Friday, November 30, 2012

నీవు

నీవు 
నాకే అందని 
నా మనసు లోతుల్లోకి చేరి నీవు 
ఆ ఆకాశాన్ని మించిన శిఖరంలా 
నిలిపేవు నన్ను.
********
మనసు 
అంతు అఘాతము రెండూ తెలియని 
కడలిలాటిదేనోయ్ మనసూనూ 
మరి మథించి అమృతాన్ని పొందలేక 
వేదన అనే హాలాహలంతోనే 
 సరిపెట్టుకుంటావేమిటోయ్.
*********
కలల ఆచూకి  
కలల  ఆచూకీనే కాదు 
కలల చిరునామానూ 
చెరిపేస్తున్నాయా పుస్తకాలు 
పోటీ పెట్టి మరీ పరుగులెత్తిస్తూ 
ఆ పిల్లల్ని.
*********
సంఘీభావం  
నవ్వుకు సంఘీభావం తెలిపి 
ఏడుస్తున్న కళ్ళను చూస్తూ కూడా 
ఏడుపుకు సంఘీభావం చూపుతూ 
ఆ పెదవులు నవ్వవెందుకని?
*********

Tuesday, November 27, 2012

నాదు మనసు

నాదు మనసు 
గాయపరచే ముళ్ళను తోడుంచుకున్న 
పువ్వు కన్నా 
గాయపడి గుండెకు కన్నీళ్లను ధారవోయు 
నాదు మనసెంతో మృదువైనది గాదే.
*******
చీర 
వాడు మోయలేని అప్పులతో సహా 
వాడిని ఎంత సునాయాసంగా మోసిందో చూడు 
వాడు అల్లిన ఆ నూలుపోగుల చీరె.
********
అద్దం 
భూమి మొత్తాన్ని పట్టి చూపగలిగే 
అద్దమెక్కడ ఉందని అడిగిన గాలికి 
తనపై నీటిబొట్టును చూపింది 
ఆ గరిక.
*******
నాగరికత  
దీపం చీకటిని పోగేయడంతో సమానం 
నాగరికత 
ఆ వినాశనాన్ని పోగేయడం.
********

Saturday, November 24, 2012

అడుగులు-అనుబంధాలు

అడుగులు-అనుబంధాలు 
అసలు అడుగులకి అనుబంధాలకు సంబంధం ఎలాటిదోయ్ 
అనులోమమా? విలోమమా?
అది వేసే అడుగుకు తెలియాలంటావా?
వేయించే మనసుకు తెలియాలంటావా? ఏది చెప్పు 
ఎందుకంటే తన వైపుకు పడని అడుగులపై ఆశ కొన్ని మనసులకి 
కొలిచే మనసున్న దానిపై ద్యాసుండదు కొన్ని అడుగులకి 
ఎలా విప్పాలోయ్ ఈ చిక్కుముడి 
అసలు కొంగులు గట్టి బ్రహ్మముడి అంటారు గానీ 
ఈ ముడిని విప్పేదెవ్వరు 
ఎవరు వివరించినా ఇది విక్రమార్క విజయమే అవుతుందిలే గానీ 
ఏతావాతా ప్రతి అనుబంధానికి తెలిసేదేమిటంటే 
అడుగులు దూరంగా పోతున్నా దగ్గరగా పడుతున్నా 
మనసులు కొన్నిఆ అడుగులకు మడుగులొత్తుతాయని 
కొన్ని అడుగులకు తెలిసేదేమిటంటే 
అవునన్నా కాదన్నా తమ అడుగుల్లో అడుగులేసి నడిచే 
కొన్ని మనసులుంటాయని.
********

