Saturday, June 30, 2012

దాంపత్యం

దాంపత్యం
రేపటికి వాడిపోయే పూలతో 
క్షణానికి ఇంకిపోయే సిరాతో 
సరిపెట్టుకుంటుంటే ఆ పెళ్లి తంతు 
తానేమో రోజులు లెక్కెట్టుకుంటుందా దాంపత్యం .
*******
ఇరువురు యోధులు  
ఆశయాలు వేరైన ఇద్దరు మహా యోధులను 
ఎదురు పడనిచ్చి కూడా 
రవ్వంతైన అలజడి రేగకుండా 
నిదుర దారినొకరిని స్వప్నపు దారినొకరిని 
సాగనంపే ధీమంతురాలు నా మనసు.
********
నెలవంక-నిండు జాబిలి  
ఎపుడైనా నెలవంకను  నిండు జాబిలిని 
 కలిపి ఒకేసారి చూసావేమిటోయ్ లేదా 
ఐతే నిదురలో లీలగా నవ్వుతున్న 
ఆ పసివాడి మోమునోసారి చూడు.
********
ఆత్మీయత  
అన్వేషణ ఆత్మీయతను పెంచితే 
ఆ ఆత్మీయతను 
పంచుతుందా అనుభవం.
*******

Friday, June 29, 2012

ప్రణయం-ప్రళయం

ప్రణయం-ప్రళయం 
ప్రణయానికైనా ప్రళయానికైనా తానే దిక్కని 
ఆ పువ్వుతో ఎలా ఆటలాడుతోందో 
చూడా గాలి 
అచ్చమా అతివతో ఆడుకునే అతగాడిలా.
********

తడిసిన మనసు 
ఆ తుషారం వెనుక షికారెళ్లి 
తడిసిన నా మనసు
తననారబెట్టుకుంటోంది చూడా ఎండమావిలా.
*******
స్వప్నం  
నిద్రకు  చెవులు లేవని 
తనకు పెదవులు 
వద్దనుకుందా స్వప్నం .
*******
తెలుసనుకున్నా  
ఇవ్వడమే తెలుసనుకున్నా 
ఆ కడలికి  చెలీ!
నీ పాద ముద్రలు మాయం చేసే దాకా. 
*******

Thursday, June 28, 2012

జలపాతం

జలపాతం 
వానచినుకిచ్చిన హాయిని 
మరువలేకే కాబోలా కొండ 
ఆ జలపాతాన్ని అలా సాగనంపి 
తుషారాన్ని మీదకొంపుకునేది.
*******
కాలిబాట  
చూపినట్టే చూపి చిటికెలో 
ఆ కాలిబాటనెలా మాయం చేసిందో చూడు 
మేఘాల మధ్య ఆ మెరుపుతీగ.
********
  మహావృక్షం  
వేరు కాండము ఉండి 
పత్రాలనేవే లేకుండా 
ఇంత ఒత్తుగా నా గదినిలా కప్పిన 
ఈ దీపపు మహావృక్షాన్ని 
ఆకులన్నీ కన్నులు చేసుకుని 
విస్తుపోయి చూస్తోందా మాను.
*******
పనిపసోడు  
రోజుకెన్ని సార్లో ఆ ముత్యాల పంట 
కాపుకొచ్చి రాలుతుంది 
ఈ పనిపసోడి ఒంటి మీదుగా 
కనీసం ఆ  పంటకైనా  
గిట్టుబాటు ధర ఇవ్వదెందుకోయ్ ఈ లోకం.
*******


