Saturday, August 4, 2012

మనసు చెక్కిన శిల్పం 

మనసు చెక్కిన శిల్పం

నిముషాన వెళ్ళదలచి
నీ చూపుల ఆశుకవితా ధారలు
నే కోరియుంటి గానీ నీవేల
వలపులీను చూపుల కావ్య ధారలు కురిపించి
నీ మనసు చెక్కిన శిల్పంలా
నను మలచుకుంటివి
ఇక నే పోవుటెట్లు

********
వసంతం
కన్నీటి శిశిరమైననేమి
నా ఎడద గాయమ్ము
గేయమ్మే అల్లి
వసంతాన్ని విరబూయింతునీ లోకాన.

********
బడాయి
బడాయి కాకపోతే
ఏమంత దూరంలో ఉందని! తన నేస్తం
అంత పెద్ద దీపం వెలిగించి మరీ
బిగ్గరగా అరుస్తూ వెతుకుతుందా మేఘం
ఇంకో మేఘాన్ని.

*********
సమాజం  
పనికి రాని ఆకుల్ని రాల్చుకునే శక్తి
ఆ చెట్టుకున్నట్లే
ఈ సమాజానికీ ఉంటే?
********
యుద్ధం
ఎవరూ వద్దని అడ్డు చెప్పనంత
అందంగా యుద్ధం చేసుకుంటుంటున్నాయోయ్
చీకటితో ఆ రెల్లుగడ్డి పొదలు
మిణుగురు సరాలను విసురుతూ.

*********
పల్లెపడుచు
చెరువంత ఆకాశం కడవంతై
ఆ పల్లెపడుచు చంకలో ఊయలూగిన దృశ్యం
గుండె గోడలపై నుండి
గది గోడల మీదకి చేరింది.

*********
ఇంద్రజాలం
మెరుస్తూ పిలిచినా కన్నెత్తి
క్షణమైనా వాటి వంక చూడలేదని
కిందికొచ్చి రెప్పవాల్చలేని
అందాల ఇంద్రజాలాన్ని
నా కళ్ళ ముందెలా పరచాయో చూడా మేఘాలు
చినుకునొక్క మొలకగా మలచి.
***********


4 comments:

  1. ఇంద్రజాలం,సమాజం excellent అండి.ఇలా ఎలా వ్రాస్తారండి ఇంత బాగా!మీకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు. .

    ReplyDelete
  2. అన్నీ చాలా బాగున్నాయి రమేష్...
    అభినందనలు మీకు..
    happy friendship day..
    @శ్రీ

    ReplyDelete