Wednesday, November 21, 2012

మృతాభిసారికుడు

మృతాభిసారికుడు 

వాడు సామాన్యుడు కాడు 
సంధ్యారుణ కాంతి పుంజాలను కన్నుల దాచిన వాడు 
అమావాస్య నిశికే తిమిరాన్ని అరువీయ గల అంతరంగమున్నవాడు 
సగం దేహాన్ని గోతిలో పూడ్చుకుని 
నిత్యమా మృత్యువుతో బేరసారాలాడేవాడు  
అవును! వేదన వాడి జీవన నాదమని తెలీక 
ఒక్కో పోగునూ వాడింకా జాగ్రత్తగా అల్లుతూనే పోతున్నాడు 
నవజీవన నాదం కోసం వెదుకుతూ 
గతకాలపు వైభోగానికి నీళ్ళోదలలేక 
అమాయకంగా కన్నీళ్ళోదులుతున్నాడు 
నిజం!వాడు సంస్కృతికే సంస్కృతిని నేర్పిన వాడు 
వొంటిపై ఇంద్రధనుస్సు వర్ణాలను తెచ్చిన వాడు 
జలతారు వెన్నెల జిలుగులను అగ్గిపెట్టెన పెట్టి 
ఈ లోకాన్నే అబ్బురపరచినవాడు  
కాదు కాదు వాడిప్పుడు నిదురను వెలివేసి 
స్వప్నాలను ఉరిదీసినవాడు 
పొట్ట చేతపట్టుకున్నా బిచ్చమెత్తలేని అభిమానధనుడు 
వేదనను తీరని వాంఛలను పడుగు పేకలుగా 
తనపై తానే అర్ధాయుష్షు వస్త్రాన్ని నేసుకుంటున్న 
మృతాభిసారికుడు.
*********

Monday, November 19, 2012

స్వాభిమానమా నీకు జోహార్

స్వాభిమానమా నీకు జోహార్  
వస్తూ నీవిన్ని ఆనంద బాష్పాలను తేలేదే
 పోతూ ఇన్ని కన్నీళ్ళనెలా పట్టుకుపోతున్నావు 
అందరిలానే ఎదిగావు కాలపు ఒడిలో ఒదిగావు 
ఐనా జరగకూడనిది ఏదో జరిగినట్లు ఏమిటా జనసంద్రం 
ఏమి పంచావని నువ్వు అందరికీ 
ఈ లోకంతో పొసగక నీ అంతరాంతరాలలో 
చెలరేగిన తుఫానుని తప్ప 
ఏమి చెప్పావని అందరితోనూ నువ్వు 
స్వాభిమానానికి మించిన సంపద 
ఆ స్వర్గంలోనూ లేదని తప్ప 
అందుకే వివాదాలు, సందేహాలు, సయోధ్యలు,సామరస్యాలు 
ఎన్నుంటే ఉండనీ నీతో 
నువ్వు చరిత్రవయ్యావన్నది మాత్రం వాస్తవం 
విజయానికి కూడా వివేచన ఉండాలని 
ఆ వివేచనలోనూ జాతి గౌరవం మెరవాలని 
నీవన్నది మరువగలవాడెవ్వడు ఈ భారతావనిలో ఓ థాకరే!
అందుకే మా స్వాభిమాన భారతానికి 
నీ జీవితమో ఉపనిషత్తు.
*******

Sunday, November 18, 2012

ప్రాణస్పందన

ప్రాణస్పందన 
చినుకుల సడికి 
ప్రతిస్పందన చూపమంటే 
ప్రాణస్పందనను చూపిందేమిటీ పుడమి.
******
అధరాలు 
అర విచ్చి నీ వదనానికి 
ఎంత అందాన్ని 
అరువిచ్చాయో నీ అధరాలు.
********
అనుబంధాలు  
ఒక తరాన్ని మించి 
సుగంధాన్ని పంచలేకపోతున్నాయి 
ఆ అనుబంధాలు 
బాబ్బాబు ఒక్క తరమైనా పంచుతున్నాయా? అని 
ఎదురడక్కు.
********
స్వప్నాలు 
నిదురనే తెర వెనుక 
గాఢ ఆలింగనం చేసుకున్న ఆ నిశి సుందరి
నాపై కురిపించే చుంబనాలే స్వప్నాలు.
********

