Wednesday, August 8, 2012

నిగర్వి

నిగర్వి
నేను నిగర్వినే
ఐనా నాలోని గర్వాన్ని
బయట పెడుతుందా అద్దం.
**********
వీణ తీగలు
ఆకాశం నుండి చూస్తే

వీణ తీగలుగా కనబడిన
ఆ నదీ పాయలను మీటుదామని
ఉన్నపళంగా బయలుదేరిన జాబిలికి
అడ్డొచ్చి అసలు నిజాన్ని
చెబుతున్నాయా మేఘాలు.
***********
ఊహల పూదోట

మృత్యువంత దూరాన
ఆగింది శిశిరం
నా ఊహల పూదోటలో.
*********
సరస్సు
సిగ్గు పూలను విరబూయిస్తాయో

ఆవేశాలను ఆరబోస్తాయో
ఆ సంధ్యలీ సరస్సులో.
**********

Tuesday, August 7, 2012

ఇంద్ర ధనుస్సు

ఇంద్ర ధనుస్సు
ఎడబాటు ఫలించిన
నీ, నా కన్నుల నడుమ
సప్తస్వరాలను నేర్చుకుంటున్న
సప్త వర్ణాలను చూసి
ఉలికి పడుతుందా ఇంద్రధనుస్సు.
***********
మహా సంగ్రామం
ఊయలూగే పసిపాపలా ఐనా

నిలబడడం వచ్చిన యోధుడిలా ఐనా
మహాసంగ్రామమే చేయడమొచ్చా దీపానికీ చీకటితో.
***********
చితులు

లోకానికంతటికీ
వెలుగు చూపడానికి
ఎక్కడికక్కడ చితులను
వెలిగించిందీ చరిత్ర.
*********
అవినీతి

నాలుగు అడుగులు వెనక్కి వేయడమే
నేర్పిందా ఆకలి క్రూర మృగానికి కూడా
కానీ కడుపు నిండిన మానవ మృగానికి
అవినీతో?
************
పొద

పొద ఎదలో చేరి
తాను కనిపెట్టిన రహస్యాన్ని
అడవి కంతటికీ చెప్పేదాకా
కుదురెక్కడ వస్తుందా గాలికి.
*********

Monday, August 6, 2012

మధువు

మధువు 
పాత్రల కొద్దీ మధువును
కొసరి కొసరి పోస్తుంటే ఆ మేఘాలు!
మత్తులో పడి అడుగైనా కదపగలవా?
ఆ కొండలు.
**********
ప్రహేళికలు
చూపులతో నా సమస్త చీకట్లను వెలిగించే 
కాంతి ప్రహేళికలనెవ్వరు వెలిగించారు 
నీ కన్నుల.
*********
గతం
మనిషికి మనిషి దొరికాడంటే
తన గతం తనకు దొరికినట్లే
ఆ కాలానికి.
*********
అలంకారం
అద్దాన్ని నాకు అలంకారమెందుకంటే
ఓ పట్టాన వినిపించుకోకుండా
ఆ వాడని వసంతాన్ని నా పాలు చేసి
ఎలా వస్తూ పోతున్నాయో చూడా మేఘాలు
అంటోందా చెరువు.
**********

Saturday, August 4, 2012

మనసు చెక్కిన శిల్పం 

మనసు చెక్కిన శిల్పం

నిముషాన వెళ్ళదలచి
నీ చూపుల ఆశుకవితా ధారలు
నే కోరియుంటి గానీ నీవేల
వలపులీను చూపుల కావ్య ధారలు కురిపించి
నీ మనసు చెక్కిన శిల్పంలా
నను మలచుకుంటివి
ఇక నే పోవుటెట్లు

********
వసంతం
కన్నీటి శిశిరమైననేమి
నా ఎడద గాయమ్ము
గేయమ్మే అల్లి
వసంతాన్ని విరబూయింతునీ లోకాన.

********
బడాయి
బడాయి కాకపోతే
ఏమంత దూరంలో ఉందని! తన నేస్తం
అంత పెద్ద దీపం వెలిగించి మరీ
బిగ్గరగా అరుస్తూ వెతుకుతుందా మేఘం
ఇంకో మేఘాన్ని.

*********
సమాజం  
పనికి రాని ఆకుల్ని రాల్చుకునే శక్తి
ఆ చెట్టుకున్నట్లే
ఈ సమాజానికీ ఉంటే?
********
యుద్ధం
ఎవరూ వద్దని అడ్డు చెప్పనంత
అందంగా యుద్ధం చేసుకుంటుంటున్నాయోయ్
చీకటితో ఆ రెల్లుగడ్డి పొదలు
మిణుగురు సరాలను విసురుతూ.

