఓ అడుగేద్దాం, దాని అంతరంగాన్ని చదివేద్దాం అనుకుంటే 
నీదే నిజమంటూ ఎక్కడలేని రాజసాన్ని నాకాపాదిస్తుంది 
నా కనుసన్నల్లో మెలగాల్సిన కన్నెపిల్ల ఈ లోకమని నన్నొప్పిస్తుంది 
తెలుసు! నన్ను చూసి పరిహసిస్తుంది ఈ లోకమని 
తన తో పల్లవించని నాకై ఏ గాంధర్వాలనూ వినిపించదనీ తెలుసు 
ఐనా ఎందుకో ఆ విభజనరేఖను దాటలేను నేను 
నాకు అహమనుకో లేక  నాపై నాకే అభిమానమనుకో, ఏమైనా అనుకో నువ్ 
గాయాన్నైనా గేయంలా మలచే మనసు నాకుందని మాత్రమే అనగలను నేను. 
**********

Thursday, May 9, 2013

తొలకరి తూటాలు

తొలకరి తూటాలు 
గాలి వాటాన తనపై దుమ్మెత్తి పోస్తున్న 
ఆ బీడు పైకి! గురిపెట్టి మరీ తొలకరి తూటాలను పేల్చిందా ఆకాశం. 
ఆహా! యుద్ధమూ లాభాసాటేనోయ్ అప్పుడప్పుడు. 
********
మరణం 
ఇంతకాలము నే తోడున్నానన్న 
స్వాంతనతో విరబూసిన కాలానికి,
మాయని గాయం! నా మరణం. 
*******
మజిలీ 
మజిలీని నీ మనసు 
మరచింది గనుకే 
బిజిలీ పోయింది జీవితాల్లోంచి. 
*******
కాలం 
చేయి తిరిగిన వైద్యుడవు 
నీవని అనిపించుకోవడానికి 
నాపై ఇన్ని గాయాలు పూయించాలా నీవు?
ఓ కాలమా!
********

Thursday, May 2, 2013

వెన్నెల

వెన్నెల 
అలంకరించుకోవడం 
నేర్చిన చీకటే 
వెన్నెల. 
*****
నీడ 
బ్రతకడానికని కాలంతో పాటూ 
పరుగెడుతున్న నన్ను చూసి 
ఆయాసపడుతుంది నా నీడ.  
అవును! నా కన్నా నా బ్రతుకు విలువ 
దానికే తెలుసు మరి. 
*******
 కాట్వాక్ 
కొన్ని దాంపత్యాలు కూడా 
ఫాషన్ గా కాట్వాక్ చేస్తున్నాయి 
కోర్టు మెట్లపై. 
*******
పరిమళం 
మనసుతో ఆ దేవుణ్ణి వెదకాలని 
తనువు శిలపై వాల్చి 
గుడిని దాటిందా పరిమళం. 
*******