Saturday, November 17, 2012

మాస్క్

మాస్క్ 
నేను నిజాన్ని ఒప్పుకోలేను 
అబద్ధాన్ని హత్తుకోలేను 
నా ఊహాశ్వమేధాన్ని ఆపనూలేను 
కపటత్వం నా అంతరంగాన్ని ఏలుతుంటే 
నలుగురిలో విభూతి నామాలు పెట్టుకుని తిరుగుతూనే 
కోరలని, నఖాలను నా ఆలోచనలకు మొలిపించడం మాత్రం మరచిపోను నేను 
ఎందుకంటే ఎలాగైనా గెలుపు కావాలి నాకు 
అది మిధ్యలోనైనా మీ అందరి మధ్యలోనైనా 
ఐనా నాతోనే నాకు పరిచయం గగనమైన ఈ కాలంలో 
నలుగురిలో నేనెలా మొలుస్తాను 
ఆ నలుగురిపై నేనెలా గెలుస్తాను 
అందుకే నాకు నిజం వద్దు 
అలాగని అబద్ధంలోనూ జీవించనునేను 
నాకిప్పుడు కావాల్సిందల్లా 
నాలోని నిజాన్ని మీకు చూపించని 
అబద్ధంతో నన్ను నొప్పించని మాస్కొకటే.
*********

Friday, November 16, 2012

అద్దం-అందం

అద్దం-అందం 
ఆమెతో ఆమె అందాన్ని ఒప్పించే సరికి 
పాపం ఎంత ఆయాసమొస్తుందో 
ఈ అద్దానికి.
******
జాలం 
మీనాల కోసం కాదు 
ముత్యాల కోసమీ జాలమల్లుతున్నానంటూ 
తెల్లవారే సరికి నిజంగానే 
తన జాలాన చిక్కిన ముత్యాలను 
వేలానికి పెట్టింది ఆ సాలీడు 
మెరుపంటి చూపులతో పాడుకొమ్మంటూ.
*********
అందాల కావ్యం 
తనపై తానే అందాల కావ్యాన్ని రాసుకోవాలని 
పరిమళించిన తన భావాలనెలా 
నాతో పంచుకుంటోందో 
చూడీ పుడమి తొలకరిన.
********
నెలవు 
అలజడుందని అలవాటైన నెలవునొదిలి 
తాను చేసిన తప్పింకెవ్వరూ చేయొద్దని 
గిలగిలా కొట్టుకుంటూ ఎలా చెబుతోందో 
చూడా గట్టున పడ్డ  చేప.
********

Thursday, November 15, 2012

అమృతోదయం

అమృతోదయం 
పరుషములాడినవి వారి అధరములు గాన 
నాడు అమృతోదయమ్మునకు మదనమవసరమయ్యె గానీ 
సరస సారస్వతమెరిగిన మాకయ్యది 
లిప్తపాటు క్రీడయే సుమీ అంటూ 
తమ అధరామృత రాశులు గట్టిన సౌధాన్ని 
ఆ చిటారు కొమ్మల వీక్షించమంటూ 
గాలివాటున ఆహ్వానమంపేరు 
ఆ తేనేతీగలు ఈ పూతీగెలు.
********
పుట్టుమచ్చ 
ఏ నెలవంకకు సైతమూ మచ్చలుండవా?
అంటూ ప్రశ్నించే 
ఆమె నడుమొంపున వెలసిన 
ఆ పుట్టుమచ్చ.
*******
పసిపాదాలు  
జానెడు నింపని  లోకాన్ని 
అవిశ్రాంతంగా కొలుస్తూనే ఉన్నాయి 
వాడి పసిపాదాలు.
*******
జీవితం  
నలుగురిలోకొచ్చి 
నలుగురిలోంచి వెళ్ళడమే 
జీవితమంటే.
******

Monday, November 12, 2012

చెలీ! నీకై....

