Wednesday, July 4, 2012

ఆనంద తాండవం

ఆనంద తాండవం 
ప్రతి భావనలోనూ ఆమెనే తలపోసే నాకు 
ఆమె కన్నుల జారిన 
ఆనంద బిందువొకటి దొరికింది 
ఆ బిందువే అనంత రూపాలుగా ఈ పుడమిపై 
ఆనందతాండవం చేస్తోంది.
*******
గోదారి 
ఓ నాడు ఆకాశపు కన్య 
తారల ముందు  నర్తిస్తుంటే 
ఆమె పైట జారి వెన్నెల సంద్రాన పడి తడిచిందట 
కన్నె ఆ పైట తీయబోవ వెన్నెల సంద్రం కసిరి 
ఆ పైటను నేలకు విసిరిందట 
ఆకసపు గానం తనలో కలుపుకుని 
గలగలా సాగిందా పైట గోదారిలా 
వెన్నెలంటిన కస్తూరిలా.
********
జాబిలి 
నిండు జాబిలిని అద్దంలో పట్టి 
దాని మచ్చలపై మిణుగురులను పొదిగాను 
అంతే ఆ వెన్నెల కాంతిలో వెలిగిపోయే నన్ను 
సోదరా అని పలకరించిందా జాబిలి.
********
దీపం 
మాయం చేసిన చీకటిని 
తన కింది రెప్పగా 
మార్చుకుందా దీపం.
******

6 comments: