Tuesday, October 9, 2012

భువనవిజయం

భువనవిజయం 
తమ రచనలను  అందంగా పాడి వినిపించే 
జలపాతం,  సెలయేరు 
పక్షులు, కీచురాళ్ళు 
తుమ్మెదలు, తేనెటీగలు 
గాలికూగే చెట్లు, నానా మృగాదులనే 
అష్టదిగ్గజాలతో నిత్య శోభిత 
భువనైక మోహన భువనవిజయమేనోయ్ 
ఆ అడవి.
***********
ఇంద్రధనుస్సు 
మనసులు కలిసి అప్పటికప్పుడే 
మనువాడతాయేమోనని ఆ ఎండా వానలు 
తాను తాళిబొట్టుగా  ప్రత్యక్షమౌతుందా ఇంద్రధనుస్సు.
**********
కావడి 
పున్నమి వెన్నెల్లో 
సరదాగా కావడి మోయాలనుకున్న ఆ జాబిలికి 
కావడి బద్దలా దొరికిందా గోదారి 
మరి కుండలంటావేమిటోయ్ ?
రసాస్వాదనాబాష్పాలు రాల్చుతున్న నీ నా కన్నులేనోయ్.
**********
ఆశలచిగురింత 
చెమరించిన ఎన్ని నయనాలకు తెలుసు 
తమ ఆశల చిగురింతకు 
అక్కరకు రావీ కన్నీరని.
*******

Monday, October 8, 2012

ప్రియుని రూపు

ప్రియుని రూపు 
ఎంత కదిలించాలని చూసినా
కదలక నిలబడి ప్రియుణ్నే చూసే 
ఆమెను ఏమీ అనలేక 
పదిలంగా ఆ ప్రియుని రూపు పట్టి 
ఆ కలువభామినికిచ్చి అలసట తీర్చుకుంది 
ఆ తటాకం.
******
 ఆమె అడుగులు 
ఆమెనిక చేరకపోయినా పరవాలేదు 
ఆమె అడుగులలో 
నా అడుగులు పడుతున్నాయి 
అది చాలు.
******
ప్రకృతి 
ఓ క్షణం చాలు 
ప్రకృతిని నీవు చూడడానికి 
ఆ క్షణం చాలు 
ప్రకృతే నీవవడానికి.
*******
కొరడా  
మెరుపు కొరడా ఘుళిపిస్తే 
ఇన్ని చెమటలు బోసాయా?!!
ఆ ఆకాశానికి.
*******

Sunday, October 7, 2012

చిగురుటాకు

చిగురుటాకు 
ఆ చిగురుటాకు జననాన్ని 
కళ్ళప్పగించి చూస్తూ వనానికంతా వినబడేలా 
చప్పట్లు కొడుతున్నాయా పక్షులు 
రెక్కలాడిస్తూ .
******
మౌనం 
మాటలు పాటలు అన్నీ పోయే 
వద్దంటున్నా మౌనమే
మొఖాన రాసిపెట్టి పోతున్నాడా సురీడంటూ 
తనలో తానే అనుకుంటోందా వృక్షం 
ఎగిరే గువ్వలను చూస్తూ.
*******
ఆకాశం 
కరిగి మాయమైన మేఘం కోసం 
గుండెలవిసేలా ఉరుముతుంది 
ఆకాశం.
******
కల  
కడలి అల  
మెలకువతో కనే కల 
తిరిగి తిరిగి నీ అడుగులు కొలవాలని.
******

Saturday, October 6, 2012

జోల పాట

జోల పాట 
చిటపట అల్లరి చేసిన 
వాన చినుకులకు 
నోరు తెరిచిన బీడు 
జోల పాడింది.
*****
ఉదయ సుందరి 
తాను రాసిన పాటను 
పాడడం కోసమని 
ఎన్ని గొంతులను మేల్కొల్పిందో 
ఆ ఉదయ సుందరి.
*******
జలపాతం 
మంచి చెప్పే లోపే 
ముఖం పగల గొట్టేసుకుంటుందని 
ఆ పర్వతమెప్పుడూ 
తిడుతూనే ఉంటుందా జలపాతాన్ని.
*******
ఘోష 
మేనంతా కరిగించిందని 
ఆ మేఘం ఘోషిస్తూ 
ఈ గిరి తనువునే చీలుస్తుంది 
జలపాతమై.
******