*********
పల్లెపడుచు
చెరువంత ఆకాశం కడవంతై
ఆ పల్లెపడుచు చంకలో ఊయలూగిన దృశ్యం
గుండె గోడలపై నుండి
గది గోడల మీదకి చేరింది.

*********
ఇంద్రజాలం
మెరుస్తూ పిలిచినా కన్నెత్తి
క్షణమైనా వాటి వంక చూడలేదని
కిందికొచ్చి రెప్పవాల్చలేని
అందాల ఇంద్రజాలాన్ని
నా కళ్ళ ముందెలా పరచాయో చూడా మేఘాలు
చినుకునొక్క మొలకగా మలచి.
***********


Friday, August 3, 2012

నారుమడి

నారుమడి   
సర్దుకుని సర్దుకుని పెరిగి ఆపై 
ఎదిగేందుకు ఇంత చోటు చూపిన 
ఆ పంట చేలో ఎలా సమ్మోహనంగా 
పరుగెడుతోందో చూడా నారుమడి.
********
జాబిలి 
అందాల నిండు జాబిలిని
అద్దాన పట్టి కొంటెగా దానికి
కను ముక్కు చెవులు గీచేంతలో
నవ్వుతున్న నీవగుపించావేమిటి ఈ అద్దాన!
ఓ నా చెలీ.
*********
వేణువు

ఓనమాలు నేర్చుకుంటానని
లోపలికొచ్చి సంగీత సారస్వతాన్నంతా
నేర్చుకుని బయటకెళ్తున్న గాలిని
మనసారా దీవిస్తుందా వేణువు.
**********
విత్తు

ఆకాశానికి పుడమికి కూడా
తనలోని భావ చిత్రకారున్ని చూపిస్తూ
ఎదుగుతుందా విత్తు.
********
అలంకారం

ఏపుగా ఎదిగిన పంట చేనుకు
కడలి అలల
అలంకారమద్దుతుందా గాలి.
**********

Thursday, August 2, 2012

జ్ఞాపకం

జ్ఞాపకం 
నాకు నీడనిచ్చిన జ్ఞాపకాన్ని 
నాతో పాటూ బూడిదౌతూ 
గురుతు తెచ్చుకుందా మాను.
*********
స్తన్యం 
వట్టిపోయిందని చెలి తన ఎదను చూపితే 
అరుస్తూ రోదిస్తూ ఆకాశం నుండి 
ఆ ప్రియుడు దిగొచ్చాడంతే 
ఇక చూడామె ఎన్ని మొలకలకి 
తన స్తన్యాన్ని పడుతోందో.
*********
నల్లని పుష్పం 
ముడుచుకోవడం వికసించడం తప్ప 
వాడడం అంటే ఏమిటో తనకు తెలీదంటూ 
నేలకు మాత్రమే తన పరిమళాన్ని పంచే 
నల్లని పుష్పమే నా నీడ.
********
మానవత 
నాగరికతెంత వికసించినా 
అంటరాని తనాన్ని 
వదిలించుకోలేక పోయిందెందుకో 
ఈ మానవత.
********
పబ్ 
మిణుగురుల్లాటి మసక దీపాల కింద 
గుడ్లగూబలంత వికారంగా 
మన సంస్కృతిని తక్రిందులు చేసిన 
గబ్బిలాలు కొన్ని మత్తులో 
చిందులేస్తున్నాయా పబ్బులో.
*********

Wednesday, August 1, 2012

రైలు బోగీ

రైలు బోగీ 
ఈ చిగురుటాకుల నుండి 
ఆ పండుటాకుల వరకు 
పెద్దకొడుకైంది 
కాలి ఆ రైలు బోగీ.
*******
ఆ రైలు బోగీ సాక్షిగా 
అంతిమ సత్కారానికి కూడా నోచుకోని 
చావులెన్నో.
*******
కలల పంట 
నాగేటికి కట్టిన ఆ ఎద్దుల గంటల చప్పుడులో 
నా ప్రియురాలి కాలి మువ్వల సవ్వడి విన్నాను 
మొలిచిన మొలకల్లో 
గిలిగింతగా ఆమె పిలుపులు విన్నాను 
ఆ పిలుపులు పాటలైన అనుభూతులతో 
ఎంత పచ్చగా ఈ లోకాన్ని పలకరించానో 
మేనంత ఎదిగిన ఒయ్యారంతో గాలికి నాట్యమాడుతూ 
సౌందర్య దేవతకు పట్టు పీతాంబరమై అమరిన ఆమె మేను 
నా తలపుల పండి ఒంగిన వేళ నా కలల పంటనిదిగో 
ఇలా తూర్పారబట్టుకుంటున్నాను.
**********
 మేఘాల కంబళి 
గ్రీష్మం ఎండలకి సెలవని 
వర్ష ధారలతో చెబుతూ 
చలికి తట్టుకోలేకో ఏమో నల్లని మేఘాలనలా 
కంబళిలా కప్పుకుంటుందా ఆకాశం.
*********
తివాచి 
పుట్టబోయే పువ్వులాటి బిడ్డలు 
ఒడి జారితే ఎక్కడ గాయపడతారో అని 
మాసం ముందుగానే తన కింద 
ఆకుల తివాచి పరచిందా మాను.
********