Friday, August 17, 2012

అందాల జంట

అందాల జంట 
గాఢ ఆలింగనంలో 
ఒకరికోర్కెకొకరు కరిగిపోయే 
అందాల జంట ఈ రేయింబవళ్ళు 
ఆ సంధ్య సాక్షిగా.
*******
దాగుడుమూతలు 
నేను నేనేనా అనే అనుమానపు లోతుల్లో 
నాతో నీవాడే దాగుడుమూతలే 
నాకు చీకటి వెలుగులైనాయి.
*********
ఇల్లాలు 
అలసి ఇంటికొచ్చిన ఇల్లాలికి 
కాసిని మంచినీళ్ళైనా 
ఇద్దామని లేదా కడలికి 
ఆ మాటకొస్తే........
*********
జ్ఞాపకాల మాల 
విరహం కన్నా గొప్పగా 
జ్ఞాపకాల మాలను 
కట్టగలవారెవ్వరోయ్?
*******
మత్తు 
మత్తెక్కక పోతే 
నిటారుగా నిలబడలేదోయ్ 
ఆ కలల కుంచె.
********

Thursday, August 16, 2012

స్వప్నం

స్వప్నం 
లయ నచ్చి తానెక్కడ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందో అని 
చప్పుడు చేయనప్పుడా కనురెప్పలు 
చక్కంగా వచ్చిపోతుందా స్వప్నం.
********
మృత్యువు 
ప్రతి వికాసమూ ఆ కాలానికి 
హృదయస్పందన ఐతే 
తనకు మాత్రం ప్రాణస్పందన 
అంటుందా మృత్యువు.
*******
ఆకలి 
రసికత ఉన్నా లేకున్నా 
ఎలాటి మనిషినైనా కదిలించగలిగే 
రాగమాలపించడంలో తన తర్వాతే ఎవరైనా 
అంటుందా ఆకలి.
*******
ఆవేదన 
ఆవేదనే అధికభాగం కాబోలు 
అందరిలా ఈ పుడమికీ 
కాకున్ననేమి 
కన్నీళ్లు కడలంత కాగా 
ఆనందబాష్పాలు నదులంత.
*********

Wednesday, August 15, 2012

అమృతం

అమృతం 
నీ జ్ఞాపకాలను 
చెరపలేని కన్నీరు 
నిజంగా అమృతమే 
నా మనసుకు.
******
కేశాలంకరణ  
కేశాలంకరణ అంటే  
ఎంత మోజో ఆ ఆకాశానికి పాపిటి రేఖను 
మెరుపు వేగంతో మార్చుకుని మరీ 
ఎలా ముస్తాబవుతోందో చూడు.
********
సంస్కృతి  
ఆశ్రయమిచ్చి ఇచ్చీ 
చివరికి తానే ఆశ్రితురాలైంది 
నా దేశ  సంస్కృతిపుడు.
*******
జీవనదులు 
అండగా కరిగే మనసుంటే 
జీవితమంతా గల గల నవ్వులే అని 
పారుతూ చెబుతున్నాయా జీవనదులన్నీ.
********
 

Tuesday, August 14, 2012

నాలుగు రాళ్ళు

నాలుగు రాళ్ళు
నాలుగురాళ్ళు 
వెనకేసుకోమనా పెద్దలంటే 
ఏకంగా నాలుగు కొండలనే 
వెనకేసుకున్నాడా నేత.
*******
శంఖం  
ఏ దూర తీరాలను చేరినా
పుట్టింటి పలుకులనే వల్లెవేసే 
ఆ శంఖాన్ని చూసి 
ఏమి నేర్చుకోవాలంటావ్ 
ఈ ఎగిరెళ్ళే యువతరం.
********
రాగాలాపన 
తన గొంతు పిసుకుతున్నా 
నీ శ్వాస సీమలో 
తన మనసుతో ఎన్నెన్ని 
రాగాలాలపించగలదా పువ్వు.
*******
వీలునామా 
తన ఒయ్యారపు వీలునామా 
చెల్లుబాటు కావడానికి 
ఆ ఆకాశపు చేవ్రాలు కోసం 
ఎదురుచూస్తుందా గోదారి.
*******

Monday, August 13, 2012

పిల్లనగ్రోవి

పిల్లనగ్రోవి 
కష్టపడి తన ఇంటికొచ్చిన అతిథిని 
యోగక్షేమాలు కూడా అడగకుండా 
ఇట్టే సాగనంపేసి కూడా 
నాతో అన్ని ఆనందబాష్పాలు పెట్టించడం 
ఆ పిల్లనగ్రోవికే చెల్లు.
*******
విలువలు 
పాతాళంలో పందిరల్లుతున్న 
ఆ తీగలకు 
విలువలని పేరు.
********
కారుమేఘాలు  
మౌనం తప్ప ఇంకో భాష తెలీదన్నట్లు 
ఎదురు బదురు చూసుకుంటూనే 
రోజులు గడిపేస్తున్న ఆ నింగి నేలలను 
కలిపే బాధ్యతను భుజాన వేసుకుని 
కరిగిపోయాయా కారుమేఘాలు.
*********
నా పరిచయం 
నా పరిచయం 
తనలోని చిత్రకారుణ్ణి 
బయటకు తెచ్చింది 
అంటుందా అద్దం.
*******

