Sunday, March 10, 2013

లేఖాశ్వాలు

 లేఖాశ్వాలు 
 పూలు పంపిన 
లేఖాశ్వాలను కట్టుకున్న తేరులపై 
 తుమ్మెదలొచ్చాయి 
ఆ తోపుల్లోకి. 
*******
తొలకరి 
తన శౌర్యాన్ని చూపమంటూ 
వీరగంధం పూస్తుంది బీడుకి!
తొలకరి. 
*******
గోదారి 
ఉగ్గుపాలు పడుతూ 
గట్టుని బిడ్డలా చూస్తుంది 
గోదారి!
*******
వేసవి 
కనుచూపు మేర బాటల వెంట 
నీళ్ళ అంగళ్ళను తెరిచింది వేసవి 
నీ సరసమైన వీక్షణలతో వెలగడతావని. 
*******

Friday, March 8, 2013

నాడలా-నేడిలా

నాడలా-నేడిలా 
నాడు! ఆ బుడ్డోడి చేతిలో నలుగుతూ వాడితో పాటుగా 
అంబరమంతటి ఆనందాన్ని అనుభవించిందీ నాకు జ్ఞాపకమే 
మారాలు పోయే గారాలపట్టీలకంది 
షావుకారు కొట్టుకి షికారెళ్లి0దీ నాకు జ్ఞాపకమే 
జారి నేలపై పడి నేను టాంగుమంటే గాబరాగా 
నన్ను వెతుకుతూ తల్లడిల్లిపోయిన గుండెలెన్నో నాకు జ్ఞాపకమే 
శ్రీమంతుల మొదలు బుద్ధిమాంధ్యుల గుండె చప్పుళ్ళను విన్నదీ నాకు జ్ఞాపకమే 
కానీ నేడు ఒంటిగా బుడ్డోడి చేతిలో పడ్డానో! నేలకేసి కొట్టేస్తున్నాడు 
నేల తగిలి చప్పుడు చేస్తూ నే రోదిస్తున్నా 
నన్ను గుండెలకు హత్తుకునే వాడే లేడు  
శ్రీమంతుడికే కాదు కదా మతిలేని ధీమంతులకు కూడా 
అక్కరకు రాని చుట్టాన్ని నేనిపుడు 
మారిన ఈ కాలాన తళ తళలాడే రూపమైతే నాకొచ్చింది గానీ 
నాటి విలువ పోయి వెలవెలలాడుచుంటి 
చెల్లని రూపాయినై. 
********* 

Wednesday, March 6, 2013

ఈ జాబుకు బదులేది?

ఈ జాబుకు బదులేది?
అందరి ఎదలోని  ఊహలు, పసిడిజిలుగుల పల్లకీనెక్కాలని 
అందరికీ అందేలా జాబు రాసి విడిచాడు వాడు 
నా కాలికింద నలిగే గడ్డిపోచ సైతం, 
నిలిచి గాలికూయలూగే చిగురాకు సైతం 
తనకందిన లేఖలో తడిచి తబ్బిబ్బయితే,
నిలబడలేని పనుల మునిగిన నాదు మనసునకు 
పట్టుబడలేదయ్యో! ఆ వెన్నెల పట్టాభిషేక ప్రాభవం. 
*********
పలకరింపు 
తొలకరి పేరు చెప్పి 
అందరినీ ఆ గాలిలా 
పలకరించడం నేర్చిందీ మట్టి. 
*********
ఆశ  
జరామరణాలనే 
అలలతో సింగారించుకున్న సంద్రమీ లోకమని 
మంచి ముత్యాలకై వెదికేవు 
నీ ఆశ పాడుగాను. 
*******
పతంగాలు  
మెరుపంటి దారం తెగి 
గాలి వాటున 
ఎటు పడితే అటు ఎగిరిపోయే 
పతంగాలీ మబ్బులు. 
*******

Tuesday, March 5, 2013

సిద్ధాంతాలు-రాద్ధాంతాలు

సిద్ధాంతాలు-రాద్ధాంతాలు 
తీపో! చేదో!తనకూ కొన్ని అనుభూతులుండాలని 
ఈ కాలమే కోరుకుంటుందేమోనోయ్ 
అందుకే ఇన్ని సిద్ధాంతాల పూమాలలను వేసుకుని 
రాద్ధాంతాల ముళ్ళపై అదే పనిగా నడిచెళ్లిపోతుంది 
పరిమళాన్ని మెచ్చేవారు కొందరైతే 
పదునుకు నొచ్చేవారు కొందరు కదా!
అందుకే మనిషి పుట్టిన నాటి నుండీ నేటి దాకా 
పదునుకు, పరిమళానికీ నడుమ పెనుగులాట తప్పనూలేదు 
సామూహిక చితిమంటలు ఆరనూలేదు. 
*********