Wednesday, June 27, 2012

ఎడబాటు

ఎడబాటు  
ఎడబాటు  తీరబోతోందన్న భావాన్ని 
తడబడుతూ కూడా 
ఎంతందంగా  చెప్పగలదా నది.
********
  సీమంతం
తన మీది చిటారు కొమ్మకు సీమంతమంటూ 
ఎండుటాకుల శుభలేఖలొదిలెనా  మాను అడవి సెలయేటిలో 
అందుకున్నదే తడవు ఆ ఏరు 
అడవి మానుల గడపలెల్ల వదిలెనాలేఖ 
లేఖనంది సంతసమొంద ప్రతి మాను
తన గూటిలోనే గువ్వలనాయింటి పెరంటానికంప 
గువ్వలంత  ఆ మానింట ఎన్ని దీవెనలిచ్చిరమ్మ 
ఫక్కుమని నవ్వ కొమ్మ ఎన్ని చివురులు తొడిగెనమ్మ.
********
కనువిప్పు
ఎవరికో కనువిప్పు కలగాలని 
తీగలను చుట్టుకుని మరీ 
ఒంటిని దాచుకుంటుందా మొక్క 
ఎవరికైఉంటుందంటావ్?
*******
మనసు రూపం  
ఆ తామరాకు మీది నీటిబొట్లను 
చుక్కలుగా కలుపుతూ రంగవల్లిని 
రచిద్దామనుకుంటున్నావేమిటోయ్ 
ఎపుడైనా ఓ సారి ప్రయత్నించు 
నీ మనసే రూపంలో ఉంటుందో 
నీ కళ్ళకు కనబడకుంటే నన్నడుగు.
*******

Tuesday, June 26, 2012

చిరునవ్వు

చిరునవ్వు
మనకన్నా ఎక్కువగా పడుతూ లేస్తూనే 
ఎంత అందంగా నవ్వగలదు ఆ అల 
మరి నీవేమిటోయ్ 
చిరునవ్వుని గతజన్మ లోనే వదిలేసినట్లు 
ఎప్పుడూ అలా ........
******
నీడ
ఎప్పుడో గానీ కన్నెత్తి చూడనా 
ఐనా గానీ అది ప్రతి క్షణము 
నన్నే కనిపెట్టుకుని ఉంటుందోయ్ 
నిజంగా అనుబంధమంటే 
నాదీ నా నీడదేనోయ్.
*******
ఒయ్యారం
మేఘాల్లో దాగిన 
ఆ నదీ యవ్వనాన్ని 
ఆడుతూ పట్టుకొచ్చేసిందా మయూరం 
ఇక చూడా నది పొంగులు.
******
ఆంగ్లం
మనదన్న దాన్ని మింగేస్తూ కూడా 
మనతోనే కొనియాడబడడం 
ఆ ఒక్క ఆంగ్లానికే చెల్లు.
******

Monday, June 25, 2012

కారు మేఘాలు

కారు మేఘాలు 
మౌనం తప్ప ఇంకో భాష తెలీదన్నట్లు 
ఎదురు బదురు చూసుకుంటూనే 
రోజులు గడిపేస్తున్న ఆ నింగి నేలలను 
కలిపే బాధ్యత భుజాన వేసుకుని 
కరిగిపోయాయా కారుమేఘాలు.
******
తామరాకు
నేలను 
తామరాకును చేసే 
నీటిబొట్టు నా నీడ.
******
తోరణం
నా ఏకాంతాన్ని పంచుకుంటూ
ఆ వెన్నెల ఇంకా ఇంకా వెలిగిపోతుంటే 
వలపు పేరంటపు తోరణాన్ని 
ఎంతందంగా కట్టిందో చూడా కలువ 
నా కనుదోయి వాకిట.
*******
ఏమనాలో ..
అది పాపిట రేఖో 
కంట హారమో 
వడ్డాణమో లేక
మురిసా ప్రియుడు పెట్టిన 
మువ్వల పట్టీయో చెప్పలేకున్నాను 
నీవైనా చెప్పవోయ్ 
ఆ కొండను చుట్టుకుని పారుతున్న 
ఈ నదీ పాయ నేమనాలో 

Sunday, June 24, 2012

మహాసంగ్రామం

మహాసంగ్రామం 
మనసు దొరకబుచ్చుకోవాలనుకునే 
ప్రతి నిశ్శబ్దం వెనుక 
సమాప్తాన్ని కోరుతున్న 
ఓ మహాసంగ్రామమేదో ఉండే ఉంటుంది.
*******
కొబ్బరాకు
గాలి వాటున నాపై 
వెన్నెల వస్త్రం నేసే నేతగాడౌతుంది 
నా పెరటి కొబ్బరాకు 
ఇదిగో ఇలా.....
******
ఆధునిక కాపురాలు
ఐతే  నిశ్శబ్దం లేకుంటే రాద్ధాంతం 
అనే రెండు సేతువులే అనుసంధానిస్తున్నాయి 
కొన్ని కాపురాలనీమధ్యన.
*******
నిషా  
చెమట చుక్కల సౌందర్యాన్ని 
ఆకలి కన్నా ఎక్కువగా 
ఆస్వాదిస్తుందా నిషా.