పూబోణి
రాతి గుండె కరిగించి, రాగమాలికాలాపించి,
ఒంపులు తిరిగే ఒయ్యారాన పచ్చలారబోసి
నేలమ్మ నుదుటిన సిరిరాత రాసే పూబోణి అని
ఆ గోదారిననిపించాలని ఎన్ని నురుగులో ఆ మేనుపై.
*****
కంటెరుపు
మింటి కంటెరుపు కిలకిలా రావాలు పలికిస్తుంటే,
నాలుగు గోడల నడుమే మూగవైపోతున్నవెందుకు?
ఇంతి కంటెరుపు గీతాలు.
*****
జిలుగులు
పడుగు పేకలు పారిజాతాలై విచ్చినా
ఆకలి అప్పులు సహజాతాలై గ్రుచ్చె
తరాల దృశ్య మాలికలో జిలుగులందరివి.
చిరుగులే వారివి.
*****
నాలుగు రాళ్ళు
కుదురుగా ఉన్న జీవితాన
నాలుగు రాళ్ళేసి అందం తేగలవా?
ఎందుకు తేలేవోయ్
మా ఊరి చెరువులో ఒకమారు అలా చెయ్.
అలల పై ఆడే నీ మనసుని ఆపనెవ్వరి తరమని
అడగవా మరి నీవే.
******
No comments:
Post a Comment