Monday, June 11, 2012

అభినందన

నిద్రనిచ్చిన నిశ్శబ్దాన్ని 
ఎంతందంగా అభినయిస్తున్నాయి 
లేస్తూనే ఆ పక్షులు.
******
కరగకుండా ఆ నెమలికి 
కరిగీ వాగుకి  ఆట నేర్పేదే 
కారుమేఘం.
******
వేదాంతిననిపించుకోవాలని 
చీకటి సారస్వతాన్ని 
పదే  పదే  వల్లె వేస్తుంది 
ఆ కీచురాయి.
*****
వయసుతో సంబంధం లేకుండా 
శివునికన్నా ఇంకో నయనాన్ని 
అదనంగా సాధిస్తున్నారు కొందరు.
*******

Sunday, June 10, 2012

సంక్షేమం

పేదల జీవితాల్లోంచి 
ఏనాడో కాగితాల మీదకు 
జారుకుందా సంక్షేమం.
*****
అణచివేతతో  అలజడితో 
ఏ ఆత్మీయతా రాదని 
అంటున్నాయా పూలు సుడిగాలితో.
******
కాలి వేళ్ళపై పడి 
దీవెనలందే  ఆ వాగుని 
మనసారా దీవిస్తున్నాయా మానులు 
అక్షతలుగా ఎండుటాకులు రాల్చుతూ.
******
బ్రతికున్నంత కాలం 
కారాగారాల్లో గడిపి 
తరువాత రూపాయి నోట్లపైకెక్కి 
మా నేతింటికొచ్చి 
అజ్ఞాతం లోకి వెళ్తున్నాడా గాంధీ 
పాపం వెలుగు చూసేదెపుడో .
*******

Saturday, June 9, 2012

నలక

అనురాగామంటూ  ఓడితే 
మనసులో
నలక పడినట్లే.
****
ఆనక సాధించే ఫలితంలో 
కావాలా పిల్లలే నా కోపమూ 
ఆ సాయం సంధ్య.
****
జోల పాడా చేనుని 
సాకే కన్నా తల్లి 
ఈ పంట కాల్వ.
****
గాలి తనను 
ఊయలలో పిల్లాడిని చేసినా 
శత్రు సంహారం మాత్రం ఆపనంటూ 
చూడా దీపం ఎలా.......
****

Thursday, June 7, 2012

విప్లవం

ఆ చిన్న రాయికి 
నేనిచ్చిన స్వేచ్ఛ 
ఎంతటి విప్లవాన్ని 
లేవదీసిందా చెరువులో.
*******

రెప్పలు చిలికే 
స్వప్నాలకు 
ఊహలని పేరు.
*****
ఆఖరికి అడిగి లోనికి వెళ్ళాల్సిన 
అగత్యమేర్పడిందా  కిరణానికి 
ఈ అపార్టుమెంటుల పుణ్యమా అంటూ.
*******
వానచినుకు సందడిని మళ్ళీ మళ్ళీ 
పరిచయం చేస్తుందా చెరువుకి 
ఎగిరెగిరి పడుతూ ఆ చేపపిల్ల.
******
ఎడ్ల గిట్టల 
చప్పుడునా పంటచేను  మరచినట్లు 
పిల్లల పద ఘట్టనలను ఏనాడో 
మరచిపోయిందా కాన్వెంటు ప్లే గ్రౌండ్.
******

Wednesday, June 6, 2012

మృత అభిసారికలు


కదులుతాయి కన్నీరు కారుస్తాయని శవాలనం గానీ 
వాటికన్నా గొప్పవేమీ కాదు 
ఆటవిడుపు వాంఛలు తీర్చే వారి దేహాలు
సానుభూతంటే ఎరుగని సహనం వారి సొంతం 
దేహాలపై గాయాలెన్నో విరబూసినా 
వాటిలో కూడా మధువునెతుక్కునే
తుమ్మెదల రూపాలను 
కన్నీటితో కడుగుతూ మరో తేటిని వెదికేందుకు 
ముఖం పై నవ్వు దీపాలను వెలిగించాల్సిందే 
భాగ్యము వారిది కాదంటూ వారి కన్నీళ్లు 
చెప్పకనే చెబుతున్నాయి 
ఐనా అర్ధాలతో మనకు పనేమిటోయి అందాలతో గానీ 
రా వారి దేహాలపై నీ కోర్కెల పంజా విసురు 
చిమ్మిన వారి రక్తాన్ని అత్తరుగా పూసుకుని 
ఆమె వెచ్చని కన్నీళ్లు ఆ అత్తరు ఘాటును 
తగ్గించక ముందే  
నీ పురుష సుగంధాన్ని ఈ నాగరిక లోకానికి చూపు 
భయపడకోయ్ ఓ రోజాకలి తీర్చిన 
నిన్నెందుకామె  శపిస్తుంది
అయితే గియితే ఆమె రాతనలా రాసిన ఆ దేవుణ్ణి తప్ప 
ఐనా మగాడిని శపించడం ఏ ఆడదాని కన్నీళ్లకొచ్చు.
******* 

Tuesday, June 5, 2012

ఊహ

నిజమవ్వాలంటూ 
తనకు తానే రాసుకునే రాతను 
ఆ విధాతకు కూడా నేర్పిస్తే 
ఎంత బావుణ్ణు  నా ఊహ.
******
అలజడిని 
పోగేసుకోవడంలో పోటీ పడేవే 
మనసులన్నీ.
******
చావు పుట్టుక 
పగలు రాత్రి 
వెలుగు చీకటి 
వేటి వ్యతిరేకాలు వాటికున్నాయని 
నాకు వ్యతిరేకమైంది నా మనసు.
*******
వెలుగప్పుడప్పుడూ ఈర్ష్య పడుతుంది 
చీకటి అప్పుడప్ప్పుడూ భయపడుతుంది 
నా మనసు లోతుల్లోకి చూసి.
******

Monday, June 4, 2012

నా మనసు

తన సొంతమైనట్లు నా మనసులోకి దూరి 
నావైన కొన్ని ఆనందభాష్పాలను 
తన గుండె లోతుల్లో మకరందంలా మార్చి 
చివరకా పూవు తుమ్మెదకు ధారవోసేది నా మనసునే.
********
కడుపు నింపిన ఆ ఆకాశానికి 
ఎంత మృదువుగా 
చిగురు గొంతు విచ్చి 
ధన్యవాదాలు చెబుతుందో 
చూడా మాను.
*******
కొన్ని కోపాలు కాసిని ద్వేషాలు
కొన్ని ఊహాకుసుమాలు కాసిని మాయని గాయాలు 
అంతే మానవ జీవిత నాలుగు పార్శ్వాలు.
********