కాలప్రవాహం
అంతలోనే పుట్టి నీలో నీవే కలిసిపోయే
నీ ఇంద్రజాలమెవ్వరికీ అబ్బింది కాదు
నీ రూపగోప్యతకాలవాలమై ఎన్నో చైతన్యాలు
నీ ఒడిలో పెరిగి విరుగుతాయి
నీ ఏకరుప స్పర్శకు ముగ్ధమొంది
ఏకాంశిక తానై నీ కౌగిట చేరి వివిధ రూప లావణ్యాలతో
తననలంకరించమంటుందీ విశ్వం
అలంకరించి, తన వంక చూడక సాగే నీ చూపున పడాలని
నీ వెనుకే వస్తున్న విశ్వానికి
ఆ బాటలోనే శాంతి విశ్రాంతులు కల్పిస్తావు
నీలో లేని విభాగాలకు ఎన్నో పేర్లు పెట్టుకుని
ఈ విశ్వస్రవంతి తనపై
ఎన్నో రంగుల నీడలు పడేట్టు చేసుకుంటుంది
ఎన్నో అందాల భావనలతో తన వియోగ దుఃఖ స్పందనలను
సాఫల్యానుభూతులను నీకే ఆపాదిస్తూ
నీ చేయూతతో నడిచే విశ్వంలో నేనెంత నా స్థానమెంత
ఐనా నీ సంపూర్ణ భాగస్తుడిగా నన్నెంపిక చేసి
నాకందుతున్న నీ విలువను నేనెరిగేదెపుడో.
*********
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
రమేష్ గారు,
ReplyDeleteమీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చిన్ని గారు మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు
Delete