చెలీ! నీకై....
గోదారి మేనంతా తానే కరిగింది ఎన్నెలా 
కరిగి ఏరులా పారింది ఆ పండు ఎన్నెల 
ఏరులా పారి అందాన మేరువే అయింది ఆ పండు ఎన్నెల 
మేరువైన అందాన 
జలతారు పరదాల్లా ఆ వెండి మబ్బులు 
ఆ వెండి మబ్బుల కింద 
ఈ పసిడి గడ్డి దుబ్బుల మాటున వెదుకుతోంది నా మనసు 
నీకై ఓ చెలీ! 
ఆ నిండు జాబిలిని నీ ముక్కెరగ పొదగాలని.
*********
(బ్లాగ్ వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు)

Friday, November 9, 2012

ఆమె

ఆమె  
ఆమె ఆక్రోశమే 
రామాయణం 
ఆమె అవమానమే 
భారతం.
*****
చీకటి గది 
సహనంతో ఆమె కళ్ళూ 
సరదాకి ఆ సహనాన్ని కొన్నానన్న ఆనందంతో 
ఆతని కళ్ళూ!
ఇరుసంధ్యలై వెలుగుతున్నాయా చీకటి గదిలో.
*********
తూకం 
మంచి చెడులను 
తూకం వేస్తుందా దీపం 
తలకాడెలుగుతూ.
********
వసంతగీతం-వర్షరాగం 
చెవులు కనుల మీదుగా 
మనసులోకి జారుతుందా వసంతగీతం 
కనులు చెవుల దారిన  
మనసు లోతుల్లోకి చేరుతుందా వర్షరాగం.
*********

 


Thursday, November 8, 2012

జీవన వసంతం

జీవన వసంతం 
బరువంతా దింపుకున్నాక గానీ సాక్షాత్కారించలేదు 
వసంతమనే స్వప్నమా మానులకైనా.
మరి నీవేమిటోయ్ ?
మోయలేనంత బరువుని నీ మనసుకెత్తి 
అలా ఆరాటపడతావు ఆ  జీవనవసంతానికై.
*********
పున్నమి  
విరిసిన ఆమె మనసు పొరలన్నిటి మీద 
అచ్చమైన మనసుతో 
వాడు చేవ్రాలు చేసిన ప్రతివేళ 
పున్నమే.
*******
నిండు మనసు 
పైకెదగమంటూ 
నిజమైన నిండు మనసుతో 
అక్షతలు చల్లడం 
ఆ ఆకాశానికి తప్ప ఇంకెవరికొచ్చు.
*******
పూజ 
తాను పోగొట్టుకున్న ఏకాంతాన్ని 
తిరిగి సాధించాలని 
ఓ చెలీ! నీ పాద ముద్రలనెలా పూజిస్తోందో 
చూడీ సంద్రపు తీరం.
*********
 

Monday, November 5, 2012

మెరుపు దారం

మెరుపు దారం 
ఎన్ని  పూలు 
నేలరాలాయో చూడు 
ఆ మెరుపు దారం తెగగానే .
********
నిగ్రహం 
ఆచ్చాదనలను, ఆభరణాలను వదిలేసి 
నిగ్రహాలు, గౌరవాలు 
కావాలంటున్నాయా అందాలు.
********
కవితాకపోతం  
భావాలను రెక్కలుగా సాచి 
ఎగురుతూ వచ్చి 
మీ గుండెలపై వాలుతుంది 
నా కవితాకపోతం.
*******
హృదయపాన్పు  
నే తలచిన రీతిన వచ్చి 
నీవెంత అలసితివోనని నాదు విరహాన,
సంగమాన నీ మేనుకు 
పాన్పుగా పరతు నాదు హృదయాన్ని.
*********