Friday, October 5, 2012

మొట్టికాయలు

మొట్టికాయలు 
మొట్టికాయలంటే ఎంత ఇష్టం లేపోతే 
వాన వెలిసాక కూడా 
ఆ ఆకుల నుండి జారే నీటి బొట్లతో 
మళ్ళీ మళ్ళీ ఈ నేల అలా.....
********
పూల చరిత్ర 
పట్టు బట్టి మరీ ఆ పూల చరిత్రని 
గ్రంథస్థం చేస్తున్నాయి 
ఈ తేనెటీగలు.
********
వాన చినుకు 
నిండు జాబిలిలా 
తనను తాను అలంకరించుకుని 
ఆనక ఈ పుడమికి వన్నెలద్దుదామని 
తనను తాను ఎలా బ్రద్దలు చేసుకుంటుందో 
చూడా వాన చినుకు.
********
రాదారి 
వెలిగే వీధి దీపాలై ఆ పూలు 
నా చూపులు నడిచే 
రాదారిగా చేసాయీ తీగను.
*******

Wednesday, October 3, 2012

వర్షరాగం

వర్షరాగం 
పరిమళ మంత పారవశ్యాన్నే కాదు 
మొలకలెత్తినంత ఆనందాన్నీ 
చూపగలదా మన్ను 
 హర్షాన రవళించిన 
ఆ వర్ష రాగాన్ని వింటూ.
*********
అత్తగారు 
గుభాళించే పువ్వుల్లాటి పిల్లల్ని 
వేలు లక్షలుగా కని కూడా 
ఆ తోట దక్కించుకోలేని అత్తగారన్న గౌరవాన్ని 
ఇద్దరంటే ఇద్దర్నే కని దక్కించుకుందా చెరువు 
సూర్య చంద్రులను అల్లుళ్ళుగా సంపాదించి.
********
'గాలి' తో సావాసం  
'గాలి'తో సావాసం చేసి 
తనలోని భావుకతను 
బయట పెట్టుకుంటే ఆ ఎడారి 
'గాలి'తో చెలిమి చేసి తన వైభోగాన్నే 
పోగొట్టుకుందీ న్యాయం.
*******
వాన పాట 
ఒక్క వాన పాట పాడి 
తన వసంతాన్ని 
శిశిరంగా మార్చుకోగలదా ఆకాశం.
********


Monday, October 1, 2012

తెలుగు వాచకం

తెలుగు వాచకం 
నాడు నా బ్రతుకెంతో ఘనం 
నేడు బ్రతకడమే గగనమంటూ 
ప్రతిధ్వనిస్తూనే ఉందా తెలుగు వాచకం.
*********
నల్లవాడు 
అక్కడ కోయిల పిలుపులు లేవు 
తేటిని పిలిచే పూవులు లేవు 
కానీ ఆ వనాన నిత్య వసంతం 
 కొలను లేదు కలువలు లేవు 
కానీ నిత్య పూర్ణిమ ఆ తీర ముఖచిత్రం 
  అక్కడ పెదవి దాటి ఊరేగిన గాలికి 
పాదాలు కదిపే పడుచులాటలో 
నిదురన్నది మరచి  రాతిరి 
ఆ నల్లవాడి మేని వర్ణమైందేమో 
********
చేతి గాజులు  
రవ్వంత సడి లేకుండా 
ఆమె ఊసులు వినాలన్న నా తలపును 
రాగయుక్తంగా తీరుస్తున్నాయి 
ఆమె చేతి గాజులు.
*******
ఆత్మీయత 
పంచిన ఆత్మీయత 
చాలలేదనుకుందేమో 
ఎగసి ఎగసి గాలితో కలసి 
తుషారమై మరీ నన్ను తాకుతోంది 
జోరువాన.
*********