Friday, August 10, 2012

గులకరాళ్ళు

గులకరాళ్ళు
మట్టి, ఇసుక మేఘాలుగా కమ్మిన నిండు చంద్రుళ్ళు
నలుపు, ఎరుపు గొంగళ్ళు కప్పుకుని
మట్టిలో మొద్దు నిదరోతున్న బట్ట బుర్రల తాతలు
మేఘం గాలికి కదిలినా, గొంగళి నీళ్ళకు చివికినా
నిండు చంద్రోదయం లాటి పాత పలకరింపుతో
యకాయకి నా మనసు పొరలను చీల్చి
బాల్యాన్ని బైటేసే తుపాకి గుళ్ళు
ఆహా! బాల్య స్రావాన్ని పిల్లకాలువలా పరుగెత్తించే
ఎలాటి గాయమైందో చూడవోయ్ నా మనసుకిపుడు
ఆనాడు, ఆ సెలయేటి గట్ల వెంబడి పరుగెడుతూ
దోసిళ్ళ కొద్దీ నీళ్ళతో ఈ బట్ట తలలకు తలంటి
అరుపులాటి పిలుపుతో నా నేస్తాల మధ్య
దివిటీల్లా వెలిగిన నా కళ్లిప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి
పోటీలు పడి మరీ పోగేసుకున్న గులకరాళ్ళు
జోడెడ్లలా ఆ జేబులు కట్టిన "లాగు"డు బండిలాటి
లాగూలో వేసుకుని ఇంటికెళ్తుంటే 
బరువుతో ఒకెద్దు కిందికి జారుతుంటే
నా చిట్టి చేతులే ఆసరాగా "లాగు"డు బండి
ఇంటిదాకా లాక్కెళ్ళిన సజీవ దృశ్యం
నేనెన్ని మైలురాళ్ళీ జీవితంలో దాటితే మాత్రం
మాసిపోగలదా చెప్పు నేస్తం
అవును మనసైన జ్ఞాపకాలు మట్టిలో ఉంటేనేం? ఇసుకలో ఉంటేనేం?
ఒకసారి పలకరించు నేస్తం
ఒకటో, రెండో, గుప్పెడో, గంపెడో పోగుచేయి
పట్టుకెళ్ళడమే తెలిసిన ఈ కాలం
నీ బాల్యాన్ని తిరిగి నీకెందుకివ్వదో చూద్దాం రా నేస్తం.
************

Thursday, August 9, 2012

సంధ్యా చెక్కిళ్ళు

సంధ్యా చెక్కిళ్ళు 
తీరని తన అలకలన్నీ అనుమానపు తీగలై అల్లుకున్న వేళ
ఆమె మనసు, కంటి నుండి ఏకధారగా గారుచుండ
మెరయుచున్న ఆ ముదిత చెక్కిళ్ళ అద్దాన
మోదమొందుచు తన రూపు సవరించుకొనియె ఆ మాధవుండు
అపుడామె మోము విరిసిన ఎర్రకలువ
అపుడామె మనసు అమాసను వరించిన పున్నమి వెన్నెల చెలియ
ఇక అక్కడి మౌనమోపలేక ఆ కాలం
ఆరు ఋతువుల అందాలను దూసి
ఆ బృందావనాన రాశిగ బోసి
మచ్చికైన వారి మనసుల నడుమ
ఆ అనురాగామెంతసేపు ఎడమైయుండునటంచు
వారి కనుదోయిల నడుమ తోరణమై నిలచె
అపుడు జారుతున్న ఆమె కన్నీటి బిందువులనొక్కొక్క కొనగోట నిలిపి
ఓ బేల ఇన్ని గోవర్ధనాల నెటుల మోయగలిగితివీవు
నీ మనసు పరిధి దాటి ఊహనైనా పోని నాకై అంటూ సరస వచనంబులాడ
అపుడా అనుమానపు తీగలపై అనురాగపు విరులు నవ్వె
మనసులు కలసిన మకరందాన్ని కాలానికి రువ్వె
ఇపుడూ! ఆ రాధ మోము విరబూసిన ఎర్రకలువేనోయ్
కాకపోతే ఆ ఎరుపు ఏ సంధ్యా ఒప్పనిది
ఈ ఎరుపు ఏ సంధ్యా విడువనిది.
***********