Thursday, September 27, 2012

అద్దం

అద్దం 
నవమాసాలు మోయకుండా 
కాస్తంతైనా పురుటినొప్పులు పడకుండానే 
నవరసాలొలికించే నన్నెన్నిసార్లు ప్రసవించిందో 
నా ఇంటి అద్దం.
******
స్వేచ్ఛ 
స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగితే 
తన రెక్కకు నా రెప్పను 
బంధీని చేసిందేమిటో ఆ పిట్ట.
********
నీడ 
వెలుగు ఔదార్యాన్ని 
చీకటి స్వార్ధాన్ని 
ఏక కాలంలో చూపగలదు 
నా నీడ.
******
విజయం 
సాగరమంత 
శ్రమే కాదా విజయం కోరుకునేది 
స్వాతిముత్యమంత 
ఓరిమిని కూడా.
*******

Wednesday, September 26, 2012

లంచం

లంచం 
ఒడి నుండి ఆ చావులమడి దాకా 
ఎంత పచ్చగా తన బ్రతుకు పండించుకుంటోందో 
చూడా లంచం.
*******
ఉపనయనం 
ఎప్పుడో గానీ బిడ్డలపై ప్రేమను కురిపించని 
ఆ తండ్రిని కాదని అన్నీ తానేఅయి 
ఆ మానుకి ఈ తీగను జంధ్యంగా వేసి 
ఎంతందంగా ఉపనయనం చేస్తుందీ నేల తల్లి.
********
మధువు 
నన్నా భానుడు భయపెట్టేవేళ 
పువ్వులా ఈ నేలపై విరిసిన 
ఆ చెట్టునీడ గర్భాన 
గుప్తంగా దాగిన మధువు!
నా నీడ.
********
నవ వధువు 
ఆ వరునింటే వడిగట్టు బియ్యాన్ని 
అప్పగిస్తానని ఇంద్రధనుస్సు గడప దాటి 
పుట్టింటి నుండి మెట్టినింటికి చేరిన 
నవవధువా వానచినుకు.
********

Tuesday, September 25, 2012

వర్ణాశృవులు

వర్ణాశృవులు
 
బాల్యాన ముగ్గురు తాతలు చేయిపట్టి 
సౌందర్య వనాంతరాల కుసుమరాగరంజిత పదాన 
నన్ను నడిపించారోయ్!

ఆపై రూపరేఖా లావణ్యాలతో విచ్చుకున్న 
నా యవ్వన సోయగాన్ని రసికదిగ్గజాలైన 
ఆ ఎనమండుగురు ఎంతందంగా వర్ణించారోయ్!
భువనైకమోహన హాసవిలాసాన.

ఇక నా కౌమార కౌశలాన 
రవి అస్తమయమే ఎరుగమన్న ఆ తలబిరుసు దొరలే 
నింగికంటా ఎగసిన  నా కీర్తి కేతనాల ముందు 
అవనత మస్తకాలతో నిలిచి 
సంతత మనోసీమల నుండి జారిన 
ఆ మాధుర్య మోదామృత ధారలు త్రావి 
చిరంజీవులన్న యశము బడలేదా?
 
ఇపుడా వైభోగమంతా యేమాయెనో గానీ నాకపుడే వృద్ధాప్యమాపాదించి 
ఆ మొనదేలిన ఇరువదియారు అమ్ముల అంపశయ్యపై పరుండ బెట్టారు.
ఆ! ఇపుడు నా మరణ ముహూర్తం ఆసన్నమైనదనీ ,
సంస్కృతికి పాలు పట్టించిన నా స్తనాలుకూడా వట్టిపోవునని 
ఈ కాలానికిపుడు తెలిసొస్తుందిలే 
నీ వల్లే కాదులే మీ అందరి వల్ల.
**********

 