Monday, March 4, 2013

సీత

సీత 
సందేహం! 
అగ్నిలోకి కొమ్మను విసిరేస్తే,
ఆ అగ్నిలో పూవై విరిసి 
ఎంతటి మకరందాన్ని 
నా జాతికి పంచిందో చూడు 
ఆమె సంస్కారం. 
*******
నీడ  
వెలుగు ఔదార్యాన్ని 
చీకటి స్వార్ధాన్ని 
ఏక కాలంలో చూపగలదు 
నా నీడ. 
********
వేర్లు 
లోకం మెచ్చిన అంతటి 
భావచిత్రాన్ని గీశామన్న గర్వం 
కించిత్ కూడా లేకుండా 
మట్టిలోకి ఎలా ముడుచుకుంటున్నాయో 
చూడా వేర్లు.
 ********
అద్దం 
నవమాసాలు మోయకుండానే 
కాస్తంతైనా నొప్పులు పడకుండానే 
నవరసాలొలికించే 
నన్నెన్ని సార్లు ప్రసవించిందో 
నా ఇంటి అద్దం. 
********

Friday, March 1, 2013

శిశిర క్షోభ

శిశిర క్షోభ 
పసిడి జిలుగుల పట్టు పీతాంబరమొకటి 
ఉషః కాంతిన మా మేనియలపై నేసి 
తమ పనితనానికి తామెంత 
మురిసిపోయినవో! ఆ సంధ్యారుణ కాంతి పుంజాలు 
వర్ణాంగినులై, మోదక లాలసాన 
ఆ గాలికి విందు జేయు పూబాలలు 
మోమంత విప్పారిన కన్నులతోడ 
రాయంచలై మా తోడ నూయలలూగే 
కాలివ్రేళ్ళపై కదలక నిలబడిన 
మాతృమూర్తి క్షుద్భాధను 
కాదనక దీర్చే ప్రమోదమొక్కవైపు 
పచ్చగా మాలో పరవళ్ళు ద్రొక్కుతుంటే,
ఇంకో వైపున ఆయమ కాలివ్రేళ్ళపై వాలి 
ఇంత కాలమూ భుజాల మమ్ము మోసిన 
ఋణం తీర్చుకోవాలనుంది 
కాలం కలిసొచ్చింది!
మాలోని హరితమిప్పుడు సువర్ణమయింది 
కాలివ్రేళ్ళ మా ఆశ పండి రాలిన ఋణాలతో 
శిశిర క్షోభ వచ్చింది! వనానికి. 
*********

Thursday, February 28, 2013

చరిత్రకూ కాలాలు

చరిత్రకూ కాలాలు 
యుద్ధం, వేసవి 
ఆనక జారిన అందరి కన్నీళ్లు వర్షం 
అలాటి యుద్దాలంటే 
ఈ అవని వెన్నులో పుట్టిన వణుకు సీథాకాలమ్.
 అవునోయ్ మనలానే మూడు కాలాలున్నాయి!
ఆ చరిత్రకీనూ. 
*********
ఇంద్రధనుస్సు 
పాపం తనకు 
ఇంకో వర్ణాన్ని అరువీయమని 
నా కన్నుల వెలసి ఆ ఇంద్రధనుస్సు 
ఆశగా చూస్తుంది 
నవ్వే ఆ పసోడి బోసినోరొంక. 
*********
వాన చెట్టు 
వాన చెట్టుని 
పెంచాలనుందేమిటోయ్ నీకు.?
ఐతే అవిగో విత్తులు!
ఆ తామరాకుపై నీటి బొట్లు!
ఎక్క నాటమని అడుగుతావేమిటోయ్?
సుక్షేత్రమైన మనసుని 
నీ దగ్గరుంచుకుని. 
********
గురువు 
ఇవి ఆడడం చూసి 
ఆ నింగిలో మేఘాలు ఆట నేర్చాయ?
లేక అవి ఆడడం చూసి 
తామరాకు మీద ఈ నీటిబొట్లు ఆట నేర్చాయా?
ఎవరు ఎవరికీ గురువో! కాస్త చూసి చెబుదు!
********