స్వప్నం
లయ నచ్చి తానెక్కడ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందో అని
చప్పుడు చేయనప్పుడా కనురెప్పలు
చక్కంగా వచ్చిపోతుందా స్వప్నం.
********
మృత్యువు
ప్రతి వికాసమూ ఆ కాలానికి
హృదయస్పందన ఐతే
తనకు మాత్రం ప్రాణస్పందన
అంటుందా మృత్యువు.
*******
ఆకలి
రసికత ఉన్నా లేకున్నా
ఎలాటి మనిషినైనా కదిలించగలిగే
రాగమాలపించడంలో తన తర్వాతే ఎవరైనా
అంటుందా ఆకలి.
*******
ఆవేదన
ఆవేదనే అధికభాగం కాబోలు
అందరిలా ఈ పుడమికీ
కాకున్ననేమి
కన్నీళ్లు కడలంత కాగా
ఆనందబాష్పాలు నదులంత.
*********
No comments:
Post a Comment