Monday, September 24, 2012

బృందావన శోభ

బృందావన శోభ   
సాహసించిన ఆతని 
అధరవైభోగమామే చెక్కిలిపై 
స్వాగతించిన ఆమె 
నఖవైభోగమాతని మేనిపై 
ఇరుసంధ్యలై శోభించాయా బృందావనాన.
**********
విరహం  
కాలమనే గాలి వీచి 
విరహమనే కారుమబ్బు 
కరిగి కురిసింది గనుకే 
నా హృదయోద్యానవనంలో 
పూచిన ప్రతి పువ్వులోనూ 
నీ రూపే నాకు తోచెనో చెలీ.
********
గర్వం 
ఎవరూ మీటకుండానే 
రాగమాలపించే వీణ తీగలమని!
తుషారమంత గర్వమా జలపాతానికి.
*********
గోదారి 
పాదం కదిపినంత అందంగా 
పదం పాడడం 
పదం పాడినంత అందంగా 
పాదం కదపడం 
తనకు నవ్వినంత తేలికంటుందా గోదారి.
**********

Wednesday, September 19, 2012

వలపు ఏరువాక

వలపు ఏరువాక 
ఏడు అడుగులు నడిచాయో లేదో 
అపుడే వలపు ఏరువాకకు ఎంతందంగా 
ప్రణాళికను రచిస్తున్నాయో చూడా చేలో 
ఆ వానచినుకులీ మన్నుతో మమేకమై. 
*********
శిశిరోదయం 
మోడైన ఆ ఎదలను చిగురింప చేయాలని 
తన వంతుగా 
ఆ గాలెంత శ్రావ్యంగా సంగీతమాలపిస్తోందో 
చూడా రాలిన ఆకులతో కలిసి  
ఆ శిశిరోద్యానవనాన.
********
సింగారం 
అసలు సిసలు సింగారాన్ని 
నా వదనానికి నేర్పేవి 
పెదవులే.
*******
ప్రగతి తేరు 
అవినీతి, అధిక ధరలు 
సామాన్యుని ప్రగతి తేరుకు చక్రాలు 
నా దేశాన.
*******

Monday, September 17, 2012

గానవాహిని

 గానవాహిని 
పికమాపిన గానాన్ని ఆ సెలయేరు 
ఆ యేరొదిలిన  పదాన్ని 
ఈ ఆకులనుండి జారే మంచుబిందువులు 
ఆలపిస్తుంటే 
ఇక తన గానవాహినికి అంతమెక్కడిదని  
అడుగుతుందా అడవి.
********
మెరుపు తీగ 
ఆ వీణతీగ కన్నా అందంగా ఉంది కదా 
మీటితే ఇంకెంత వీనులవిందైన 
సంగీతం వినిపిస్తుందో అనుకుంటే 
ఇలా ఉరిమిందేమిటా మెరుపుతీగంటూ 
కరుగుతున్నాయా మేఘాలు.
*********
వర్ణ విక్రయశాల 
ఏ దారినీ పూలన్నీ పోయి ఆకాశంలోని 
ఆ వర్ణ విక్రయశాలలోని రంగులను 
కొనుక్కొచ్చాయో ఆ దారినే పోయి 
అన్ని స్వప్నాలను కొనుక్కొచ్చింది 
నా మనసు.
********
శృతి 
కరిగిన ఆ ఇల్లాలి కలలు 
కన్నీళ్ళై కారుతున్నా నిషా మత్తులో పడి 
మేలుకోడా మొగుడు 
కానీ ఆమె ఒడిలోని బిడ్డడో!
ఆమె కన్నీళ్ళకో శృతినీయడా?
*********

Sunday, September 16, 2012

తూరుపు తీరుపు

తూరుపు తీరుపు 
ఈ మంచుతో ఆహ్లాదంగా అల్లుకున్న 
తమ అనుబంధాన్ని ఓర్వలేకపోతున్న 
ఆ తూరుపు తీరుపును కన్నీళ్ళతో 
శిరసా వహిస్తున్నాయా ఆకులు.
*******
అతివృష్టి 
అతివృష్టి లోనూ 
ఆకాశం దాకా ఎదిగే పంట 
మన విషాదమేనోయ్.
********
మానవత 
మానవత 
ముందుకు నడవాలంటే 
తరాలు వెన్నక్కి నడవాల్సిందే.
**********
గజ్జె 
నవజీవనహేలతో నర్తించే 
ఈ పుడమి చరణాలా నదులకు 
అప్పుడప్పుడు గజ్జె కడుతుందా ఆకాశం.
********