గోదారి
వడిగా పరుగు, ఆపై వొగురొకటి
పోనీ ఆగమని అందామా? అంటే
ఆమె గారి ఒంపుసొంపులను చూస్తూ
మాట, మౌనమనే మాత్ర మింగేసింది
ఇలా, ఆమె ఆడుతూ పాడడమెపుడు మొదలెట్టిందో గానీ
చెట్టూ పుట్టా పైరుపాపల నోట ఆ పదనిసలను
తాను వినని క్షణం లేదంటే ఈ కాలం, కాదనగలవారెవ్వరోయ్
అవునోయ్ మరి, ఈ ధాత్రిపై చరిత్రని కన్నదామె
మురిపాల ఉగ్గు పాలు పడుతూ
తన వేలిచ్చి నాగరికతను నడిపించిందామె
ఊహల్ని, కలల్ని విరబూయించి ఎడారులంటి మనస్సులను
రసికోద్యానాలుగా మార్చిందీ ఆమే
గలగలల గాంధర్వాలతో సుశ్యామల గీతిని
ఇలా ఈ ఇలనాలపించిందీ ఆమే!
ఇన్ని చేసి కూడా!
మెత్తని తివాచీలు పరచి తనని ఆహ్వానించమనదామె,
పోయే దారుల ఈ ఇసుక తిన్నెలు చాలంటూ.
దొంతరలుగా శాలువాలు గప్పి సన్మానించమనీననదామె
మేఘపు ఛాయలను తన మేనిపై కప్పుకుంటూ.
కడలి ఒడిని చేరునంత వరకు
తన భావుకతతో ఈ ప్రకృతి పాదాలకు పారాణి దిద్దుతూ
నవజీవన చైతన్యాన్ని నా ప్రాణనాడుల నింపుతూ
ఎలా సాగుతోందో చూడా గోదారి.
*********
ReplyDeleteచక్కని భావ వ్యక్తీకరణ! చాలా బాగుందండీ!
రసజ్ఞ గారు మీ స్పందనకు ధన్యవాదములు
ReplyDelete