ప్రసవ వేదన
తాను పడాల్సిన ప్రసవవేదనను
తన తనువు చీల్చుకుని మరీ
పడిందనీ పుడమని గాబోలు
జీవిత కాలమంతా
ఈ పుడమి వేలు విడిచిపెట్టదా విత్తు.
*********
ప్రయోజకత్వం
కోవెలనో నీ వాల్జడనో చేరి
ప్రయోజకత్వానికి భలే నిర్వచనాన్ని
ఇచ్చాయా పూలనుకుంటాము గానీ
నిజానికి తనను నిలబెట్టిన నేలను
నేలను పూజించాలని
ఆ మాను రాల్చే పూలకన్నా
ఎవరీయగలరోయ్ పరిపూర్ణమైన నిర్వచనాన్ని
ప్రయోజకత్వానికి.
*********
వానవత
ఇలా తామందరం తడిపేస్తుంటే
పాపమా చెరువుకెక్కడ
జలుబు చేస్తుందో నని
వానవతతో గొడుగు పడుతున్నాయా చెరువుకి
వానచినుకులు కొన్ని గాలిబుడగలై.
********
గట్టు
నే చేతులడ్డు పెట్టి
గాలికి ఒంపులు తిరుగుతూ వెలిగే దీపాన్ని
ఠీవిగా నిలబెట్టినట్లుగా
తానూ ప్రయత్నిస్తానని
గోదారికి తన చేతులడ్డు పెట్టి
తానేమి సాధించిందో చూడా గట్టు.
*********
మీ భావవ్యక్తీకరణ చాలా బావుంది.Blog template ని , Fonts ని కొంచెం సరిదిద్దితే చూడ్డానికి చదవడానికి కళ్ళకు శ్రమ లేకుండా ఉంటుంది
ReplyDeleteమీ స్పందనకు సూచనకు ధన్యవాదములు.
ReplyDelete