మానవత్వపు భంగపాటు
అమ్మ లాలనను ఇంకా మరచిందో లేదో గానీ
అపుడే ఓ ఇంటి పాలనను అందుకుందది
మది తలపులను, గడియపెట్టిన ఇంటి తలుపులను దాటనీయని విద్య నేర్చింది
అద్దం లాటి ఆ చెక్కిళ్ళపై పడిన ఐదువేళ్ళ ముద్రలు
అద్దంలా అది మెరిపించిన ఆ ఇంటి గచ్చున మచ్చలుగా ప్రతిబింబిస్తున్నాయిప్పుడు
పాపం! ఆకలికి దాని హక్కులన్నీ జీర్ణమైపోగా,
ఆ ఇంటి వాళ్ళ అంతులేని అధికారపు దాహాన్ని అలుపెరుగక తీర్చినట్లుంది దాని దేహం
ఒంటిని కప్పుకోలేని దాని దారిద్ర్యానికి మనసాపుకోలేక, ఆ ఆసామి చేసిన అఘాయిత్యానికి
ఆ గది నాలుగు గోడలు ఉలికి పడ్డాయి
ఎందరిలానో చావుతోనే అదృష్టం వరించింది దాన్నీ
ఎప్పటిలానే పత్రికల పతాకానికెక్కింది
నోరుందని అందరూ అరిచారు మాటల తూటాలూ పేల్చారు
జరుగుతున్న తంతునంతా చూస్తూ
వికసించే తరుణం వచ్చేసిందనుకుంది ఆ మానవత
కాసేపటికే తాను ఆవిరై పోతానని ఎరుగక
అవును! ఎవరి తొందరలు వారివి మరి
అంతేలేవోయ్ దగాపడిన జీవితానికిక్కడ విలువేముందని
అందరూ పంచుకునే ఓ ఐదు నిముషాల కాలక్షేపం తప్ప
ఆ!ఆ! ఆ ఐదు నిముషాలు ఐపోయాయి ఇంకా ఆలోచించకు
ఆలోచించే వారిని వెక్కిరిస్తూ, పద వెనువెనుకకు పోతూ
ఆదిలో మనం విడిచొచ్చిన అడవులను చేరదాం
అక్కడ ఆశా ఉండదు, భంగపాటు ఉండదు ఈ మానవత్వానికి.
*********
enta baagaa chepparu cheppadaaniki maatalu levu abhinandanalu
ReplyDeletethank you very much
Deleteఎంత బాగా రాసారు...స్పందించేలా.
ReplyDelete