Friday, August 10, 2012

గులకరాళ్ళు

గులకరాళ్ళు
మట్టి, ఇసుక మేఘాలుగా కమ్మిన నిండు చంద్రుళ్ళు
నలుపు, ఎరుపు గొంగళ్ళు కప్పుకుని
మట్టిలో మొద్దు నిదరోతున్న బట్ట బుర్రల తాతలు
మేఘం గాలికి కదిలినా, గొంగళి నీళ్ళకు చివికినా
నిండు చంద్రోదయం లాటి పాత పలకరింపుతో
యకాయకి నా మనసు పొరలను చీల్చి
బాల్యాన్ని బైటేసే తుపాకి గుళ్ళు
ఆహా! బాల్య స్రావాన్ని పిల్లకాలువలా పరుగెత్తించే
ఎలాటి గాయమైందో చూడవోయ్ నా మనసుకిపుడు
ఆనాడు, ఆ సెలయేటి గట్ల వెంబడి పరుగెడుతూ
దోసిళ్ళ కొద్దీ నీళ్ళతో ఈ బట్ట తలలకు తలంటి
అరుపులాటి పిలుపుతో నా నేస్తాల మధ్య
దివిటీల్లా వెలిగిన నా కళ్లిప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి
పోటీలు పడి మరీ పోగేసుకున్న గులకరాళ్ళు
జోడెడ్లలా ఆ జేబులు కట్టిన "లాగు"డు బండిలాటి
లాగూలో వేసుకుని ఇంటికెళ్తుంటే 
బరువుతో ఒకెద్దు కిందికి జారుతుంటే
నా చిట్టి చేతులే ఆసరాగా "లాగు"డు బండి
ఇంటిదాకా లాక్కెళ్ళిన సజీవ దృశ్యం
నేనెన్ని మైలురాళ్ళీ జీవితంలో దాటితే మాత్రం
మాసిపోగలదా చెప్పు నేస్తం
అవును మనసైన జ్ఞాపకాలు మట్టిలో ఉంటేనేం? ఇసుకలో ఉంటేనేం?
ఒకసారి పలకరించు నేస్తం
ఒకటో, రెండో, గుప్పెడో, గంపెడో పోగుచేయి
పట్టుకెళ్ళడమే తెలిసిన ఈ కాలం
నీ బాల్యాన్ని తిరిగి నీకెందుకివ్వదో చూద్దాం రా నేస్తం.
************

4 comments:

  1. బాల్యం లోని మధుర స్మృతుల్ని బాగా పలికించారు.విభిన్నంగా సాగింది మీ కవిత. .

    ReplyDelete
  2. "గులకరాళ్ళు" ఘల్ మని బాల్యాన్నంతా గుర్తుతెప్పించాయి...
    చాలా చాలా బాగుందండీ :-)

    ReplyDelete